కరోనా భువనవిజయం
అష్టదిగ్గజాలు –నమోస్తు మహా మంత్రీ .ఈ రోజు మా ఆసనాల వైఖరి మారింది .కవికీ కవికీ దూరం గజం పైనే ఉంది .ఏమిటి విశేషం అప్పాజీ
అప్పాజీ – కరోనా క్రిమి స్వైర విహారం చేస్తోందని చారులవలన విని దానికి సా౦ఘిక దూరమే విరుగుడు అని ప్రభువులవారు నిర్దేశించగా ఇలా ఏర్పాటు జరిగింది .అందరిమేలుకోసమే కదా
అష్ట-బాగుంది .
అప్పా-అంతేకాదు ప్రతివారూ ముక్కుకు ,మూతికి ముసుగు ధరించాలి .అవీ సిద్ధంగానే ఉన్నాయి మీ ఆసనాలలో .ధరించి ఆసీనులుకండు కవివరులారా
రామలింగడు –అది కట్టుకొని కవిత్వం చదవాలంటే ఒకటి చదివితే ఒకటి వినిపిస్తుందేమో అమాత్యవర్యా
అప్పా-కొంటె వాడవు వికటకవీ .చదివేటప్పుడు తొలగించి నువ్వన్న ఇబ్బంది రాకుండా చేసుకోవపచ్చు .అరుగో ప్రభువులు వేంచేస్తున్నారు స్వాగతం పలుకుదాం
అందరూ-స్వాగతం శ్రీ కృష్ణదేవయ మహీపాలా ,జయోస్తు దిగ్విజయోస్తు
రాయలు –నమస్తే అప్పాజీ .కవి దిగ్గజాలకు వందనం సుఖాసీనులు కండి
పెద్దన –ప్రభూ ! ఈఅత్యవసర సమావేశానికి కారణం తెలుసుకోవచ్చునా
రాయలు –అవశ్యం పెద్దనామాత్యా .అదేదో క్రిమి ప్రపంచమంతా వ్యాపించి దానవమారణ హోమం చేస్తోందని తెలిసింది .దాని పేరు కరోనా అట .అందుకే ఇవాళ మనం ప్రత్యేకంగా కరోనా భువన విజయం నిర్వహిస్తున్నాం
అష్ట –భేషుగ్గా ఉంది మీ ఆలోచన .అదే ఇప్పటి తక్షణ కర్తవ్యమ్ ప్రభూ
రాయలు –అప్పాజీ ప్రారంభించండి
అప్పా –ధన్యుడను ప్రభు శత్రు రాజుల కదలికలు ముందే గ్రహించి తగినట్లు వ్యవహరించి మట్టు పెట్టె చాణక్యం దాని ముందు పని చేయటం లేదు .ఎలావస్తోందో ఎలా సోకి జనాలను వేలాది పోట్టనబెట్టుకొంటో౦దో అంతు చిక్కటం లేదు .ప్రపంచమంతా కి౦కర్తవ్య తా భావంలోదిక్కు తోచక పడిపోయింది . మీ కవితా ప్రతిభాతోనైనా దాన్ని ప్రపంచం నుంచి తరిమేద్దామని ప్రభువులు సంకల్పించి ఇలా ఏర్పాటు చేశారు .మనం కూడా ఎక్కువ సేపు ఇక్కడ ఉండటమూ క్షేమంకాదు . కనుక ఒక్కొక్కరు ఒక్క పద్యంతో నే మీసత్తా చూపి ,దాన్ని భయపెట్టి ,తిట్టి ,చావగొట్టి చెవులుమూసి తరిమేయండి .ఇంతకంటే వేరు ఉపాయం లేదు
రాయ –మామనసును చక్కగా అర్ధం చేసుకొని వక్కాణించారు మహామాత్యులు అప్పాజీ
అప్పా –ధన్యుడను రాయా .ముందుగా నేను ఒక కవి పేరు చెబుతాను వారి కవిత్వం అయ్యాక వారే తమతర్వాత ఎవరో సూచించి సమయం వృధా కాకుండా చేస్తారు .పెద్దనా మాత్యా ఉపక్రమించండి
పెద్దన –మహా ప్రసాదం
నిరుపహతిస్థలంబు రమణీ ప్రియ దూతిక తెచ్చి ఇచ్చు క
ప్పుర విడె మాత్మ కింపయిన భోజన మూయల మంచ మొప్పు త
ప్పరయు రసజ్ఞులూహ తెలియంగల లేఖక పాఠకోత్తములన్ కరోన దూరము చేసె
అవిలేని బాధితుడనైన నన్ను పద్యము రచియించుమటన్న శక్యమే ‘’
ధూర్జటి మహాకవీ మీరే తరువాత
ధూర్జటి-నీకుం గాని కవిత్వ మెవ్వరికి నేనీనంచు మీదెత్తితిన్
జేకొంటిన్ బిరుదంబు కంకణము ముంజేఁ గట్టితిం బట్టితిన్
లోకుల్ రచ్చరచ్చ చేసి నను శంకించి బాధించగా
పిప్పిటిగోటిపై రోకలిపోటనినట్లు కొ౦ప ము౦చేవు
కరోనా కారుణ్యమే లేదనీకు జీవులతో ఆటాడగన్ ?
