’నాగరకత కు అసలు అర్ధం గుణకారం కాదు .స్వచ్చందంగా ఐచ్చికంగా కోరికలు తగ్గించుకొని అసలైన సంతృప్తి ,సంతోషం పొంది ,సేవాభావంతో ధన్యత చెందటమే ‘’
మానవ భద్రత నూతన మైన భావం అన్నది ఒక నిజం . అదివ్యక్తి అనుభవించే సంక్లిష్ట ,ఒకదానితో ఒకటి సంబంధమున్న విషయాలను వివరించేది .దీన్ని ప్రతిపాదించేవారు సంప్రదాయ మామూలు భద్రత ను సవాలు చేస్తారు .వీరి దృష్టిలో భద్రత అంటే వ్యక్తిగతమైనదే కాని దేశానికి మాత్రమే చెందింది కాదు .దేశభద్రత లో మానవ భద్రత ఉన్నదని అనుకోరాదు .గత వందేళ్ళలో ఆయా ప్రభుత్వాలే తమ ప్రజలను విదేశే పాలకులకంటే ఎక్కువగా చంపారు అన్నది పచ్చి నిజం .
1994నాటి హ్యూమన్ డెవలప్ మెంట్ రిపోర్ట్ ప్రకారం కోరికలనుండి ,భయాలనుండి రక్షణ కల్పించటమే విశ్వ వ్యాప్తంగా మానవాళికి భద్రత కలిగించటం .ఈ రిపోర్ట్ .1-ఆర్ధిక 2-ఆహార 3-ఆరోగ్య 4-పర్యావరణ 5- వ్యక్తిగత 6-సామాజిక 7-రాజకీయ అంశాలను చర్చించింది ..ప్రస్తుతం వ్యక్తి ఆర్ధిక భద్రతను గాంధీ ఆలోచనా దృక్పధం లో పరిశీలిద్దాం .
యునైటెడ్ నేషన్స్ అంచనా ప్రకారం 2009నాటికి ప్రపంచం లో అత్యంత బీదరికం లో ఉన్నవారికి ,ప్రపంచ మొత్తం జనాభాకు మధ్య ఉన్న నిష్పత్తి 21శాతం .బీదరికం యెంత ఉన్నదో, ఆకలీ అంతే ఉంది .అభివృద్ధి చెందుతున్న దేశాలలో 150 మిలియన్ల పిల్లలు పోషకాహార లోపం తో అలమటిస్తున్నారు .దీనికి పరిష్కారాన్ని మానవ భద్రతను ఆ పేపర్ గాంధీ ఆలోచనలు- ఆచరణలు దృష్టి కోణం లో సమాధానాలు చెప్పింది .
గాంధీ స్పష్టంగా ‘’మనిషి ఆకలి కోరలలో నలిగి బాధ పడటానికి ఏదో గొంతెమ్మ కోరికలు కోరటం కాదు, కేవలం తన కడుపు ని౦పు కోవటానికే అంటే ఆత్మారాముడిని సంతృప్తి పరచటానికే ‘’అని చెప్పాడు .మహాత్ముడు తన జీవితమంతా ఈ సమస్యా పరిష్కారానికే ,దీనికి సరైన ఆర్ధిక సాధనం కోసమే కృషి చేశాడు .ఈవిధానం పేదవాడి కడుపు ని౦పటమే కాక ,అనుసరణీయమైనదిగా ,నమ్మకమైనదిగా ,సాధ్యమైనదిగా ఉండాలని తపన చెందాడు .
మహాత్ముడు ‘’మానవారాధనతో ,బలహీనులను దోచి సంపాదించిన ఆర్ధిక సంపద పనికి రానిది శాస్త్రీయ ఆర్ధిక విధానానికి వ్యతి రేకమైనది .నిజమైన ఆర్దికత సాంఘిక న్యాయాన్ని సమర్ధిస్తుంది .గాంధీ భావనలో ఆర్దికతకు ,నైతికతకు మధ్య పెద్దగా గణనీయమైన భేదం లేదు .ఆయన భావనలో ‘’వ్యక్తి యొక్క నైతిక భావన ,వ్యక్తి సంక్షేమం,దేశ సంక్షేమాలను బాధించే ఆర్దికతలన్నీ అనైతికమైనవే ‘’.ఈ భావన ఒకప్పుడు ఆడం స్మిత్ చెప్పిన ‘’ఆర్ధిక విధానం విశ్వాసం ,నమ్మకం ,అవ్యక్త విలువల పై కూడా ఆధార పడిఉంటుంది ‘’అన్న భావానికి అతి దగ్గరగా ఉందికదా .
