16-గోపతి లింగకవి
తెలంగాణలో వీర శైవాన్ని వ్యాప్తి చేసిన వారిలో మధ్యయుగానికి చెందిన గోపతి లింగకవి కూడా ఒకడు .కృతిభర్త మెదకు మండలం వాడు కనుక కవి కూడా ఆ ప్రాంతం వాడే అయి ఉంటాడని బిరుదరాజువారూహించారు .అనేక రచనలు చేసినా రెండు మాత్రమే లభ్యం 1-చెన్నబసవపురాణ౦ 2-అసమగ్రంగా ఉన్న’’అఖండజ్ఞాన మనఃప్రబోధ వచన కావ్యం .ఈ కవి అంగడిమఠం వీర శైవాచార్యులకు శిష్యుడు .ఇంటిపేరు తుమ్మా. తాత శివరామ లింగం . శివరామ లింగం ,మల్లమాంబా దంపతులకు జన్మించిన పాపయ లింగం ,మల్లమా౦బా దంపతులకు గోపతి లింగకవి జన్మించాడు =
‘’శివ దేవియు మజ్జననియు –శివ దేవుడు తండ్రి సుప్రసిద్ధముగాగన్
శివభక్తులు బంధువులును –శివ కుల జనితుండ నిరత శివ గోత్రుడన్’’
చెన్నబసవ పురాణానికి విపులంగా పీఠిక రాశాడు .శివ ,గురు,ప్రమధగణ పాల్కురికి సోమన స్తుతి చేశాడు .పిడపర్తి బసవన్న ,కొడుకు సోమలింగం గార్లపాటి లక్ష్మయ్య లను స్మరించటం చేత కవి 16వలేక 17 శతాబ్ది వాడై ఉంటాడని రాజుగారన్నారు .గురుపరంపర తర్వాత ప్రబంథరచన ఉద్దేశ్యం చెప్పాడు .శ్రీ గిరీశ్వరుడు జ౦గమాకృతి ధరించి కవితో –
‘’సురుచిర గ్రంథము లారును –వర సుస్తవ మొకటి ,బెక్కు వచనంబులు
స్థిర శతకము లైదును శ్రీ –కర కేదారీశు నోము కథయునుమరియున్’’
మరియు మంగళాస్ట కాలు ,విఘ్నేశ్వర వీరేశ్వర మల్లేశ్వర రామేశ్వరాస్టకాలు ,శారద పదాలు జాజర పదాలు రాశాడని ,ఇప్పుడు ఈ కృతిరాసి అంకితమివ్వమని కోరాడు .అలాగే చేద్దామని అనుకోగా తండ్రి కలలో కనిపించి అలాగే కోరాడు .అప్పుడు తమ్మడిపల్లె సిద్దయ్య అనే మాహేశ్వరుడు వచ్చి కృతిభర్త ఐన కాసాల పరబణ్ణ వీర మహేశ్వర ఆచార సంపద గుణగణాలు,వంశావళి వివరించాడు .పరబణ్ణ చిరు తొండనంబి కులం వాడట .అతని తమ్ముడు గర్రెపల్లి బసవలింగం .పీఠికలో పూర్వకవుల, స్మ్రుతి శృతి పురాణ ఇతిహాసాల వాక్యాలు అధర్వణవేదం జాబాలిక ముండక ఉపపనిషత్ బ్రహ్మాండ స్కాంద విష్ణు పురాణ ,వీరాగమ విశ్వాగమ రహస్యం ,ప్రభులింగలీల వేమన పద్యాలనుండి కూడా ఉదాహరణలున్నాయి .కనుక కవి వేమన తరవాతవాడు ఐ ఉంటాడు .తాళపత్ర ప్రతి రాసినవాడు కవికొడుకు మల్లయ్య .
గోపతి లింగాని రెండవ కృతి ‘’అఖండజ్ఞామనః ప్రబోధ వచన కావ్య ప్రబంథము .పీఠిక అసమగ్రం .శివ స్తోత్రం ‘ అంగ డీశ్వరు డైన గురు స్తుతి ,తలిదండ్రుల ,పురాతన అధునాతన భక్తగణ౦వివరాల తర్వాత తోటక మఠంకు చెందిన గురువు స్తుతి ,కొలనుపాక సోమేశ్వరస్వామి స్తుతి చేశాడు .‘’అమరున్ పాదపములున్,ఖగంబులు నిత్యానంద సింధుల్ పురిన్ –అమరున్ గోవులు కామధేనువులు పుణ్య క్షేత్ర సద్వర్ణన౦-
బమరేంద్రాబ్జభవాచ్యుతాదుల కవశ్యం బన్నపూర్ణా౦బకున్-భ్రమరా దీశునికున్ సుఖావహము సామ్రాజ్యైక తత్పీఠమున్’’
‘’కమలహితుండు ,తారలును సుదాకరుడున్ గ్రహంబులున్-అమరులు ,తాపసే౦ ద్రులు మహా భయమంద పురంబు చుట్టునన్
గమిగొని భైరవుల్ ప్రహరి గాచుచు దా విహరింపు చుందుర – క్కమల విరోధి మౌళిపద కంజములున్ మదిలో దలంపుచున్ ‘’
ఈ కవి ఇతర కృతులేమయ్యాయో ఆశివునికే ఎరుక .
– ఆధారం -.–ఆచార్య బిరుదరాజు రామరాజుగారి ‘’చరిత్ర కెక్కని చరితార్ధులు ‘’-(విస్మృత కవులు –కృతులు )
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -22-5-19-ఉయ్యూరు
,
—