రామలింగ కవీ అందుకో
రామలింగ- తెలియక వచ్చి తలుపు తట్టి లోన ప్రవేశించి
అస్తవ్యస్తముల్ జీవితములన్ జేసి కులుకుచున్నావు
కాలిడిన నోట దుమ్మువడ,చండాల ,కోవిద రూప ఓరి
రోరి పలు మారు నీ పిశాచపు పాడె గట్ట
కరోన గిరోన తురాన యేగు మిక లేకున్న చీపురుతోడ సి౦గారింతు ‘’
తిమ్మన్నకవీ కానీండి
తిమ్మన – అతుల మహానుభావ మని కరోన నొక పెద్ద సేసి,ఊహాను
నిచ్చకంబొదవ సూడిద నిచ్చిన నిచ్చెఁగాక
అది ఆదేశపు ప్రజల నర్పణ మొందిన మొంది౦చు గాక
ఆమతకరి కోవిదుండు మమ్ముఁ దలంపఁగ నేల యచ్చటి
దాని పెకలించి దెచ్చి ఇచ్చట నాటగ నేల ఈ ఘోరకలి అంటించగానేల పృథ్వి అందంతటన్ ‘’
సూరనా మాత్యా మీదే తరువాయి
సూరన – తమి బూదీగల తూగుటుయ్యలల బంతాలాడుచుం దూగనా
కొమరుంబ్రాయపు గబ్బి గుబ్బెతల యంఘ్రుల్ చక్కగా జాగి
ఉమ్మెత కాయ మొగంబై భీతి గొల్పుచు చనుదెంచు రోతన్ గంటె
మానవులార నాక మృగీ నేత్రముల మీద మింటి మొగంబై
సవాల్ విసరు నా వికృతాకార కరోన గాల్చాచు లా గొప్పెడున్ ‘’
భట్టుకవీ మీ పట్టు పట్టండి
రామరాజ భూషణుడు – హరిదం భోరుహ లోచనల్ గగన రంగాభోగ రంగత్తమో
భర నేపధ్యము నొయ్య నొయ్య సడలింపన్ రాత్రి పిశాచికి
వరుసన్మౌక్తిక పట్టమున్ నిటలమున్ వక్త్రంబునున్ దోఁచె నా
కరోనా కాకృతి వొల్చె రేకయి సగంబై బింబమై తూర్పునన్ విభ్రాంతి చేకూర్చుచున్
రుద్రకవీ సిద్ధం కండు-
రుద్రకవి – పండితులైనవారు దిగువం దగనుండగ నల్పమైన కరోన
ఉద్దండత బీఠమెక్కిన బుధప్రకరంబులకేమి యెగ్గగున్
గొండొక కోతి చెట్టుకొన కొమ్మకు నెక్కి ఫలప్రసూనముల్ రాల్చిన చందమయ్యే
గండ భేరుండ మదేభ సింహములలైన మానవుల్
చేష్టలుడిగి కరోన చేతిలో చిక్కుట విదివ్రాతముగాదే యెంత వింతయో .’’