బైబిల్ కూడా దాతృత్వం ,అధిక సంపద ప్రశ్నలను ఎదుర్కొన్నది .ఇందులో మొదటి భాగమైన ఓల్డ్ టెస్టమెంట్ సంపద కూడబెట్టటాన్ని సమర్ధించింది .రెండవభాగమైన న్యు టెస్టమెంట్ దాతృత్వాన్ని బాగా సమర్ధించింది .తన ‘’దీరీ ఆఫ్ మోరల్ సెంటి మెంట్స్’’ లో ఆడం స్మిత్ మానవుని నైతికత ,భావోద్వేగాలపై గట్టిగానే చెప్పాడు .’’వెల్త్ ఆఫ్ నేషన్స్ ‘’లో స్వయంగా విధి పూర్వకంగా బలి చేయటం (సెల్ఫ్ఇంటర్ మెంట్ )సరైన, నిర్దుష్టమైన చర్యకు దారి చూపుతుంది’’ అని ఉద్ఘాటించాడు .
గాంధీ దాతృత్వాన్ని సమర్ధించాడు .సంపద ఎలా కూడా బెట్టారన్న విషయం జోలికి పోలేదు .ఆయన సంపన్నులను తమ సంపాదకు ట్రస్టీ లుగా ఉండమని ,అందులో కొంతభాగం అవసరమైనవారికి దానం చేసి ఆదుకోమని చెప్పాడు ..’’ట్రస్టీ షిప్ విషయం లో నా సిద్ధాంతం వెంటనే అద్భుతాలు జరుగుతాయని కాదు ,అది మిగిలిన సిద్ధాంతాలకంటే శ్రేష్టమైనదని నేను నమ్ముతాను .ఏ సిద్ధాంతమైనా అహింసా సిద్ధాంతం తో కలిసి పని చేయాల్సిందే ‘’అన్నాడు .
అధిక సంపద తో, అత్యున్నత అధికారాలలో ఉన్న వర్గాలవారు తమ దురాశ ను తగ్గించుకొని కిందికి దిగి, దిన కూలీ జీతం తో బతికే వారి సమ స్థానం లో ఉండాలి అని గాంధీ భావించాడు .ఆయన ఆలోచనకు ఆచరణకు మధ్య వ్యత్యాసం ఉండదు .అందుకే ఆయన ‘’పూర్తి ట్రస్టీ షిప్ అంటే యూక్లిడ్ నిర్వచనం లాగా నైరూప్యం కాదు .దానికోసం మనం గట్టిగా ప్రయత్నిస్తే ఈ భూమిపై సమానత్వం సాధించటానికి ఇంతకంటే సరైన శ్రేష్టమైన మార్గం లేదని నా దృఢ విశ్వాసం ‘’అన్నాడు .
