అదో పాండిత్య రాజసం
శ్రీ దండి భట్ల విశ్వనాధ శాస్త్రి గారు తెలుగువారే కాని ఎక్కడివారో తెలీదు .అత్తవారిది గోదావరి జిల్లా నేదు నూరు ప్రాంతం .బాగా చిన్నతనం లోనే కాశీకి భార్యతో సహా వెళ్లి స్థిరపడ్డారు .పిల్లా పీచూ జంజాటం లేని కుటుంబం .ఆ రోజుల్లో కాశీలో ఒక అలవాటు ఉండేది .ఏ జమీందారు యాత్రకు వచ్చినా అక్కడ ఒక పండిత సభ జరిపి ,పరీక్షలు ,శాస్త్రార్ధాలు చేయించి శాలువాలుకప్పి బహుమతులివ్వటం రివాజు గా ఉండేది .ఈ సభలు తరచుగా జరుగుతూనే ఉండేవి .దండి భట్ల లాంటి పెద్దలు అధ్యక్షత వహించేవారు .వీరికి రెండేసి శాలువాలు కప్పేవారు .అవి తీసుకొని ఇంటికి వస్తూ దారిలో ఇద్దరు వేదవేత్తలను పిలిచి ,ఇంటికి తీసుకు వచ్చి ,భార్యతో’’ వేద పండితులొచ్చారు. వారు దేవతా స్వరూపులు ,ఈ రెండు శాలువలు చెరొకరికి సమర్పించి నమస్కరించు ‘’అనేవారు .ఆమె అలానే చేసేది .వందలకొద్దీ శాలువాలొచ్చినా ఇదే పధ్ధతి .అన్నీ వినియోగించటమేకాని కప్పుకోటానికి ఒక్కటీ మిగిల్చుకొనే వారు కాదు .కప్పుకోవటానికి జమిలి దుప్పటే ఆయనకు .డబ్బు కూడా ఎంతవచ్చినా అది ఇలాగే సద్వినియోగమవ్వాల్సిందే .రేపటి ధ్యాస లేని నిరీహులాయన .భార్యకూడా ఈ పద్ధతికే అలవాటు పడిపోయి౦ది పాపం .
ఒక ఏడాది శాస్త్రిగారి భార్యకు కోటిపల్లి తీర్దానికి మహా శివరాత్రి కి వెళ్ళాలనే కోరిక కలిగింది .ఆయనా సరే నన్నారు .కాకినాడ దాకా రైలు లో చేరి(వీరిద్దరికి రైలు టికెట్ ఉండేదికాదు ) అక్కడి నుంచి కోటిపల్లికి బండీ మీద వెళ్ళాలి .చేతిలో డబ్బు ఉంచుకొనని ఆయన ,కాకినాడ నుంచి మజిలీలు చేస్తూ ,కోటిపల్లికి నడిచి భార్యతో శివరాత్రి ఉదయం గోదావరి ఒడ్డుకు చేరారు .భార్యను అక్కడే ఉండమని చెప్పి ,తాను గోదావరి స్నానంచేసి బయటికి వచ్చి, ఆమె చేతిలో ఉన్న సంచీ తనకిమ్మని చెప్పి,స్నానం తర్వాత ఇద్దరు గుడికి వెడదామని ఆమెను స్నానానికి పంపారు .ఆమె వెంటనే వెళ్ళకుండా రేవు వైపు చూస్తూ ‘’కాకిలాగా మునిగి రావటమేగా వెళ్తాలెండి ‘’అని కదలకుండా అలాగే నిలబడింది .ఆవిడ దృష్టిని అంతగా ఆకర్షించి౦ దేమిటా అని శాస్త్రిగారు పరకాయించి చూశారు .రేవులో ఎవరో కమ్మవారి ఆడంగులు స్నానాలు చేస్తూ ,అక్కడి బ్రాహ్మణులకు రూపాయి బిళ్ళలు పంచి పెట్టటం కనిపించింది .ఆయన గ్రహించి ఆమె మనోభిప్రాయం తెలుసుకొని ‘’వాళ్ళలాగా పంచిపెట్ట టానికి మనదగ్గర డబ్బు లేదనే కదా నీ దిగులు ?’’అన్నారట .ఆమె ‘’. ‘’ఎందుకా అడగటం .కావాలంటే మనకిప్పుడు డబ్బు వస్తుందా ?’’అంది కొంచెం వెటకారంగా .’’ఈ సంచీ పుచ్చుకొని అటూ ఇటూ తిరక్కుండా ఇక్కడే ఉండు .ఊళ్లో కెళ్లిడబ్బు తెస్తా .పిఠాపురం రాజా గంగాధర రామారావు గారు ,ఇక్కడికి వచ్చి హరిశాస్త్రి గారింట్లో ఉన్నారని సత్రం లో చెప్పు కొంటుంటే విన్నాను .అతని దగ్గర డబ్బు తెస్తాను .నుంచో ‘’అని చెప్పి ఎకాఎకిని హరి శాస్త్రిగారింటికి వెళ్ళారు నడిచి .
