యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -30
‘’స్వయం జ్యోతిస్వరూపుడైన ఆత్మ స్వప్నం నుంచి సుషుప్తి పొందగోరి స్వప్నం లోనే మిత్ర బంధులాదిగా దర్శనం చేత అనురాగం పొంది ,అనేక విధాలుగా సంచరిస్తూ , పుణ్యపాపఫలాలను చూస్తూ’’ సంప్రసాదం ‘’అంటే జాగ్రతలో దేహెంద్రియాది వ్యాపార సమూహం వలన పుట్టిన కాలుష్యాన్ని వదిలేసి వాటి వాసనలైన స్వప్న వ్యాపారాలను విడిచేసి నిర్మలమైన గాఢ సుషుప్తి లో ఉండి,మళ్ళీ స్వప్నం కోసం పూర్వం పొందినట్లు ప్రతి స్థానం పొందు తుంది .కాని పుణ్యపాపాలచే బంధింప బడదు . కనుక ఆత్మ అసంగమం ఐనది. దేనితోనూ కలిసి ఉండదు. కనుక ఆత్మకు మరణం లేదు .’’అని మోక్ష సాధనం గురించి మొదలుపెట్టి చెప్పాడు యాజ్ఞవల్క్యుడు జనకంహారాజుకు .రాజు మళ్ళీ వెయ్యి గోవులను కానుక ఇస్తానని చెప్పి మిగిలిన విషయాలు వివరించమని కోరాడు .
‘’ఆత్మ జాగ్రదవస్థలో కూడా బంధుమిత్రాదులతో అనురాగం పొంది క్రీడిస్తూ పుణ్యపాపాలకు బద్ధం కాకుండా మళ్ళీ స్వప్న స్థానం లోనే ప్రతిస్థానం పొందుతుంది .నీటిలోని చేప ఈ ఒడ్డునుంచి ఆ ఒడ్డుకు తిరుగుతున్నట్లు ఆత్మ స్వప్న, జాగ్రత స్థానాలలో సంచరిస్తుంది .పక్షి ఆకాశం లో తిరిగి తిరిగి మళ్ళీ తన గూటికి చేరినట్లు ,ఆత్మకూడా దేనికీ అంటక,దేన్నీ ఆశించకుండా తనరూపాన్ని తాను పొందుతుంది .శరీరం లో ‘’హితం ‘’అనే పేరుగల సూక్ష్మనాడులు వాతం ఎక్కువైతే నల్లగా ,పిత్తం ఎక్కువైతే పసుపుగా ,,శ్లేష్మం ఎక్కువైతే తెల్లగా ఈ మూడు సమాన౦గా ఉంటే ఎర్రగా అవుతాయి .అంతః కరణ ప్రవృత్తి ఆశ్రమం గా కలిగి ,మిధ్య ఐన జాగ్రత్ వాసనలవలన స్వప్న దృక్కులున్న ఆత్మను శత్రువులు వెంబ డించినట్లు ,నూతిలోపడినట్లు భావనకలుగుతుంది .జాగృతం లో చూసిన భయానక విషయాలే స్వప్నం లోనూ కనిపిస్తాయి .అవిద్యవలన ఆ భయం కలుగుతుంది. అంటే స్వప్నం లో లేకపోయినా అజ్ఞానం చేత ఉన్నాయని అనుకొంటాడు ,. మళ్ళీ జాగృత స్థితికి వచ్చి తన్ను తాను తెలుసుకొని ,సర్వం నేనే అనుకొంటాడు. అదే ఆత్మకు’’ పరలోకం ‘’అనగా ఆత్మ స్వప్నం లో మోక్షం పొందినట్లు పొందుతోంది .సుషుప్తి పొందక, కోరికలేక ,స్వప్నాన్ని చూడకుండా ఉండటమే ఆత్మకు రూపం .అది కోరికలను, పాపాలను అతిక్రమించినది ,భయరహితమైనది పురుషుడు లేక ఆత్మ ప్రాజ్ఞాతతో ఉన్నా, లోపలా బయటా ఉన్నదాన్ని తెలుసుకోలేడు.ఇదే ఆత్మ స్వరూపం. లోకాలు లోకాలుకావు .దేవతలు దేవతలుకారు .ఆత్మ శుభ అశుభ కర్మలను అతిక్రమించి ఉంటుంది ‘’
‘’ద్రష్ట ఐన ఆత్మ దృష్టికి నాశనం లేనేలేదు .ద్రష్ట స్వరూపమైన ఆత్మకంటే భిన్నమైనది లేదు .దేన్నీ చూడకపోయినా ,చూసేదే అవుతుంది .దాని సర్వే౦ద్రియజ్ఞానానికి నాశనమే ఉండదు ‘’అన్నాడు .జనకుడు ‘’ఎందువలన ఆత్మ విశేష జ్ఞానాన్ని తెలుసుకో లేకపోతోంది ?’’ప్రశ్నించాడు .మహర్షి ‘’ఏకాకృతి ఐన ఆత్మకు స్వభావమైన అజ్ఞానం చే స్వప్నం లో తనలో లేని వేరొక వస్తువు ను కల్పించి పొందిస్తుంది .జాగ్రదవస్థలో అజ్ఞాన సంకల్పిత వస్తువులకు వేరుగా ఉంటూ అన్నీ చూస్తూ ఆఘ్రాణిస్తూ రుచి చూస్తూ భిన్నమైన జ్ఞానం కలిగి ఉంటుంది .చూడ దగిన రెండో వస్తువు లేని ద్రష్ట అవుతుంది .సుషుప్తిలో స్వకీయ తేజస్సుపొందుతుంది అదే బ్రహ్మ లోకం. అదే విజ్ఞానమయ ఆత్మకు ఉత్తమగతి సంపత్తు, పరమానందం అవుతుంది .ఇతర భూతాలూ ఈ ఆనంద అంశం యొక్క కళను అనుసరించి జీవిస్తాయి .మనుష్యులలో ‘’రాద్ధుడు’’ అనేవాడు ఉపభోగ కరణ సంపత్తి కలవాడై ప్రభువై ,సమస్త మానుష భోగాలచే సంపన్నతముడు ఔతాడు. అదే మనుషులకు పరమానందం .ఇలాంటి వంద మానుషానందాలు పితరులకు ఒక ఆనందం తో సమానం .వంద పితృ దేవతానందాలు ఒక గంధర్వానందం .వంద గంధర్వానందాలు ఒక దేవతానందం .వంద దేవతానందాలు ‘’అజాన దేవుడి’’కి అంటే పుట్టగానే దేవత్వం పొందినవాడికి ఒక ఆనందమౌతుంది .ఇలాంటివి వందయితే ప్రజాపతి లోకానందమౌతుంది. శ్రోత్రియుడు ,అవృజినుడు ,అకామ హతుడు ఐనవాడు హిరణ్యగర్భ ఆనందం తో సమానమైన ఆనందం కలవాడౌతాడు .ఈ బ్రహ్మలోక ఆనందామే పరమానందం .ఇక ఆనందం ఎన్నటానికి సాధ్యమే కాదు .అదే బ్రహ్మలోకం లేక బ్రహ్మానందం .’’అని చెప్పగా జనకుడు మహదానందం పొంది మళ్ళీ వెయ్యి ఆవులనిస్తున్నట్లు చెప్పి మోక్ష సాధనలో మరిన్ని విశేషాలు తెలియ జేయమని కోరాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -10-3-19-ఉయ్యూరు