సంపద, అధికార వర్గాల ప్రభావం తగ్గించటానికి ప్రభుత్వం అతి తక్కువ హింసను ప్రయోగించటాన్ని గాంధీ సమర్ధించాడు .ఆయన దృష్టిలో ప్రైవేట్ ఓనర్షిప్ అంటే స్వంత యాజమాన్య౦ చేసే హింసకంటే ,వారిపట్ల ప్రభుత్వం చూపే హింస అత్యల్పమైనది.కనుకనే సమర్ధించాడు .మనుషులలో మంచితనం ఉండాలని, అది ప్రతిఫలించాలని కోరాడు .శ్రమకు, పెట్టు బడికి మధ్య అనాదిగా ఉన్న ఘర్షణ తగ్గి ఆర్ధిక సమానత్వం సాధించాలనే కృషి చేశాడు . మృత సమానత్వం వ్యక్తిని తన శక్తి సామర్ధ్యాలను సమర్ధంగా పరిపూర్ణంగా వినియోగించుకోలేక పోతే అలాంటి సమాజనం నాశనమౌతుంది .కనుక ధనవంతుడు న్యాయంగా, గౌరవంగా కోట్లు ఆర్జించి ,వాటిని సర్వ జనుల సేవకు వినియోగించాలని గాంధీ కోరాడు.‘’తేన త్యక్తేన భు౦జీతా ‘’అనే ఆర్యోక్తి ‘’ అనేది సరైన సూటి మార్గమని ,దీనివలన నూతన జీవిత విదానమేర్పడుతుందని ,అప్పుడు ప్రతి వ్యక్తీ తన కోసమేకాక ,తన చుట్టూ ఉన్నవారికోసమూ కస్టపడతాడని విశ్వసించాడు .దీనినే ఆడమ్ స్మిత్ ‘’వ్యక్తి ఎంతటి స్వార్ధ పరుడైనా ,అతనిలో తప్పకుండా కొన్ని మంచి సూత్రాలు కూడా ఉంటాయని ,అవి అతనికి స్పూర్తి నిస్తూ ఇతరుల సంతోషం తప్పనిసరిగా తన సంతోషమని భావిస్తాడు ‘’అని గాంధీ సిద్ధాంతాన్నే మారు పల్కాడు .
గాంధీ ఆర్ధిక భావాలపై పరిశీలన చేసిన వి.పి. పాటిల్, ఐ .ఎ .లోక్ పూర్ కొన్ని ఆసక్తికర విషయాలను తెలియ జేశారు వీటిని తప్పక పరీక్షించాల్సిందే –‘’ప్రపంచం గాంధీ భావాలను అమలు చేయక పోవటానికి ఎకైక కారణం పారిశ్రామీకరణ అత్యున్నత స్థాయి లో ఉండటమే .కనుక గడియారాన్ని వెనక్కి తిప్పి, ఆదిమ సమాజ భావనలను ఆహ్వాని౦చ గలమా ?’’అలాగే జి .యెన్ .ధవాన్ భావన ‘’కమ్యూనిస్ట్ భావ జాలం లో గాంధీగారి ట్రస్టీ షిప్ భావన అమలు పరచలేము ‘’.కాని గాంధీ భావనలు అమలు చేయటానికి ఆలస్యం అనే మాటకు తావే లేదు .పారిశ్రామీకరణ అయినా, ఇంకా ఏదో గొప్ప విధాన మైనా ప్రజలకోసం ,సమాజం కోసమే కాని దీనికి భిన్నం కాదు .ఇప్పడు గాంధీ విధానాలు యెంత అవసరమో తగినవో చూద్దాం .గాంధీ చూడగలిగింది ఇతరులు చూడ లేకపోయింది ఏమిటి అంటే ‘’ఉక్కు విద్యుత్తూ వలన జీవితమిచ్చి ,అంతకు ముందు ప్రాధాన్యంగా ఉన్న రక్త మాంసాలను దూరం చేసింది .యంత్రం చకచక కదులుతూ ,మనిషి జీవిత౦ తో ఆడుకొంటూమనిషిని రోబోట్ -మరబొమ్మను చేసింది ‘’ .
