ప్రపంచ దేశాల సారస్వతం
18-సింహళీ(శ్రీలంక ) సాహిత్యం
భాష –సింహలీ భాష ఇండో –యూరోపియన్ భాషా కుటుంబానికి చెందిన పాళీ భాషనుంచి పుట్టింది .సింహలి లిపి కూడా బ్రాహ్మీ లిపి నుంచే వచ్చింది.
సాహిత్యం –క్రీ పూ .3వ శతాబ్దం నాటికే సాహిత్య రచన ఉన్నా మొదటి రచనమాత్రం సీగిరియా దుర్గం లోని ఒక ‘’మిర్రర్ ‘’ పై చెక్కబడిన ‘’సీగిరియా గ్రస్ఫితి’’అనే గీత సముదాయమే ..ఇందులో మొదటి గీతం క్రీశ 5వ శతాబ్దిలో రచించింది .10వ శతాబ్దిలో లభించిన ‘’సియబస్లాకర ‘’,శిఖవళ౦డ’’గ్రంథాలు ప్రాచీనమైనవి .మొదటిది అలంకార గ్రంథం.రెండవది బౌద్ధ సన్యాసుల జీవిత నియమాలు వివరించేది .
12వ శాతాబ్దిచివరలో ‘’గరళు గోమి ‘’రాసిన ‘’అమవతుర’’,ధర్మ ప్రదీపికావ’’గద్య రచనలు వచ్చాయి .13వ శతాబ్దిలో వీటిని అనుసరిస్తూ చాల వచనగ్రంథాలు వెలువడినాయి ..వీటిలో వలియ ,తూపవంశ ముఖ్యమైనవి .మొదటి కథా కావ్యాలు 12,13శాతాబ్దులలోనే వచ్చాయి .మువ దేవతావత ,సనదావత ,ససదావత ,కవ్ శిళు మినవీటిలో ముఖ్యమైనవి .తర్వాత వచ్చినవి ఎక్కువగా బౌద్ధ చారిత్రిక విషయకావ్యాలు . రాహులుడు రాసిన కావ్య శేఖరం ,వాత్తానె రాసిన గుట్టిల కావ్యాలు 15వ శతాబ్దం లో సందేశ కావ్యాలుగా వచ్చాయి .
తర్వాత 300 ఏళ్ళ కాలం లో సింహళం పై పాశ్చాత్య దండ యాత్రలవలన ,తర్వాత వచ్చిన అంతర్గత కలహాలవలన సాహిత్యం బాగా వెనకబడి పోయింది .ఇది ఆ దేశ సాహిత్యానికి అంధకారయుగం .అయినా చిన్న చిన్న మినుకులలాగా అలగివయన్న ,మొహోత్తాల ,వాళవిత,సరణా౦కర అనే బౌద్ధ రచయితలు కొంత సాహిత్య సృష్టి చేశారు .
19వ శతాబ్దం లో ఈ సాహిత్యం పై పాశ్చాత్య ప్రభావం బాగా పడింది .నవలా రచన పెరిగింది పద్యకావ్యాల రూప స్వభావాలలో గణనీయమైన మార్పులొచ్చాయి ఇతిహాస ప్రధానాలు వదిలేసి భావగేయ రచన చేశారు కవులు .అనాదినుంచి జానపద రూపకాలు గేయాలు సమాజంపై ప్రభావం కలిగిస్తూనే ఉన్నాయి .సాహిత్య ప్రక్రియలలో నూ విదేశీయత చోటు చేసుకొన్నది .
13వ వరకు శ్రీలంక సాహిత్యం పై భారతీయ రాజాస్థాన భాషా ప్రభావం ఎక్కువగా ఉంది .ఈకాలం లో ‘’ముఖదేవావత ‘’అనే బోధిసత్వుడు ముఖదేవతగా జన్మించిన కథా వృత్తంతో వచ్చింది .ఆయనే’’ హరే’’ రూపం లో జన్మించిన కథా విశేషంతో ‘’ససాదవాత ‘’కావ్యం ,రెండవ పరాక్రమబాహు రాజు పై ‘’కవి సిలు మిన’’(ది క్రౌన్ జ్యుయేల్ ఆఫ్ పోయెట్రి)వచ్చాయి. ఇవి బోధిసత్వుని జీవిత సంబంధమైన క్లాసికల్ రచనలు .