అయ్యలరాజు రామభద్రకవీ శుభప్రద౦ చేయండి
రామభద్ర –గోమా౦శాసని మద్యపాని సగరిన్ గొండీడు చండాలుడున్
హేమస్తేయుడు సోదరీ రతుడు గూడేకాదశిన్ భుక్తిగాం
చేమూఢాత్ముడులోనుగా గలుగు దుశ్శీలాత్మజుడైన జనులున్
దుదిన్ కరోనా వశవర్తులై చత్తురు నెత్తురుగ్రక్కి రఘువీరా జానకీ నాయకా
రాయలు –దిగ్గజకవులారా సరస రస కందాయ పద్యదుడ్డుకర్రలతో కరోనా నడుం విరగ్గొట్టారు భేష్ . ఈనాటి మన సభకు ప్రత్యేక ఆహ్వానితులుగా కొందరు ప్రసిద్ధ కవులనూ ప్రత్యేకంగా ఆహ్వానించాం .వారూ కవితలతో మెప్పిస్తారు –పఠాభికవీ మోగించండి కవితా నగారా
పఠాభి-నాయీ వచన పద్యాల దుడ్డు కర్రలతో
కరోన నడుము విరగదంతాను
కోవిద్ కొంటె చేస్టల్ని చావు దెబ్బతీస్తాను
అనుసరిస్తాను నవీన పంథాకానీ
నేను శాంతి వల్లించే భావకవిని మాత్రం కాదు
చెడును దండించే అహంభావ కవిని ‘’
శ్రీశ్రీ కవితాగ్ని కురిపించు
శ్రీశ్రీ –నేనుసైతం కరోనాగ్నికి కవిత నొక్కటి ఆహుతిచ్చాను
నేను సైతం విశ్వ శాంతికి వీవెననై వీచాను
నేనుసైతం భువనఘోషను అణచి వేసే అరుపు ఒక్కటి అరిచాను
నెత్తురు చిమ్ముకొంటూ జనం రాలిపోతుంటే నిర్దాక్షిణ్యంగా ఉన్నారేమిట్రా
నేను చెప్పిన సమత మమతా మంటగలిపారు గదరా
భాభ్రాజమానం భజగోవిందం లారా మీ మొహాలుమండా
ఆరుద్రా కవితా రుద్రుడవుకా
ఆరుద్ర – దేవత అంత గొప్పది కరోనా రక్కసి
మా ఇంట్లో మా ఆవిడా కూడా యధాశక్తి డిటో
పేరేమిటో తెలిసినా అపలేకున్నాము
కోవిడ్ వాడు కాదు అగస్త్య భ్రాత
పెళ్ళాం చుట్టాలపట్ల నాకూ అదే వ్రాత
కరోనా కరోడా మొగుడు –మరే పేరుకీ తగడు
తిలక్ కవితాతిలకం దిద్దూ
తిలక్ – గాలిలేనిప్రకృతి యోగిలాగ రోగిలాగ
మూల్గుతోంది
కాలువిరిగిన ముసలికుక్క దీనంగా
మొరుగుతోంది
తరతరాల నిస్పృహ నన్నావరించుకొంది
చరచరాలు తాకిన కరోన మూర్తి విస్తరించింది
యుద్ధం మీద యుద్ధం వచ్చినా
మనిషి గుండె పగలలేదు
మనిషి మీద మనిషి చచ్చినా
కన్నుతుదల జాలిలేదు
నాగరికత మైలవడిన దుప్పటిలా
కరోన నిండా కప్పుకుంది
నాకందని ఏవో రహస్యాలు బాధిస్తున్నాయి నన్ను’’
కు౦దుర్తీ కవితా వాన కురిపించు
కుందుర్తి –దయ కాంతి ఉయ్యాలతో –ఊహ ఊడిగం చేసింది
క్షణక్షణ మొక వైవిధ్య సూచకంగా
విదివ్రాతలో దాగిన అర్దాలకనుగుణ౦గా విహరిస్తోంది కరోన నిర్దయగా
దాశరధీ కవితా పయోనిధి లో ముంచు
దాశరధి
చరిత్రపాడనిధరిత్రిచూడని
పవిత్రగీతంపాడండి