అందరూ గొప్పగా పొగిడే ఉత్కృష్ట పారిశ్రామీకరణలేక ‘’హై స్టేట్ ‘’మానవత్వాన్ని మంటగలుపుతోంది .అందుకే దార్శనికుడు గాంధి’’యంత్రం మానవ ప్రకృతికి,సంస్కృతికి అనుసందాన మవ్వాలి కాని ఇప్పుడున్నట్లు మానవ ప్రకృతిని యంత్రం అవసరాలకు అనుసంధానించటం కాదు. ‘’ఆధునికత తెచ్చిన అనర్ధాన్ని విశ్లేషిస్తూ రాబర్ట్ నిస్బేట్ ‘’వ్యక్తియొక్క సాంఘిక ఆర్ధిక రాజకీయ సంస్కృతిక జీవితాన్ని తారు మారు చేసి, స్థానం భ్రంశం కలిగిస్తోంది .అందుకే గాంధీ భావాలే నేడు ఆచరణీయాలు ‘’అన్నాడు. హై స్టేట్ అంటే గ్లోబలైజేషన్ వలన వచ్చిన అభివృద్ధి. ఇది యంత్రానికే, భౌతికత కే అధిక ప్రాదాన్యమిస్తుంది కాని మనిషికి కాదు .దీనినే మాక్ ఫెర్సన్ ‘’కన్స్యూమర్ ఆఫ్ యుటిలిటీస్ యొక్క సృజనాత్మక శక్తులను పూర్తిగా తగ్గించటమే ‘’అన్నాడు .ఈ హైస్టేట్ ‘’పద్ధతికి ప్రత్యామ్నాయాన్ని –‘’ఉత్పత్తి రంగం లో అత్యధిక ఉత్పత్తిని సామాన్య జనాలతో చేయించాలి ‘’ అని గాంధి చెప్పాడు .ఉత్పత్తి విధానం ,పంపిణీ పధ్ధతులను వికేంద్రీకరణ చేయాలి .ఈ కొత్త వికేంద్రీకరణ ఆర్ధిక విధానం చిన్న ,కుటీర పరిశ్రమల ఆధారంగా ఉండాలి ‘’అన్నాడు .
ఇప్పుడు జి .యెన్ .ధావన్ పరిశీలనలను గురించి తెలుసుకొందాం –‘’హెగెల్, మార్క్స్ ల లాగా గాంధీ, అభి వృద్ధిని మాండలికంగా డయలెక్టిక్స్ గా వర్ణించాడు .అయితే మార్క్సియా న్ డయలెక్టిక్స్ చారిత్రాత్మకంగా నిర్ణయి౦ప బడితే ,గాంధియన్ డయలెక్టిక్స్ చలన శీలంగా అంటే డైనమిక్ గా ,చర్యా విధానంగా ,సృజనాత్మకత ,అంతర్గత నిర్మాణ సంఘర్షణ గా నమ్మాడు .మార్క్స్ భావనలో భౌతిక శక్తి మార్పుకు పురుడుపోసే నర్సు .గాంధీకి అహింస అంటే నైతిక శక్తి .మన జీవుల అంతర్గత వారసత్వ సిద్ధాంతం .హింస అనాగరక విధానం .
సాంఘిక ఆర్ధిక విధానం పై గాంధీ సిద్ధాంతం ధావన్ భావనకు పూర్తిగా విరుద్ధం .మార్క్స్ భౌతిక పరమైన విధానం పై ఆధారపడిన ధనస్వామిక కాపిటలిస్టిక్ ఉత్పత్తి పై దాడి చేశాడు ..కానీ గాంధీ సంపాదనే ముఖ్యమన్న భౌతిక నాగరకత పై ఎదురు తిరిగాడు .మార్క్స్ కొత్త రాజకీయ విధానం అంటే డిక్టేటర్ షిప్ ను కనిపెడితే , గాంధీ మాత్రం కొత్త సాంఘిక ఆర్ధిక విధాన సృజన జరగాలని భావించాడు .’
