గౌతమీ మాహాత్మ్యం -54
74-సిద్ధ తీర్ధం
పులస్త్య వంశ సంజాతుడు రావణుడు అన్ని దిక్కులూ జయించి ,సోమలోకం పైకి దండెత్తాడు .అప్పుడు బ్రహ్మ తానొక మంత్రం ఇస్తాను యుద్ధం విర మించమని చెప్పాడు .శివుని అష్టోత్తర శతనామాలతో ఉన్న మంత్రం ఉపదేశించాడు .మంత్రం గ్రహించి చంద్రలోకాన్ని జయించి అన్ని చోట్లా విజయం సాధించి కైలాసం వెళ్ళాడు .కైలాస వైభవానికి దిమ్మతిరిగి దాన్ని లంకకు పెకలించుకు పోతానని పట్టు బట్టాడు .రావణమంత్రులు మంత్రాంగం చేసి అతనితో అది తగనిపని అని హితవు చెప్పారు .కాని వారి మాట వినకుండా పుష్పక విమానం తో కైలాసగిరిపైకి దూకి దాని మూలాన్ని పెకలించే ప్రయత్నం చేశాడు .రావణ గర్వాన్ని ఖర్వం చేయాలనుకొని కైలాసపతి కాలి బొటన వ్రేలితోఅదుమగా రసాతలం లో పడిపోయాడు .
గాయాలపాలైన దశకంఠుని చూసి ఉమామహేశ్వరులు నవ్వుకొని ,ప్రసన్నుడై అడిగిన వరాలిచ్చాడు .పుష్పకమెక్కి లంకకు పోదలచి శివుని పూజించటానికి గంగా నదిని చేరాడు .గంగలో స్నానం చేసి భక్తితో శివపూజచేయగా భోళా శంకరుడు ప్రత్యక్షమై ఒక అద్భుత ఖడ్గం ,సిద్ధి సర్వ సంపదలు అనుగ్రహించాడు .బ్రహ్మ ఉపదేశించిన శివమంత్రం తో శంభుని స్తుతింఛి సంతోషం తో లంక చేరాడు .గొప్ప సిద్ధి కలిగించేది కనుక ఇది సిద్ధి తీర్ధంగా ప్రసిద్ధమైంది అని నారదునికి బ్రహ్మ వివరించాడు .
75-పరుష్ణీ సంగమ తీర్ధం
అత్రి ముని బ్రహ్మా విష్ణు మహేశ్వరులను ఆరాధించగా ప్రీతి చెంది దర్శనమివ్వగా వారు తమకు పుత్రులుగా జన్మించాలని కోరాడు .అలాగే అని పుత్రులను ప్రసాదించారు త్రిమూర్తులు .అత్రికి ఆత్రేయీ అనే కన్య ,దత్తుడు సోముడు దుర్వాసుడు కుమారులు కలిగారు .అగ్నికి అంగీరసుడు పుట్టాడు .నిప్పు కణం నుంచి పుట్టాడుకనుక అంగీరసుడు .అత్రి తనకూతురు ఆత్రేయి ని అంగిరసుడి కిచ్చి పెళ్లి చేశాడు . ధర్మపత్నిగా భర్తకు సకలోపచారాలు చేసింది .బలసంపంనులైన పుత్రులు జన్మించారు .కాని అతడు ఆమెను పరుష వాక్కులతో బాధించేవాడు .కొడుకులు శాంతపరచేవారు .
భరించలేక భర్తపై మామగారైన అగ్ని కి ఫిర్యాదు చేసింది .ఆయన అర్ధం చేసుకొని ఆమె భర్త ఎప్పుడు అగ్ని దగ్గరకు వస్తాడో అప్పుడు జల రూపంతో ము౦చేయమని చెప్పాడు .సాధ్వి అలా చేయటం తగదని తనకు తన భర్త శాంతి మాటలే కావాలని చెప్పింది .అప్పుడు అగ్ని ‘’అమ్మా అగ్ని నీటిలో ,శరీరంలో ,స్థావర జంగామాలలో ఉంటాడు .నీ భర్తకు ఆశ్రయం నేను ,తండ్రిని నేను .జల అంటే మాతృ దేవతలు ‘’అన్నాడు .కోడలు ‘’జలం తల్లి అయితే నేను మీ అబ్బాయికి తల్లినీ భార్యనూ ఎలా అవుతాను ?’’అని ప్రశ్నించింది .అగ్ని ‘’పెళ్లి అవగానే స్త్రీ పత్నిఅవుతుంది .పాలన పోషణవలన భార్య అవుతుంది .సంతానం కని జాయా అవుతుంది .గుణాలచేత కళత్రం అవుతుంది .కొడుకు పుట్టగానే స్త్రీ మాత్రమేకాదు తల్లి అవుతుంది .స్త్రీ ఇన్ని రూపాలుగా ఉంటుంది .కనుక నేను చెప్పినట్లు చెయ్యి సందేహించకు ‘’అన్నాడు.
మామగారైన అగ్ని దేవుడు చెప్పినమాటలకు సంతృప్తి చెంది కోడలు ఆత్రేయి అగ్ని రూపం పొందిన తనభర్త అగీరసుని నీటితో ముంచేసింది .దంపతులు గంగా సంగమం వలన శాంత రూపాలు పొంది ఉమా మహేశ్వర, రోహిణీ చంద్రులులాగా శోభించారు .ఆత్రేయి అమృత స్వరూపం పొందింది .ఆ రూపం పరుష్ణీ నదిగా ప్రసిద్ధమై ,స్నానమాత్రం చేత వంద గోవులను దానమిచ్చే ఫలితమిస్తుంది .ఇక్కడ చేసే వాజిపేయయాగం కంటే స్నానం ఎక్కువ ఫలిత మిస్తుంది అని బ్రహ్మ నారదునికి చెప్పాడు .
సశేషం
మనవి- పవిత్ర మాఘమాసం ఈ రోజుతో పూర్తి కనుక ఈ ‘’75వ తీర్ధ వివరణ’’తో గౌతమీ మహాత్మ్యానికి ప్రస్తుతం విరామం ప్రకటిస్తున్నాను .మళ్ళీ అనుకూలమైన సమయంలో కొనసాగిస్తానని మనవి చేస్తున్నాను .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -6-3-19-ఉయ్యూరు

