మలయాళసాహిత్య మార్గదర్శి –చందు మీనన్ -2(చివరిభాగం )

మలయాళసాహిత్య మార్గదర్శి –చందు మీనన్ -2(చివరిభాగం )

1892లో ప్రభుత్వం తిరునల్వేలి సబ్ జడ్జిగా చందు మీనన్ ని నియమించింది .అప్పుడే ‘’శారద ‘’నవల రాయటం మొదలుపెట్టి ,1893లో పదవిలో స్థిరపడి ,మంగులూర్ కుబదిలీ అయి ,అక్కడ పక్షవాతం రావటం తో సెలవుపెట్టి ,ఆరోగ్యం కుదుటపడ్డాక ఉద్యోగం లో చేరి ,1896లో కాలికట్ కు ట్రాన్స్ ఫర్ అయ్యాడు ఈమధ్యకాలం లో శారద నవల రాయలేకపోయాడు .

మలయాళ సాహిత్యాన్ని ప్రభావితం చేసినవి ఆయన రాసిన ఇందులేఖ ,శారద నవలలు మాత్రమె .కేరళ కాళిదాసు గా ప్రసిద్ధుడైన కేరళవర్మవలీయ కోయిల్ తమ్పురాన్ పద్యరచనకు ప్రభావితుడై ‘’మయూర సందేశం ‘’ను స్వంత ఖర్చులతో ముద్రించి ,ముందుమాట తానె రాసి మిత్రులకు అందజేశాడు .కుంజీ శంకరం నంబియార్ రాసిన ‘’నారీ చరితం ‘’అనే శార్దూల చరితానికి కూడా తానె ఆముఖం రాసి అచ్చు వేయించాడు .పి.కె .పరమేశ్వరన్ నాయర్ రాసిన ‘’ఆధునిక మలయాళ సాహిత్యం ‘’ చదివి ప్రభావితుడై ‘’ప్రాచీనకాలం లో న్యాయ వ్యవస్థ ‘’,సర్.టి.ముత్తుస్వామి అయ్యర్ స్మారకోపన్యాసం అనే రెండు ప్రసంగాలు చేశాడు ఇవి పుస్తకరూపం పొందాయి .

ఇంగ్లాండ్ ప్రధాని ఇ.గ్లాడ్ స్టన్ నుంచి చందు మీనన్ కు ఒక ఉత్తరం వచ్చింది .అందులో ఆయన రాసిన రెండు నవలలు మళయాళ సాహిత్యానికీ ,భారత దేశానికి చందు మీనన్ చేసిన సేవలను విక్టోరియా మహారాణి ప్రశంసించినదనీ పేర్కొని ,1897లో చందుమీనన్ కు ‘’రావు బహదూర్ ‘’బిరుద ప్రదానం చేసింది బ్రిటిష్ ప్రభుత్వం .1898లో మద్రాస్ యూని వర్సిటి ఆయనకు ‘’న్యాయ పట్టాల పరీక్షకుడు ‘’ను చేసింది .విశ్వవిద్యాలయ సభ్యుడిగా కూడా నియమించి గౌరవించింది .

1899సెప్టెంబర్ 7 గురువారం మధ్యాహ్నం కొంచెం ముందుగా కోర్టు నుంచి ఇంటికి వచ్చి కొద్దిగా అల్పాహారం తీసుకొని కుర్చీలో విశ్రాంతి తీసుకొంటుండగా ,ఒకపాత న్యాయవాది మిత్రుడు చూడటానికి వస్తే ,ఇద్దరు న్యాయశాస్త్ర చర్చ చేశారు .మీనన్ కు బాగాలేదనిపించి బెడ్ రూమ్ వైపుకు బయల్దేరి మధ్యలోనే అలసటవచ్చి ,అడుగులు తడబడి పక్కనే ఉన్న కోచ్ మీద కూర్చున్నాడు .అంతే ఒక మహత్తర జీవితం పరిసమాప్తి అయింది .అప్పటికి భార్య ,ఆరుగురు పిల్లలు ఉన్నారు .