గాంధీ దృష్టిలో నిజమైన ప్రగతి అంటే భౌతిక అభి వృద్ధికి భిన్నమైన నైతికాభి వృద్ధి .రోమ్,ఈజిప్షియన్ నాగరకతలను, భారత్ లోని ద్వాపరయుగాన్ని ఉదాహరించాడు .ఇవి పతనం చెందటానికి భౌతిక సంపద పెరిగి ,నైతిక విలువలు పూర్తిగా క్షీణి౦చటమేఅని చెప్పాడు.ఈ సందర్భంగా ఇ.ఎఫ్ .షుమేకర్ ను గురించి కొంత తెలుసుకోవాలి .ఈయన గాంధీ ప్రభావానికి లోనై’’ఆధునిక సాంకేతికత ,ఆర్ధికం అనే ఏక శిలా విధానం పూర్తిగా మార్చి పునర్నిర్మించాలి ‘’అన్నాడు . ఆయన రచించిన గాంధీ ఫోటో కవర్ పేజీగా ఉన్న పుస్తకం ‘’స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ ‘’లో గాంధీ జీ ఆర్ధిక సిద్ధాంతాలను పాశ్చాత్య ఆర్ధిక వేత్తల ఆలోచనలను పరిచయం చేసి .గాంధియన్ విధానాలపై సీరియస్ గా అధ్యయనం జరగాల్సిన అవసరం ఉందని చెప్పాడు . ‘’షుమేకర్ మాని ఫెస్టో ‘’గా చెప్పబడుతున్న ఆయన విధానం ‘’ భూమి శక్తిని క్షీణి౦ప జేస్తున్నవేగవంతమైన మానవ జీవిత విధానం ,అనేక పరిష్కరి౦ప రాని సమస్యల వలయమై పోతోంది .రాబోయే ప్రతి తరం, హింసాత్మకమై ,నైతికత మృగ్యమైపోతుంది .అతి తక్కువైన, వాస్తవమైన మానవ అవసరాలు తీర్చకుండా , అడ్డూ ఆపూ లేని విస్తరణ విధానం అనర్ధదాయకం ‘’.ఈయనే తర్వాత ఆర్దికత కు యుద్ధానికి మధ్య సంబంధాన్ని గాంధియన్ ఆలోచనలతో విశ్లేషించి చివరకు ‘’అహింసా విధాన ఆర్దికత అత్యంత అవసరం ‘’అని తేల్చి చెప్పాడు .
యంత్రాలన్నీ నాశనం చేసి ,ఆదిమ యంత్రాను ప్రవేశపెట్టమని గాంధీ ఏనాడూ చెప్పనే లేదు .కాని యాంత్రికం పై మోజు ను నియంత్రి౦చ మన్నాడు .1924 నవంబర్’’ య౦గ్ ఇండియా’’ పత్రికలో ‘’లేబర్ ఖర్చు తగ్గించే యాంత్రికత క్షంతవ్యం కాదు .లేబర్ ను పొదుపు చేస్తూ పొతే వేలాది స్త్రీ పురుష కూలీలు ఆహారం లేక ఆకలితో అలమటించి మరణిస్తారు.కొద్దిమందికోసం కాలం ,లేబర్ పొదుపు చేయరాదు .జనులందరి కోసమే ఏ పనైనా చేయాలి .సంపద కొద్ది మంది చేతుల్లో మూలుగుతూ ఉండటం నేను ఒప్పుకోను. సంపద అందరి చేతులలో ఉండాలన్నది నా దృఢమైన ఆలోచన . సంపద కూడబెట్టి లేబర్ పొదుపు చేయటం అత్యాశ ,దురాశ అవుతు౦దేకాని ,దాతృత్వం మాత్రం కాదు ‘’అని స్పష్టంగా చెప్పాడు .
గాంధీ విధానం కేపిటల్ సేవింగ్ కాదు .లేబర్ సేవింగ్ టెక్నిక్ .ఇది అహింసకు దారి చూపుతుంది .కనుక ఆయన భావాలకు అనుగుణంగా సరైన టెక్నాలజీ లేక మధ్యేమార్గ సాంకేతికతను షుమేకర్ చెప్పినట్లు గా ప్రవేశపెట్టాలి .ఈ భావన బీద మానవ వనరుల వినియోగంతో అతి సామాన్య సాధారణ పని ముట్లతో తక్కువ ఖరీదులో పర్యావరణకు భంగం కలిగించని రీతిలో తయారు చేయించాలి .దీనివలన మానవ సృజన శక్తి సద్వినియోగపడి అందరికి మేలు కలుగుతుంది .
