మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -2

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -2
2-కన్నాంబ
శ్రీమతి పశుపులేటి కన్నాంబ 1912లో పగోజి ఏలూరులో జన్మించి 7-5-1964న 52వ ఏట కన్నుమూశారు.నావేల్ నాటక సమాజం వారి నాటకాలలో బాలపాత్రలను ధరించి 12వ ఏట రంగప్రవేశం చేశారు. కొద్ది కాలం లోనే అగ్రశ్రేణి నటీమణిగా పేరు ప్రతిష్టలార్జించారు.సతీ సావిత్రి ,అనసూయ ,చంద్రమతి పాత్రలు పోషించి సహృదయ ప్రశంసల౦దు కొన్నారు .ఆ కాలంలో కన్నాంబ పాడి రికార్డైన ‘’కృష్ణం భజ రాధా ‘’పాట ఆంద్ర దేశాన్ని ఉర్రూతలూగించింది.ప్రేక్షక హృదయాలలో ఆమె సుస్థిర స్థానం సంపాదించటానికి దోహద పడింది .
1935 లో చలన చిత్ర రంగప్రవేశం స్టార్ కంబైన్స్ వారి ‘’హరిశ్చంద్ర ‘’సినిమాలో చంద్ర మతి గా నటించటం తో ప్రారంభమైంది .అదే ఏడాది ద్రౌపదీ వస్త్రాపహరణం లో ద్రౌపది గా ,నట విశ్వ రూపం చూపించి నటనతో ప్రేక్షకులను అలరించారు .పౌరాణిక జానపద చారిత్రాత్మక ,సాంఘిక చిత్రాలలో ప్రముఖ పాత్రలను ధరించి హీరోయిన్ గా ,కేరక్టర్ ఆర్టిస్ట్ గా గణనీయ మైన నటన ప్రదర్శించారు .చాలా భాగం సాఫ్ట్ కార్నర్ పాత్రలో అత్తగా అమ్మగా ,తోడికోడలుగా నటింఛి మెప్పించారు .భక్తిని ఎలా పండించారో రౌద్ర ,కరుణ రసాలనూ అదే స్థాయిలో పండించి ఆ చిత్రాల ఘన విజయాలకు ముఖ్య కారణమయ్యారు .150 చిత్రాలలో నటించి తనకు సాటి తానె అని నిరూపించారు –అందులో కొన్ని ముఖ్యమైన సినిమాలు –చండిక ,కనకతార గృహలక్ష్మి తల్లిప్రేమ ,పల్నాటి యుద్ధం లో నాగమ్మ గా బ్రహ్మనాయుడుగా నటించిన గోవిందరాజుల సుబ్బారావు గారితో పోటీ పది నడించి మెప్పించారు . మనోహరలో తల్లిగా కన్నాంబ నటన ఉన్నత శిఖరాలు తాకింది. ఆ హావ భావ ప్రదర్శన,,సంభాషణలు పలికే చాతుర్యం న భూతో అనిపించింది .అనార్కలిలో అక్బర్ భార్యగా ,దక్షయనం లో దక్షుని భార్యగా ఆమె చిరస్మరణీయ నటన ప్రదర్శించారు .సౌదామిని ,నవజీవనం ,పేదరైతు మాంగల్యబలం కృష్ణ-కుచేల ఆత్మ బంధువు సినిమాలు ఆమె నటనకు హైలైట్ గా నిలిచాయి .తెలుగు ,తమిళ సినిమాలో దాదాపు పాతిక సంవత్సరాలు అద్వితీయమైన మహానటిగా కీర్తి పొందారు .ఆనాటి తమిళ స్టార్ హీరోలైన పియుచిన్నప్ప ,ఎ0.జి. రాధా ,నాగయ్య ,ఎం జి రామ చంద్రన్ ,శివాజీ గనేశన్ ,ఎం ఎస్ రాజేంద్రన్ లతో పోటాపోటీ గా నటించి చిత్రవిజయాలకు ధ్రువ తారగా నిలిచారు .1963లో వచ్చిన వివాహబంధం సినిమా కన్నా౦బగారి ఆఖరి సినిమా.
