హాస్య దినం    ముళ్ళపూడి వెంకటరమణకు హాస్యా౦జలి తో –

     హాస్య దినం

‘’ఒక అప్పారావు కు తండ్రి ,రుణాన౦దలహరికి జన్మస్థానం ,బుడుగుకు గొడుగు ,జనతా ఎక్స్ప్రెస్ కు రైలింజన్ ,సీగాన పెసూనా౦బ కు  గాడ్ఫాదర్ ,రాజకీయ బేతాళ పంచ వింశతిక కు స్వర్ణలతిక ,సినీ విక్రమార్క సింహాసనానికి పట్టువదలని రచనా విక్రమార్కుడు .అతని మార్కే వేరు రూటే సెపరేటు ,రిమార్కు లేని రచన ,’’తెలుగూస్ కు అరుదుగా లభించే బంగారు గూసు’’ ,సినీ జీవితాన్నిస్కాచ్ వడబోసి ,మన’’సారా’’ తాగిన  స్కెచ్ పెన్,అది విసిరే ప్రతిమాటా జోకుల తూటా చరుపే ,జలదరి౦పే ,ఇంపే ,సొంపే ,తలకడిగే ‘’షాంపే’’,తెలుగు మాటల తీరుకు అక్షరశిల్పి జక్కన్నే ,తెలుగు వాడి తలతిక్కకు ,పొగరుకూ ,ఠీవికీ  డాబూ దర్పాలకూ ,అమాయకత్వానికీ ప్రతిమలే . మలచినపాత్రలు మధురస పాత్రలే .కవ్విస్తాయ్,నవ్విస్తాయ్ ,కొంటె కోణంగిలా వెక్కిరిస్తాయ్,కొక్కిరిస్తాయ్ ,నెత్తి కెక్కి కూర్చుంటాయ్,మనల్ని వదలి పోనని భీష్మి౦చుకు కూర్చుంటాయ్.అతడే’’ ముళ్ళవాడి వ్యంగ్యట రమణ’’ .ఆయనది ఒక ప్రత్యెక స్కూల్ ఆఫ్ థాట్.మధ్యతరగతి మందహాసానికి మంద్ర స్వరరాగం .బాలమురళి స్వరం అంతటిహాయి ,కొత్తదనం మెత్తదనం ,ప్రయోగం ,సాఫల్యత అతని స్వంతం .దటీజ్ రమణ .తెలుగు హాస్య రమారమణుడు.మనసు నవనీతం మాట అమృతం .అంతశ్చేతనను తట్టి అ౦తర్ముఖుడై ,ఆధ్యాత్మికానికి ఆవలి మెట్టుగా ఉంటూ వెలుగు చూపే తెలుగోడు ,వెలుగోడు ,వెలుగు వెల్లువలాడు .

  ‘’వెంకట రమణీయార్ధక ప్రతిపాదిత శబ్దం ,కావ్యం ‘’అని రుజూ చేశాడు. అతడు పుట్టి కొత్తశబ్ద సృష్టి చేస్తాడని ఆ పేరు పెట్టి ఉంటారు .సినీ సంగీతం ఎలా ఉంటుందని అడిగితె ‘’మేమగునో ,జీవిత మేమగునో ‘’లా ఉంటుంది తలాతోకా లేకుండా అన్నాడు రవణ .మనచుట్టూ ‘’టోకరాసురులున్నారు జాగ్రత్త ‘’అని హెచ్చరిస్తాడు ‘’రాత్రిపదైనా ,పద్నాలుగైనా ‘’అన్నది మరో విరుపు .మనం సందియుగం లో ఉన్నాం కనుక ‘’వేదాన్తప్పుస్తకాలు ‘’అని మేకు బందీ చేస్తాడు .హిందీ ప్రభావం మనపై ఎక్కువకనుక ‘’ఆషా ,నిరాషలమధ్య మనిషి ఉన్నాడని చమత్కరించాడు .స్క్రిప్ట్ మీద రైటరు ,డై రెట్రూ ,ప్రొడ్యూసరు కూర్చున్నప్పుడు ‘’ఉప్పుకప్పురంబు పద్యం ‘’పోతన రాశాడని సినీకవి అంటే ,డైరెట్రు’’ఎన్ని సినిమాలకు రాశాడు ?’’అని అడిగితె మన మతులు దొబ్బెయ్యవా బాబాయ్ .

