ఊసుల్లో ఉయ్యూరు –30 ఆనాటి మాటా మంతీ

 ఊసుల్లో ఉయ్యూరు –30

               ఆనాటి మాటా మంతీ

       మేము హిందూపురం లో ఉండగా ఒక పాట చరణం ఎప్పుడు పాడే వాళ్ళం .దాని అర్ధం మాకు తెలీదు .హిందూ పురానికి దగ్గర లో పెనుగొండ ,మడక శిర ఉండేవి .ఆ మూడిటి మీదే ఆచరణం ‘’మడక శిరా  ,పెనూగొండ హిందూ పురములో ‘’అనేదే నాకు గుర్తున్నది . ఎందుకు పాడే  వాళ్ళోకూడా తెలీదు .ఉయ్యూరు వచ్చి న తరువాత ఉయ్యురుకు దగ్గర ఉన్న గ్రామాల మీద ఒక పాటపాడే వాళ్ళం .అదీ ఎందుకో తెలీదు ‘’తాడంకి ,మంటాడ తగలడ్డ గురజాడ ,చెప్పుదెబ్బల మారి సాయిపురము ‘’అంతే .ఇంకా ఉయ్యూరు చుట్టూ పక్క గ్రామాల మీద చాలా విషయాలు మా మాటల్లో సరదాకి, విషయానికి, వివరణ కు దొర్లేవి .ఉయ్యూరు కు దగ్గర్లో గరిక పర్రు ఉంది.మా ఇంట్లో ఎవరి కైనా ఏదైనా కనపడక పోతే ‘’గరిక పర్రు వెళ్లి సోది అడుగు ‘’అనటం అలవాటు .మేమే కాదు చాలా మంది అలా అనే వారు .ఆ ఊళ్ళో సోది చెప్పే వారెవరైనా ఉన్నారేమో ?లేక పొతే రాదా మాట .అక్కడ ఒక విశ్వ బ్రాహ్మిన్ ఉండే వాడు .నల్లగా లావుగా తెల్ల పంచె తెల్ల చొక్కా తో నుదిటి మీద రూపాయి కాసంత యెర్రని కుంకుమ బొట్టు తో .ఆయన దగ్గరకు ప్రశ్న అడగ టానికి వెళ్ళే వాళ్ళు .నా స్నేహితుడు పెద్ది భోట్ల ఆది నారాయణకు గురువు .శలవుల్లో ఇతను అక్కడికి వెళ్లి గురు సేవ చేసే వాడు .అలాగే తొట్ల వల్లూరు లో ఒక కమ్మాయన ప్రశ్న బాగా చెప్పే వారని ప్రతీతి .మా గేదెలు తప్పించుకు పోయినా ,ఇంట్లో ఏదైనా విలువైన వస్తువు పోయినా ఆయన్ని ప్రశ్న అడిగించే వాళ్ళం .దీనికీ మాకు ఆది నారాయనే శరణ్యం .ఆయన చెబితే ఖచ్చితం గా జరిగేది .సందేహం లేదు .కనుక ఏదైనా ఇంట్లో కనిపించక పోయినా ‘’వల్లూరు వెళ్లి ప్రశ్న అడుగు ‘’అనటం ఒక అల వాటు అయింది .ఎవరైనా తిక్క తిక్క గా మాట్లాడితే ‘’కుమ్మ మూరు వెళ్ళిరా .ఎందుకైనా మంచిది ‘’అనే వాళ్ళం .ఆవూల్లో పిచ్చ వాళ్ళు ఉండే వారని విన్నాం .అలాగే పిచ్చి నయం చేసే వాళ్ళు కూడా ఉన్నారేమో తెలీదు .

