యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -21
గార్గి రంగ ప్రవేశం చేసి తాను రెండు ప్రశ్నలు యాజ్నవల్కుని అడుగుతానని ,ఆయన సరైన సమాధానాలు చెబితే అతడిని ఇక ఎవరూ జయించలేరని సభలోని వారికి చెప్పగా వారంతా అంగీకరించగా ‘’దేనిలో ద్యులోకానికి పైన ,భూమికి కింద ,అండకపాలానికి మధ్య ఉంటూ భూమి అంతరిక్షాలను ప్రవర్తి౦ప చేసేది చేయగలిగేది ,ఏకీభవించేది అనేదాన్ని యాగాలను బట్టి చెబుతారో అది అంతా దేనిలో ఓత ప్రోతమౌతుంది ?’’అని ప్రశ్నించింది .’’వాయువులో ‘’అని ఠక్కున చెప్పాడు .సరైన సమాధానమే అని ‘’వాయువు దేనిలో ఓతప్రొతమౌతు౦ది ‘’అని అడుగగా ‘’ఆకాశం లో ‘’అనగా ,అది దేనిలో అనగా ‘’అక్షరాలలో –అక్షరాస్వరూపం లావు పొట్టి రంగున్నది స్నేహం నీడ చీకటి వాయువు ఆకాశం సంగమం కాదు. రసం వాసన కళ్ళు చెవులు వాక్కు మనసు తేజస్సు లేనిది .ప్రాణం లేనిది .ముఖం, పరిమితి ,రంధ్రం బాహ్యం లేనిది .దేన్నీ తినదు దేని చేతా తినబడదు .ఈ అక్షర ప్రకాశం వలననే సూర్య చంద్రులు క్రమం తప్పక సంచరిస్తారు .నిమిషాలు ముహూర్తాలు రాత్రి పగలు నెలలు సంవత్సరాలు కలుగుతాయి .నదులుకొన్ని తూర్పుకు కొన్ని పడమరకు ప్రవహిస్తాయి .దేవతలు యజమానుని ,పితృ దేవతలు దర్వీ హోమాలను అనుసరిస్తారు .ఈ అక్షర తత్త్వం తెలీకుండా హోమం యాగం తపస్సు చేస్తే కర్మఫలం వలన నాశనమౌతారు .అక్షర స్వభావం తెలీకుండా చనిపోతే దీనుడై జనన మరణాల సుడి గుండం లో పడిపోతాడు .అక్షర రహస్యం తెలిస్తే బ్రాహ్మ వేత్త ఔతాడు .అక్షరం చూడబడనిది అయినాచూస్తుంది .వినబడనిదైనా వింటుంది తలపబడనిదైనా తలుస్తుంది. తెలిసికోబడనిదైనా తెలుసుకొంటు౦ది .కనుక ఈ అక్షరం కంటే వేరే ఏదీ చూసేది తలచేది తెలుసుకొనేది లేనే లేదు .ఆకాశం ఈ అక్షరం లోనే ఓత ప్రోతమౌతుంది ‘’అనగానే గార్గి పరమానందం తో అక్కడి బ్రాహ్మణులతో ‘’మీలో ఎవరూ యాజ్ఞావల్క్యుని జయి౦చేవారు లేరు కనుక ఆయనకు నమస్కరించి వెళ్ళిపోవటం శ్రేయస్కరం ‘’అని తీర్పు చెప్పింది .
కాని మేనమామ విదగ్ధ శాకల్యుడికి ‘’ఎక్కడో ‘’మండి’’దేవతలుఎందరు ?’’అని అడిగితె ‘’విశ్వ దేవ శాస్త్రం నివిత్తులో చెప్పబడినట్లు ,మూడు వందలముగ్గురు ,మూడువేల ముగ్గురు అనీ దేవతల సంఖ్య చెప్పే మంత్రాన్ని నివిత్తం అంటార’’ని .చెప్పాడు తర్వాత వీరిద్దరి మధ్య ప్రశ్నోత్తర సరళి ఇలా సాగింది –దేవతలెందరు ?ముప్ఫై ముగ్గురు .దేవతలలెందరు?ఆరుగురు ‘’,దేవతలెందరు ?ముగ్గురు ‘’,దేవతలెందరు ?’’ఇద్దరు ‘’,దేవతలెందరు ?’ఒకటిన్నర ‘’దేవతలెందరు ?ఒక్కరు ‘’మూడువేల ముగ్గురు మున్నూతముగ్గురు దేవతలేవారు ?’’ముప్పది ముగ్గురా యొక్క విభూతియె ఆ దేవతలు .అసలు దేవతలు ముప్పది ముగ్గురే .’’వాళ్ళెవరు ‘’?’’ఎనిమిదిమంది వసువులు పదకొండు మంది రుద్రులు ,12మంది ఆదిత్యులు.’’వసువు లెవరు ?’’అగ్ని భూమి ,వాయువు అంతరిక్షం చంద్రుడు నక్షత్రాలు అనేవే వసువులు .వీటిలో వసువు అంటే దనం రూపం లో జగత్తు ఉండటం చేత వసువులు అని పిలువబడ్డాయి .ఈ ఎనిమిది అధీనం లోనే ధనం ఉందని భావం ,.’’రుద్రులెవరు ?’’పురుషునిలోని ప్రాణ అపానాది దశ ప్రాణాలు ,ఆత్మ కలిసి పదకొండుమంది రుద్రులు .మరణ సమయం లో ఇవి శరీరం నుంచి లేచిపోతాయి .అప్పుడు పుత్రాది బంధు వులు రోదనం చేస్తారుకనుక రుద్రులు అనబడుతాయి ‘’.ఆదిత్యులెవరు ?’’ సంవత్సరం లోని పన్నెండు నెలలే ద్వాదశ ఆదిత్యులు .ప్రాణుల ఆయువు కర్మఫలాలను గ్రహించి పోవటం వలన ఆదిత్యులు అన్నారు .’’ఇంద్రుడు అంటే ?’’గర్జించే మేఘం ‘’ప్రజాపతి అంటే ?’దర్శ పూర్ణ మాసాది యజ్ఞమే. ప ‘’.’’స్తనయత్నువు ?’’అంటే ‘’ఆశని ‘’.యజ్ఞం అంటే ?’’పశువులే యజ్ఞం .’’ఆరుగురు దేవతలేవారు ?’’అగ్ని భూమి వాయువు అంతరిక్షం ఆదిత్యుడు ద్యులోకం ‘’మళ్ళీ ఆరుగురు దేవతలలెవరు ?’’ పైన చెప్పబడినవారే ‘’ముగ్గురు దేవతలలెవరు ‘’?’’మూడులోకాలే ‘’వీటినుంచే దేవతలుద్భవిస్తారు .’’ఇద్దరు దేవత లెవరు ?’’అన్నం, ప్రాణం .’’అధ్యర్ధమైన దైవతం ఎవరు ?’’వీచే గాలి ‘’ఎందుకు అయింది ?’’వాయువు వలననే సకలం వృద్ధి పొందు తుంది కనుక .’’ఇదివరకు చెప్పిన దేవత ఏది ?’’ప్రాణమే బృహత్ స్వరూపమైన పర బ్రహ్మ౦ .’’ఈ విధంగా శాకల్య యాజ్ఞవల్క్య చర్చ కొనసాగింది .మిగిలిన విషయాలు తర్వాత తెలుసుకొందాం .
సశేషం
మీ- గబ్బిట దుర్గాప్రసాద్-6-3-19-ఉయ్యూరు

