మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -3
3-సకల కళా సరస్వతి సురభి కమలాబాయి
4-4-1908న హైదరాబాద్ లో కృష్ణాజీరావు వెంకూ బాయి దంపతులకు కమలాబాయి జన్మించారు .తల్లి వెంకూ బాయి ‘’నల దమయంతి ‘’నాటకంలో గర్భవతిగా దమయంతి పాత్రలో నటిస్తుండగా ,పురిటి నొప్పులు రాగా ,తెరదించి రంగస్థలం మీదనే కమలాబాయి ని ప్రసవించటం గొప్ప విశేషం .ప్రేక్షకులు అదీ నాటకం లో ఒక భాగమే అను కొన్నారు .తీరా విషయం తెలిశాక చంటి బిడ్డపై డబ్బులవర్షం కురిపించారు ప్రేక్షక మహాశయులు .పుట్టటం తోనే కనకాభి షేకం జరుపుకొన్న అదృష్ట శాలి కమలాబాయి .తండ్రి గారి స్వంత సురభి నాటక కంపెనీ ఉండటంతో ఆమె ఆ నాటక ప్రదర్శనలు జరిగే చోట్లకు వెళ్ళటం చిన్నతనం నుంచి అలవాటైంది .బాలకృష్ణ ,ప్రహ్లాద ,లవ పాత్రలను పోషించారు .సహజ సౌందర్యం ,శ్రావ్యమైన కంఠం,స్వచ్చమైన ఉచ్చారణ పుష్కలమైన నటనాకౌశలం ఉండటం తో పాత్రలకోసం ఆమె ప్రయత్నించాల్సిన అవసరం లేక పోయింది .యుక్త వయసురాగానే సురభి సమాజం లో నాయకి పాత్రలన్నీ ఆమె ధరించి పరి పూర్ణమైన న్యాయం చేకూర్చారు .ఆమె నటజీవిం లో కొన్ని వందల సువర్ణ,రజత పతకాలు గెలుచుకొన్న మహా నటీమణి కమలాబాయి .ప్రదర్శనాల మధ్య వచ్చే విరామ సమయం లో అద్భుతంగా నృత్యం చేసి మెప్పించేవారు .బొంబాయిలో పరశురాం వద్ద హిందూస్తానీ సంగీతాన్ని అభ్యసించి ‘’అమరగాయని ‘’బాలగంధర్వ ‘’ప్రశంసలు పొందిన శేముషీ మహిళ.
రంగస్థలం పై తన నటనా వైదుష్యాన్ని ప్రదర్శించి కమలాబాయి మొదటి సారిగా మొదటి టాకీ సినిమా1931లో శ్రీ హెచ్ ఎం రెడ్డి నిర్మించిన ‘’భక్త ప్రహ్లాద ‘’లో లీలావతి గా హిరణ్య కశిపుని గా నటించిన శ్రీ మునిపల్లె వెంకట సుబ్బయ్య సరసన నటించి మెప్పించారు .తర్వాత సర్వోత్తమ బాదామి దర్శకత్వం లో సాగర్ ఫిలిమ్స్ వారి ‘’పాదుకా పట్టాభి షేకం ‘’లో సీతాదేవి గా,శ్రీరాముడి వేషం ధరించిన ప్రముఖ నటుడు శ్రీ అద్దంకి శ్రీరామమూర్తి ప్రక్కన నటించారు .సాగర్ ఫిలిమ్స్ వారు నిర్మించి సర్వోత్తమ బాదామి దర్శకత్వం వహించిన ‘’శకుంతల ‘’సినిమాలో మరో ప్రసిద్ధ నటుడు శ్రీ యడవల్లి సూర్యనారాయణ తో శకుంతల గా నటించారు .శ్రీ బి.వి .రామానందం దర్శకత్వం లో కృష్ణా ఫిలింస్ నిర్మించిన ‘’సావిత్రి ‘’లోటైటిల్ రోల్ పోషించారు .సరస్వతి సినీ టోన్ వారి ‘’పృధ్వీ పుత్ర
లో ముఖ్య పాత్రపోషించారు.
కమలాబాయి నటప్రతిభను గుర్తించి ,ముగ్ధుడైన సాగర్ ఫిలిమ్స్ అధినేత కమలాబాయి ని బొంబాయికి ఆహ్వానించగా వెళ్లి పదేళ్ళు ఉండి వాళ్ళ మహాభారతం మొదలైన 25సినిమాలలో నటించి గొప్ప కీర్తి సాధించారు ..ఇక్కడే ఆమెకు సిగరెట్ తగాటం అలవాటై షాట్ షాట్ కు మధ్య పక్కకు వెళ్లి గుప్పు గుప్పున ఆదరాబాదరా సిగరెట్ తాగి వచ్చి నటించేవారు . .సిగరెట్ తనకు కొత్త ఉత్సాహం ఇస్తుందని చెప్పేవారు . .
