నా దారి తీరు -116
సమర్దురాలైన ఉపవిద్యా శాఖాదికారిణి శ్రీమతి ఇందీవరం గారు
నాదారి తీరు -115 ఎపిసోడ్ బాలసాహిత్య చక్రవర్తి శ్రీ ముదునూరు వెంకటేశ్వరరావు గారి గురించి 2018 జూన్ 12 న రాశాను .సుమారు 9నెలలతర్వాత 116 తో మళ్ళీ కొనసాగిస్తున్నాను .
శ్రీ మతి ఇందీవరం గారి సర్వ సమర్ధత విని నేను మేడూరు నుంచి కావాలని గుడివాడ డివిజన్ అడ్డాడ కు వచ్చానని ఇదివరకే రాశాను .ఆవిడ చాలా డైనమిక్ పర్సనాలిటి .ఆమె పని చేసిన కాలం గుడివాడ జోన్ జిల్లాలో అన్ని జోన్ లకంటే ముందు ఉండటమేకాదు ఆదర్శంగా ఉండేది .అక్కడి హెడ్ మాస్టర్లతో సన్నిహిత పరిచయం సబ్జెక్ట్ టీచర్ల సమర్ధత ఆమెకు బాగా తెలుసు .వారిసేవలు విద్యా వ్యాప్తికి ఎలా విని యోగించుకోవాలో బాగా తెలిసిన ఆఫీసర్ ఆమె .ఫ్రూట్ ఫుల్ డిస్కషన్స్ తో ఆమె విజయాలు సాధించారు .పరీక్షల నిర్వహణ ,స్కూళ్ళను సమర్ధవంతంగా పని చేయించటం ,గొప్ప పర్యవేక్షణ వార్షిక తనిఖీలు ,అకస్మాత్తు తనిఖీలతో డివిజన్ అంతా ఎప్పుడూ అప్రమత్తంగా ఉండేది .స్కూల్ కాంప్లెక్స్ ల నిర్వహణ బాగా ఉండేది .సబ్జెక్ట్ టీచర్స్ కు ఓరిఎంటేషన్ క్లాసుల నిర్వహణ అర్ధవంతంగా ఉండేది .గుడివాడ కాలేజీ లెక్చరర్ల సహాయ సహకారాలతో సబ్జెక్ట్ టీచర్స్ కు మంచి నైపుణ్యం అందించేవారు .సమర్ధులైన హెడ్ మాస్టర్లు శ్రీ జోశ్యుల సూర్యనారాయణ మూర్తి గారు వంటి వారి అనుభవాన్ని విద్యాభి వృద్ధికి చక్కగా వినియోగింఛి గౌరవించేవారు ,మూర్తిగారు ఇంగ్లిష్ లో మహా నిపుణులైన ఉపాధ్యాయులు హెడ్మాస్టర్ .ఆయన పని చేసిన అంగలూరు హై స్కూల్ సెంట్ పర్సెంట్ రిజల్ట్స్ తో జిల్లాలోనే ఆదర్శ పాఠశాలగా గుర్తింపబడింది .ఒక రకంగా ఆయనతో మాట్లాడటమే ఒక ఎడ్యుకేషన్ .ఎన్నో విషయాలు మనం గ్రహి౦చి రిఫ్రెష్ అవుతాం .అందరిని ఆదరంగా చూసి మర్యాదగా మాట్లాడటం ఆయన సహజ స్వభావం .మూర్తీభవించిన సౌజన్య మూర్తి మూర్తిగారు .ఆయన తో నాకు మంచి పరిచయమేర్పడింది .వారు నాకు సన్నిహితులయ్యారు .ఇది గుడివాడ డివిజన్ కు నేను రావటం వలన మాత్రమే జరిగింది .