            పాలు ఇవ్వని గొడ్లు ఉంటె ,లేక పని చేయని ఎడ్లు ఉంటె పాలేళ్ళ కు ఒక ఊత పదం ఎప్పుడూ నోటికి వచ్చేది ‘’నిన్ను కంకి పాడు సంతకు తోలా ‘’అని వాటిని తిట్టే వారు .ఉయ్యురుకు పది కిలో మీటర్ల దూరం లో కంకిపాడు లో వారానికి ఒకసారి సోమ వారం పశువుల సంత జరిగేది అందుకని అది వాడుకయింది .ఒక వేళ మరీ పనికి రాని గొడ్డు అయితే ‘’నువ్వు కంకిపాడుకు కూడా పనికి రావు గుడ్ల వల్లేరు సంతే నీకు గతి ‘’అనే వారు .అక్కడ కోతకు గొడ్లనుబాగా కొనే వారు .గుడివాడ దగ్గర  ఉందిగుడ్ల వల్లేరు .పెద్ద సంత .

    మా దగ్గర లో సాయి పురం లో బ్రాహ్మణులు  మంచి వ్యవసాయం చేసే వాళ్ళు .కండ పుష్టి ,తిండి పుష్టి ఉన్న వాళ్ళు .అందుకని ఇళ్ళల్లో పిల్లలు కొంచెం ఎక్కువ గా ఆ పూట తింటే ‘’ఎరోయ్ !సాయి పురం వ్యవ హారం లా ఉందే ?’’అని ఆట పట్టించే వారు .మాలో మేమే అలా అనుకొనే వాళ్ళం . మా ఊళ్ళో పోలీసు స్టేషన్ వెనకాల ఒక ఆవిడ వ్యభిచారం చేసేదని అనుకొనే వారు .అందుకని ఎవరైనా డీలా పడ్డ మొహం తో మొహం వేలాడ దీసు కొని  ఉంటె ‘’ఏరా రాత్రి పోలీస్ స్టేషన్ వెనక్కి వేల్లోచ్చావా ‘’/అని గేలి చేసే వారు .ఇది పెద్ద అయితే కాని మాకు అర్ధం అవ్వలేదు .అలాగే కనక వల్లి అతను ఒక కుర్రాడు తెల్లటి గ్లాస్కో పంచె లుంగీ ,తెల్ల చొక్కా గుండీలు లేకుండా  కాటూరు రోడ్డు లో పాకలు వేసి వ్యభి చారం చేసే వాళ్ళను తెచ్చి వ్యాపారం చేసే వాడు అని చెప్పు కొనే వారు .కుర్ర కారు ఎవరైనా ఏమీ తోచటం లేదు అని అంటే ‘’హాయిగా కాటూరు రోడ్డు కు వెళ్ళు ‘’అని ఉచిత సలహా ఇచ్చేవారు. ఇదీ ఆ తర్వాతా ఎప్పుడో కాని మా బల్బు వెలగ లేదు .ఆ కుర్రాడు ఉన్నదంతా వాళ్లకు అర్పణం చేసి నెట్టి మీద గుడ్డ వేసుకోన్నాడని చెప్పు కొనే వారు .

          మా ఇంట్లో కూరలోనో ,పులుసు లోనో ఉప్పు ఎక్కు వైతే మా నాన్న ‘’ఇవాళ కూర బందరు వెళ్లి నట్లుందే ‘’అనే వారు .అంటే బందర్లో సంద్రం ఉందని ,అందులో ఉప్పు ఎక్కువని అంత  ఉప్పు ఇందులో చేరిందని అర్ధం .కారం ఎక్కువైతే ‘’గుంటూరు సీమ వాళ్లెవరు ఇవాళ మనింటికి రాలేదే ‘’అనే వారు .గుంటూరు కారానికి ప్రసిద్ధి అని అందరికి తెలుసు కదా . మా రెండో అక్కయ్య అత్తగారి ఊరు తేలప్రోలు దగ్గర చిరివాడ అగ్రహారం .అత్తగారి పేరు కాంతమ్మ గారు .చిట్టెమ్మ గారు అనీ అనే వాళ్ళం .ఆవిడ బాగా వంట చేసేది కాఫీ బాగా కాచేది ఫిల్టర్ కాఫీ మాద్రాస్ లో  ఇచ్చినట్లు ఇత్తడి గ్లాసు ,వెడల్పు కప్పు లో కాఫీ ఇచ్చేది .ఆవిడ చారు ,పులుసు పెడితే పంచదార ,బెల్లం బాగా ఎక్కువ వేసేది .అది వేలూరి వారికి అల వాటు .మా ఇంట్లో మా అమ్మ లేక మామ్మ  చేసిన చారు పులుసు లో కొంచెం బెల్లం ఎక్కు వినా ‘’ఇవాళ చారు చిరివాడ వెళ్ళింది ‘’అని సోడ్డు వేసే వాడు నాన్న .

