యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -29
‘’ప్రాణాలలో ఉన్న విజ్ఞానమయ ఆత్మ గురించి వివరించండి?’’అని జనకర్షి అడుగగా మహర్షి ‘’హృదయం లో, కంఠంలో ఉన్న తేజో రూప పురుషుడి నే ఆత్మ అంటారు .ఈ ఆత్మను బుద్ధి ధ్యాని౦చేప్పుడు ధ్యానించే దాని లాగా ,బుద్ధి ఇంద్రియాలు చలిస్తున్నప్పుడు చలించే దానిలాగా ఉండి,బుద్ధితో సమానమైన ఇహ ,పర లోకాలను రెండిటిని అనుసరించి తిరుగుతుంది .ఈ ఆత్మయే ఈ లోకం లో మృత్యురూపాలను అతిక్రమిస్తుంది .ఆత్మస్వరూప పురుషుడు శరీరం లో ఉన్నప్పుడు బుద్ధితో సమానుడై స్వప్నాది అవస్థలలో ప్రవర్తిస్తూ ,పాపరూప మైన దేహేంద్రియ సముదాయ మును విడుస్తూ ,గ్రహిస్తూ పుట్టి అవి తానే అనే అభిప్రాయం తో పాపరూప దేహే౦ద్రియాలతో కూడి ఉంటాడు .చనిపోయి వేరొక దేహాన్ని పొందినపుడు ,పాపరూప శరీరేద్రియాలను విడిచి పెడతాడు .ఇలా జనన మరణ పరిభ్రమణం లో సంసారం వడిలో మోక్షం పొందేదాకా ఉంటాడు .కనుక ఆత్మా జ్యోతిస్సు దేహెంద్రియాలకంటే వేరైనది అని గ్రహించాలి .ఆపురుషుడికి ఈలోకం, పరలోకమే కాకుండాఈ రెండిటికి మధ్య సంధిస్థానంగా ఉండే మూడవలోకం స్వప్న స్థానం అవుతుంది .ఇక్కడి నుంచి ఇహ పర లోకాలని చూస్తాడు .ఈ పురుషుడు విజ్ఞాన లక్షణాలతో పరలోకం లో ఉండి,విద్యా కర్మలయొక్క విజ్ఞానాన్ని ఆశ్రయించి స్వప్నం లో పాపఫల దుఖాన్ని, పుణ్యఫల సుఖాన్ని చూస్తాడు .స్వప్న౦ లో ఉన్నప్పుడు ఈ లోకం లోని కొంచెం మాత్రమే గ్రహించి ,తానే శరేరాన్ని పడేసి ,వాసనామయ స్వప్న దేహాన్ని మాయాస్వరూపంలాగా నిర్మించుకొని, తన తేజస్సుతో నిద్రిస్తాడు .ఈ అవస్థసలో స్వయం జ్యోతి ఔతాడు ‘’అని వివరించాడు యాజ్ఞవల్క్యుడు .
‘’స్వప్నం లో రధాలు గుర్రాలు మార్గాలు ఉండవు .మరి ఎలావచ్చాయనే సందేహం కలుగుతుంది .పురుషుడే స్వప్నం లో వాటిని కల్పించుకొంటాడు .అక్కడ సంతానం సుఖం లేవు .వీటినీ ఆత్మ సృష్టించుకొంటు౦ది .చెరువులు బావులు ఉండవు .వాటినీ ఆత్మయే సృష్టించు కొంటుంది . అంటే స్వప్నం లో కనిపించేవన్నీ ఆత్మ సృష్టించినవే .కనుక ఆత్మయే కర్త .వీటిపై కొన్ని శ్లోకాలున్నాయి లున్నాయి ‘’అనగా వాటి తాత్పర్యం చెప్పమన్నాడు జనకుడు .యాజ్ఞవల్క్యుడు ‘’హిరణ్మయుడు లేక హంస స్వరూపుడు అయిన పురుషుడు స్వప్నం చేత దేహానికి నిశ్చేస్టత కలిగించి తాను నిద్రించకుండా ,నిద్రించేవాడిని చూస్తాడు .తేజస్సుకల ఇంద్రియమాత్ర రూపాన్ని పొంది, మళ్ళీ జాగృత స్థానం చేరుతున్నాడు .అమృతుడు హిరణ్మయుడు ,ఏక హంసుడు ఐన ఆ పురుషుడు అంటే ఆత్మ ,ప్రాణవాయువు చేత ఈ గూడు లాంటి శరీరాన్ని కాపాడుకొంటూ దానికి బయట తిరుగుతూ మరణం లేక కామం ఉన్న చోటికి పోతాడు .స్వయం జ్యోతి అయిన ఆత్మ స్వప్నం తర్వాత అధికమైన దేహ భావాన్ని ,నీచమైన పశుపక్ష్యాది భావం పొంది అనేక రూపాలను సృష్టిస్తుంది .ఆనందం నవ్వు భయం ఉన్నట్లు ప్రవర్తిస్తుంది .లోకులు ఈ క్రీడా స్థానాలనే చూస్తారుకాని ఎవ్వరూ ఆత్మను చూడరు .గాఢ నిద్రలో ఉన్నవాడిని అకస్మాత్తుగా లేపద్దని అంటారు .అలా లేపితే ఆత్మ నేత్రాది రూపాలను పొందలేదు .అప్పుడు గుడ్డితనం ,చెవుడు మొదలైనవి ఏర్పడుతాయి .అప్పుడు అతడికి చికిత్స చేయటం చాలాకష్టం .కనుక ఆత్మ స్వరూపం మృత్యు రూపమైన దేహెంద్రియాలను అధిగమించి స్వయం జ్యోతి స్వరూపమౌతోంది .కొందరు విజ్ఞులు ఆత్మకు జాగృతస్థానమే స్వప్న స్థానం అంటారు కానీ ఇది కుదరదు .జాగృతస్థానం లో దేన్ని చూస్తాడో, నిద్రా స్థితిలోనూ దాన్నే చూస్తాడు .స్వప్నం లో నేత్రాది ఇంద్రియాలు లేకపోయినా స్వయం జ్యోతి రూపమైన జాగ్రత్ వాసనవలన తానే కల్పించుకున్నవన్నీ చూస్తుంది .కనుకజాగృత్, స్వప్నాలు వేరు వేరు .ఒకటికానేకాదు .స్వప్నం లో ఆత్మ స్వయం జ్యోతి అని గ్రహించాలి ‘’అన్నాడు .’’మహాత్మా !మీబోధనకు వెయ్యిఆవులు కానుకగా ఇస్తాను .ఇంకనాకు మోక్షసాధనాన్ని అనుగ్రహించండి ‘’అని కోరాడు జనకర్షి .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -10-3-19-ఉయ్యూరు

