యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -20
వచక్నుని కుమార్తె గార్గి ,తన సహోదరి కూతురు మైత్రేయిని కూడా వెంటబెట్టుకొని వచ్చి ‘’యాజ్ఞవల్క్యా !అంతా ఉదకాలలో ఓత,ప్రోతాలుఅయ్యాయని అంటారు .ఉదకాలు దేనిలో ఓతప్రోతాలయ్యాయి ?’’అని ప్రశ్నించింది .ఇక్కడఓత పోతాలు అవటం అంటే వస్త్రం లో ఉండే పడుగు పేక లాగా ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉండటం .యాజ్ఞవల్యుడు ‘’వాయువులో ‘’అన్నాడు వాయువు దేనిలో?’’అంతరిక్షం లో ‘’.అంతరిక్షం దేనిలో ‘’?’’గ౦ధర్వ లోకం లో ‘’,అది దేనిలో ?’’’’ఆదిత్యలోకం లో ‘’అది దేనిలో ‘’?’’చంద్రలోకం లో ‘’,అది దేనిలో ?’’నక్షత్ర లోకం లో ..’’అది దేనిలో ?’’’’దేవలోకం లో ‘’అది ఇంద్రలోకం లో అది ప్రజాపతి లోకం లో ,అది బ్రహ్మలోకం లో ‘’అని చెప్పాక ‘’బ్రహ్మలోకం దేనిలో ఓతప్రోతమౌతుంది ‘’?అని గార్గి అడిగితె ‘’గార్గీ !న్యాయం మీరి అడగకు అలా చేస్తే నీతల పగిలిపోతుంది ‘’అనగానే గార్గి నోరు మెదపలేదు .
ఈ సంవాదానికి శ్రీ భాగవతుల లక్ష్మీ పతిశాస్త్రిగారు అర్ధవంతమైన వివరణ ఇచ్చారు .దాన్ని పరిశీలిస్తేనే అసలు భావం తెలిసేది .-అంతరిక్షం అంటే శరీరాకాశం .గంధర్వలోకం అంటే సూర్య కిరణాలు .వేడిలేకపోతే నీరు వాయువు ఉన్నా బీజం మొలకెత్తదు .శరీరం లోని వేడినే గ౦ ధర్వ శబ్దం .జఠరాగ్ని యే ఆదిత్యుడు .చంద్రలోకం మనసు .పంచేంద్రియాలు నక్షత్రలోకం .కళ్ళు చెవులు మొదలైనవాటికి అది దేవతలే దేవలోకం .జీవాత్మ ఇంద్రలోకం .ప్రజాపతిలోకం అంటే శుభాశుభకర్మలు .బ్రహ్మ అంటే పరబ్రహ్మ .
అరుణ పుత్రుడు ఉద్దాలకుడు ‘’మేము పత౦జలుని ఆశ్రమం లో యజ్ఞ శాస్త్రం చదువుతూ ఉంటె అతనిభార్య గాంధర్వ గృహీతగా ఉంటె ఎవరని అడిగితె గాంధర్వ పుత్రుడను కబంధుడను అన్నాడు.అతడుపత౦జలు నేకాక మమ్మల్నీ ప్రశ్నించాడు ‘’లోకం ,పరలోకం సకలభూతాలు ఏ సూత్రంతో గుచ్చబడినాయి ?’’అని అడిగితె పతంజలి తనకు తెలీదన్నాడు ‘’తర్వాత ’’అంతర్యామి అయిన పరమాత్మ తెలుసా ?అని అడిగాడు .తెలుసుకోలేదన్నాడు .అప్పుడు కబంధుడు ‘’ఆ సూత్రం లో ఉన్న అంతర్యామిని కనుగొన్నవాడే బ్రహ్మవేత్త .వాడే లోకవిదుడు వేదవిదుడు .తర్వాత అతడి ద్వారా ఆ విషయాలన్నీ తెలుసుకొన్నాం .యాజ్ఞవల్క్యా ! నీకు ఆ సూత్రం తెలీకుండానే గోవుల్ని స్వంతం చేసుకోవాలనుకొన్నావు .తోలుకు వెడితే తలపగిలి చస్తావు ‘’అన్నాడు .
యాజ్ఞవల్క్యుడు ‘’ఉద్దాలకా !నాకు ఆ సూత్రస్వరూపం అంతర్యామి తత్త్వం పూర్తిగా తెలుసు ‘’అనగా ‘’తెలుసు అంటే చాలదు ఎలా తెలుసో వివరించు ‘’అన్నాడు .మహర్షి ‘’ ఆ సూత్రం అంటే వేరే ఏదీకాదు వాయువే .వాయువే అన్నిటినీ దారంతో పూలు గుచ్చినట్లు గుచ్చుతుంది .వాయువు శరీరాన్ని వదిలేస్తే మరణమే .సంతోషించి’’అంతర్యామి తత్త్వం వివరించమనగా ‘’అది దైవత స్వరూపాలైన భూమి నీరు అగ్ని అంతరిక్షం వాయువు ద్యులోకం ఆదిత్యుడు దిక్కులు చంద్ర తారకలు ఆకాశం అంధకారం తేజస్సు – అది భూతాలైన –సకల భూతాలూ ,ఆధ్యాత్మ స్వరూపాలు ప్రాణం వాక్కు ,కన్ను చెవి మనసు చర్మం విజ్ఞానం రేతస్సు ఇవన్నీదేనికి శరీరమై ఉందొ ,ఏది వాటికి అంతరంగా ఉండి వాటిని నియమిస్తోందో అదే నాశనం లేని అంతర్యామి స్వరూపం .అంటే భూమి ఆకాశాలకు అంతరంగా ఉంటూ వాటినన్నిటినీ నియమిస్తూ వాటి చేత తెలియబడకుండా విలక్షణంగా ఉండే నాశరహిత అంతర్యామి స్వరూపమే ఆత్మ’’అని వివరించాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -6-3-19-ఉయ్యూరు