1939లో విడుదలైన భక్త జయ దేవ సినిమా లో మళ్ళీ తెలుగు చిత్రాలో నటించటం మొదలుపెట్టారు.విశాఖ ఆంధ్రా సినీ టోన్ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగు ,బెంగాలీ భాషలలో నిర్మించింది.రెండు భాషలలోనూ కమలాబాయే హీరోయిన్ .శ్రీ రెంట చింతల సత్యనారాయణ హీరో .అంత౦త మాత్రం సినీ సాంకేతిక పరిజ్ఞానం ఉన్న బెంగాలీ హీరెన్ బోస్ దర్శకుడు .చిత్ర నిర్మాణం సరిగ్గా సాగక ,భారీ నష్టాలకు గురయ్యే పరిస్థితులు గమనించిన కమలాబాయి దర్శకత్వం తో పాటు ఎడిటింగ్ కూడా చేసి తన సర్వజ్ఞత్వ ప్రతిభ ప్రదర్శించి అందర్నీ ఆశ్చర్యం లో ముంచెత్తింది .టైటిల్స్ లో మాత్రం హీరేన్ బోస్ పేరే ఉంచి ఆయన గౌరవాన్ని కాపాడిన స్థిత ప్రజ్ఞురాలు .1940లో వచ్చిన మరో ద్విభాషా చిత్రం ‘’భక్త తుకారాం ‘’ తెలుగు వెర్షన్ లో నటించారు .ఇప్పటిదాకా కధానాయకి పాత్రలే వేసిన కమలాబాయి ,క్రమంగా కేరక్టర్ పాత్రలను ధరించటం మొదలు పెట్టారు.ఈ చిత్రాలో పత్ని ,మల్లీశ్వరి ,లక్షమ్మ,,పాతాళభైరవి సంక్రాంతి ,అగ్ని పరీక్ష మొదలైనవి ఉన్నాయి . పెహర్ కా జాదూ లో లైలా ,దో దివానే ,బేబరాబ్ జాన్ ,లలో సుమారు 22 సినిమాలలో నటించారు
.తెలుగుతో పాటు తమిళ ,హిందీ సినిమాలలోనూ కమలాబాయి నటించి ఒప్పించారు .మద్రాస్ లో 17-1-1957న జరిగిన భారత చలన చిత్రోత్సవ౦ లో దక్షిణ భారత నటీ నట సమాఖ్య వారు ప్రప్రధమంగా తెలుగు చిత్రాలలో నటించి నందుకు సురభి కమలాబాయి కి ఒక షీల్డ్ సన్మానపత్రం అందించి ఘనం గా సత్కరించారు ఏలూరులో ఆంద్ర నాటక కళాపరిషత్ ,వై ఎం హెచ్ఎ వారు నాటక ,సినీ రంగాలకు ఆమె చేసిన సేవలకు ఘనసన్మానం చేశారు .కమలాబాయి హిందూ స్థానీ సంగీతం తోపాటు హార్మనీ,సారంగీ ,వయోలిన్ మొదలైన వాద్యాలను అమోఘంగా వాయించే నేర్పున్న విదుషీ మణి .సినిమాలద్వారా సంపాదించిన డబ్బు 30 వేల రూపాయలు భవిష్యత్తులో ఉపయోగ పడుతుందని ఒక బాంక్ లో డిపాజిట్ చేస్తే ,అ బాంక్ దివాలా తీయగా ,డబ్బంతా కోల్పోయి జీవిత చరమాంకం లో ఆర్ధికంగా ఇబ్బంది పడ్డారు .వయసు మీద పడి అవకాశాలు తగ్గి పోతూ ఉండటం తో ,ఇంట్లో ఊరికే కూర్చోలేక తన అక్క కూతురు సురభి బాలసరస్వతి తో కలిసి షూటింగ్ లకు వెళ్ళేవారు .
ఏలూరులో స్వగృహం లో తొలి తెలుగు హీరోయిన్ ,గాయని ,సకల కళా సరస్వతి సురభి శ్రీమతి కమలాబాయి 30-3-71న 65వ ఏట మరణించారు .
మల్లీశ్వరి చిత్రంలోఅమ్మలక్కగా ‘’అయినా ఎవరెట్లా పొతే నాకేమి ?’’అనే డైలాగ్ బాగా పండింది .నర్స్ వేషం ,సోది చెప్పే అమ్మి వేషాలలో బాగా మెప్పించారు.అందమైన వెడల్పు ముఖం ,కాణీకాసంత బొట్టు ,ఊరించే కాటుక కళ్ళు,కొప్పు ముడి ,పటుత్వమైన డైలాగ్ డెలివరి కమలాబాయి స్వంతం .నటనకు భాష్యం చెప్పినట్లు ఉండే వారమే .ఆమెలో నట సరస్వతి కనిపించేది .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -23-12-21-ఉయ్యూరు

