దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు –

దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -2

1-సంగీ సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి -2(1759-1847)

ఒక రోజు రామకోటి జపంచేశాక సంధ్యావందనాదులు పూర్తిచేసి ,పట్టాభిషేకసమయం లో శ్రీరాముడు ప్రత్యక్షం కాకపొతే ఆర్తిగా త్యాగరాజస్వామి ‘’ఏల నీ దయ రాదు ‘’కృతి రచించారు .రెండు సార్లు రామకోటి జపం చేశాక సపరివారంగా దర్శనమిచ్చిన స్వామిని  ‘’కనుగొంటిని శ్రీరాముని ‘’.’’ఎంతముద్దు యెంత సొగసు ‘’,నాద సుధా రసంబిలను నరాకృతిఆయెరా’’అంటూ కీర్తనలతో స్తుతించారు .ఈవిషయం గురువుగారికి తెలిసి పాడమని కోరగా ‘’దొరకునా ఇటు వంటి సేవ ‘’కృతిలో ‘’కామిత ఫలనాయకి యగుసీత ‘’అనే చోట సాహిత్య స్వరాలు వేయగా ,పరమానందం తో వేంకటరమణయ్య గారు రాజు తమకు బహూకరించిన ‘’మకర కంఠి’’మొదలైన ఆభరణాలను తీసి శిష్యుని మెడలో వేసి ఆప్యాయంగా ఆలింగనం చేసికొని’’దీర్ఘాయురస్తు ‘’అని దీవించగా త్యాగరాజస్వామి ‘’జయ జానకీ రామ ‘’కృతి పాడి ఆశీర్వాదం పొందారు ..గురువుగారి కుమార్తె వివాహానికి ఈ ఆభరణాలను  నూతన వస్త్రాలతో సహా ఆయనకే కానుకగా అందజేసిన త్యాగమూర్తి త్యాగయ్యగారు .

స్వార్ధపరుడైన అన్న జపేశం ఆస్తి విభాగం లో మొత్తం ఆయనే దక్కించుకోగా త్యాగరాజస్వామికి నిత్యం తాను  పూజించే ‘’శ్రీరామ పంచాయతనం ‘’దక్కింది .వీటికి అలంకరణ చేసి ‘’కొలువై యున్నాడే’’,కొలువమరెగదా’’మొదలైన కీర్తనలు రచించి పాడుతూ కాలం గడిపారు .ప్రతిఏడాది ఈ విగ్రహాలకు సమారాధన చేసి సంగీత రసికులను ఆహ్వానించి తన కీర్తనలతో బ్రహ్మానందం కలిగించటం జపేశుని ఈర్ష్యకు కారణమై ,వాటిని దొంగిలించి కావేరిలో పారేశాడు .ఈ సంఘటనకు మనసు వ్యాకులమై ‘’ఎందు దాగినాడో ‘’మొదలైన కృతులు రాసి పాడుకొంటూ నిద్రాహారాలు లేకుండా గడుపుతుంటే స్వామి కలలో సాక్షాత్కరించి తానున్న చోటు తెలియజేశారు .అక్కడికి వెళ్లి వెతుకగా అవి దొరకగా పట్టరాని ఆనందం తో ‘’రారా మా ఇంటి దాక ‘’కీర్తనపాడి సంప్రోక్షణ చేసి ,అన్నకు సద్బుద్ధి ప్రసాది౦ప మని వేడుకొన్నారు.భార్య పార్వతి ఒకరోజు ధర్మ సంవర్ధినీ దేవితో మాట్లాడటం విని త్రిపురసు౦దరిపై  ‘’దారిని తెలుసుకొంటి ‘’కీర్తన రచించి పాడారు .భార్య మరణాన్ని తట్టుకోలేక ‘’తొలి జన్మమున జేయు’’, ‘’ఏ పాపము జేసితినో ‘’కృతులు రాశారు .ఆమె చెల్లెలు కమలను ద్వితీయం చేసుకొని ‘’సీతమ్మ ‘’అనే కూతురిని పొందారు .

