అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -13 13-గోపాలుని నన్ని(న్న)య భట్టు  

అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -13

13-గోపాలుని నన్ని(న్న)య భట్టు

11వశతాబ్దికి చెందిన గోపాలుని నన్ని(న్న)య భట్టు రాజరాజేంద్ర నరేంద్రుని ముఖ్యామాత్యుడు ,ఆస్థానకవి .రాజేంద్ర చోళుడు కన్యాకుమారి వరకు దక్షిణ దేశం జయించి ,గొప్ప నౌకాబలంతో సింహళాన్ని వశపరచుకొని ,పశ్చిమ సముద్రం లోని 12వేల దీవులను ఆక్రమించి ,తూర్పునున్న’’ పెగు ‘’రాజ్యాన్ని ,నికోబార్ ,అండమాన్ దీవులతో సహా’’ శ్రీ విషయం ‘’ను సామంత రాజ్యం గా చేసుకొన్నాడు .దీనితో ఆగక బీహారు, ఉత్కళ, వంగ దేశాలు జయించి ‘’గంగైకొండ చోళుడు ‘’బిరుదు పొందాడు .అప్పటికే ఉత్తర భారతం గజనీ దండయాత్రలకు గురై దిక్కు తోచక ఉన్నది .చోళచక్రవర్తులు హిమాలయం నుంచి రామేశ్వరం దాకాఏకచ్చత్రంగా పాలించాలనే సంకల్పం తోఉండగా రాజరాజు రాజేంద్ర చోళుడికి అల్లుడయ్యాడు .రాజరాజు కొడుకు రాజేంద్ర చోళుడిమనవరాలి మొగుడే .

ఈ సమయంలో వేంగీ రాజ్యం తమ వశం కావాలనే కోరికకూడా కలిగింది .1070 లో రాజరాజు కొడుకుచోళచక్రవర్తి అయి  ‘’కులోత్తుంగ చోళుడై ‘’తాతగారిలాగా ప్రతిభా వ్యుత్పత్తులతో 49ఏళ్ళు రామేశ్వరం నుంచి కళింగ దాకా పరిపాలించి కీర్తిపొందాడు .వైదిక ,వర్ణాశ్రమ ధర్మాలతో వైదికమతాన్ని పునరుద్ధరించాలన్న తలంపుతో ,అందులో నిష్ణాతుడైన నన్నియభట్టు ను సమాదరింఛి –‘’జననుత కృష్ణ ద్వైపా-యన  ముని వృషభాభి హిత మహాభారత బ-ద్ధ నిరూపితార్ద మేర్పడ -దెనుగున రచియింపు మధిక ధీయుక్తి  మెయిన్ ‘’అని నన్నయను కోరాడు రాజరాజు .తెలుగు చేయటమే కాదు భంగ్య౦తరంగంగా కూడా చెప్పమన్నాడు .ఇలాంటి సదాశయాన్ని మెచ్చిన కవినన్నాయ’’సమస్త వర్ణాశ్రమ వర్ణ ధర్మ రక్షణ మహా మహిమన్మహి నొప్పు సర్వ లోకాశ్రయుడు ‘’అని రాజును పొగిడాడు .అగస్త్య మహర్షి ‘’సుహ్రుత్సమితాత్ కాంతా సమ్మతయా యయా సరసతయా  మాపాద్య కావ్య శ్రియా కర్తవ్యే ‘’అని చెప్పింది శిరో దార్యంగా భావించి ,కర్తవ్యమ్ లో ఆసక్తి అకర్తవ్యం లో అనాసక్తి కలిగించటం ముఖ్య లక్షణం గా భావించాడు .అందుకే ‘’ధర్మ తత్వజ్ఞులు  ధర్మ శాస్త్రంబని ,ఆధ్యాత్మ విదులు వేదా౦తమని  నీతికోవిడదులకు నీతిశాస్త్ర  మని ,కవులకు మహాకావ్యమనీ లాక్షిణులకు లక్షణ శాస్త్ర మని  ,ఐతిహాసకులకు ఇతిహాసమని ,పౌరాణికులకు పురాణ సముచ్చయమనిభావి౦ చేట్లు వేదవ్యాసమహర్షి మహా భారతం రాశాడని  భారతం ధర్మమూలం,పంచమవేదం అనీ నన్నయ చెప్పాడు .

