గౌతమీ మాహాత్మ్యం -55
76-మార్కండేయ తీర్థం
బ్రహ్మ దేవుడు నారదమహర్షికి మార్కండేయ తీర్ధ విశేషాలు తెలియ జేస్తున్నాడు .సర్వక్రతువులకు ఫలం ,సర్వ పాప పరిహారం చేసేది ఈ తీర్ధం .మార్కండేయ ,భరద్వాజ ,వసిష్ట ,అత్రి ,గౌతమ ,యాజ్ఞవల్క్య,జాబాలి మొదలైనమునులు మహా శాస్త్రవేత్తలు ,పురాణ న్యాయమీమాంస విషయాలలో పరిణత బుద్ధులు .ముక్తి విషయంలో ఎవరి అభిప్రాయం వారు చెప్పారు .జ్ఞానాన్ని కొందరు, కర్మను కొందరు భావిస్తే ,కొందరు రెండూ అవసరమే అన్నారు .ఏకాభిప్రాయంకుదరక బ్రహ్మ సలహాపై వీరు శ్రీమన్నారాయణ మూర్తిని చేరి అడుగుదామనుకొంటేశంకరుని వద్దకు పంపాడు హరి .గంగానదిలో ఉన్న పరమశివుని దర్శించి ,పూజించి ఆయనే ఆర్యుడు అని పొగిడారు .
శివుడు వారితో ‘’కర్మయే ప్రధానం .జ్ఞానం క్రియారూపం .దానినే కర్మ౦టారు .ప్రాణులు సిద్ధిపొండటానికి కర్మకావాలి .కర్మ లేనిది ప్రపంచం లేదు. విద్య ,యోగం యజ్ఞం ,శివపూజా అన్నీ కర్మలే .అదికాదంటే పిచ్చితనమే .మృకండ సూనికి కుమారుడు మార్కండేయుని సమక్షం లో ఈ సర్వవిషయ చర్చ జరిగి కర్మ చేతనే అంతాపొందబడుతోంది అనే నిర్ణయం ఎక్కడ జరిగిందో ,ఆ తీర్ధం మార్కండేయ తీర్ధంగా విరాజిల్లింది .గంగానదికి ఉత్తరాన ఉన్న ఈ తీర్ధం పితృదేవతలకుపావనం ,స్మరణమాత్రం చేత ముక్తినిచ్చేది.ఇక్కడే 98తీర్దాలున్నాయి .వేదం కూడా ఈమాటే చెప్పింది .మహర్షులూ ఆమోదించారు’’ అని నారదునికి బ్రహ్మచెప్పాడు.
77-కాలాంజర తీర్థం .
నారదునికి బ్రహ్మ కాలాంజర తీర్ధ విశేషాలు చెబుతూ దీనికి ‘’యయాతమ్’’ అనే పేరుందని ,ఇక్కడ శివుడు కాలామ్జర పేరుతొ కొలువై ఉన్నాడని చెప్పాడు. నహుషునికొడుకు యయాతి రాజు అపర దేవేంద్ర వైభవమున్నవాడు.పెద్దభార్య దేవయాని ,శుక్రాచార్యుని కూతురు చిన్నపెళ్ళాంశర్మిష్ట వృషపర్వుని కొమార్తె .