దక్షిణాదిన ఉన్న సకల శైవ వైష్ణవ క్షేత్రాలన్నీ దర్శించి అ స్వాములపై కీర్తనలు రచించారు త్యాగ బ్రహ్మ .తిరుమలేశుని దర్శనం లో ‘’తెరతీయగ రావే ‘’కోవూరు సుందరేశ్వరునిపై ‘’శంభో మహాదేవ ‘’కృతులు రాశారు .ఇక్కడి సుందరేశ మొదలియార్ త్యాగయ్యగారి నిర్లిప్తత గమనించి రహస్యంగా పల్లకీలో వరహాల మూట పెట్టించాడు .అడవి దొంగలు అపహరిస్తే ,ఇస్ట దేవతా స్మరణ చేస్తే రామ సోదరులు విల్లంబులతో దొంగలను భయపెడితే‘’ఎవరిచ్చిరిరా ఈ శరచాపం ‘’అని కీర్తిస్తే వరహాలమూట అర్పించి క్షమాపణ కోరి, వారే పల్లకీ బోయీలై  ఒక అగ్రహారానికి గౌరవంగా చేర్చారు .

ఆవూరిలో కాశీ యాత్రకు వెడుతున్న  దంపతులను పెద్దపులి భయపెడితే పాడుపడిన దేవాలయంలో ప్రాణ రక్షణ చేసుకోగా, భర్త అక్కడి పాడు నూతిలో పడి చనిపోతే ‘’అయ్యవారికి ‘’తెలిసి ,’’నా జీవనాధారా ‘’కృతి రచించి శ్రీరామ కృపతో బ్రతికించారు .ఉపనిషద్ బ్రహ్మంగారి ఆహ్వానం పై కంచి వెళ్లి కామాక్షి అమ్మవారిపై ,కీర్తన రాశారు .మద్రాస్ పార్ధ సారధి కోవెలలో దేవ గాంధారి రాగాన్ని వరుసగా వారం రోజులు దీక్షగా గానం చేశారు .పుదుక్కొట మహా రాజు దర్బారులో ‘’జ్యోతిస్వరూపిణి’’రాగాలాపన చేసి దీపాన్ని వెలిగించారు .తీర్ధ యాత్రలు ముగించి స్వగ్రామం పంచనదం చేరగా ,అక్కడ గోవింద మరార్ అనే తిరువాన్కూర్ సంగీత విద్వాంసుడు ఎదురు చూస్తున్నాడు .మరార్ గానప్రతిభకు మెచ్చి సత్కరించి ‘’గోవింద దాసు ‘’బిరుదు ప్రదానం చేసి ‘’ఎందరో మహాను భావులు ‘’అనే విశిష్ట కృతి రాశారు .కృతులతోపాటు నౌకాచరితం ,ప్రహ్లాద విజయం మొదలైన యక్షగానాలూ రాశారు .

ఇలా 88ఏళ్ళు రామనామ కీర్తనలు రాస్తూ ,గానం చేస్తూసార్ధక జేవితం గడిపిన సంగీత సద్గురు త్యాగరాజస్వామి ‘’జ్ఞానమొసగ రాదా ‘’,’’ఇదే సమయమురా ‘’,’’దయ జూచుటకిది వేళరా ‘’మొదలైన కీర్తనలతో మోక్షాన్ని ప్రసాది౦పమని తన ఇస్ట దైవాన్ని వేడుకొంటూ కాలం గడిపారు .ఒక ఏకాదశి నాటిరాత్రి త్వరలో భగవత్ సందేశం రాబోతోందని కలగన్నారు .కలలో రామచ౦ద్ర ప్రభువు దర్శనమిచ్చి ‘’నువ్వు త్వరలో సన్యాసం స్వీకరించు .ఇవాల్టికి అయిదవ రోజు నా పదవి నీకిస్తాను ‘’అని అని  చెప్పి అంతర్ధానమయ్యాడు .చివరి కీర్తనగా ‘’గిరిపై నెలకొన్న రాముడు ‘’పాడి ఆనాడే వేద విదుల సమక్షం లో బ్రహ్మానంద తీర్దులవారి వద్ద సన్యాసాశ్రమం పొందారు .1847ప్లవంగ నామ సంవత్సర పుష్యబహుళ పంచమి నాడు త్యాగబ్రహ్మ కపాలం విచ్చేదమై త్యాగ జ్యోతి అంతరిక్షం చేరింది .రామభజనలతో త్యాగరాజ కీర్తనలతో శిష్యులు వారి పార్ధివ దేహాన్ని కావేరీ తీరం చేర్చి ,అభిషేకం చేసి బృందవానం నిర్మించారు .

