కల్ప వృక్షపు స్త్రీలు –2

 కల్ప వృక్షపు స్త్రీలు –2

          దశరధుని ముగ్గురు రాణుల గురించి చెప్తు  ,విశ్వనాధ- వారి రూప వర్ణన చేయడు .లక్షణాలను మాత్రమే చెప్పి ,మనల్నే ఆలోచించు కో మంటాడు .సుమిత్ర ను కౌసల్య తో ఒక సారి ,కైకతో ఒక సారి కలిపి చెప్తాడు .రామ లక్ష్మణులు ఒక జంటగా ,భరత శత్రుఘ్నులు ఒక జంటగా ప్రవర్తిస్తారనే భావి  భావన సూచిస్తాడు .అదీ విశ్వనాదీయం .

‘’కౌసల్యా ముక్తి కంతా సమానాకార ,నలి సుమిత్ర యుపాసనా స్వరూప –విజయ రమా కార వినయామ్బుధి బుద్ధి సుమిత్ర

కైకేయి మధు సామ గాన మూర్తి ,-కౌసల్య నవ శరత్కాల మందాకినీ –సిత పుండరీకంబు  శ్రీ సుమిత్ర

మందార పుష్పంబు మహిళా మణిసుమిత్ర –కైకేయి నును నల్ల కల్వ పువ్వు ‘’

కౌసల్య రాముని తల్లి .ముక్తి కాంతా సమాన మైన ఆకారం కలది .లక్ష్మణుడు ఉపాసనా స్వరూపుడు .శత్రుఘ్నుడు విజయానికీ ,వినయానికీ ప్రతీక .భరతుడు పరమ భాగవత శ్రేష్టుడు .అందుకని కైక ను ‘’సామ గాన మూర్తి’’ అన్నాడు విశ్వనాధ .శరత్కాల మందాకినీ కౌసల్య .-అంటే స్వచ్చమైనది .,శాంత మైనది .ఆమె తో  ఉన్న సుమిత్ర సిత పుండరీకం .అంటే తెల్ల తామర .మరి కైకేయి ?నల్ల కలువ పువ్వు .రాజులకు అత్యంత ప్రీతీ పాత్ర మైంది .ఉద్రేకి అని నిగూఢ భావం .ఆమె తో ఉన్న సుమిత్ర మాత్రం యెర్ర మందారం .గుణాలకు ప్రతీక లుగా వీరిని తన అసమాన పతిభతో తీర్చి దిద్దాడు కవి సమ్రాట్ .

            రాముని చాప విద్యా గురువు కైక .అస్త్ర విద్యా గురువు విశ్వా మిత్రుడు .సీతా రాముల కళ్యాణం తో విశ్వామిత్రుడు తన పని ముగించు కొని వెళ్లి పోతాడు .కాని శ్రీ రాముడు అడవికి వేడితేనె, కాని, అసలు రామాయణం మొదలు కాదు కదా .ఆ పనికి ప్రేర ణ కైక . .ఆమె కూడా శ్రీ రాముని ప్రేరణ తోనే చేసింది . ‘’ .రాముని ఉపనయన సమయం లో కైక ‘’వజ్ర పుంఖిత వాలు టమ్ము ‘’ భిక్ష గా పెట్టింది .ఇది ఒక వింత భిక్ష .వెంటనే రాముడు ఉప్పొంగి పోయాడు .తనకు తగిన భిక్ష అని ఆనంద పారవశ్యం చెందాడు .రాముడి భవిష్యత్తు ‘’దైత్య సంహార గాదా పాండిత్య సముద్ర మూర్తి ‘’కాగలదు అనీ కైక భావన ,ఆశ .’’మొగమున నింత యై ,మురిసి పోయెను రాముడు ,కైక కన్నులన్దిగము మరింత ఇంత యయి ,,ఏళ్లులు  వారే ,–తద న్తరస్థగిత  రఘూద్వాహ ప్రవిల సచ్చిశు  మూర్తి మరింత ఇంతయై ,జగములు పట్ట రాని యొక సాహస దీర్ఘ తనుత్వమొ ప్పగన్ ‘’’

            అహల్య విషయం లో కవి చాలా లోక మర్యాదను పాటించి ధర్మోప దేశం చేశాడు .స్త్రీ ,పురుషులు సంగమం లేకుండా ఎక్కువ కాలం ఉండలేరనేది లోక విదిత మైన విషయమే .ఉంటె వాంఛ  పెరుగుతుంది .తీరే మార్గం లేక పోతే తప్పటడుగులే .పతనం ప్రారంభమే .ధర్మ చ్యుతి జరిగి పోతుంది .అందుకే అహల్యను ‘’మంజూషికా రత్నం ‘’ అని ఎవ్వరూఅనని మాట ను అన్నాడు విశ్వనాధ .రత్నం పెట్టె లోనే ఉంది .వాడకం లేదు .గౌతమ మహర్షి వెయ్యి సంవత్స రాల దీర్ఘ తపస్సు లో మునిగాడు .భార్య యవ్వనాన్ని ,సౌందర్యాన్ని గురించిన చింత లేదాయనకు .మరి అహల్య లావణ్యం అంతా పోత పోసి సృష్టింప బడిన ‘’జగదేక సుందరి ‘’.సంసార సౌఖ్యం పొందని రుషి భార్య .అందుకే ఆమె లో ‘’లౌల్యం ‘’ప్రవేశించింది..ఆమెను ప్రేమిస్తూ తపిస్తూ , చాలా కాలం నుండి ఇంద్రుడు సమయం కోసం ఎదురు చూస్తున్నాడు .ఆ సందర్భం లో అతని మనస్సు లోని మాట ను కవి ఆవిష్కరిస్తాడు –