            చిన్న ప్పుడు అందరం గోచీలు పెట్టు కొనే స్నానం చేసే వాళ్ళం .యువకులు లంగోటి కట్టు కొనే వారు .కుర్రాడు ఎవరైనా కొంచెం పొగరు మోతు గా కని పిస్తే ‘’లంగోటి కట్టే వయస్సు కదా ఆ మాత్రం హడా విడి చేస్తాడు లే ‘’అనే వాళ్ళు పెద్ద వాళ్ళు ముసి ముసి నవ్వులతో .పైలా పచ్చీస్ గా ఉంటె పూల రంగడని.మరీ ఫాషన్ గా ఉంటె దసరా  బుల్లోడుఅనటం మామూలే .మా చిన్న తనం లో స్తుడ్ బెకర్ అనే మోటారు కార్లున్దేవి .చాలా వెడల్పుగా పొడుగ్గా ఉండేవి .ఎవరైనా కొంచెం లావు గా ఉంటె వాణ్ని స్తుడ్ బెకర్ అని గేలి చేసే వాళ్ళం .మరీ సన్న గా ఉంటె పూచిక పుల్ల అనేవాళ్ళం .

             పెసర పచ్చడి  తింటే బాగా విరేచనం అవుతుంది .అందుకని దాన్ని ‘’సందడి పచ్చడి ‘’అనే వాళ్ళం .ఎవరైనా పొడుగ్గా  ఉంటె ములక్కాడ పర్సనాలిటి అనీ గడ కర్ర అనీ ,వాసం బొంగు అనీ ఆటం ఆనాడు సాధారణం .కొంచెం లావుగా ఉంటె ‘ పిప్పళ్ళబస్తా ‘’అనే వారు .ఎవరైనా జనం తో కలవక పొతే ‘’ఒంటికాయి సొంటి కొమ్ము ‘’అనడం మామూలు .ఆ రోజుల్లో లెట్రిన్ సౌకర్యం లేదు .అందుకని మరుగు ఎక్కడ ఉంటె అక్కడ కాల కృత్యాలు తీర్చుకొనే వాళ్ళు .మా ఇంటి వెనుక ఖాళీ ప్రదేశాన్ని ‘’చామలి ‘’అనే వారు .దాన్నిండా ఈత పొదలు తాడి పొదలు ముళ్ళ పొదలు వుండేవి. అక్కడికే అందరు బహిర్భూమికి వెళ్ళే వాళ్ళు .దాన్ని చెంబట్టుకు వెళ్లటం ,బైలికి వెళ్లటం అనే వారు .కొంచెం ఇంగ్లీష ఫాశాన్లు అలవాటైన తరువాత ‘’లండన్  కు వెళ్లాడు ‘’అనటం ఫాషన్ అయి పోయింది . అలాగే ఆ మూడు రోజుల్ని ‘’ఫ్రెంచ్ లీవు ‘’అనటం . పని ఎగ గొడితే కూడా ఇలానే పిల్చే వారు .

