ఊసుల్లో ఉయ్యూరు -61 ఉత్తమ శిష్యుడు పారుపూడి గంగాధరరావు

ఊసుల్లో ఉయ్యూరు -61

ఉత్తమ శిష్యుడు పారుపూడి గంగాధరరావు

పారు పూడి గంగాధరరావు మార్చి 6వ తేదీ న చనిపోయాడని నిన్న మా బజారులో కరెంట్ స్తంభానికి వ్రేలాడతీసిన ఫ్లెక్సి వల్ల తెలిసి చాలా బాధ పడ్డాను .ఎర్రని రంగు ,వెడల్పైన నిరంతర నవ్వు ముఖం ,అందమైన నల్లని క్రాఫు ,స్పోర్ట్స్ మాన్ పర్సనాలిటి కుదుమట్టమైన  నాజూకు శరీరం తో  సన్నని మీసకట్టుతో ఉన్న అతడిని చూడాగానే ఆకర్షణ కలుగుతుంది .వీటికి మించి గొప్ప వినయ సంపన్నుడు .పారుపూడి ఇంటిపేరు .అంటే మా ఉయ్యూరు వీరమ్మ తల్లి ఇంటిపేరు .గొల్ల కుర్రాడైనా ఎంతో ఒదిగి ,ఏ దురలవాట్లు లేక తనను తానూ తీర్చి దిద్దుకున్న వాడు .అలాంటి వారు వారిలో చాలా అరుదు గా ఉంటారు  .

  నేను మోపిదేవి నుంచి ఉయ్యూరు హైస్కూల్ కు సైన్స్ మాస్టర్ గా 1965వచ్చాను .గంగాధరరావు అప్పుడు హైస్కూల్ లో నా విద్యార్ధి .అసలు ఆ కుటుంబాలలో గంగాధరరావు అనే పేరు ఉండటమే అరుదైన విషయం .అందువల్లనేమో నా మనసు లో స్థానం పొందటానికి ఒక కారణం అయి ఉండచ్చు .చాలా నియమబద్ధంగా ,క్రమశిక్షణ గా ఉండేవాడు .బాడ్ మింటన్  వాలీబాల్ ,కబాడీ ,సాఫ్ట్ బాల్ ఆటలలో బాగా రాణి౦చేవాడు .అతని ఆటతీరు ఇప్పటికీ కళ్ళలో నిలిచే ఉంది .తొణకని బెణకని స్వభావం అతనిది .అదే సమయం లో నేప్పల్లె గాంధీ కూడా ఉన్నాడు .అతడూ గొప్ప ప్లేయర్ .వాలీబాల్ బాడ్ మింటన్ లలో అద్వితీయుడు .ఈ ఇద్దరితో ఉన్న స్కూల్ టీం అన్నిట్లోనూ విజయాలు సాధించేవారు .

 సాయంకాలం స్కూల్ అయిపోగానే  వీళ్ళ బాచ్ తో కలిసి మా టీచర్స్ ఆ రెండు ఆటలు ఆడేవాళ్ళం .నిజం చెప్పాలంటే వారిద్దరే మాకు నేర్పారు అని చెప్పవచ్చు .మిగతావారి సంగతేమోకాని నాకు ఒక రకంగా వాళ్ళిద్దరూ గురువులే ఆటల్లో .కానీ ఎప్పుడూ ,ఎక్కడా అతిగా ప్రవర్తించేవారు కాదు .అత్యంత వినయంగా ఉండేవారు .చదువులో కూడా అబవ్ ఆవరేజ్ గా ఉండేవాళ్ళు .ఇందులో గాంధీ కొంత రఫ్ అండ్ టఫ్  మనిషి .కాని గంగాధరరావు అప్పటినుంచి ఇప్పటికీ అదే సౌజన్యం అదే వినయం అదే విధేయత అదే మర్యాద అదే మన్నన  కనబరచేవాడు .

   వీరమ్మతల్లి తిరునాళకు గుడికి వెడితే  గంగాధరరావు మా టీచర్లకు ప్రత్యేక దర్శనం చేయించి ,కొబ్బరి చిప్పలు విశేషంగా ఇప్పించేవాడు .అక్కడున్నవాళ్లకు ‘’మా టీచర్స్ .వీళ్ళు ఎప్పుడొచ్చినా మర్యాదగా ఉండండి ‘’అని చెప్పేవాడు .గంగాధరరావు కుటుంబానికీ  పూజలో వంతు ఉండేది .ఆతర్వాత అతడు స్కూల్ లో లేకపోయినా మేము వేరే చోట్ల పని చేసినా తిరునాళలో కనిపిస్తే  పూర్వంలాగానే మర్యాద చేసేవాడు .అంతటి గుణ సంపన్నుడు గంగాధరరావు ..

