అమ్మనబ్రోలు చెన్నకేశవ శతకం

అమ్మనబ్రోలు చెన్నకేశవ శతకం

అమ్మన బ్రోలు చెన్న కేశవ శతకాన్ని శ్రీ నాగినేని వెంకట కవి గారు 1914 మార్చి 10న రచించి 1914లో దుగ్గిరాలలోని ప్రబోదినీ ముద్రాక్షర శాలలో వ.నిరంజన శాస్త్రి గారి చే ముద్రింపబడింది .వెల కేవలం పావలా .’’అమ్మనబ్రోల్పురి చెన్నకేశవా ‘’అనేది శతకం మకుటం .కవి అమ్మనబ్రోలు వాస్తవ్యుడు ,కమ్మవారు .ప్రకాశం జిల్లా ఒంగోలుకు 13కిలో మీటర్ల దూరం లో అమ్మనబ్రోలు ఉంది .అక్కడ ఉన్న చేన్నకేశవస్వామిని ప్రసన్న చెన్నకేశవస్వామి అంటారు

 శతకాన్నిశార్దూల వృత్తం లో  చెన్నకేశవ స్తుతితో కవి ప్రారంభించాడు-

‘’శ్రీ రమణీశ యోగిజన  చిత్త సరోరుహ మత్త భ్రు౦గ సా-కార సురేంద్ర వంద్య పద ,కౌస్తుభవక్ష సుదీరకోటి మం

దార సువర్ణ చేల మురదానవ సంహర గోపికా మనో –హార సునీల వర్ణధర నమ్మనబ్రోల్పురి చెన్నకేశవా ‘’

  తర్వాత ద్విప్రాసానుప్రాస ,అంత్యప్రాస ద్విపాది ,ఏక యతిత్రిపాది పద్యాలు రాసి ముక్తపదగ్రస్తం లో  -‘’అబ్జాధరాధరాధిపమురాంతక శాత్రవభీమ ,భీమమో

హాబ్జ విలాస లాస కమలాసన సేవిత దేవ దేవ ర-క్షాబ్జసుధామ ఢామకనకా౦బర వారణరాజతాజ పా-లాబ్జ హితాజితాజిధర’’—- తనకవితా విన్యాసాన్ని చూపాడు .తర్వాత తన చదువు సందె విషయాలు చెప్పుకొన్నాడు .11వ ఏట బడిలోచేరి గురు సన్నిధిలో విద్య నేర్చి ధర్మమే లేని ఊరిలో తనను ఉంచినందుకు దేవుడితో మొరపెట్టుకొన్నాడు .చదువులేకపోతే రెండుకాళ్ళ పశువే అని గ్రహించి ,పాపాలు చేయకుండా సర్వమత సామరస్యం నీతి విద్యా శుచి సత్యవచనం దైవభక్తి ఉన్నవాడే బ్రాహ్మణుడు అని తెలుసుకొన్నాడు .కులమత భేదాలు తంత్రాలు నచ్చలేదు .’’వర్షబిందువులు కారుచు నన్నియు నొక్కరూపమై ఘన నదులై జనంబులకు కల్పమహీజాల్లాగా’’ ఉన్నట్లుగా మనుషులలో ఐకమత్యం ముఖ్యం అన్నాడు .పెళ్లి చేశారు .దరిద్రం .ఎటూ పాలుపోలేదు .ధనమే అన్నిటికి మూలం అని గ్రహించాడు .మాంసం తోలుతో ఉన్న ‘’అంగజు మందిరం ‘’పై వ్యామోహంతోం అన్నీ  మర్చిపోతారుజనం .వేశ్యావృత్తిని నిరసించాడు. వేశ్యకు ఒళ్ళు అమ్ముకొని అమ్మనూ సోదరులను  మేపటమే సరిపోతుంది .