కరోన విచిత్ర భూతం చూడండి
నరాలలోతరతరాలగాథలు
శిరస్సులోనరనరాలబాధలు
గిరిశిరస్సుపైకోవిదహరీంద్రగర్జన
మనమనస్సులోతర్జనభర్జన
చరిత్ర పాడని ధరిత్రి చూడనివిషాద గాధలు విన్నాం కన్నాం
లోకం పట్టని కవీ విశ్వనాథా అందుకోండి
విశ్వనాథ- కడచిన యామిని పిడుగువడ్డ సగంబు
మాఁడిన తలయైన మద్దిచెట్టుఁ
బోలినదానిని, ముంచెత్తు వానలు
సగములో వచ్చినం జల్లనారి
పోయిన కాష్ఠంబుఁ బోలిన దానిని,
గహనంబులోఁ గుంటగట్టులోన
మట్టలెండి జలాన మాఁగిన చిట్టీతఁ
బోలినదానిని, సోలుదాని
తే. నెడపెడగ వాయువులు వీవనిట్లు వచ్చు
వాయువున వంగుచును నట్లువచ్చు వాయు
పూరణమున నాఁగుచు నాఁగి మొరయుచున్న
వేణువల్మీక గుల్మంబుఁ బోనిదాని
కరోన నొకదాని గంటి నేను
సరస్వతీ పుత్రా శతపత్ర సుందరకవిత విప్పండి
పుట్టపర్తి నారాయణాచార్యులు – అదుగో పాతర లాడుచున్నయది సౌధాంతాల నిశ్శబ్ద, మ
ల్లదె మా ప్రపంచ రాజ్యలక్ష్మి నిలువెల్లన్నీరుగానేడ్చుచు
న్నది, భాగ్యంబులుగాసెగట్టిన మహా దుఖా౦బోధిలో
సౌభాగ్య రేఖ చిదిమి వేసెను క్రూర నికృష్ట కరోనక్రిమి ఇక దారేది తెన్నేది లోకానికిన్’’
రాయలు –చాలా రసవత్తరంగా మన కరోన భువన విజయం సాగింది .పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు .ఐతే నేనిచ్చిన శీర్షిక కరోన భువన విజయం .అంటే నా భావం కరోన మహమ్మారి ఈ భువనం పై విజయ సంకేతం చూపిస్తోంది కనుక దాన్ని అణచటానికి కవిత్వ సాధనం చేయమని. చక్కగాస్పందించి కవిత శూలాలతో వాగ్బాణాలతో ,చెప్పుదెబ్బల్లాంటి తిట్లకవిత్వంతో చేరిగిపారేసి తరిమికొట్టి ఈఅనంత భువనానికి మేలు చేకూర్చి పుణ్యం కట్టుకొన్నారు మీరంతా .చివరగా నా కవిత
బాలార్కాంశు విజృంభితామలశరత్పద్మాక్ష! పద్మాక్షమా
నీళాజాంబవతీశ! యీశ బలభి న్నీరేరుహోద్భూత ది
క్పాలామూల్యశిరోమణిద్యుతికనత్పాదాబ్జ! పాదాబ్జఫా
లాలంకారకచావలీ మకర దీప్యత్కుండలాంచన్ముఖా.
కరోన బాధితుల స్వాంతంబు చేకూర్చి విస్తరింపక నివారి౦చుమా
అప్పాజీ – ఈ నాటి భువన విజయానికి స్వస్తి .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -1-5-20-ఉయ్యూరు
విన్నపం –మహాకవుల కవితలలో కవిత్వమే రాని నేను సాహసించి వ్రేలుపెట్టి సరదాకోసం ,శీర్షికకు న్యాయం కోసం స్వత౦త్రించి మార్పులు చేశాను .ఆమహాకవులకు చెంపలేసుకొని క్షమాపణ చెప్పుకొంటూ –దుర్గాప్రసాద్