  చదువు ఎంతవరకు చదివాడో తెలియదుకాని అతను ఎస్. ఎస్. ఎల్ .సి .అవగానే ఉయ్యూరు కెసీపి స్టోర్స్ లో  ఉద్యోగం లో చేరాడు .అప్పుడు ఫాక్టరీ వాళ్ళు ఫాక్టరీకి బయట పెట్రోల్ బ౦క్ నడిపే  వారు .అప్పుడు నాకు’’ లూనా ‘’ఉండేది .దానికి పెట్రోల్ కోసం అక్కడికే వెళ్ళేవాడిని .అప్పుడు గంగాధరరావు అక్కడ డ్యూటీ చేస్తూ కనిపించాడు .బహుశా ఇది 1982 -90మధ్యకాలం అని గుర్తు .ఎన్ని బళ్ళు ఉన్నా నన్ను ముందుకు రమ్మని పెట్రోల్ కొట్టి పంపేవాడు ‘’మా మాస్టారండీ ‘’అని అందరితో చెప్పేవాడు నవ్వుతూ .ఎప్పుడు ఎక్కడ కనిపించినా నమస్కారం తో చిరునవ్వుతో పలకరించటం అతని అలవాటు .కుశలప్రశ్నలు వేయటం నాకు అలవాటు .తర్వాత ఫాక్టరీ పెట్రోల్ బంక్   లాస్ వస్తోందని ఎత్తేసింది .అప్పటికే పెళ్ళికూడా అయి ఉంటుంది .

  తర్వాత ఫాక్టరీ లో వర్కర్ లను కొందర్ని తీసేశారు .అందులో ఇతను కూడా ఉన్నాడని అనుకొంటా .ఎందుకంటె వీరమ్మ తల్లి అత్తారింటి గుడి దగ్గర ఒక చిల్లర దుకాణం నడుపుతూ కనిపించాడు .బహుశా అతడే మానేసి ఉండాలి లేకపోతె  ఫాక్టరీ వాళ్ళు తీసేసి ఉండాలి .ఇప్పుడుకూడా అదే చిరునవ్వు అదే సౌజన్యం .ఏమీ మార్పులేదు ఎవరిమీదా ఆరోపణలు చేయలేదు .తర్వాత మా అబ్బాయి రమణకు మంచి స్నేహితుడయ్యాడు . మన శ్రీ సువర్చలా౦జనేయ  స్వామి దేవాలయ కార్యక్రమాలలో, సరసభారతి కార్యక్రమాలలో కలిసేవాడు .మనిషి ఆరోగ్యం కొంత దెబ్బ తిన్నట్లు నాకు అనిపించేది .2017అక్టోబర్ లో అమెరికా నుంచి ఉయ్యూరు వచ్చినదగ్గర్నుంచీ మళ్ళీ గంగాధరరావు ను ఎక్కడా చూడలేదు నిన్న అతని మరణ వార్త చూసే దాకా  .అతనికి సుమారు 65 ఏళ్ళు పైగా ఉంటాయనుకొంటాను .అతని ఆత్మకు శాంతికలగాలని పరమేశ్వరుని ప్రార్ధిస్తూ ,అతని కుటుంబానికి సానుభూతి సంతాపం తెలియ జేస్తున్నాను .మంచి వాళ్ళను భగవంతుడు త్వరగా తనదగ్గరకు తీసుకు వెడతాడని అంటారు .

   ఉయ్యూరు హైస్కూల్ లో నాకు గురువుగారు ,తర్వాత నాతో అదే స్కూల్ లో సహ ఉపాధ్యాయులుగా పని చేసిన స్వర్గీయ శ్రీ మహంకాళి సుబ్బరామయ్య గారి పెద్దబ్బాయి,నా శిష్యుడు  ‘’కరెంట్ ప్రసాద్ ‘’అని అందరూ పిలిచే ప్రసాద్  శివరాత్రి మర్నాడు మార్ఛి 5న మరణించినట్లు తెలిసింది .అలాగే ఉయ్యూరు హైస్కూల్ లో నా శిష్యుడు ,నా దగ్గర ట్యూషన్ కూడా చదివిన ,మాఇంటికి దగ్గరలోనే కిరాణా దుకాణం పెట్టి మంచిపేరు పొందిన స్వర్గీయ తాడినాడ సుబ్రహ్మణ్యం కొడుకు ‘’నాని’’ నిన్న 8వ తేదీ చనిపోయాడు .వీరిద్దరి మరణానికి సానుభూతి .కుర్రాళ్ళు ఇలా రాలిపోవటం బాధాకరం .

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -9-3-19-ఉయ్యూరు 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in ఊసుల్లో ఉయ్యూరు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.