మహామహోపాధ్యాయ – బూదాటి వేంకటేశ్వర్లు

మహామహోపాధ్యాయ – బూదాటి వేంకటేశ్వర్లు

September 11, 2013

‘కవయామి వయామి యామి’ అని తన వద్దకు వచ్చి చెప్పేదాకా ఆ కువిందుడు కవిత చెప్పగలడని భోజరాజుకు తెలియదు. అలాగే తల్లిలేని, పూటగడవని నిరుపేద తెలంగాణ పల్లె నుంచి వచ్చిన విద్యార్థి భారత దేశం గర్వించే మహామహోపాధ్యాయుడవుతాడని, అన్నంపెట్టి చదువు చెప్పిన ఆ విద్యా సంస్థకూ తెలియదు. వట్టిమట్టిబడిలో ఓనమాలు దిద్దబెట్టిన ఆ గురువుకు తెలియదు, అపశబ్దమాలిన్యం సోకని ఒక నిఘంటుకర్త, వ్యాకరణ వ్యాఖ్యాత అతనిలో ఉన్నాడని. తాను పుట్టిన నల్లగొండకూ తెలియదు, ఏడుకొండలవాడిని ముప్పైరెండు వేల కీర్తనలతో కీర్తించిన అన్నమయ్య పదాలకు పదకోశం తయారు చేసే నిఘంటు నిర్మాణ కర్త దాగి ఉన్నాడని. ‘నీ యవ్వా’ అంటూ నీల్గే తన తల్లి బాసకూ తెలియదు, తన మాండలికాన్ని వ్యాకరించే వ్యాకర్త ఆ పసివాడవుతాడని. ఇన్ని ఉషస్సుల్ని ముడివేసుకున్న మహోదయమే ఆచార్య రవ్వా శ్రీహరి.

నల్గొండ జిల్లాలోని ఒక చిన్న కుగ్రామంలో చేనేత కార్మిక కుటుంబంలో జన్మించిన శ్రీహరి గారు చిన్నతనంలోనే తల్లిని కోల్పోయారు. ఒక తమ్ముడు, ఒక చెల్లెలు గల బాల శ్రీహరే ఆ ఇంటికి పెద్ద. యాదగిరి లక్ష్మీనృసింహ సంస్కృత విద్యాపీఠంలో ఉచిత భోజన సౌకర్యంతో ఫీజులు లేకుండా సంస్కృత చదువు చెబుతారని తెలిసి, కేవలం చదువు మీద మోజుతో పరుగెత్తుకు వెళ్ళాడు బాల శ్రీహరి. సంస్కృతమంటే ఏమిటో, దానివల్ల వచ్చే లాభమేమిటో తెలియనప్పటికీ కేవలం ఉచిత విద్య, ఉచిత భోజనం అన్న ఆ రెండు పదాలే శ్రీహరిని సంస్కృతం వైపు నెట్టి వేశాయి. తనలాగే చదువుకొనే శక్తిలేని నిరుపేద సహపాఠులు నలుగురితో కలిసి యాదగిరి వెళ్ళిన శ్రీహరి బృందాన్ని కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి పరీక్షించి అర్హుల జాబితాను హైదరాబాదు నుంచి పంపిస్తానని చెప్పి వెళ్ళారు. ఐదారు రోజుల తరువాత పంపిన జాబితాలో ఆ ఐదుగురి పేర్లూ లేవు. దాంతో నిరుత్సాహపడకుండా శ్రీహరి, అతని మిత్రుడు రామరాజు వెళ్ళి విద్యాపీఠం కమిటీ సభ్యులైన సురవరం ప్రతాపరెడ్డిని, ఎం. నరసింగరావుని కలవటంతో సీటు లభించింది. అయితే లక్ష్మణ శాస్త్రి మాత్రం ఒక షరతు పెట్టి విద్యాపీఠంలో చేర్చుకున్నారు. అదేమంటే మూడునెలల తర్వాత పరీక్ష పెట్టి అందులో ఉత్తీర్ణులైతేనే తీసుకుంటామని. అయితే చివరికి ఆ పరీక్షలో శ్రీహరి మాత్రమే నెగ్గారు. తొలుత అంగీకరించని కప్పగంతులవారు పరీక్ష పాసైన శ్రీహరిని కౌగిలించుకొని ఆనందంతో గంతులేశారు.

