సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-19
తెల్లకలువల సమూహం గా ప్రకాశించే నిర్మల చంద్రుడు ,నల్లని జలాలలోకి హంస వెళ్లినట్లు నిర్మలాకాశం పైభాగాన కనబడి ,తనకా౦తితో సహాయ పడేట్లు హనుమను సేవిచటానికి వచ్చాడు .ఆచల్లని వెన్నెలలో హనుమ సీతాదేవిని చూశాడు .ఆమె చుట్టూ ఒంటికన్ను ఒకే చెవి కలవారు చేటచెవులతో తలను దాచు కొన్నది ,అసలు చెవులే లేనిది ,పంది చెవుల్లాంటి చెవులున్నది ,ముక్కు పైకి ఉన్నది ,సన్నని పొడవైన మెడ ఉన్నది ,కొద్ది జుట్టున్నది అసలు జుట్టే లేనిది వ్రేలాడే చెవులు నొసలున్నది ,వ్రేలాడే పొట్ట, స్తనాలున్నది ,వ్రేలాడేమోకాళ్ళు న్నది ,గూనిది ,మరిగుజ్జుది,పారపళ్ళున్నది ,అసలు పొట్ట మోహంలో ఉన్న వికృతమైనది ,మొదలైన రాక్షస స్త్రీలను చూశాడు .నల్ల తెల్ల యెర్ర మొదలైన రంగు శరీరం ఉన్నవారు ,పందిముఖం లేడి ముఖం , ఎనుబోతుముఖం ,మేకమొహం ,నక్కముఖం ,ఏనుగు పాదం ఒంటేకాళ్ళు,దేహంలోనే తల దూరి ఉన్నవారు ,ఆవు నక్క కుక్క ఏనుగు ,కోతిచెవులున్నవారు ,అడ్డముక్కు పెద్దముక్కు ఏనుకాళ్ళవారు ,పాదాలలోజుట్టున్నవారు ,అనేక జంతు ముఖాలున్నవారు ,రకరకాల రంగు వెంట్రుకలున్నవారు కలవారు ,మద్యం లో పూర్తి నిషాలో ఉన్న అనేకరకాల రాక్షస స్త్రీలను సీత చుట్టూ ఉన్నట్లు గమనించాడు
అనవద్య సౌందర్య తేజో మూర్తి సీతమ్మను చూశాడు .పతివ్రతా ధర్మం తో పెరిగిన కీర్తి శోభతో ,పతి స్నేహమే అలంకారంగా ,సింహం చేత బంధింపబడిన ఆడ ఏనుగులా గా , మేఘాలచే ఆక్రమించబడిన చంద్ర రేఖలా ,బెదరిన ఆడలేడి చూపులతో ,శోక సమూహంగా ,దుఖ సాగర తరంగం పైకి లేచినట్లు న్న సీతను చూసి హనుమ ఆనంద పారవశ్యంతో కన్నీరు కార్చాడు .రామలక్షమణులను ఒకసారి తలచుకొని నమస్కరింఛి ,శింశుపా వృక్షం ఆకులమధ్య దాక్కున్నాడు .
‘’నమస్కృత్వా చ రామాయ ,లక్ష్మణాయచ వీర్యవాన్ –సీతా దర్శన సంహృస్టో హనుమాన్ సంవృతో భవత్ ‘’
ఇది 32శ్లోకాల 17వ సర్గ .ఇందులో ఎన్నిరకాల రాక్షస స్త్రీలున్నారో వాల్మీకి మనకు చూపించాడు. సీత పాతివ్రత్యాన్ని మరింత మెచ్చే శ్లోకాలు రాశాడు .లంకలో దిగినప్పుడు చంద్రోదయం యెంత గొప్పగా హనుమకు సహకరించిందో ,ఇక్కడ అశోకవనం లోనూ చంద్రుడు ఆయనకు బాగా సహాయపడ్డాడు కాంతితో .
సశేషం
నృసింహ జయంతి శుభాకాంక్షలతో
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -6-5-20-ఉయ్యూరు