ఇంతకూ నన్నియభట్టు ఎలా ఉండేవాడు ?’’స్వస్థాన వేష భాషాభిమతా స్సంతో రస ప్రలుబ్ధ ధియః ‘’.అవిరళ జపహోమతత్పరుడు ,సంహితాభ్యాసుడు ,తెలుగులోమహాభాత సంహితా రచన బంధుడు ,సమస్త పురాణ వేత్త ,లోకజ్ఞుడు .ఈయన నిష్ట’’రమణీయార్ధ ప్రతిపాదిత శబ్దాలపైనా ,ఉచ్చారణ మీదా .దీనినే అక్షర రమ్యత అన్నాడు .ఉచ్చారణవలన నాదోత్పత్తి చేసిన నాదబ్రహ్మ .విపుల శబ్ద శాసనుడు .శిలాశాసనాలలోనూ, అవ్యవస్తంగానూ ఉన్న శబ్దాలను తీర్చిదిద్ది నియతికల్పించి తెలుగు సంస్కృతపదాలకు ఛందస్సులకు తీయదనం తీర్చిదిద్దిన అక్షర శిల్పి .

నన్నియభట్టు రాజరాజుకు  కులబ్రాహ్మణుడు  .అంటే పురోహితుడుకాదు.వీరమంత్రి అన్నమాట .చాళుక్య శాసనాలలో ,కర్నాటక రాజ శాసనాలలో కుల బ్రాహ్మణ శబ్దానికి పురోహితుడు అనే పర్యాయ పదం ఎక్కడా లేదు .శాసనాలు రాసే అధికారం మహా మంత్రులకే ఉండేది పురోహితులకు లేదు .’’కులీనా శ్చాను రక్తాశ్చ కృతాస్తే వీరమంత్రిణః’’అనే దాన్నిబట్టి నన్నయ రాజరాజుకు వీరమంత్రి .లౌకిక కార్య సాధకుడు మంత్రి .అలౌకిక కార్యసాధకుడు పురోహితుడు అని అర్ధం చేసుకోవాలి .

తూర్పు చాళుక్యులలో ఐదవవాడు సర్వ లోకాశ్రయుడిని ‘’మంగి యువరాజు ‘’అంటారు .ఇతని తండ్రి రెండవ విష్ణు వర్ధనుడు ,తాత ఇంద్రభట్టారకుడు ,ముత్తాత కుబ్జ విష్ణు వర్ధనుడు .సర్వ లోకాశ్రయుడు క్రీశ 672నుండి 696వరకు 27ఏళ్ళు పాలించాడు .చందలూరు శాసనం లో ‘’పరమ బ్రహ్మణ్యః మహారాజానుభావ శ్రీ సర్వ లోకాశ్రయ మహారాజః కమ్మరాస్ట్రేచెందలూరు గ్రామేయకాన్ అత్రగత సర్వ గత ‘’సర్వ నైయోగిక ‘’వల్లభా౦శ్చజ్ఞాపయతి ‘’అని ఉన్నదానిలో ‘’సర్వ నైయోగిక వల్లభాన్ ‘’అనే మాట ‘’రాత్నాలమూట’’అన్నారు కొమర్రాజు లక్ష్మణరావుగారు.738లో జాయకదేవ మహారాజు ఆస్థానం లో ‘’భట్ట నారాయణుడు ‘’అనే మహామాత్యుడు  మౌద్గల్య గోత్రీకుడు ఈశ్వరభాట్టుకు అగ్రహారం ప్రదానం చేశాడు  .రారాజు తండ్రి విమలాదిత్యుని మ౦త్రి రావుల వజ్జియ ప్రగ్గేడ  కౌ౦డిన్యగోత్రుడు ,కారం చేడు వాడు  .కనుక నన్నయకు చాలాకాలం పూర్వమే శాఖా భేదాలు ఏర్పడి ఉన్నాయి .

