ఒక రోజు విదేహరాజు జనకుడు ఆసనం దిగి యాజ్ఞవల్క్య మహర్షి చెంతకు వచ్చి’’భగవాన్ !నమస్కార శతం. నాకు ఈ రోజు బ్రహ్మోపదేశం చేయమని మనవి చేసుకొంటున్నాను ‘’అన్నాడు అత్య౦త వినయ విధేయతలతో.దానికి మహర్షి యాజ్ఞవల్క్యుడు ‘’మహారాజా !నువ్వు ఉపనిషత్తులు సాకల్యంగా విని సమాహితాత్ముడవయ్యావు .నువ్వు పూజ్యుడవు సార్వ భౌముడవు వేదాధ్యయనం చేసి జ్ఞాన విజ్ఞాన సముపార్జన చేసిన ధీమతివి .ఈ దేహాన్ని విడిచాక ఎక్కడికి పోతావో తెలుసా ?’’అని అడిగాడు .తెలియదన్నాడు రాజు .తెలియకపోతే తానే చెబుతానని ‘’కుడికంటి లోని పురుషుడిని ఇంధుడు అంటారు .అంటే ప్రకాశించేవాడు అతడినే అప్రత్యక్షం గా ఇంద్రుడు అంటారు .కారణం దేవతలు పరోక్షప్రియులు ,ప్రత్యక్ష శత్రువులు కూడా .ఎడమకంటిలోని పురుష రూపం పత్ని ,అన్నం కూడా అవుతుంది .అంటే కుడికంట్లోప్రకాశించే పురుషుడు భోక్త , భర్త ఇంద్రుడు అనీ ,ఎడమకంటిపురుష రూపం భోజ్యమైన అన్నం, అతని భార్యఇంద్రాణి అవుతున్నాయి.జాగ్రదావస్థలోకుడి ఎడమ నేత్రాలలోని పురుష రూపాన్ని ‘’విశ్వ’’ శబ్ద౦ చే తెలియ జెప్పారు .ఇది స్త్రీ పురుష ద్వంద్వం .ఈ స్త్రీ పురుషులకు హృదయాకాశమే సంభోగ స్థానం .అందులోని రక్తపు ముద్దవారికి అన్నం .నాడీ తంతువులే వస్త్రాలు .హృదయం నుండి పైకి వెళ్ళే నాడులే వారు సంచరించే మార్గం .ఒకవెంట్రుక ను వెయ్యి భాగాలుగా చీలిస్తే ఏర్పడే అతి సూక్ష్మనాడులు హితములని పిలువబడి హృదయం మధ్యలో ఉంటాయి .తిన్న అన్నం ఈ నాడులద్వారా వ్యాపించి దేహాన్ని వృద్ధి చేస్తుంది .స్థూల దేహాన్ని వృద్ధి చెంది౦చే ఆహారం కంటే ,దేవతా శరీరాన్ని వృద్ధి చెందించే అన్నం చాలా సూక్ష్మమైనది .ఈ దేవతా శరీరాన్నే లింగ శరీరం అంటారు .స్థూల దేహ సంబంధమైన విశ్వాత్మకంటే , సూక్ష్మ దేహ సంబంధ తైజసాత్మ ఇంకా సూక్ష్మ అన్నం చేత వృద్ధి పొందుతుంది .తైజసుడు స్వప్నావస్థలో కంఠంలో ఉండి ప్రకాశిస్తాడు కనుక ఆ అవస్ద లో తైజసుడని పిలువబడతాడు .