  పంచ తంత్రం లో వలెనె ప్రపంచ తంత్రమును అయిదు భాగమ్ములు ‘’అంటాడు .’’ద్వికరణ శుద్ధిగా ‘’అని కాయినేజ్ చేశాడు .అంటే –నోటా ,నొసటాఅని అర్ధం చెప్పాడు గడుసుగా .యతికోసం పాకులాడే కవులకు చురక అంటిస్తూ ‘’హాలీ వుడ్డు లో హరనాధ బాబు ఉండేవాడు ‘’అన్నాడు ఎలా అని ప్రశ్నిస్తే ‘’ఎందుకుండడు?యతి కోసం చచ్చినట్టు ఒదిగి కూర్చుంటాడు అని దబాయిస్తాడు .వర్ధమాన రచయితను ‘’రామాయణం చదివారా ‘’అని అడిగితె ,చిన్నప్పుడు బామ్మ చెప్పిన రామాయణం విన్నాను ఇంకా చదవటం ఎందుకు అని వోరిజినల్ చదవ లేదు అన్నాడట .’’ఇంకా ఏమైనా చదివారా ‘’అన్నప్రశ్నకు ‘’చాలా చదివా గుర్తు లేదు.అయినా ఇంత హఠాత్తుగా అడిగితె ఎలా అని విసుక్కున్నాడట ‘’.

   రైల్వే హోటళ్ళలో ఇడ్లీలు ‘’మాత్రలు ‘’లాగా ఉంటాయని చమత్కరించాడు .డబ్బాలు మూడురకాలు’’ స్వరడబ్బా ,పరడబ్బా ,పరస్పరడబ్బా’’  అని డబ్బాకొట్టి మరీ చాటాడు .మనిషి వర్ణన ఎలా చేశాడో చూడండి –‘’రామ చామి(రామస్వామి ) ది భారీ విగ్రహం –తెలుగు సినిమా అంత .అరవసినిమాడైలాగంత పొడుగ్గా ఉంటాడు. సగటు ఇండియా సినిమాహీరోయిన్ అంత లావుగా ఉంటాడు ‘’అని అన్నిభాషల సినిమాలనూ వాయించి వదిలాడు రవణ.

  ఇంతటి కమ్మని తెలుగు హాస్యం పండించిన ముళ్ళపూడి వెంకటరమణకు హాస్యా౦జలి తో –

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -3-5-20-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in ఆ''పాత''మధురాలు and tagged . Bookmark the permalink.

1 Response to   హాస్య దినం    ముళ్ళపూడి వెంకటరమణకు హాస్యా౦జలి తో –

  1. పరమానందం !
    -dr.t.v.narayana rao
    rajamahendravaram

    4 మే, 2020, సోమన 10:02 AMకిన సరసభారతి ఉయ్యూరు
    వ్రాసినది:

    > gdurgaprasad ప్రచురించారు: ” హాస్య దినం ‘’ఒక అప్పారావు కు తండ్రి
    > ,రుణాన౦దలహరికి జన్మస్థానం ,బుడుగుకు గొడుగు ,జనతా ఎక్స్ప్రెస్ కు రైలింజన్
    > ,సీగాన పెసూనా౦బ కు గాడ్ఫాదర్ ,రాజకీయ బేతాళ పంచ వింశతిక కు స్వర్ణలతిక
    > ,సినీ విక్రమార్క సింహాసనానికి పట్టువదలని రచనా విక్రమార్కుడు .అతని మార్”
    >

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.