ఆస్ట్రేలియన్ సారస్వతం
క్రీ.శ .1788లో ఆంగ్లేయులు వలస వెళ్లి ఆస్ట్రేలియా ఖండం లో స్థిరనివాసం ఏర్పరచుకొన్నారు కనుక అక్కడ వచ్చిన సాహిత్యమంతా ఇంగ్లీష్ లోనే ఉండేది .మొదటి రచనలలో స్థానికచరిత్రకు ప్రాధాన్యం ఇచ్చినా ,వాటికి సాహిత్య గౌరవం రాలేదు.మొదటికవులు బేరయన్ ఫీల్డ్ ,విలియం వెంట్ వర్త్ లలో కూడా ఈ లోపమే ఉండేది .
చార్లెస్ హార్పర్ (1817-68)కవితలలో ఆస్త్రేలియన్ వాతావరణాన్ని ప్రతిఫలించే ప్రయత్నం చేసి కొంతవరకు నెరవేర్చగాలిగాడు .అదే బాటలో హెన్రి క్లారెంస్ ,కేండాల్ (1841-82)అక్కడి ప్రకృతి దృశ్యాలను మనోహరంగా వర్ణించారు .1833-70 వాడైన ఎ..ఎల్ .గార్డన్ అశ్వధాటి లయతో కొన్ని గేయాలను ఆనాటి ఆశ్వికుల వీరోచిత పోరాటాలపై రాశాడు .అప్పటినుంచి పాడుకోవటానికి అనువైన గీత రచనలు బాగా వచ్చాయి .ఈ గేయకర్తలలలో ఎబి పాటర్సన్ హెన్రి లాసేన్ ,సి.జె.డెవిస్ ముఖ్యులు .
క్రమంగా కవిత్వం లో ఉద్వేగం తగ్గి ,20వ శతాబ్ది నాటికి కవిత లో కొత్త సొగసులు చేరాయి .’’నవ ప్రజాస్వామ్యకవి ‘’అని పేరు పొందిన జేర్నార్డ్ ఓ డౌడ్ దీర్ఘ కవితల్లో ఆస్ట్రేలియన్ లజీవితాలను ,ప్రణయ విషయాలను రసవత్తరంగా చిత్రించాడు .క్రిస్టఫర్ బ్రెన్నాన్’’ది వా౦డరర్ ‘’కావ్యం లో తాత్విక చింతన బాగా చేసి మంచి ఆకర్షణ కలిగించాడు .మేరీ గిల్మోర్ ,జూడిత్ రైట్ కవయిత్రులు సుకుమార ప్రణయం పండింఛి జనరంజనం చేశారు .హ్యూమక్ క్రే కవిత్వం లో అక్షర రమ్యత ,సా నెయిల్సన్ కవిత్వం లో మధుర భావనలు పఠితలను.విశేషంగా ఆకట్టుకొన్నాయి .
తర్వాత కాలపు కవులలో ఆర్.డి ఫిట్జెరాల్డ్ ,,కెన్నెత్ స్లెసర్ బాగా ప్రసిద్ధులు .నవ యువకవులు కొందరు సాంప్రదాయ కవిత్వం రాస్తుంటే, మరి కొందరు విశ్రు౦ఖల మైన కవిత్వం తో చెలరేగుతున్నారు .కవిత్వం లో ఉపమానాలు ,వస్తువు ఆస్ట్రేలియా కే చెందినవి ఉండాలన్న ఉద్యమంకూడా వచ్చింది .నవలా రచనకు మార్గదర్శి హెన్రి కింగ్స్లీ .తర్వాత మార్కస్ క్లార్క్ ,రాల్ఫ్ బోల్డర్ వుడ్ .అక్కడ యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న ఖైదీ ల జీవితాలను మార్కస్ క్లార్క్ ‘’ఫర్ ది టర్మ్ ఆఫ్ హిజ్ నేచురల్ లైఫ్ ‘’అనే నవలలో,అనేక ఎపిసోడ్ లుగా అత్యంత సహజం గా రాశాడు .ఆ దేశపు సాహసికుల కార్యకలాపాలను రాల్ఫ్ బోల్దర్ వుడ్ నవలలలో కళ్ళకు కట్టించాడు .జోసెఫ్ ఫర్ఫీ రాసిన ‘’సచ్ ఈజ్ లైఫ్ ‘’నవల ఆస్ట్రేలియా దేశీయ వాతావరణాన్ని వాస్తవంగా మహోహరంగా చిత్రించాడు. బ్రేంట్ ఆఫ్ లిన్ బిన్,మైల్స్ ఫ్రాన్క్లిన్ ,యీనియన్ గన్అనే నవలారచయిత్రులు కూడా అదే లక్ష్యంతో రాశారు .