‘’సాంప్రదాయ ఎకనామిస్ట్ తక్కువ ఖర్చుతో ఎక్కువదూరం ఎక్కువ బరువు వెళ్ళటం గొప్పవరం గా ఇదే సరైన విధానంగా భావిస్తాడు .దీనివలన అధిక ఉత్పత్తి ని తక్కువ వనరులతో సాధించవచ్చు అని చెబుతాడు .కానీ గాంధీ ‘’స్థానిక ,తక్కువ దూర రవాణా ను పూర్తిగా అందరూ ప్రోత్సహించాలి. కాని ఎక్కువ సేపు ఆగటం ను నిరుత్సాహపరచాలి .దీనివలన మానవ ప్రావీణ్యత పెరిగి ,,పట్టణీకరణ తగ్గి , మానవ సమగ్రత పెంపొందుతుంది .లేకపోతే మూలాలు లేని శ్రామిక వర్గం విపరీత౦ గా పెరిగి, వ్యవస్థ వినాశానికి దారి తీస్తుంది ‘’అని వాదించాడు .
వారణాసి లో 1973లో గాంధీ స్మారక ఉపన్యాసం చేస్తూ షు మేకర్ ‘’కొందరి చేతుల్లో మూలుగుతున్న సంపద మొత్తం ప్రపంచాన్ని 1-వనరులు 2-జీవావరణం 3-పరాయీకరణ అనే మూడు ఒకదానితో ఒకటి సంబంధమున్న సంక్షోభాలకు గురి చేస్తోంది ‘’అని హెచ్చరించాడు .ఇందులోని దార్శనికత ఏమిటో చూద్దాం .2008లో వచ్చిన వనరుల సంక్షోభం వలన ఆర్ధిక మాంద్యం విపరీతంగా పెరిగింది .జీవావరణ సంక్షోభం మన ఆలోచన విధానం పై ప్రభావం చూపి రినో లో ,కోపెన్ హాం లో అంతర్జాతీయ సదస్సులు నిర్వహించి పరిష్కారాలను వెదుక్కోవాల్సి వచ్చింది .పరాయీకరణ సంక్షోభం పై రెండిటి యొక్క ఫలితమే .
జీవితాంతం మహాత్మాగాంధీ వ్యక్తి వలన మంచి సమాజం నిర్మి౦పబడుతుంది అనే సిద్ధాంతాన్నే ప్రచారం చేశాడు .ఆయన ఆర్దికత వ్యక్తి నిస్టమే కాని ,ఉత్పత్తి నిష్టం కాదు .ఇదే మానవ భద్రతకు అత్యంత శ్రేయోదాయకమైన విధానం (సమ్మన్ బోనం ).గాంధీజీ స్వదేశీ ,ఆహార౦కోసం శ్రమ లలోని ప్రాముఖ్యత ను నొక్కి వాక్కా ణి౦చేవాడు .చరఖా తో గ్రామీణ భారతాన్ని నిర్మించటం గాంధీ ఆలోచన .ఇది కాలం చెల్లిన భావన అని చాలామంది అనుకొంటారు ,కాని ఇందులోని లాజిక్, శక్తి, సామర్ధ్యం ఆయన మరణం తర్వాతనే అందరికీ అర్ధమైంది . ,ఉదాహరణకు ఖాదీ పరిశ్రమ వికేంద్రీకరణ జరిగి ఉత్పత్తి ఎక్కడ జరుగుతుంటే దానికి దగ్గరలో చేరింది .అలాగే చేతి వృత్తి తో తయారయ్యే వస్తువుల విషయం లో కూడా అంతేజరిగింది .ఇదీ గాంధీజీ ఆర్దికత .ధనికుల కబంధ హస్తాలనుండి పేదలకు విముక్తికలగాలని ఆయన చిరకాల వాంఛ .ఆర్ధిక చర్యకు నూలువడకటం ప్రత్యామ్నాయం కాదు అది ఒక అనుబంధ పోషక విధానం మాత్రమే అని మరువరాదు .
స్వదేశీ అనేది ఎక్కడో దూరంగా ఉన్నవారికి కంటే మన చుట్టూ ప్రక్కల వారికి సేవ చేయటమే .ఆయనే ఒకసారి ‘’స్వదేశీ ఒక బాయ్ కాట్ అంటే బహిష్కరించాల్సిన ఉద్యమం కాదు .ఇది ప్రతీకారం కాదు .అందరూ పాటించాల్సిన, అదొక మతపరమైన నియమం .దీనికి చట్ట పరమైన జోక్యాన్ని నేను ఏవగిస్తాను . విదేశీ వస్తువులు రాకుండా గట్టి భద్రత కావాలని నేను వాదించను ‘’అని స్పష్టంగా చెప్పాడు .