హరి శాస్త్రి గారింట్లో జమీందారు గారు, ఆయన ,స్నానాలు చేసి పట్టుబట్టలు ధరించి శ్రీ సోమేశ్వర స్వామి దర్శనానికి బయల్దేరుతూ సావిట్లో కనిపించారు .విశ్వనాధ శాస్త్రి గారిని చూసి ,గుడిప్రయాణం ఆపేసి ,ఆ ఇద్దరూ కూర్చున్నారు .రాజావారు ‘’శాస్త్రిగారూ ఎలా వచ్చారు ఎప్పుడొచ్చారు ?’’అని అడిగితే శాస్త్రీజీ ‘’ఏదో వచ్చాం లెండి. మా ఆవిడ కూడా వచ్చింది .స్నానాల రేవు దగ్గర ఉంది .దానికో పిచ్చి. రేవులో ఆడవాళ్ళు బ్రాహ్మణులకు రూపాయలు దానం ఇవ్వటం చూసి ,తనదగ్గర చిల్లిగవ్వకూడా లేదని దిగులుతో ఉంది .మీరిక్కడికి వచ్చారని తెలిసి కొంత డబ్బు తీసుకెళ్ళదామని వచ్చాను ‘’అన్నారు .జమీందారు ‘’అయ్యా !నేడు మహా శివరాత్రి పుణ్యకాలం .ఇంతకంటే ధన్యత ఉందా ?’’అని ,ఒక పళ్ళెం నిండా రూపాయి బిళ్ళలు తెప్పించి, బల్లపై పెట్టించి ,తీసుకు వెళ్ళమని కోరారు .శాస్త్రి గారు రెండు చేతులూ పళ్ళెం లో పెట్టి ,రెండు గుప్పిళ్ళలోరూపాయలు ఇరికించి పట్టుకొని ,రెండు జేబుల్లో పోసుకొని ‘’ఇవి చాలండి .అవన్నీ ఎందుకు ?’’అని చెప్పి ‘’ఇక నేను గుడికి వెడతాను .మీరూ గుడికి బయల్దేరండి ‘’అని చెప్పగా ‘’అలాకాదు స్నానాలు, దానాలు అయ్యాక అమ్మగారిని కూడా తీసుకొని గుడికి రండి .మా సిబ్బంది ముందే వెళ్లి దర్శనం ఏర్పాట్లు చేస్తున్నారు .ఈ జనసమ్మర్దం లో మీరు లోపలి వెళ్ళలేరు ‘’’అన్నారు .
శాస్త్రిగారు ‘’దేవ దర్శనానికి సిబ్బంది ఎందుకండీ .వీటి తాత లాంటి సమ్మర్దాలు కాశీ విశ్వేశ్వరాలయం లో ఎన్నో చూశాం .మేము సులభంగా వెళ్ళగలం. మీ దారిన మీరు వెళ్ళండి .నేను మళ్ళీ ఇటురాను ‘’అంటూ గోదావరికి వెళ్లి భార్యకు రూపాయలిచ్చి ‘’ఇందులో ఒక్క రూపాయి కూడా మిగల్చకుండా అన్నీ నీకు తోచిన వారికి పంచిపెట్టు ‘’అనగా భార్య అలానే చేసింది. ఇద్దరూ దైవ దర్శనం చేసుకొని మళ్ళీ కాశీకి ప్రయాణం చేశారు .పండితులలో ఆశాపరులు, దురాశా పరులే కాకుండా నిస్పృహులుకూడా దండి భట్ల విశ్వనాధ శాస్త్రి గారి లాంటి వారున్నారు .ఇలాంటి వారిని, సరసులైన సంపన్నులు నెత్తిన పెట్టుకొంటారు పిఠాపుర౦ జమీందారు శ్రీ రావు వెంకట మహీపతి గంగాధర రామారావు గారిలాగా . ఇదో పాండిత్య రాజసం .
ఆధారం -శ్రీదువ్వూరి వారి స్వీయ చరిత్ర
నాగుల చవితి శుభాకాంక్షలతో
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -31-10-19-ఉయ్యూరు