 ‘’చదువులురాని నోరు ,శృతి చక్కగ లేని సితారు ,సద్గుణీ సుదతులు లేని గీము ,వర శూరులు మెచ్చని సాము ,నాటలో పదములురాని పాట,వర్తకులు లేనిపేట ‘’నిష్ప్రయోజనం అన్నాడు .స్త్రీలకూ విద్య అవసరం అన్నాడు .పాటలేనినాటకం ,పాకం దప్పిన భోజనం ,సయ్యాటలు లేనిపొందు,ప్రియమాజ్యము జూపని విందు ,కొలువులో మాటలురాని తేట,మతిమంతులు మెచ్చనిమాట వలన సుఖం ‘’ఇల్లె’’ అ౦టాడుకవి .  ధర్మం మాటలలోకాక ఆచరణలో ఉండాలి .ఆశకు మితిఉండాలి .మేఘాలు ,సూర్య చంద్రులులాగా పరోపకారం చేయాలి మానవుడు .బలాత్కార వివాహం కూడదు అంటాడు .పరస్పర అంగీకారంతో వధూవరులు పెళ్లి చేసుకోవాలి .పరుషవాక్యాలుపలక పోవటం ,పర స్త్రీ వ్యామోహం లేకపోవటం ,పరధనం ఆశించకపోవటం,పండితుల్ని గౌర వించటం బుద్ధిశాలికి ఉండాల్సిన ముఖ్య లక్షణాలు .

  కపట సన్యాసి లక్షణాలు ,మురికిలక్షణం ,కూడా వివరించి ,ప్రపంచోత్పత్తి క్రమం వర్ణించాడు .ఆతర్వాత దశావతారాలు  వర్ణించాడు  -‘’వటువు నటంచు వేషమున వామన రూపముదాల్చి నేల మూడడుగులు చాలు నిమ్మని ‘యాచన చేసి ,ఒసంగ అడుగులుపెంచి ,జగమంతయు జాలక విశ్వరూపమైన వామనావతారం  వర్ణించాడు సహజంగా .దేవుడు ఎక్కడో లేడు ‘’దేవమయంబు నీ జగము .దేవునిలోపల నుండు లీనమై ,భావము లేచువేళప్రపంచము నేర్పడు ‘’అని జగత్తుకు జగన్నాధునికి ఉన్న అనుబంధం వివరించాడు.కాలప్రభావం, మాయచెప్పాడు .ప్రళయం అంటే –‘’శ్రీకరమైన నీ పుడమి జెప్పక నీరము నందు పోవు ,నా ప్రాటమైననీరుగన పావక కీలలయందు ని౦కు ,బల్ తేకువ తోడ పావకుని తీక్షణ మంతనడంచు వాయువాకాశామునందు లీనమవటం ‘’అని కళ్ళకు కట్టినట్లు వర్ణించాడు కవి అనుభవసారంగా .వేదాంత పర౦గా .

కందగీతి గర్భ చంపకమాల లో –‘’ఘనఘన సుందరా ,నిపుణక౦తునిదు-గన్న ప్రవీణ సార దు-ర్జనహర ణాధిపాపరమ ,శాంత శిఖామణి భక్త రక్షపా

వనముని సన్నుతా వరద ,వారణపాలన వారిజాక్ష –రాయని యననే సదాసిరుల నమ్మనబ్రోల్పురి చెన్నకేశవా ‘’

చివరగా గద్యం లో ‘’ఇది శ్రీహరి చరణారవిందమకరంద బిందాస్వాదనేందిందిరా యమాన మానసుండు,కమ్మ వంశజుండును ,క్రిష్ణయ్యతనూ భవుండు ను ,నవనాట కాలంకార విరచిత యశో దురంధరుండు నగు నాగినేని వెంకట కవీ౦ద్ర ప్రణీతంబైన అమ్మనబ్రోలు చెన్న కేశవ శతకము సంపూర్ణము .  

  చక్కని ధారాశుద్ధి ,బహు చందోరీతి ,చెన్నకేశవునిపై భక్తీ శతకమంతా ప్రవ హించింది . ఏ విమర్శకుని దృష్టి కీ,చరిత్రకారుని దృష్టికీ   నాగినేనికవి పడకపోవటం విడ్డూరమే .ఈకవి గురించి రాసే అదృష్టం నాకు కలిగింది .

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -14-7-21-ఉయ్యూరు      ,

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.