లోకజ్ఞుడు నన్నియ ‘’సత్ప్రతిభాభి యోగ్యుడు,నిత్య సత్యవచనుడు కనుక తనరాజుకు రాజ్యం చేకూర్చాలనుకొన్నాడు .అప్పటికి భారత రచన చేయలేదు .రాజరాజే నిలకడ లేకుండా ,దేశం వదిలి తిరుగుతుంటే నన్నయకు రాసేఅనురక్తి ఓపికా అప్పటికి లేవు .నన్నయ సుకృతమో లేక రాజరాజు అదృష్టమో వాణస  వంశ రత్నాకరుడైన నారాయణభట్టు సహాధ్యాయి అవటం,అతని సాయంతో త్రైలోక్యమల్లుని మంత్రి మధుసూదనయ్యను దర్శించి,మళ్ళీ  రాజరాజుకు 1051లో వేంగీ సామ్రాజ్యం ఇప్పించాడు .1050లో తిరువయ్యార్ లో ఉన్న రాజరాజ నరేంద్రుడు 1051లోనారాయణభట్టుకు రెండు ఏరులమధ్యలో ఉన్న’’నందమపూడి ‘’గ్రామాన్ని దానంగా ఇచ్చినట్లు ,అతడు ప్రాకృత పైశాచీ ,కర్నాటక ఆంద్ర  సంస్కృతాది భాషలలో నిష్ణాతుడైనట్లు నన్నియ రాసిన శాసనం లో ఉంది .

తన కులబ్రాహ్మణుడైన నన్నియభట్టురాజనీతి వలన రాజరాజనరేంద్రునికి మళ్ళీ రాజ్యం సంక్రమించటం కాక విజయాదిత్యునివలన కష్టాలూ తప్పాయి .ఒలంబవాడికి విజయాదిత్యుని సామంత రాజును చేయటం తో సమస్యలు తీరాయి .యుద్ధాలుఆగిపోయాయి .రాజరాజు పాలన చివరి పదేళ్ళలో 1051నుంచి ,1061వరకు శాంతి సౌఖ్యాలతో రాజ్యపాలన చేయగలిగాడు .రాజరాజు వెంటనే తన రాజధానిని వేంగి నుంచి రాజమహే౦ద్రానికి మార్చాడు .సుస్థిర శాంతి చేకూరటం తో తనుకు ఇంత మహోపకారం చేసిన నన్నియను మహాభారతానువాదానికి ప్రోత్సహించాడు .1051-55మధ్యలో నిండు పేరోలగం లో  రాజు నన్నియనుసంస్కృత భారతాన్ని తెలుగు సేయమని ఆనతిచ్చాడు .ఆతర్వాత జరిగిన విషయమంతా ముందే చెప్పుకొన్నాం .

ఆధారం – –ప్రాచీన హిందూ దేశ రాజ్యాంగ చరిత్ర ,కన్నడ దేశ చరిత్ర ,ప్రాచీన గ్రామసభల న్యాయ పరిపాలన ,దండనాథులు, దుర్గాధిపతులు వంటి అమూల్యగ్రంథాలు రచించిన విమర్శక శిరోమణి ,సాహిత్య విశారద బ్రహ్మశ్రీ కోన వేంకటరాయ శర్మగారు1950లో రచించిన  ‘’సచివోత్తములు ‘’ పుస్తకం

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -16-10-19-ఉయ్యూరు

 

 

 

 

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.