ఆహారానికి శ్రమ అన్న గాంధీ సిద్ధాంతం నిర్మాణాత్మక అభి వృద్ధికి రాచమార్గం .1937అక్టోబర్ ‘’హరిజన ‘’ పత్రికలో ‘’అందరూ ఆహారం కోసం శ్రమిస్తే ,ఇక అందరికీ పుష్కల౦ గా ఆహారం, విశ్రాంతి లభిస్తాయి .బౌద్ధిక శ్రమ సాంఘిక సేవలో ఉత్కృష్ట మైన సేవ .’’అని రాశాడు .అసలు తిండికోసం శ్రమ పడాల్సిన అవసరం ,నూలు వడకాల్సిన అవసరం లేని తన గురించి చెబుతూ ఆయన ‘’ఎందుకంటె నాకు చెందనిది నేను తింటున్నాను కనుక ‘’అన్నాడు .
గాంధీజీ జీవించిన కాలం లోఆయనను వ్యతిరేకి౦చిన వారూ, ఆయనకు దూరమైనవారు కూడా ఆయన భావాలకూ చేతలకూ కలవర పడ్డారు .వీళ్ళనే కాదు ఆయనను పూర్తిగా సంర్ది౦చే అనుయాయులు కూడా అంతే కలవరపాటుకు గురయ్యారు .అందులో గురుదేవ్ రవీంద్రనాధ టాగూర్కూడా ఉన్నాడు . ‘’స్వరాజ్ అంటే గందర గోళం .పక్షి ఉదయం నిద్రలేవగానే ఆహారం కోసం మాత్రమే ఆలోచించదు.దాని రెక్కలు ఆకాశం కేకకు స్పందిస్తాయి .’’అని వ్యాఖ్యానించాడు .దీనికి సరైన సమాధానంగా గాంధీజీ ‘’కవి రేపటి కోసం జీవిస్తాడు .వివేకంగా ప్రవర్తి౦చ మంటాడు .కాని నేను పక్షులను బాధతో గమనిస్తాను .అవి బలం కోసం పొగడ్తలకోసం రెక్కలు అల్లల్లాడించవు.భారత ఆకాశం లోని మానవ విహంగం విశ్రాంతి నటించే ముందు బలహీనపడుతుంది .బాధ పడుతున్న రోగిని కబీర్ పాట తో ఉపశమింప జేయటం నాకు సాధ్యంకాని పని ‘’ అని దిమ్మ తిరిగే సమాధానమిచ్చాడు తాను గురుదేవుడుగా భావించే టాగూర్ కు శిష్యుడైన మహాత్మా గాంధీజీ .
హృదయ నేత్రం తో గమనించాల్సిన ఈ అంతర్ దృష్టి గాంధీజీ ని మిగిలినవారందరికంటే వేరు చేసి ప్రత్యేకంగా చూపిస్తుంది .ఈ రోజు గాంధీజీ జీవించి ఉన్నట్లయితే నిజమైన ఆర్ధిక అభి వృద్ధి ,మానవ భద్రతా సూచకంగా ధాయ్ లాండ్ దేశం జి.డి.పి.స్థానం లో ఎన్.హెచ్.పి.అంటే ‘’నేషనల్ హాపినెస్ ప్రొడ్యూసేడ్’’ సూత్రాన్ని ప్రవేశ పెట్టటాన్ని బాధాకరంగా అంగీకరించి ఉండేవాడు .
ఆధారం –ఆశుతోష్ పాండే సంకలనం చేసిన ‘’Relevence Of Gandhi in 21st.Century’’పుస్తకం లో రజనీకాంత్ పాండే ,చంద్రమోహన్ ఉపాధ్యాయ సంయుక్తంగా రాసిన ‘’Gandhian Perspective On Human Security ‘’వ్యాసం .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -22-3-19-ఉయ్యూరు
—