ఇందులేఖ నవల రాయటానికి చందు మీనన్ కు భార్య లక్ష్మీ కుట్టి అమ్మ గొప్ప సహకారం అందించిందని అందరూ చెప్పుకొన్నారు .ఈ నవల ఆంగ్లాను వాదకుడు ‘’డూమేర్గ్’’కు మీనన్ రాసిన లేఖలో ‘’నా భార్య ఇంగ్లీష్ నవలల పద్ధతిలో తన మాతృభాష మలయాళం లో రాసిన ఒక నవల చదవాలని ఉంది అని తరచుగా నాతొ చెప్పేది .ఆ కోరిక ఇలా నేరవేర్చాను ‘’అని రాశాడు .

టై లేకుండా కోటు వేసుకొనేవాడు మీనన్ .కోటు గుండీలు పెట్టుకొని దానిపై దట్టీ కట్టుకోనేవాడు .ఇతరుల పాండిత్యాన్ని చాలా తేలికగా అంచనా వేసేవాడు .హాస్యప్రియుడు చమత్కారం మాటలతో సయ్యాట లాడేది .అదే రచనలోనూ ప్రతిఫలించింది .కధాకేళి అంటే చాలా ఇష్టం .కున్జకర్దా నటన బాగా ఇష్టం .అతని ప్రదర్శన చూసి ఆరోజు సావరిన్ ధర ఎంతో తెలుసుకొని దానికి సరిపడా వెండి రూపాయలను అతని చేతుల్లో పోసి తృప్తి చెందేవాడు మీనన్ .

ఇందులేఖ నవల ప్రాముఖ్యత

19వ శతాబ్ది నాయర్ తార్వాడ లేక మరుమక్కత్దాయి ఉమ్మడి కుటుంబాలకద.సాధారణ సంఘటనలతో పాటు విశిష్ట పాత్రలు కూడా ఇందులేఖ నవలలో చిత్రించాడు చందుమీనన్ .ఇందులో పంచు మీనన్ పరమ కోపిష్టి ,నిరంకుశుడు .ఇతని వర్నలోనే అతని క్రూరత్వం స్పష్టమౌతుంది .సూరి నంబూద్రి ని హాస్యం వ్యంగ్యంతో చిత్రించాడు .ఇతడిని విదూషకుడుగా ,పంచుమీనన్ ను ముసలి మిణుగురు పురుగుగా చిత్రించాడు .మాధవన్ ,ఇందులేఖలు ఆదర్శ వ్యక్తులు సౌందర్య సామర్ధ్యాలున్నవాడు ,అసాధారణ పండితుడు గొప్ప క్రీడాకారుడు మాధవన్ .బహుశా మన చందు మీనన్ అనిపిస్తాడు .ఇందులేఖ అత్యంత సౌన్దార్యరాషి ఆమె గుణ గణాలను ఆరు పేజీలలో వర్ణించాడు .ఆమె ఆలోచించి పనులు చేస్తుంది కనుక కుటుంబ లో అందరికీ ఆమె ఇష్టం .ఇంగ్లీష్ చదువులో దిట్ట నంబూద్రి ని మొహం మీదే నిరాకరించి మాధవన్ ను పెళ్ళాడింది .నవల చివర్లో రచయిత పురుషులు అనుభవించే అన్ని హక్కులు స్త్రీలకూ కూడా ఉండాలని తెలియజేయటమే ఈనవల రాయటం లో ముఖ్యోద్దేశం అని చెప్పాడు .నవల వాస్తవికతకు సజీవ చిత్రమే .యువతరానికి మాధవన్ ప్రతినిధి .చందుమీనన్ రచయితగా నిరక్షరాస్యతపై పోరు చేశాడు, విజయం సాధించాడు .

బెంగాల్ లో స్త్రీలు చదువుకొంటే విధవ రాళ్ళు అవుతారు అనే మూఢ నమ్మకం ఉండేది .1882లో భారత స్త్రీ జనాభాలో 800మందిలో ఒక్క స్త్రీ మాత్రమె చదువు నేర్చింది అని గణాంకాలు తెలియజేశాయి .ఇందులేఖ నవలలకు వచ్చిన విశేష ప్రాముఖ్యాన్ని బట్టి అది ‘’నవలారాజం ‘’అయింది .