ఒకటవరాజసేన(832-851)కాలం లో సియాబస్లకార( భాషా లంకార ) అనే అలంకార గ్రంథం రాయబడింది .పాళీ ధమ్మపద పై ‘’ధాం పియాతువ గాతపదాయ ‘’అనే వ్యాఖ్యానగ్రంధం 10వ శతాబ్దం లోనే వచ్చింది.శిఖావలనంద ,శిఖావలంద వినిషా అనే బౌద్ధ సన్యాసుల నియమగ్రంథాలు వెలువడినాయి .ధర్మసేన బౌద్ధాచార్యుడు రాసిన ‘’శ్రద్ధామరత్నావళి ‘’ గురులుగోమి రాసిన అమవాతురా (అమృతధార )ధర్మప్రదీపికాయ ,విద్యా చక్రవర్తి రాసిన ‘’బూత్సరణ్య’’(బుద్ధ రక్షణ )సింహళ తూపవంశ ,,దాలదాశరిత (బుద్ధుని దంత విశేషం )పూజావలీయ ,పంశీయ పనస్ జాతకపోత (బోధి సత్వుని 550 జన్మ కథలు) ,మైత్రేయుని ‘’బుదుగుణాలంకార ‘’(బుద్ధుని గుణ విశేషాలు )’’లోవాద సంగ్రహాయ ‘’(ప్రపంచోద్ధరణకు మార్గాలు )మొదలైనవన్నీ విశిష్ట బౌద్ధ ఆచార్యులచే రాయబడిన బౌద్ధ రచనలు .
వ్యాకరణ అంశాల సంకలనం ‘’సిదాత్ సంగారవ ‘’,సియాబస్ లకూన (భాష పై శ్రద్ధ ),దండ్యాలంకార సన్నా అనే దండి అలంకార రచనపై వ్యాఖ్యానం , ‘’ఏలు సందస్ లకూన’’(అసలు సింహళ విశేషాలు )ఈ కాలం లో వచ్చిన విశేష రచనలే .13వ శతాబ్దిలో సందేశ కావ్యాల హవా నడిచింది .సాలలిహిని సందేశం (సాలలిహిని పక్షి సందేశం )పారేవి సందేశ (పావుర సందేశం )లను రాహుల సన్యాసి రాశాడు.ఈయనే కావ్యశేఖర అనే అల౦కారాగ్రంథంకూడా రాశాడు .ఈకాలపు మరో ఇద్దరు గొప్ప రచయితలు-విదాగమ మైత్రేయ ‘’బుధుగుణాలంకార’’,బౌద్ధాచార్య వెత్తేవే’’గుత్తిల కావ్యం ‘’రాశారు .మూడు శతాబ్దాల పాశ్చాత్య పాలన చీకటి యుగం లోకూడా ‘’ అలగియవన్న మహోత్తాల’’ రచించిన ‘’కూస జాతక ‘’(కూస రాజుగా బోధిసత్వుని అవతారం ),దాహం సొందకావ్యం ,సుభాషిత మాత్రమె రచి౦ప బడినాయి..
శ్రీలంక రచయితలలో ముఖ్యులు –ఆర్ధర్ సి క్లార్క్ –సైన్స్ ఫిక్షన్ ,స్పేస్ సైన్స్ లపై గోప్పరచనలు చేసి కలింగ అవార్డ్ పొందాడు
ఆన౦ద కుమార స్వామి – సింహళ శిల్ప శాస్త్ర రచయిత ,చిదంబర నటరాజస్వామి పై అద్భుత విశ్లేషణచేసిన రచయిత
శ్యాం సెల్వ దొరై –గొప్పనవలాకారుడు –ఫన్నీ బాయ్ నవలతో ప్రసిద్ధుడు
స్టాన్లీ జయరాజ తంబియ –యాన్త్రోపాలజిస్ట్ –బైజాన్ ప్రైజ్ విన్నర్
రాజీవ విజే సింహా –రాజకీయ విశ్లేషకుడు
సిరిల్ పొన్నం పెరుమ – కెమికల్ ఇవల్యూషన్ ,పర్యావరణ రచయిత
జే.ఆర్ జయవర్దనే -11ఏళ్ళు శ్రీలంక ప్రధానమంత్రి గా రెండవ దేశాధ్యక్షుడుగా ఉన్న రచయిత .ఆరేళ్ళ ప్రణాళిక రచయిత
కార్ల్ ముల్లర్ –కవి ,జర్నలిస్ట్
జాన్ కోటేల్ వాలా –స్టేట్స్ మన్, మూడవ ప్రధాని
సిరి గుణ సింఘే –సంస్కృత ,కళా ,చరిత్ర రచయిత, ఫిల్మ్ మేకర్
ఎడిర్ వీర శరచ్చంద్ర –ప్రముఖ నాటకరచయిత,రాజకీయ విశ్లేషకుడు
ఎర్నెస్ట్ మాక్లింత్రేయ-ప్రముఖ ఆంగ్లభాషా పండితుడు, రచయిత.
మార్టిన్ విక్రమ సింఘే –ప్రసిద్ధ నవలాకారుడు .అనేకభాషలలోకి ఇతని నవలలు అనువాదం పొందాయి .
శ్రీలంక ప్రముఖ రచనలు -కోలపెట్టి పీపుల్ , ది గుడ్ లిటిల్ సిలనీస్ గర్ల్ ,దిజామ్ ఫ్రూట్ ట్రీ,రీఫ్,ఆన్ సాల్ మాల్ లేన్,ది రోడ్ ఫ్రం ఎలిఫెంట్ పాత్,ఫన్నీ బాయ్ , ఐలాండ్ ఆఫ్ ఎ థౌజండ్ మిర్రర్స్,చినమాన్ ,బిహైండ్ ది ఎక్లిప్స్ .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -6-2-20-ఉయ్యూరు
—

