చిట్టి గూడూరులో సంస్కృత కళాశాల ఏర్పడిన విధానం బెట్టిదనిన –
చిట్టి గూడూరు అంటే కృష్ణాజిల్లా బందరు దగ్గరున్న గ్రామం .ఆపేరు చెబితే శ్రీ మత్తిరుమల గుదిమెట్ల వరదా చార్యులు అంటే ఎస్ టి జి వరదా చార్యుల వారి పేరే ముందు జ్ఞాపకమొస్తుంది .కారణం అక్కడ సంస్కృత కళాశాల స్థాపించి కృష్ణా గుంటూరు జిల్లాల లోని వారెందరికో చదువుకొనే వీలు కలిగించిన మహానీయులాయన .
విజయనగరం మహారాజా కాలేజిలో ప్రధాన అధ్యాపకులు గా చేసి అక్కడే తెలుగు వ్యాకరణ బోధకులుగా శ్రీ దువ్వూరి వెంకట రమణ శాస్త్రి గారిని నియమించుకొని ,తర్వాత ప్రాచ్య పాఠశాలలపాలనా వ్యవహారాల పర్యవేక్షకునిగా పని చేసి ,తర్వాత ఈ ఇద్దరు కొవ్వూరులో శ్రీ తల్లాప్రగడ సూర్య నారాయణ రావు గారు కార్యదర్శిగా ఉన్న గౌతమీ సంస్కృత కాలేజిలో చేరి ,కొంతకాలం అయాక వరదాచార్యులవారికి స్వగ్రామం చిట్టి గూడూరులో సంస్కృత కళాశాల స్థాపించాలనే కోరిక కలగటం తో ,దువ్వూరి వారు ,వేదాల తిరు వెంగళాచార్యులుగారు కొవ్వూరు కాలేజిలో చదువుతున్న సగం మంది విద్యార్ధులతో సహా అందరు ఒక రైలులో బయల్దేరారు .
కాలేజి పెట్టాలంటే క్లాసులు నడిచి ,ఒక అధికారి వచ్చి చూసి రికగ్నిషన్ ఇవ్వాలి .అప్పటికి ఇంకా విశాఖలో (1923)లో ఆంద్ర విశ్వవిద్యాలయం పుట్టనే లేదు .అప్పటికి మద్రాస్ యూని వర్సిటి యే అన్నిటికీ .శాస్త్ర గారినీ ,విద్యార్ధులను బెజవాడలో దిగిపోయి ,చిట్టిగూడూరు చేరి మర్నాడే కళాశాల ప్రారంభించమని చెప్పి, వరదాచార్యులుగారు సరాసరి స్టడీస్ బోర్డ్ మీటింగ్ కు మద్రాస్ వెళ్ళారు .అలాగే దువ్వూరి వారు చిట్టిగూడూరు లో సంస్కృత కాలేజి ప్రారంభించారు .కాలేజి ప్రారంభమైన నాలుగవ నాటికి ఆచార్యులవారు రికగ్నిషన్ సాధించి తీసుకొని గూడూరు చేరారు .తర్క అలంకార శాస్త్ర బోధకులుగా శాస్త్రిగారితో కొవ్వూరు ను౦చి వచ్చిన శ్రీ వేదాల తిరువెంగళాచార్యులు గారున్నారు. దువ్వూరి వారు తెలుగుకు ఉన్నారు .సాహిత్యం ,లాంగ్వేజ్ లిటరేచర్ కు వరదాచార్యులవారున్నారు .వ్యాకరణానికి విజయనగరం నుంచి శ్రీ కరి రామానుజా చార్యులను రప్పించి చేర్చుకొని కాలేజి అన్ని ఫాకల్టి లతో ఆరంభమై నడిచింది .అందరు ఎవరి సబ్జెక్ట్ లో వారు సర్వ స్వతంత్రులు ,మహోత్సాహవంతులు .కనుక తమ సత్తా చాటారు .