ఇందీవరం గారిని మా అడ్డాడ హై స్కూల్ వార్షిక తనిఖీకి ఆహ్వానించాం .పానెల్ టీచర్స్ ను నియమించి ఆమె ఇన్స్పెక్షన్ కు వచ్చారు .అంతా సవ్యంగా ఉందని సంతోషించి మెచ్చారు .అప్పటినుంచి ఆమె నాపై ప్రత్యేక అభిమానం కనపరచేవారు .నేను ఎప్పుడు ఎక్కడమాట్లాడినా ఇందీవరంగారి సమర్ధత చూసే అడ్డాడ వచ్చాను అని చెప్పేవాడిని.గుడివాడలో జరిగే డివిజన్ హెడ్ మాస్టర్ల సమావేశం లో సైన్స్ ఇంగ్లీష్ టీచర్స్ సమావేశం లో నాతో మాట్లాడించేవారు .నేను ప్రతిదీ నోట్స్ రాసుకోనేవాడిని .దాన్ని ఆధారంగా మాట్లాడే వాడిని .కనుక సమావేశం లో ఎవరెవరు ఏమి మాట్లాడింది మొత్తం మీద సమావేశ ముఖ్యననిర్ణయాలేమిటి అన్నీ పూస గుచ్చినట్లు చెప్పేవాడిని .అప్పటినుంచి నేను రిటైర్ అయేదాకా నాకే ఈ బాధ్యతఆమె ఆమెతర్వత వచ్చిన ఉప విద్యా శాఖాధికారులు కూడా అప్పగించేవారు .అలాగే జిల్లాపరిషత్ చైర్మన్ గారి ఆధ్వర్య౦ లో నూ డియివో గారి ఆధ్వర్యం లో జరిగే ప్రధానోపాధ్యాయుల సమావేశం లోనూ నాతోనే అన్ని విషయాలు చెప్పించేవారు .అదంతా నాకు చాలా ఆనందంగా హుషారుగా బాధ్యతగా ఉండేది. సాటి వారు నన్ను అభిమాని౦చ టానికి ,నాతో సన్నిహితులవటానికి కారణాలు కూడా అయ్యాయి .
గుడివాడ డివిజన్ లో ఇందీవరం గారికి సన్నిహితులైన హెడ్ మాస్టర్లు బేతవోలు హెడ్మాస్టర్ శ్రీ ప్రభాకరరావు ,టౌన్ హై స్కూల్ హెడ్మాస్టర్ శ్రీ నర్రా వెంకటేశ్వరరావు ,శ్రీ పొట్టి శ్రీరాములు హై స్కూల్ హెడ్ మాస్టర్ జోశ్యులమూర్తిగారితో పాటు ఉండేవారు .
పప్పెట్ షో నిర్వహించే క్రాఫ్ట్ మాస్టర్ శ్రీ తాతా రమేష్ బాబు ను ప్రత్యేక శిక్షణ కోసం పంపించి అతని సేవలు అన్ని స్కూళ్ళకు అందించేట్లు షోలు ఏర్పాటు చేయించేవారు .ఇక్కడే అతనితో పరిచయమై ఆతర్వాత ఉయ్యూరు సాహితీమండలికి, సరసభారతి కార్య క్రమాలకు కవి సమ్మేళణాలకుఆహ్వానిస్తే వచ్చేవాడు ,కృష్ణా జిల్లా రచయితల సంఘానికి కోశాధికారిగా ఉండేవాడు .జాతీయ సభ ,మొదటి ప్రపంచ తెలుగు రచయితలసభ లకు మేమిద్దరం కలిసిపని చేశాం కూడా .విజయవాడ రేడియో స్టేషన్ డైరెక్టర్ మాన్యశ్రీ మంగళ గిరి ఆదిత్యప్రసాద్ గారితో చాలా సాన్నిహిత్యం ఉండేది .ఆయన జీవిత చరిత్ర అతడు రాస్తున్నట్లు ప్రసాద్ గారే నాకు చెప్పారు .ఉయ్యూరులో మా సువర్చలాన్జనేయస్వామి దేవాలయం లోజరిగిన సరసభారతి కార్యక్రమం లో ఆదిత్యప్రసాద్ గారు రెండుగంటలసేపు తెలుగుపాట పుట్టుక గురించి సోదాహరణంగా వీనుల విందైన సంగీత౦ తో మాట్లాడినప్పుడు కూడా అతడు వచ్చాడు .