యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -25
యోగ బోధ
ఒక రోజు బ్రహ్మవేత్తలతో ఉన్న యాజ్ఞవల్క్యుని గార్గి ‘’యోగతత్వాన్ని సంపూర్ణంగా తెలియ జేయండి ‘’అని అడిగింది .యాజ్ఞవల్క్యుడు ‘’నేను పూర్వం బ్రహ్మ వలన విన్నదే మీకు చెబుతాను .జ్ఞానానికి ప్రవర్తకం, నివర్తకం అని రెండుమార్గాలను వేదం చెప్పింది .కామ సంకల్పక పూర్వమైన వర్ణాశ్రమ ధర్మాన్ని ప్రవర్తకం అంటారు .ఇది అవలంబిస్తే స్వర్గం లభిస్తుంది .కాని పుట్టుక చావు నిరంతరంగా ఉంటుంది .కామ సంకల్పం ,విధ్యుక్తమైన కర్మ నివర్తకం .దీన్ని అచరిస్తే ముక్తి లభిస్తుంది .శ్రుతులలో బ్రాహ్మణులకు నాలుగు ,క్షత్రియులకు మూడు ,వైశ్యులకు రెండు శూద్రులకు ఒకటి ఆశ్రమాలు చెప్పబడినాయి .బ్రాహ్మణుడు బ్రహ్మ చర్య వ్రతం చేస్తూ ,వేద, వేదాంగాలు అధ్యయనం చేసి ,స్నాతుడై సవర్ణ స్త్రీని వివాహమాడి ,పుత్రులను పొంది విదిప్రకారం భార్యతో కలిసి హోమం చేస్తూ ,చివరికి నిర్జన ప్రదేశం లో నిత్యమూ అగ్నిహోత్ర సమక్షం లో తపస్సు చేస్తూ ,ఆత్మలో అగ్నిని ఆరోపించుకొని విధి ప్రకారం సన్యసించి పరమాత్మ క్షేత్రియుడు అయ్యే వరకు నిత్యకర్మ చేయాలి .
క్షత్రియుడు సన్యాసాశ్రమం వరకు ,వైశ్యుడు వానప్రస్థాశ్రమం వరకు ,శూద్రుడు శుశ్రూష తో నిత్యం గృహస్తాశ్రమంలో ఉండాలి .నాలుగు ఆశ్రమాలలో ఉన్నవారు కోరికలు లేని విధ్యుక్త కర్మలే చేయాలి అని నాకు బ్రహ్మ బోధించాడు ‘’అన్నాడు .గార్గి ‘’జ్ఞానం తో విధ్యుక్త కర్మ చేసేవారికి ముక్తికలుగుంది అన్నారు కదా ఆ జ్ఞానం ఎలాంటిది ?’’అని అడిగింది .మహర్షి ‘’జ్ఞానం యోగాత్మకమైంది .అది అష్టాంగ సంయుతం .జీవాత్మ ,పరమాత్మల సంయోగమే యోగం .దానికి యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణా ధ్యాన సమాధి అనే ఎనిమిది అ౦గా లున్నాయి .యమ నియమాలు మళ్ళీ పదేసి రకాలు. ఆసనాలు ఎనిమిది అందులో ఉత్తమోత్తమాలు మూడు .ప్రాణాయామం మూడు రకాలు.ప్రత్యాహారం అయిదురకాలు.ధారణ అయిదురకాలు .ధ్యానం పదహారు విధాలు .సమాధి ఒకే విధానం ‘’అని వివరించాడు .
మహర్షులంతా యోగీశ్వరుడు అంటే వాజసనేయ యాజ్ఞవల్క్యమహర్షి మాత్రమే కాని వేరెవరూకాదన్నారు .మాఘ శుద్ధ పౌర్ణమి రోజున కణ్వ గురువైన యాజ్ఞవల్క్య మహర్షికి యోగీంద్ర పట్టాభి షేకం జరిగి నట్లు ‘’సహస్రనామావళి ‘’అనే గ్రంధం లో ఉన్నదని శ్రీ భాగవతుల లక్ష్మీ పతి శాస్త్రి గారు రాశారు . .
సశేషం
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -8-3-19-ఉయ్యూరు