కాలేజి ఆయితే ప్రారంభమైంది కాని 50మంది ఉన్న విద్యార్ధులకు తరగతులనిర్వాహణ కు భవనాలు కాదుకదా తాటాకు పాకలు కూడా లేవు .అధ్యాపకులకు ఉండటానికి కొంపలు లేవు. అంతా వరదాచార్యులవారి విశాలమైన భవనం లోనే .క్లాసులు ఎవరింటి దగ్గర వారే నిర్వహించేవారు ఆచార్యులవారి ఇంట్లోని గదులలో ఉంటూ .నాలుగు పండిత కుటుంబాలు 50మంది విద్యార్ధులకు వసతి చదువు అన్నీ అక్కడే .అంతా ఎదురుగానే ఉ౦డేవారుకనుక ,అస్తమానంమానం పాఠాల యావ తప్ప వేరే ఏదీ ఉండేదికాదు .విద్యార్ధులూ అలాగే అలవాటు పడిపోయారు. వినోదానికి వెళ్ళాలంటే ఆరుమైళ్ళ దూరం లోని బందరు వెళ్ళాలి .కనుక సాహసం చేయకుండా విద్యార్ధులు చదువు మీదే ఏకాగ్ర దృష్టి పెట్టేవారు .ఇక్కడ చదువు బాగా చెబుతున్నారన్నవార్త కృష్ణా గుంటూరు జిల్లాలలో వేగంగా ప్రాకి కమ్మవారి పిల్లలు సంస్కృతాంధ్రాలు నేర్వాలనే ఆసక్తితో వచ్చి చేరారు .ఎవరొచ్చినా చేర్చుకోవటం, ఉన్నంతలో వారికి సౌకర్యాలు కలిగించటం వరదా చారిగారి ప్రత్యేకత .స్మార్త ,వైష్ణవులకన్నా ,కమ్మవారి విద్యార్ధుల సంఖ్య పెరిగి పోయింది .ఊళ్ళో సుమారు నలభై కుటుంబాలు మాత్రమె ఉండేవి.అన్యోన్యంతో అధ్యాపక విద్యార్ధులు మెలగి ఆదర్శంగా నిలిచారు .
అమరం ,ధాతువులు ,అస్టాధ్యాయీ ,చి౦తా మణి కారికలు ,అధర్వణ కారికలు క్లాసులలో కాకుండా తీరిక సమయాలలో పగలో, రాత్రో, తెల్లవారు ఝామునో సంతలు చెప్పేవాళ్ళు .నోటికి వచ్చాక మర్చిపోకుండా అప్పుడప్పుడు ఏకరువు పెట్టించేవారు .ఇదంతా మనం చెప్పుకొనే ‘’ఎక్స్ట్రా కర్రిక్యుల వ్యాసంగం అన్నమాట .’’పుస్తకేషు ఛయా విద్యాపరహస్తేచ యద్ధనం సమ యేతు పరిప్రాప్తేనసా ,విద్యా న తద్దనం ‘’ అన్నట్లుకాకుండా ,పరీక్షల్లో ,బోధనలో అవసరానికి గ్రంథం తో పనిలేకుండా ముఖ్యమైనవన్నీ నోటికి వచ్చేట్లు చేసేవారు .మౌఖిక పరీక్షలుపోయి రాత పరీక్షలు వచ్చాయికనుక ,ప్రశ్నాపత్రం లో వాటికి తగినట్లు జవాబులు రాయటానికి వ్రాతపని ఎక్కువగా చేయించేవారు .ఈ నలుగురే ఆలోచించి అమలు చేసేవారు .కాంపోజిషన్ క్లాసులు దువ్వూరివారేనిర్వహించారు.వ్యాకరణ విద్యా ప్రవీణ సాహిత్య విద్యా ప్రవీణ,భాషా ప్రవీణ పిల్లలంతా ఈక్లాసుకు వచ్చి శిక్షణ పొందేవారు .ఈక్లాసులో సుమారు 25మంది విద్యార్ధులు ,మిగిలిన క్లాసులలో సుమారు 10మంది ఉండటం వలన విద్యావ్యాసంగం మహా రమ్యంగా సాగేది .అర్ధంకాని పిల్లాడి’’ తెల్లమొహం ‘’చూసి గుర్తించి ,మరొకమారు బోధించేవారు .
