మహర్షి దేవేంద్ర నాథ ఠాకూర్-4(చివరిభాగం )
వేదాంత గ్రంథాలను సులభమైన భాషలో రచించి దేవేంద్రుడు అందరికి అందుబాటులోకి తెచ్చాడు .దినపత్రికలో మాసపత్రికలలో బ్రహ్మ ధర్మాల గురించి వ్రాస్తూ జనాలకు అందుబాటులోకి తెచ్చాడు .వేద వేదాంతాలలోని కఠిన మంత్రాలకు సులభ శైలిలో వ్యాఖ్యలు వంగభాషలో రాశాడు .వేదం ఉపనిషత్తులను ఏయే ఛందస్సులతో చదవాలో ఎలా ఉచ్చరించాలో ఆ నిబంధనలన్నీ స్వయంగా నేర్పేవాడు .అందరు నిత్యపూజతో భగవంతుని ఆరాధన చేయాలని చెప్పి తానూ ఆచరించి అందరిచేతా చేయించాడు .బ్రహ్మ విద్యా వ్యాప్తికి అహరహం తపిస్తూ కృషిచేసి ఫలితాలు సాధించాడు .కేశవ చంద్ర సేన్ దేవేంద్రుని ప్రధాన శిష్యుడయ్యాడు .
మహర్షి దేవేంద్రనాథ ఠాకూర్
బ్రహ్మ సమాజాలు అన్ని చోట్లా వెలశాయి .అన్నిటికి ఆదిమ బ్రహ్మ సమాజమే ఆదర్శంగా చేశాడు. పరమజ్ఞాని ,మానవ హృదయవేది ,విశ్వ ప్రకృతి తెలిసిన దేవేంద్రుడు అందరి మనసులను గెలిచాడు .అందరూ ఆయనను గురుతుల్యునిగా భావించి గౌరవించారు .మహర్షి అని గౌరవంగా సంబోధించేవారు అన్ని సంఘాలచేత ధర్మప్రచారం పెద్ద ఎత్తున నిర్వహింప జేశాడు .వేదాధికారం అందరికీ వర్తింప జేశాడు .దీనికి సనాతన హిందువులు అడ్డు పడ్డారు .ఇంట్లోనే కాదు తీర్ధ యాత్రా స్థలాల లోనూ సంసారం చేస్తూ సాధన చేశాడు .బాల్యం నుండి ప్రకృతి ఆరాధకుడు .వివిధ ప్రదేశాలలో ప్రకృతి సౌ౦దర్యాలలో లీనమై తన సాధన కొనసాగించాడు .
శాంతి నికేతన్
దేవేంద్రుని శిష్యులలో శ్రేష్టుడైన కేశవచంద్రుడు మహాపండితుడు జ్ఞాని మహావక్త .అతనిని ఆది బ్రహ్మ సమాజానికి ఆచార్యుని చేసి వానప్రస్థ ఆశ్రమం స్వీకరించాడు .ఇదే శాంతినికేత ఆశ్రమం లేక శాంతి నికేతన్ ..ఇక్కడ ప్రశాంత జీవితం గడుపుతూ ‘’ధర్మ పిత ‘’గా భాసి౦చాడు .ఏడాదికొక సారి బ్రహ్మ సమ్మేళన సభ జరిపేవాడు. 1874నవంబర్ లో ‘’సమదర్శి ‘’మాస పత్రిక ఏర్పరచి నిర్వహించాడు .అవసరమున్న వారికి లెక్కలేనన్ని దాన ధర్మాలు చేసి వదాన్యుడని పించుకొన్నాడు .శాంతి నికేతన్ ను ఆర్యరుషి సంప్రదాయ బద్ధంగా నిర్వహించాడు .సర్వ శాస్త్రాలు ఇక్కడ బోధించాడు .చక్కని భవనాలు నిర్మించాడు .ప్రకృతి శోభతో శాంతినికేతన్ అందర్నీ ఆకర్షించేది .
దేవేంద్రుని పెద్దకుమారుడు ద్విజేంద్రనాథుడు తండ్రి ధర్మకార్యాలన్నీ నిర్వహించేవాడు .రెండవ ఆయన విశ్వకవి రవీంద్రుడు సరస్వతి పుత్రుడై ఆసియా కవి సార్వభౌముడైనాడు .మహర్షి దేవేంద్రనాథ ఠాకూర్ 87వ ఏట 19-1-1905న బ్రహ్మ ప్రాప్తి పొందాడు .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -17-9-22-ఉయ్యూరు