‘’ విశ్వాత్మ నుండి తైజసాత్మ,తైజసాత్మనుండి ప్రాజ్ఞాత్మ పొందేవాడికి తూర్పు దిక్కు ను పొందినప్రాణాలు తూర్పు దిక్కు అవుతాయి .అలాగే దక్షిణ దిక్కువి దక్షిణ దిక్కు ,పడమరకు పోయేవాటికి పడమటి దిక్కు, ఉత్తరానికి పోయేవాటికి ఉత్తర దిక్కు, పైకి పోయేవాటికి ఊర్ధ్వ దిక్కు క్రిందికి పోయేవాటికి అధో దిక్కు అవుతాయి. ఒక్కమాటలో చెప్పాలంటే సకల ప్రాణాలు సకల దిక్కులౌతాయి .ఈ ఎరుక గలవాడు సర్వాత్మకమైన ప్రాణాన్ని ఆత్మ స్వరూపంగా మార్చుకొంటాడు .అనగా ప్రత్యగాత్మ లో సర్వాత్మకమైన ప్రాణాన్ని ఉపసంహరించి ‘’నేతి, నేతి అంటే ఇదికాదు ఇది కాదు అనుకొంటూ అన్నిటినీ నిషేధించి, చివరకు ఆత్మను పొందుతాడు .ఆత్మ గ్రహింప శక్యం కాదు కనుక గ్రహి౦ప బడదు .శరీర ధర్మం లేనిదికనుక శిధిలం కాదు .దేనితోనూ కలవదు కనుక ఒంటరిదై ఉంటుంది .దేనిచేత గ్రహి౦పబడదు ,పీడింపబడదు .గ్రహణం సంగమం శిధిలం అనే ధర్మాలు లేవుకనుక ఆత్మ హింస పొందదు. అంటే నశించదు .మహారాజా జనకర్షీ !నువ్వు ఇపుడు జననమరణ నిమిత్త భయం లేకుండా అభయం పొందావు కదా ?’’అన్నాడు .
జనకుడు ‘’మహాత్మా !మీరూ భయరహితులు అగుదురుగాక .భయరహితమైన బ్రహ్మాన్ని తెలియ జేసినందుకు కృతజ్ఞతలు నమోవాకములు .ఈ విదేహ దేశాన్ని హాయిగా అనుభవించండి .నేను మీ దాసుడను ‘’అన్నాడు చక్రవర్తి జనకుడు .రాజువద్ద సెలవు తీసుకొని ఆశ్రమానికి వెళ్ళాడు మహర్షి .కొంతకాలం తర్వాత మళ్ళీ రాజు దగ్గరకు వచ్చాడుకానీ ఆయనకు ఏమీ చెప్పకూడదు అనుకొన్నాడు .కాని పూర్వం వీరిద్దరూ అగ్ని హోత్ర విషయమై చాలా చర్చించారు .అప్పుడు యాజ్ఞవల్క్యుడు ‘’నీ ఇష్టమొచ్చిన ప్రశ్నలు అడుగవచ్చు ‘’అన్నాడు .కనుక ఇప్పుడు జనకుడే ముందుగా ‘’మహర్షీ !కర చరణాదులైన అవయవాలున్న ఈ పురుషుడి గమన సాధనమైన తేజస్సు ఏది ?’’అని అడిగాడు .’’సూర్య తేజస్సుతోనే కూర్చుంటాడు అనేక చోట్లకు తిరుగుతాడు .లౌకిక వైదికకర్మలు చేస్తాడు ‘’అని బదులిచ్చాడు .సూర్యుడు అస్తమించగానే తేజస్సు లేని వాడౌతాడుకదా అని సందేహించిన రాజుకు ‘’చంద్ర తేజస్సుతో సకలం నిర్వహిస్తాడు ‘’అనగా సూర్య చంద్రులిద్దరూ అస్తమిస్తే ?’’అనగా ‘’అగ్ని తేజస్సుతో అన్నీ నిర్వహిస్తాడు .అగ్నికూడా ఆరిపోతే వాక్కు అతని తెజస్సై అన్నీ చేయిస్తుంది ‘’అన్నాడు .’’వాక్కు కు తేజస్సు ఉందని ఎలా తెలుస్తుంది ?’’జనకుని ప్రశ్న.’’చీకటిలో ఏదైనా కూసినా అరచినా మాట్లాడినా అది మనదగ్గరుందా దూరంగా ఉందా అనే జ్ఞేత్రం ద్వారా తెలుసుకొంటాం .కనుక సూర్యచంద్ర అగ్నులు లేనప్పుడు వాక్కే తేజస్సు అవుతుంది .’’వాక్కు కూడా లేకపోతె ?’’అన్న ప్రశ్నకు ‘’ఆత్మయే తేజస్సు అయి అన్నీ చేయిస్తుంది ‘’అని బదులిచ్చాడు యాజ్ఞవల్యుడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -9-3-19-ఉయ్యూరు