చాలా కవితా సంపుటులు రాసి ప్రచురించాడు .రేడియోలో చాలా ప్రసంగాలు చేశాడు .నేను రిటైరయ్యాక ఉయ్యూరు ఫ్లోరా స్కూల్ లో అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ గా 2000 నుండి 2002వరకు పని చేసిన కాలం లో అతన్ని ఆహ్వానించి పప్పెట్ షో ఏర్పాటు చేయించాను .కుటుంబంతో వచ్చి చేసి మెప్పు పొందాడు . కేన్సర్ సోకి దానితో పోరాటం చేసి అందరికీ పత్రికాముఖంగా ధైర్యం చెప్పి సుమారు మూడేళ్లక్రితం మరణి౦చాడు .ఇలాంటి మెరికల్లాంటి వారి నెందరినో ఇందీవరం గారు తయారు చేశారు .ఈ విధంగా గుడివాడ డివిజన్ ఇందీవరంగారి హయాం లో నిత్యకళ్యాణం పచ్చతోరణంగా అభి వృద్ధి మూడు పూవులు ఆరుకాయలులాగా ఉండేది .
శ్రీమతి ఇందీవరం గారు గుడివాడలోనే రిటైరయ్యారు .ఆమె వీడ్కోలు అభినందన సభ పొట్టి శ్రీరాములు హైస్కూల్ లోసాయం వేళ చాలా ఘనంగా నిర్వహించారు .అన్ని స్కూళ్ళ హెడ్ మాస్టర్లు హాజరయ్యారు. పట్టు చీరెలు పుష్పహారాలు ఆత్మీయ బహుమతులతో నభూతో గా జరిగిన కార్యక్రమం లో జిల్లాపరి షత్ చైర్మన్ డియివో గార్లు వేదికనలంకరించి ఇందీవరంగారిని ఘనంగా సత్కరించి ఆమె విద్యా సేవను సమర్ధతను బహుధా ప్రశంసించారు .ఆమె కూడా తనకు గుడివాడ డివిజన్ అంటే ప్రత్యేకమైన అభిమానమని ఇక్కడివిద్యా కుటుంబం సర్వ సర్ధవంతమైనదని అందువలలననే ఏదైనా అద్భుతాలు సాధించాబడ్డాయి అంటే వారందరి సహాయ సహాకారాలవలననే ఇంతటి ప్రగతి లభించిందని చెప్పారు .గుడివాడ డివిజన్ తన ఆరవ ప్రాణంగా పని చేశానని ఇక్కడ సాధించింది అంతా ఈ డివిజన్ కే అంకితం అనీ అన్నారు .తమలాంటి వారు ఎందరో వస్తూ ఉంటారు పోతూ ఉంటారు .కాని నిరంతరం విద్య మీద విద్యార్ధుల అభి వృద్ధిమీద దృష్టి ఉంచితే ఎవరైనా ఏదైనా సాధించవచ్చు అంటూ తనకు ఈ డివిజన్ లో అందించిన సహకారానికి డిపార్ట్ మెంట్ కు హెడ్ మాస్టర్లకు ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలియ జేశారు .ఉత్తేజకరమైన ఆమె ప్రసంగం అందరినీ ఆకట్టుకొని ఆమె కృషికి ఆనంద బాష్పాలు రాల్పించింది .
శ్రీమతి ఇందీవరంగారి గుడివాడ డివిజన్ లోని అడ్డాడ హై స్కూల్ లో హెడ్ మాస్టర్ గా పని చేస్తున్నందుకు గర్వ కారణం అయింది.ఆమె ప్రభావం నాపై చాలా ఉంది . .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -12-3-19-ఉయ్యూరు