       +మా ఊళ్ళో సన్నాయి బాండ్ మేళాలు మంచివే ఉన్నాయి .అందులో బాగా వాయించే వాళ్ళు వాయించని వారూ ఉండేవారు .బాగా వాయించే వారిని ‘’వీరాస్వామి మేళం ‘’అని చెప్పు కొనే వారు .బాగా లేక పోతే ‘’జగన్నాధం డప్పు ‘’అని ఈస డించె వారు .అతను డోలు వాయిస్తే ‘’తుప్పు తుప్పు’’ శబ్దమే వచ్చేది .దేవాలయాల్లో దేవుడి ఊరేగింపు కు నూనె దివిటీలు వెలిగించే వారు .అందుకని ఎవరైనా బాగా అభివృద్ధి సాధిస్తే ‘’ఆబ్బో !వాడు దివిటీ గా వెలిగి పోతున్నాడు ‘’అనటం ఉండేది .మార్కులు తక్కువగా బొటాబొటి గా వస్తే ‘’అత్తెసరు మార్కులు ‘’అనే వారు .నాకు ఇంటర్ మొదటి ఏడు లో వచ్చిన మార్కుల్ని చూసి సరిగ్గా మా నాన్న ఇదే మాట అనటం నాకు ఇంకా గుర్తు .దానిమీద నాకు పంతం పెరిగి రెండో సంవత్సరం ట్యూషన్ చదివి ఫస్ట్ క్లాస్ తెచ్చుకోన్నాను .

    కొందరికి కొన్ని ఊత పదాలున్దేవి .చింతా ఆంజనేయులు గారు అనే సెకండరి గ్రేడ్ టీచర్ కు ‘’ఆమడగా ‘’అనే ఊత పదం వెంట వెంటనే వచ్చేది .దాని అర్ధం ఏమిటో ఆయనకు తెలుసేమో కాని మాకు బోధ పడేది కాదు .కొందరు మాస్టర్లకు వాళ్ళ ప్రవర్తన బట్టి పేర్లుండేవి అవి ఎవరు ఎందుకు పెట్టారో తెలీదు .అలా తర తరాలుగా నిలిచి పోయాయి .అత్తరు బుడ్డి ,దసరా బుల్లోడు , అంబర్బీడీ, టర్బన్ , షాన్ డో మొదలైనవి .మా ఆది నారాయణకు ‘’బిత్తర ‘’ఊత పదం .మా నాన్న  వాడు ఏదైనా పని సాధించుకు వస్తే ‘’ఎలా చేశావురా ?’’అని అడిగితే ‘’ఏంలేదు మాస్టారూ వాడికి బిత్తర వేశాను’’ .అనే వాడు .అంటే ఏదో టోకరా చేశాడని అర్ధం .అలానే ‘’అంచాత నే చెప్పేదేమిటంటే ‘’అనేది కూడా  అతను రావు గోపాల రావు కంటే ముందే వాడాడు .’’అసలు చెప్పొచ్చేదేంటంటే ‘’అనేది చాలా మంది వాడే వారు మా ఏం ఎల్ సి కొల్లూరి కోటేశ్వర రావు అయిదు నిమిషాలకో సారి ‘’ఏది ఏమయి నప్పటికి కూడా ;;’’అనే వాడు .నేను నా మిత్రులు నవ్వు కొనే వాళ్ళం .

           సాంప్రదాయ బ్రాహ్మణా కుటుంబాలలో తద్దినాలు తప్పని సరి .దానికి భోక్తలను పిలవటం వుంది తద్దిన బ్రాహ్మ నార్తానికి ఆ రోజుల్లో వైదిక నామం ‘’దర్భ పోటు’’.కనుక ఎక్కడైనా భోక్తకు వెడితే ఇవాళ డి.పి.ఎక్కడా అని అడిగే వారు అంటే దర్భ పోటు అని అర్ధం .అదే మనకు డిన్నర్ పార్టీ అయింది .అదే అశ్లీలార్ధం లో దుప్పి భోజనం గా గేలి చేయటానికి అనే వారు .అంటే భోజ నానికి పిలిచినా వారింట్లో కడు పు నిండా తిండి పెట్ట లేదని భావం .