కన్నాంబ నునటిగా తీర్చి దిద్దిన వారు భర్త కడారు నాగభూషణం .ఈ దంపతులు ‘’రాజరాజేశ్వరి ‘’సంస్థను ప్రారంభించి 30తెలుగు ,తమిళ సినిమాలను నిర్మించి రికార్డ్ నెలకొల్పారు .దర్శక నిర్మాతగా నాగభూషణం గారికి గొప్ప పేరు ఉండేది .వీరిచిత్రాలు –సుమతి ,పాదుకా పట్టాభిషేకం ,సౌదామిని ,పేదరైతు ,లక్ష్మీ, సతీ సక్కుబాయి ,శ్రీకృష్ణ తులాభారం, నాగపంచమి వగైరా .ఈ కంపెనీకి మంచి పేరుండేది .స్టాఫ్ కు నెలాఖరు రోజునే ఠంచన్ గా ఆ నెల జీతాలివ్వటం ప్రత్యేకత .ఆఫీసు కూడా విశాలమైన కాంపౌండ్ లో కార్లు ,వాన్ లతో కళకళ లాడుతుండేది .ఆ రోజుల్లో’’ కన్నాంబ లోలాకులు ,కాంచనమాల గాజులు ‘’కు క్రేజ్ ఎక్కువగా ఉండేది.కన్నాంబ గొప్ప ఐశ్వర్యవంతు రాలనీ,పోపుల డబ్బాలమధ్య డబ్బాల లో బంగారుకాసులు పెట్టుకొనేదనీ చెప్పుకొనేవారు .
నేపధ్యగాయనిగా కన్నాంబ సుమతి ,తల్లిప్రేమ గృహ లక్ష్మి సినిమాలో పాటలు పాడారుకూడా .
చండిక సినిమాలో చండిక గా ‘’నేనే రాణి నైతే ఏలనె ఈ ధర ఏకధాటిగా ‘’అంటూ గుర్రం పైస్వారీ చేస్తూ ఒక చేత్తో కత్తిపట్టుకొని వీరావతారం తో ధాటిగా ఠీవిగాకళ్ళు ఎర్రజేస్తూ కన్నాంబ పాడిన పాట ఝాన్సీ లక్ష్మీ బాయ్ ని గుర్తుకు తెస్తుంది అన్నారు రావికొండలరావు .ఈ సినిమాలోనే ‘’ఏమే కోకిలా ఏమో పాడెదవు ఎవరే నేర్పినది ఈ ఆట ,పాట ‘’అని నవ్వులు రువ్వుతూ ఒయ్యారం వలపు వలకబోస్తూ పాడారామే .మధ్యమధ్యలో వచ్చే ఆ నవ్వు మరెవ్వరూ నవ్వలేరు అని ఆనాడు చెప్పుకొనేవారు .ఆనవ్వు ఆమెకే ప్రత్యేకమై నిలిచింది .
సిరితా వచ్చిన వచ్చును సలలితముగ నారికేళ సలిలము భంగిన్ –సిరి తా బోయిన బోవును కరిమింగిన వెలగ పండు గదరా సుమతీ ‘’అన్నట్లు కన్నాంబ మరణించగానే అంతటి ఐశ్వర్యమూ ఏమై పోయిందో తెలీదు .ఆమె కంపెనీతో సహా అన్నీ పోయాయి .ఒక్కటీ నిలవలేదు .భర్త నాగభూషణం ఒక చిన్నగదిలో ఉండేవారు .చూసేవారికి కడుపు తరుక్కు పోయేది .ఆయనకు ఒక ట్రంక్ పెట్టె,ఒక కుర్చీమాత్రమే ఆగదిలో ఆస్తి .నేలమీదే పడుకొనేవారు .కన్నాంబ పార్ధివ దేహాన్ని సర్వాభరణాలతో వారి కులాచారం ప్రకారం పూడ్చిపెడితే దొంగలు నగలతోపాటు శవాన్నికూడా మాయ చేశారు .భర్త నాగభూషణం 73 వ ఏట మరణించారు .తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కన్నాంబ ,నాగభూషణం దంపతులు ఒక స్వర్ణయుగాన్ని స్థాపించారు .
కన్నాంబ పొడవుగా ,దానికి తగిన శరీరంతో, కోటేరు తీసిన ముక్కుతో హుందాగా చీరకే మహా వైభోగం కల్పించేట్లు గా, నుదుట పెద్ద కుంకుమ బొట్టు చేతులకు గాజులతో దేవతా మూర్తిలాగా కనిపించేవారు .అంతటి గొప్ప పర్సనాలిటి లేనే లేదనిచేప్పవచ్చు.నేటి నటీమణులలో అనుష్క కు కన్నాంబ గారికి ఉన్న ఫీచర్స్ అన్నీ ఉన్నాయని నాకు అనిపిస్తుంది .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -22-12-21-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.