బ్రాహ్మణపుత్రిక దేవయాని ప్రజ్ఞావంతురాలు .శుక్రుని అనుగ్రహం తో యయాతిభార్య అయింది .దేవయానికి యదు ,తుర్వసుడు కుమారులు శర్మిష్టకు ద్రుహ్యుడు ,అనుడు ,పూరుడు కొడుకులు .దేవయానికొడుకులు శుక్రుని రూపం తో ,శర్మిష్ట కొడుకులు ఇంద్ర అగ్ని వరుణ తేజస్సులో ఉంటారు .దేవయాని ఒక రోజు తండ్రి దగ్గరకు వెళ్లి ‘’నాకు ఇద్దరే ,నా సవితికి ముగ్గురు కొడుకులు .నాభర్త నాకు అపచారం చేశాడు కనుక నేను జీవించలేను ‘’అని మొరపెట్టుకొన్నది .శుక్రుడికి అల్లుడిపై కోపమొచ్చి యయాతి దగ్గరకు వెళ్లి తనకూతురుకు అపచారం చేసినందుకు ముసలివాడు కావాలని ,ముసలి రూపమున్నా కోరికలు చావక వార్ధక్యాన్ని భరించలేక కుమిలిపోవాలని శపించాడు .శుక్రుని కోపాన్ని భరించలేక యయాతి ‘’నేను పాపం ,అపకారం అపరాధం చేయలేదు .నీకూతురేవో లేనిపోనివి నీకు చెబితే వచ్చి అనవసరంగా నన్ను శపించావు .ఇది తగదు ‘’అన్నాడు .శుక్రుడు జరిగింది అర్ధం చేసుకొని,తప్పు దేవయానిదే అని గ్రహించి జాలి పడినా ఇచ్చిన శాపం వెనక్కి తీసుకోలేనని ,కాని శాపానుగ్రహంగా ‘’నువ్వు ఎవరికైనా నీముసలితనం ఇచ్చేస్తే నా శాపం తీరిపోతుంది .నీకు మళ్ళీ యవ్వనం ప్రాప్తిస్తుంది ‘’అన్నాడు .
కృతజ్ఞత చెప్పి యయాతి రాజధాని చేరి పెద్దకొడుకు యదువు తో తనముసలితనాన్ని గ్రహించమని కోరగా కుదరదన్నాడు .తర్వాత తుర్వసుడు,ద్రుహ్యుడు ,అనువు కూడా తిరస్కరించారు .ముగ్గుర్ని శపించి మిగిలిన ‘’పూరు ‘’ను అడిగితె వెంటనే ఒప్పుకోగా ,ముసలితనం పొంది,యయాతి యవ్వనుడయ్యాడు వెయ్యిన్నొక్క ఏళ్ళు సకల భోగాలు అనుభవించాడు యవ్వనంతో యయాతి .సంతృప్తిపొంది కొడుకుని పిలిచి’’ నీయవ్వనం తీసేసుకొని నా ముసలితనం నాకిచ్చేసెయ్యి’’ అనికోరగా ప్రాజ్ఞుడైన పూరుడు’’తండ్రీ !ముసలితనం వలన నాకోరికలు నశించాయి .వృద్ధాప్యం అనివార్యంకదా.ఈ ముసలితనాన్ని తపస్సు చేత జయించి సార్ధకం చేసుకొంటాను ‘’అని వినయంగా చెప్పి, గంగానదికి వెళ్లి దక్షిణ తీరం పై గొప్పతపస్సు చేశాడు .శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా ‘’మహేశా !మా తండ్రి జరను నశింపజేసి ,నా సోదరులకు శాపవిముక్తి కలిగించు ‘’అని కోరగా శివుడు అలాగే అనుగ్రహించాడు .అప్పటినుంచి ఈ తీర్ధం జరాదుల వినాశకరమై ,శివునిపేర’’కాలంజర తీర్ధం ‘’గా ప్రసిద్ధి చెందింది .ఇక్కడే యాయతం,నాహుషం ,పౌరం ,శౌక్రం ,శార్మిస్టం మొదలైన 108 తీర్దాలేర్పడి భుక్తి ముక్తి ప్రదాయంగా వున్నాయని బ్రహ్మ నారదునికి చెప్పాడు ..
సశేషం
మనవి-కిందటి మాఘమాసం చివరిరోజు 6-3-19న 54వ ఎపిసోడ్ తో తాత్కాలిక విరామం తీసుకొని ,ఈకార్తీకం మొదటిరోజున 55వ ఎపిసోడ్ తో ‘’గౌతమీ మహాత్మ్యం ‘’కొనసాగిస్తున్నానని మనవి .
కార్తీకమాస ప్రారంభ శుభాకాంక్షలు
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -28-10-19-ఉయ్యూరు