తాంబూలం వేసుకొని నోరు పండితే ‘’అబ్బో ! నోరు సమర్త ఆడిందే  ‘’అని నవ్వటం బాగా ఉండేది .అలాగే పైలా పచ్చేసు గా ఉందే వాణ్ని ‘’వాడికేం శోభనం పెళ్లి కొడుకు ‘’అనటం రివాజు ఇప్పుడూ ఉంది.మాస్టారు బెత్తం తో కొట్టటం ఆ రోజుల్లో సర్వ సాధారణం .దాన్ని కవిత్వీకరించి ‘’పేకా వారి అమ్మాయి తో పెళ్లి ‘’అనే వారు .అంటే పేక బెత్తం తో వీపు వాయింపు అని అర్ధం .

     మా ఇంటికి కొలచల ఆయన ఒకాయన పెద్ద వయసు వాడు యాభై పై వాడు వీపు మీద పాత మాసిన పంచ లో పనికి రాని కాగితాలు కట్టలు కట్టలుగా వకీళ్ళ దగ్గర గుమాస్తాల కవిలె కట్టల్లా కట్టు కొని వచ్చే వాడు .ఎప్పుడో మా నాన్న శిష్యుడు. ఆయన పేరు జ్ఞాపకం లేదు ‘’కొలచల పిచ్చాడు ‘’అనే వాళ్ళం .ఎప్పుడూ తనలో తాను మాట్లాడు కొనే వాడు .తన దిన క్రుత్యాలన్ని యధా విధిగా  చేసు కొనే వాడు .నెలకో రెండు నెలల కొ  మా ఇంటికి వచ్చే వాడు .మా వీధి వసారా లో మకాం .అరుగు లో సగం ఆయన మూటలు .ఎలా మోసే వాడో వీపు మీద. మా ఇంట్లోనే భోజనం కాఫీ నిద్ర .ఇంకెవ్వరు రానిచ్చే వారు కాదు .ఒక వారమో పది రోజులో ఉండివెళ్లి పోయే వాడు .మా నాన్న అంటే మహా గౌరవం .మా కాలం లోను అలానే వచ్చే వాడు .ఎవరైనా వీపు మీద పనికి రాని వస్తువులు మోసుకేల్తుంటే ‘’ఏమిటా కొలచల పిచ్చాడిమూటలూ నువ్వూ ‘’అనే వారు .

       జుట్టు పొట్టిగా కట్టిరించుకొంటే ‘’పనస కాయ కొట్టుడు ‘’అనే వాళ్ళు .ఎవరికైనా వత్తాసు  పలికితే ‘’చెక్క భజన ‘’అనేవారు .ఇప్పుడూ ఉందీ మాట.పిల్లలు అల్లరి చేస్తుంటే ‘’సంత గోల ‘’అని చేపల మార్కెట్ అని అన టం మామూలే .సంగీతం లో రాగాలు పాడుతూ ఉంటె ‘’జిలేబి చుట్టలు ‘’అనే వాళ్ళు .ఏదైనా ప్రమాదం వస్తే ‘’పుట్టి మునిగింది ‘’అనే వారు .తలకు నూనె రాసుకోమన టానికి తైల సంస్కారం అనే వారు .ఇలా ఎన్నని చెప్పను ?బహుశా ఇవి అందరికి పరిచయం ఆయె ఉంటాయి .ఆ కాలం లో అందరి ఊళ్ళల్లో విన్న మాటలే అయి ఉంటాయి నాకు గుర్తు వచ్చి ఒక సారి ఏకరువు పెట్టాను అంతే .

     మీ –గబ్బిట దుర్గ ప్రసాద్ –26-04-12

 క్యాంపు –అమెరికా


గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in ఊసుల్లో ఉయ్యూరు and tagged . Bookmark the permalink.