శారద నవలా విశేషాలు

చందు మీనన్ రెండవ నవల శారద కధ రామేశ్వరం లో ఒక హోటల్ గదిలో మొదలౌతుంది .అక్కడ రామన్ మీనన్ అనే చిత్రకారుడు భార్య కల్యాణి అమ్మతో ,కూతురు శారద తో ఉంటాడు .కల్యాణి తార్వాడు అనే ధనిక భూస్వామికి ఆమె ఇష్టం లేకుండా ఆమె పినతండ్రి ఇచ్చి బలవంతపు పెళ్లి ఆముసలాడితో చేస్తాడు .ఆమె భరించలేక వైతి పట్టర్ అనే ఆశ్రితుడితో కృష్ణన్ అనే పిల్లవాడి సాయంతో ఇల్లువదిలి కాశీ చేరి ,కొంతకాలం తర్వాత చిత్రకారుడు రామన్ మీనన్ తో పరిచయం కలిగి పెళ్లి చేసుకొన్నది.శారద పుట్టింది .పట్టర్ ఈమెను మోసం చేయాలనుకొంటే కధ మారటం వలన వదిలి మలబార్ వెళ్ళిపోయాడు .చిత్ర లేఖనం తో కొంతసంపాదించి కుటుంబాన్ని పోషిస్తూ కళ్ళకు ఏదో జబ్బు చేసి వృత్తి మానేసి మిగిలిన డబ్బు బాంకు లో వేస్తె అదివాలా తీసింది .తగిలిన రెండు దెబ్బలకు కుంగి తీర్ధయాత్రలు చేస్తూ కుటుంబంతో రామేశ్వరం చేరాడు .కృష్ణన్ మంచి తనాన్ని భార్యకు చెబుతూ ఉండేవాడు మీనన్ .కొంతకాలానికి భార్య కూడా చనిపోయింది .

అనేక నాటక పరిణామాలు జరిగి శారద పెద్ద ఎస్టేట్ కు వారసురలైనా ,అనేకమోసాలు జరిగి తండ్రితో వేరుగా ఉంటోంది .తర్వాత కోర్టుకేసులు విచారణలు .వాదోపవాదాలను అసాధారణ న్యాయ నైపుణ్యం ఉన్న చందుమీనన్ కు మాత్రమె సాధ్యమైన తీరులో సంభ్రమం కలిగిస్తాయి .తర్వాత భాగం రాయలేకపోయాడు .చట్టానికీ న్యాయస్థానానికి సంబంధినది శారద నవలా వృత్తాంతం .

బూజుపట్టిన పాత మార్గాన్ని వదిలి చందుమీనన్ ఆధునిక మలబారును తన నవలలో చిత్రించాడు .పద్యం వదిలి గద్యం రాసి,సజీవ భాష ఉపయోగించాడు .సామాజిక గృహ జీవితమే ఆయన రాశాడు .సమకాలీన జీవిత చరిత్రకారుడై చందుమీనన్ ,మలబారు సాహిత్య ,సాంఘిక ప్రపంచాలలో రాబోయే సంఘటనలకు వేగు చుక్క అయ్యాడు .రాబోయే తరం మరింత తిరుగుబాటుకు స్వేచ్చకు దారి చూపాడు .విద్యకు దూరంగా ఉంచబడిన స్త్రీలపై గొప్ప సానుభూతి చూపాడు .సంస్కర్తగా మారాడు .కాలానికి అనుగుణమైన విద్య మహిళలకు ఇవ్వమని ప్రబోధించాడు .వర్తమానాన్ని అధ్యయనం చేసి బంగారు భవిష్యత్తు ఊహించిన దార్శినికుడు ‘’ఆధునిక మలయాళ నవలాపితామహుడు’’ ,మళయాళ నవలారచనపై కాంతి పుంజం వెదజల్లిన ఉత్తముడు ,దేశీయుల స్వేచ్చ విజ్ఞానం కాంక్షించిన ఉత్తమదేశభక్తుడు చందు మీనన్ .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -7-4-22-ఉయ్యూరు

గబ్బిట దుర్గా ప్రసాద్

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.