తంజావూర్ దగ్గర త్యాగరాజ శివుడు కొలువై యున్న తిరువారూర్  లో ఆంద్ర ములికి నాటి బ్రాహ్మణులు కాకర్ల వంశీకులు .వేద శాస్త్ర పురాణ వేత్తలైన పంచనద బ్రహ్మ౦  గారికి సదాశివ,సదానంద ,,సచ్చిదానంద, బాలానంద, గిరిరాజ అనే అయిదుగురు కుమారులు .గిరిరాజును సుబ్రహ్మణ్య భారతి అని పిలిచేవారు .తెలుగు సంస్కృతాలలో ప్రజ్ఞావంతుడు ,గానవిద్యా సంపన్నుడు ,వేదాంత గేయ రచయిత.తంజావూర్ రాజులైన షాహాజీ శంభాజీ లపై 100 సంగీత పదాలు,యక్షగానాలు  రాసినకవి .ఇవి అలభ్యం .గిరిరాజ కుమారుడు త్యాగయ్యగారి తండ్రి రామ బ్రహ్మం భారత రామాయణాదులను ప్రసంగాలుగా చెప్పే నేర్పున్నవాడు .తులజాజి రాజు ఆస్థానం లో రామాయణ ప్రవచనం చేసి ,శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరిపి గొప్ప సన్మానాలు పొందాడు .ఈయన సోదరులు పంచనదం ,పంచాపకేశిలకు విద్య అబ్బలేదు దుష్ట  స్వభావులవటంతో తలిదండ్రులు కాశే యాత్రకు బయల్దేరారు .

ఒక రోజు స్వప్నం లో రామబ్రహ్మ౦ గారికి ‘’నారద వాల్మీకి సరస్వతి భారద్వాజ అంశ సంభూతుడు కుమారుడుగా జన్మిస్తాడని ,త్యాగరాజు పేరుతో ప్రసిద్దుడౌతాడ’’ని  కల వచ్చింది.భార్యతో శ్రీ త్యాగారాజాలయానికి వెళ్లి దర్శించి పూజించి స్వప్న ఫలం కోసం ఎదురుచూస్తుండగా అయిదవ రోజున 1759 బహుధాన్య సంవత్సర వైశాఖ శుద్ధ షష్ఠి సోమవారం శ్రీ త్యాగరాజ స్వామి జన్మించారు .కొంతకాలానికి పుత్రసమేత౦ గా దంపతులు కాశీ యాత్రకు పోతూ పంచనదం లో విడిది చేస్తే శ్రీ పంచనదీశ్వర స్వామి కలలో కన్పి౦చి ,కాశీ కంటే తిరువయ్యూరు గొప్ప క్షేత్రమని ,అక్కడ సిద్ధి పొందినవారు లింగరూపం పొందుతారని చెప్పాడు ..ఈ వార్త తెలిసిన తులజాజి రాజు వీరికి తిరుమంజన వీధిలో ఒక ఇల్లు ,కొంత పొలం ఏర్పాటు చేశాడు .అప్పటినుంచి అక్కడే ఉంటూ అయిదవ ఏట త్యాగయ్యకు ఉపనయనం చేసి ,సంస్కృతం నేర్పించి సూత్రసహితరామమంత్రోపదేశం చేశారు .

బాల్యం లో తోటిపిల్లలతో గోలీలాడుతూ గడుపుతుంటే శ్రీ రామ కృష్ణానంద యతి ‘’గమనించి శ్రీరామ షడక్షరీ మంత్రోపదేశం చేసి ,శ్రీరాముని భక్తితో కొలుస్తూ ,కీర్తనలు రాయమని హితవు చెప్పాడు .అలానే చేస్తూతోడి రాగం లో ‘’ నమో రాఘవాయ ‘’ అనే మొదటి కృతి రాసి పాడుతుంటే తండ్రి విని ,సంగీత విద్వాంసులకు వినిపిస్తే, అందులోని మధురభావ భక్తితత్పరత కు ముగ్ధులయ్యారు .వేదాధ్యయనం సాంగోపాంగంగా నేర్చి , శ్రీ శొంఠి వేంకట రమణయ్య గారి వద్ద గానవిద్య అభ్యసించారు .ఆతర్వాత కథ అంతా ముందే చెప్పుకొన్నాం .

మరో  సంగీత కళా తపస్సంపంన్నుడి గురించి ఈసారి తెలుసుకొందాం .

ఆధారం –చతుర్భాషా కోవిద ,నానారాజ్య విద్వత్సభా పదవీ విభూషిత ప్రభుత్వ గాన పరిశోధక ,నాద సుధానిధి శ్రీ మంగిపూడి రామలింగ శాస్త్రి రచన ‘’ఆంద్ర గాయకుల చరిత్రలు ‘’,

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -24-12-19-ఉయ్యూరు

 

 

 

 

‘’

 

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.