1 Response to ఊసుల్లో ఉయ్యూరు –30 ఆనాటి మాటా మంతీ

 1. దుర్గా ప్రసాద్ గారూ!
  ఆనాటి మాటా- మంతీ చాలా ఆసక్తి దాయకంగా ఉంది. మీ బాల్యపు
  జ్ఞాపకాల నెమరువేత మాటేమోగానీ చదువరులందరినీ మీ ఊసులు వారి వారి
  బాల్యాలకు లాక్కెళ్ళి పడెయ్యడం మాత్రం ఖాయం . ‘బయలుకు’ అంటే బహిర్
  ప్రదేశానికి వెళ్ళడమే కాలవశాన ‘బైలికి’ అయింది. అలాగే ‘చెంబు పట్టుకు వెళ్లడం’
  ‘చెంబట్టుకు వెళ్లడం’ , అదే కొన్ని ప్రాంతాల్లో’ చెంబడికి వెళ్లడం’ అయింది.వ్యభిచారం
  మీద బతికే ఆడదాన్ని కుర్రాళ్ళు సరదాగా అది పెద్ద ‘పి.సి.’ అనేవాళ్ళు.పి.సి. అంటే
  ‘ పబ్లిక్ కారియర్’ అని. అంట కత్తెర క్రాపును సమ్మర్ కటింగ్ అనీ డిప్ప కటింగ్ అనీ
  అనేవాళ్ళం.అంబర్ బీడీ అనేది రాజస్థాన్ లోని అంబర్ లో తయారయ్యే జాడీ బీడీ–
  అంటే ఫిల్టర్ బీడీ.శాండో అంటే వస్తాదు . మా చిన్నప్పుడు కూడా బాగా లావుగా
  ఉండేవాళ్ళని ‘కింగ్ కాంగ్’ అనీ ‘ఆడ్డీన్’ అనీ అనేవాళ్ళు. అవీ అప్పటి వస్తాదుల పేర్లే.
  ఎసరు తక్కువ వేస్తే ఉడికిన అన్నం అడుగు అంటుతుంది.అలా హత్తుకోవడం లేక
  అత్తుకోవడం కారణంగా దాన్ని అత్తు ఎసరు అన్నారు.కాలక్రమేణా ఆ పదమే
  ‘అత్తెసరు’ అయింది. ‘కొందరు తెలియక ‘అత్తెసరు ‘ పదాన్ని అత్తకు ముడిపెడుతూ
  ఉంటారు.’అత్తెసరు’ పదాన్ని పరీక్షల్లో వచ్చిన తక్కువ మార్కుల్ని సూచించడానికి
  వాడడం మా తెనాలి ప్రాంతం లోనూ ఉంది. ఎవరి పరిస్థితి అయినా మాంచి జోరుగా
  ఉంటే ‘వాడికేమిట్రా. ఎండెన్ గా ఉన్నాడు’ అనేవాళ్ళం చిన్నప్పుడు. ఆ పదానికి
  అర్థమేమిటో అప్పట్లో తెలియదు.తరువాత తెలిసింది- అది ప్రపంచయుద్ధంలో
  పాల్గొని అద్భుత విజయాలుసాధించిన ఓ యుద్ధనౌక పేరని.తలపాగా చుట్టుకున్న
  వాడిని ‘టర్బన్’ అని ఉంటారేమో! పోతే మీరు రాసిన అగ్రహారం పేరు సిరివాడ అయి
  ఉంటుంది. లేక చిరువాడ కావాలి. చిరివాడ కాదేమో! ఎక్కువమంది దాన్ని
  సిరివాడ అనడమే నేనువిన్నాను.మరి ఏది సబబో!తద్దినపు బ్రాహ్మణార్థాన్ని ‘డి.పి’
  అంటారు. డి.పి. అంటే ధర్మపిండం.తన ఇంట్లో కూడు కుడిచి ఉన్నదానితోనే
  సర్డుకుపోవడాన్ని దుప్పి భోజనం అంటారు — తినడానికి ఏమీ
  దొరకనప్పుడు దుప్పి అదే చేస్తుందని.ఇక ఎక్కడికక్కడ స్థానిక ఊళ్ళ పేర్లతో
  ఏర్పడిన వాడుకపదాలు చాలా అన్ని ప్రాంతాలలోనూ ఉంటాయి.మీ మథుర
  స్మృతుల మథనానికి మీకు మరోమారు ధన్యవాదాలు తెలియజేస్తూ–
  మీ,
  ముత్తేవి రవీంద్రనాథ్,
  డేటన్,న్యూజెర్సీ, యు.యస్.ఏ. నుంచి.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.