‘’ఇది నీకై యది ఎన్ని యేండ్లు దిగులయ్యె  నాకహల్యా ‘’అని ఒకే ఒక్క వాక్యం లో తన కోరిక తెలిపాడు .రహస్యం గా కలవాలి .సమయమా లేదు .త్వర లోనే తన కోర్కె తీరాలనే తపనతో ‘’అతి తక్కువ మాటలతో ‘’ తన మనో భావం వ్యక్తం చేశాడు .పని కావాలి ముందు .మాటలకు సమయం కాదు .అదీ ఇంద్రుడి ఆత్రం .సంక్షిప్తత కు అద్దం  పట్టే సన్నివే శం .

          అహల్య ‘’ఇది ఆదనా!కోడి కూసింధా ?’’అన్నది .  అంటే కోడి కూస్తే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నట్లే .అని భావించి వచ్చేశాడు .ఆమె మాటలు పదే ,పదే  తలచు కొన్నాడు దేవేంద్రుడు .ఆమె సొందర్యాన్ని కళ్ళారా చూడ టానికి రెండు కళ్ళు చాలటం లేదా కామోద్రేకికి .ఆమె శృంగార రసాభిజ్ఞాతకు పరవ శించాడు . బుద్ధి మహా వేగం గా ప్రవహిస్తోంది దేవ రాజు కు ..ఆ ప్రవాహానికి’’ కన్నులు చిదిసి వేయి ముక్క లు ‘’ అయాయట .ఇది గౌతముడు ఇవ్వ బోయే శాపానికి సూచన .అంత సూక్ష్మం గా ఆలోచించి చెప్పగలడు  విశ్వనాధ . ఈ కధ చెప్పటం లో విశ్వనాధ ఆంతర్యం ‘’నీతి చెప్పటానికి ,ధర్మ బోధకు జారత్వం ధన మదాంధుల చెడు లక్షణం అని చాట టా నికే ‘’.అంటాడు ఆయనే .శ్రీ రామ కధా భాష్యం జారత్వం కూడదు అనే సందేశమే అంటాడు ..అహల్య మహా పతివ్రత .కానీ’’ కా మునికీ ,కాలానికీ ‘’లొంగింది ‘’పాపపు పని చేయక పోయినా ,రుషి పత్నిని కామ వాంచ బాధించింది .శాపగ్రస్త అయింది .తపస్సు చేసి పునీతు రాలింది .అందుకే శ్రీ రామునికిస్వయం గా వండి ,వడ్డించి ‘’రామ ,రఘు రామ ,దశరధ రామ ,యో యయోధ్యా రామ ,జానకీ రామ ,యోయి తండ్రీ ,అసుర సంహార రామ ,,పట్టాభి రామ ‘’అని విందుకు ఆహ్వానం గా సంబోధించింది అహల్యా దేవి .ఈ  సంబోధనలన్నీ భవిష్యత్తు లో జరిగే కధా సూచనలే .ఆమె మహా తపస్విని కనుక అలా సంబోధించటం లో ఔచిత్యం ఉందని కవి విశ్వనాధ సమర్ధించు కొన్నాడు .

           అహల్య కు పంచేద్రియ జ్ఞానం కలిగే సన్నీ వేశం లో విశ్వనాధ చెప్పిన పద్యం పంచేద్రియాలతో చేసే మహా భక్తీ పూర్వక ఉపాసనా క్రమం .అద్భుత మైన పద్య మాణిక్యం .ఏ కవికీ ఇలాంటి భావనే రాలేదు .రాయలేదు కూడా .అందుకే అది విశ్వనాదోప జ్నకం .విశ్వనాధైక మార్గం .అహల్య పాదాలకు శ్రీ రాముడు నమస్కరించాడు .ఇదీ విశేషమే .ధర్మ రక్షకుడుకనుక ,తపో మూర్తి కనుక ,ఆమె తపస్విని కనుక రాముడు అలా చేయటం మర్యాదా పూర్వకమే .ఒక తపః పుంజం లో ఒక భాగం ఇంకో భాగాన్ని గౌరవించటం అనే వేదాంత భావన ఇమిడి ఉందని విశ్వనాధ సత్య నారాయణ గారే స్వయం గా చెప్పారు .మిగిలిన విషయాలు మరో సారి –

   సశేషం –

                     మీ –గబ్బిట   దుర్గా ప్రసాద్ —17-5-12 —కాంప్—అమెరికా
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.