హెన్రి హామ్డేల్ రిచర్డ్స్ సన్ అనే మారుపేరుతో హెన్రి ఎట్ రిచర్డ్సన్ అనే రచయిత్రి రాసిన ‘మారిస్ గెస్ట్ ‘’’’,డి ఫార్త్యూన్స్ ఆఫ్ రిచర్డ్ మెహోని ‘’నవలలు ఆస్ట్రేలియా సాహిత్యం లో ఉత్తమోత్తమమైనవిగా కీర్తి పొందాయి .ఈమె 1939లో ‘’యంగ్ కోసిమా ‘’నవలకూడా రాసింది వాన్స్ పామర్ నవల ‘’ది స్పెయిన్ ఫామిలి ‘’నగర జీవిత వర్ణనకు పెట్టింది పేరుగా నిలిచింది .అతని మనస్తత్వ చిత్రణ అమోఘం .కైలీ కేన్నెంట్ ‘’లాస్ట్ హావెన్ ‘’నవల గ్రామీణ జీవన చిత్రణ కు పట్టం కడితే ,’’రైడాన్ స్ట్రేంజర్’’నవల లో నాగరక జీవిత చిత్రణ ఉంటుంది .క్వీన్స్ లాండ్ ప్రాంతపు పశువులకాపరుల నిరాడంబర జీవితాలను ఫ్రాంక్ డేవిసన్’’మాన్ –షై’’లో కథా వస్తువుగా తీసుకొన్నాడు .అత్యధిక ప్రజాదరనపొందిన నవలాకారులు –ఎలినార్ డార్క్,కేధరిన్ ప్రిచర్డ్ ,జేవియర్ హెర్బర్ట్ మొదలైనవారు .మానవుడికి ప్రకృతికి మధ్య సంఘర్షణ ను లియనర్డ్ మన్ ’’మౌంటేన్ ప్లాట్ ‘’నవలలో మంచి సమర్ధవంతంగా చిత్రించాడు .
ఆస్ట్రేలియా పత్రిలు కొన్ని చిన్నకథలకు ఎక్కువ ప్రోత్సాహమివ్వటం వలన సృజన ,కల్పన మూడు పువ్వులు ఆరుకాయల్లా కథా వాజ్మాయాన్ని సుసంపన్నం చేశారు కవులు నవలాకారులు .వీరిలో హెచ్ లాసన్ ,బార్బారా బెయిన్ టన్ ,స్టీల్ రడ్,డీ.స్టువర్ట్ ,ఏ .మార్షల్ .జి.కేసీ లు ముఖ్యులు .ఆస్ట్రేలియాలో సాహిత్య గౌరవం అందుకొన్న గొప్ప నాటకాల సృష్టికి అనుకూల వాతావరణం లేదు .అక్కడ నాటక ప్రదర్శనలపై ప్రజలకు అభి రుచి కలిగే లోపే సినిమాలు వచ్చేసి ,రంగస్థలానికి ప్రోత్సాహం లభించలేదు .లూయీ ఎస్సన్ ,డగ్లస్ స్టువర్ట్ ఔత్సాహిక ప్రదర్శనలకోసం కొన్ని ఏకాంకికలు మాత్రం రాశారు .వ్యాసరచన ,సాహిత్య విమర్శకు విశేష గౌరవం ,ఉత్తమ ప్రమాణం తమ రచనలద్వారా కల్పించినవారు వాల్టర్ మర్డక్,నార్మన్ లిండ్సే .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -12-12-19-ఉయ్యూరు