అప్పటి విద్యాపీఠంలో సంస్కృతమంటే కేవలం బ్రాహ్మణులకు మాత్రమే పరిమితమైన చదువు. ఆ వేషభాషలూ, వాతావరణం తొలుత కొత్తగానే అనిపించినా క్రమంగా శ్రీహరి ఆ వాతావరణంలో ఒదిగిపోయారు. ఎంట్రన్స్ తర్వాత హైదరాబాద్‌లోని సీతారాంబాగ్‌లోని సంస్కృత కళాశాలలో డి.ఓ.ఎల్, బి.ఓ.ఎల్. వ్యాకరణం చదివారు. శ్రీశఠకోప రామానుజాచార్యులు, శ్రీఖండవల్లి నరసింహశాస్త్రి, అమరవాది కృష్ణమాచార్యుల వద్ద మహాభాస్యాంతం వ్యాకరణం చదువుకున్నారు. బి.ఓ.ఎల్. వ్యాకరణంలో పాసైన వెంటనే వివేకవర్ధిని కళాశాలలో తెలుగు పండితులుగా చేశారు. క్రమంగా బి.ఏ., తెలుగు పండిత శిక్షణ చేశాక, ఎం.ఏ. తెలుగు, సంస్కృతం చేసి, ఆంధ్ర సారస్వత పరిషత్తులో లెక్చరర్‌గా 1967లో చేశారు. సారస్వత పరిషత్తు విద్యార్థులకు సంస్కృతం, తెలుగూ రెండూ బోధించారు. ఉస్మానియా తెలుగుశాఖలో 1973లో ఉద్యోగంలో చేరడంతో ఆచార్య బి. రామరాజు సలహాతో తెలుగులో ‘భాస్కర రామాయణం’ మీద పరిశోధన చేసి పీహెచ్‌డీ పట్టా పుచ్చుకొన్నారు. ఇలా ఉద్యోగరీత్యా క్రమంగా తెలుగు సాహిత్యం వైపు వెళ్ళటం జరిగింది. సాధారణంగా ప్రాచీన గ్రంథాలకు పాఠబేధాలు ఎక్కువగా కనిపిస్తాయి.

చాలా గ్రంథాలకు సంశోధిత ముద్రణలు రాలేదు. అయితే భాస్కర రామాయణం విషయంలో ఏవో పదాలు, పాదాలు మాత్రమే కాకుండా పద్యాలకు పద్యాలే పాఠబేధాలతో కనిపిస్తున్నాయి. ఇక ప్రక్షిప్తాలు సరేసరి. అటువంటి సందర్భంలో అన్ని ప్రాచ్య పరిశోధనా సంస్థలకు తిరిగి భాస్కర రామాయణానికి సంబంధించి శ్రీహరి చేసిన పరిశోధన కృషి ఆ తరం విద్వాంసుల్ని ఎంతగానో మెప్పించింది.

సూర్యరాయాంధ్ర నిఘంటువు శేషమైన శ్రీహరి నిఘంటువు శ్రీహరి కృషికి నిలువెత్తు సాక్ష్యం. శ్రీహరి నిఘంటువు ఒక వ్యక్తి చేయగలిగిన కృషి కాదు. దీనికి తెలుగు విశ్వవిద్యాలయం వారి పురస్కారం లభించింది. అలాగే తెలంగాణలోని న ల్లగొండ జిల్లా మాండలికంపై శ్రీహరి నిర్మించిన నిఘంటువు విశిష్టమైనది. అలబ్ధకావ్యముక్తావళితోపాటు, తెలంగాణ మాండలికానికి సంబంధించి ప్రాచీన కావ్యాల్లో కనిపించే ప్రయోగాలను ఎత్తి చూపి తెలంగాణ మాండలిక ప్రత్యేకతను తెలియజెప్పారు. ‘సంకేత పదకోశం’, ‘వ్యాకరణ పదకోశం’, ‘సంస్కృత న్యాయదీపిక’ వంటి రచనలన్నీ ఒక ఎత్తు, అన్నమయ్య నిఘంటువు మరొక ఎత్తు. సాధారణంగా నిఘంటువులు అందరూ ఉపయోగించే, ప్రయోగించే పదాలకు అర్థాలనిస్తాయి. అన్నమయ్య పదకోశం మాత్రం అన్నమయ్య సంకీర్తనల్లో ఉపయోగించిన పదాలకు అర్థ నిర్ణయం చేస్తుంది. అన్నమయ్య సంకీర్తనల్లోని చాలా పదాలకు అర్థాలు తెలియవు. వాటికి నిఘంటువుల్లోనూ అర్థాలు లభించవు.