నేర్చిన వ్యాకరణ జ్ఞానం వ్రాతలలో ప్రతి ఫలించిందో లేదో కనిపెట్టేవారు .ఏదో విషయం మీద విపులంగా వివరించి వ్యాసం రాయించేవారు. దువ్వూరివారు సరదాగా ఎన్నో రకాల ఎక్సర్ సైజులు చేయించి పుస్తకాలను ఒకరి పుస్తకం ఇంకోరికిచ్చి దిద్దించి తప్పులున్న చోట్ల గీతలు పెట్టించి,తప్పేమిటో తెలుసుకోనేట్లు చేయించేవారు .ఎవరైనా పొరబాటున తప్పు గీత గీస్తే దాన్ని కనిపెట్టిన విద్యార్ధి శాస్త్రి గారికి ఫిర్యాదు చేస్తే ,దానిపై చర్చించి ,సరిచేయి౦చేవారు.ఒకసారి చేసినతప్పులు మళ్ళీ చేసేవారుకాదు విద్యార్ధులు .ఇదే కాక శీఘ్ర లేఖనం ,సుశబ్ద అపశబ్ద వివేచనం బాగా అలవడేది .అందరికీస్వంత కాలేజి అనే భావం మనసులో కలిగి అంకితభావం తో పని చేసి, కళాశాల అభివృద్ధికీ విద్యాభి వృద్ధికీ తోడ్పడ్డారు
1923నుంచి 18ఏళ్ళు 1941దాకా దువ్వూరి వారి అమూల్య సేవలు చిట్టిగూడూరు కాలేజికి లభ్యమయ్యాయి . 1929లో దువ్వూరి వారి గురువులు ‘’ప్రౌఢ వ్యాకరణ’’కర్త శ్రీ వఝల చిన సీతారామ శాస్త్రిగారు తెలుగులో దువ్వూరివారికి విజీనగరం కాలేజిలో గురువులు ,రెండవ సారి సెనేట్ కు పోటీ చేయాలని భావిస్తే ,ఆ పోస్ట్ గౌరవం చిట్టి గూదూరుకే దక్కాలని వరదాచార్యులుగారు భావించి పోటీగా దువ్వూరివారిని నిలబడమని నచ్చచెప్పి నామినేషన్ వేయించారు .గురువుగారు శిష్యుడిని నయానా భయానా బెదిరించి విత్ డ్రా కమ్మని కోరినా లాభం లేక అవ్వారి సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని తనకు బదులుగా పెట్టి జోరుగా ప్రచారం చేయించారు .అప్పటికి విజయనగరం కొవ్వూరు తెనాలి చిట్టిగూడూరు కాలేజీలలో అధ్యాపకుల వోట్లు 10.వజ్జలవారి ప్రయత్నాలన్నీ వమ్మై,ఎన్నిక జరగగా దువ్వూరి వారికి అవ్వారివారికి చెరిసమానంగా ఐదేసి ఓట్లు వచ్చి టైగా మారితే ,బెజవాడలో వైస్ చాన్సలర్ కట్టమంచి రామలింగారెడ్డి గారు రిజిస్ట్రార్,చెట్టిగారి సమక్షం లో ఆఫీసులో ఒక పెద్ద డబ్బాలో దువ్వూరి ,అవ్వారి పేర్లు రెండు చీటీలు రాసిపడేసి ఒక గడ్డికోసే ముసలతనితో తీయిస్తే దువ్వూరి వారి చీటీ తీయగా ,వెంకటరమణ శాస్త్రి గారు సెనేట్ మెంబర్ అయి చిట్టిగూదూరుకు గౌరవం దక్కించి వరదాచార్యులవారి ఈప్సితాన్ని నెరవేర్చారు .తర్వాత దువ్వూరివారు తెలుగు స్టడీస్ బోర్డ్ మెంబర్ కూడా అయ్యారు .యూనివర్సిటి ఆవిర్భావం నుంచి వరదాచార్యులవారే అవిచ్చిన్నంగా 45ఏళ్ళు చైర్మన్ గా కూడా ఉండి,సంస్కృత భాషా వ్యాప్తికి యెనలేని సేవ చేశారు .సంస్కృతం బోర్డ్ మెంబర్గా ఆచార్యులవారు ,తెలుగు బోర్డ్ మెంబర్ గా దువ్వూరి వారు ఒకే కాలేజీ నుంచి వచ్చి రికార్డ్ సాధించారు .
ఆధారం –కళాప్రపూర్ణ దువ్వూరి వెంకట రమణ శాస్త్రి స్వీయ చరిత్ర .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -29-10-19-ఉయ్యూరు