కాబట్టి శ్రీహరి సమకూర్చిన అన్నమయ్య పదకోశం ఆ వెలితిని పూరిస్తుంది. అన్నమయ్య పదకోశం కోసం అన్నమయ్య పదకవితా సంకలనాలు ఇరవై తొమ్మిదింటిని ఎన్నోసార్లు చీల్చి చెండాడాడు. ఆ క్రమంలో అన్నమయ్య ఉపమలు, అన్నమయ్య భాషా సంపద, అన్నమయ్యకు గల అచ్చ తెలుగు ప్రేమ, అన్నమయ్య నవ్వులు వంటి ఎన్నో అపురూపమైన విశేషాలను తెలుగు ప్రపంచానికి చాటి చెప్పారు. సాధారణంగా తిక్కన పేర్కొన్నన్ని నవ్వులు ఎవ్వరూ పేర్కొనలేదని చాలాకాలం సాహిత్యలోకం అనుకుంది. కానీ, అన్నమయ్య పేర్కొన్న 200 పై చిలుకు నవ్వుల్ని శ్రీహరి సాహిత్యలోకానికి చెప్పి అబ్బురపరిచారు. కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పదిహేడు సంవత్సరాలు బోధన, పరిశోధనల్ని నిర్వహించిన శ్రీహరి ద్రావిడ విశ్వవిద్యాలయానికి 2002లో ఉపాధ్యక్షులుగా నియమితులయ్యారు. ఆ విశ్వవిద్యాలయానికి ద్వితీయ ఉపాధ్యక్షులుగా నియమించబడినప్పటికీ అద్వితీయమైన ఖ్యాతిని ఆ ఉన్నత విద్యా సంస్థకు సంపాదించి పెట్టారు. సాధారణంగా పరిపాలనా రంగంలో ఉన్నవారికి విద్యావ్యాసంగాలు కొనసాగవు. కానీ శ్రీహరి సవ్యసాచిలా ఆ రెండు పనులు చేసి మేటి అనిపించుకున్నారు.

ఆ విశ్వవిద్యాలయానికి రూపురేఖలు కల్పించి తెలుగు, తమిళం, కన్నడం, ఇంగ్లీషు శాఖలను ప్రభుత్వం నుంచి మంజూరు చేయించి, భాషా విశ్వవిద్యాలయమన్న మాటకు నిజమైన అర్థాన్ని కల్పించారు.
2011లో తి.తి.దే. కార్యనిర్వహణాధికారి ఐ.వి.ఆర్. కృష్ణారావు ఆహ్వానం మేరకు దేవస్థానం ప్రచురణల విభాగం ప్రధాన సంపాదకునిగా వివిధ పుస్తకాలను ప్రచురించే కృషిని నిర్వహిస్తున్నారు. కవిత్రయ మహాభారతాన్ని మళ్ళీ సవరణలతో పునర్ముద్రణ చేయడం, ఆంధ్ర మహాభాగవతాన్ని, మహాభారతంలా పండితులచే వ్యాఖ్యానింపజేసి అందించే ప్రయత్నంలో ఉన్నారు. తిరుపతిలోని కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం వారు మహామహోపాధ్యాయ బిరుదాన్ని ఇచ్చి శ్రీహరిని సత్కరించడం ఆ బిరుదాన్ని సార్థకం చేస్తుంది. ఇటువంటి పరిశోధన ప్రేమికుడిని, విద్యకు మాత్రమే పరిమితమైన చింతన చేతన గల విద్యావేత్త నుంచి ఈ తరం స్ఫూర్తి పొందవలసిన అవసరం ఎంతైనా ఉంది.
– బూదాటి వేంకటేశ్వర్లు
ద్రావిడ విశ్వవిద్యాలయంలో తెలుగు ఆచార్యులు
(సెప్టెంబర్ 12న ఆచార్య రవ్వా శ్రీహరి 70వ జన్మదినోత్సవం)

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సేకరణలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.