తిక్కన భారతం –3 మహా భారతం -మహా విజ్ఞాన సర్వస్వం

  తిక్కన భారతం –3

                                                                                          మహా భారతం -మహా విజ్ఞాన సర్వస్వం

ప్రాచీన భారతీయుల విజ్ఞానాన్ని ,నాగరకత ను తెలియ జేసే గొప్ప గ్రంధమే వ్యాస భారతం .మానవుల భౌతిక ,మానసిక ,ఆధ్యాత్మిక జీవితం అంతా అందు లో ప్రతి బిమ్బించింది .సాధారణం గా ఏ సారస్వత మైనా మానవ జీవితానికి శబ్ద ,వర్ణ చిత్రణే.నాగరకత ,సాంఘిక వ్యవస్థ ,సంస్కృతి ని వ్యక్తం చేసేది సాహిత్యం .లోక ధర్మ వ్రుత్తి కోసం వ్యాసుడు రాయటం ,కద లో ఉదాత్తత ఉండటం ,ఆద్యాత్మిక విషయ ప్రాధాన్యత ,వల్ల మహా భారతం మహా విశిష్టమైంది .అంతరార్ధం గా ఆలోచిస్తే ,సత్యాసత్యాలకు ,ధర్మాదర్మాలకు ,దైవ ,రాక్షస భావాలకు జరిగే సంఘర్షణ మే దీని లోని ఇతి వృత్తం .వేద వాజ్మయం లోను ఈ ద్వంద్వాల సంఘర్షణ ఉన్నా ,భారతం లో అదిప్రధాన ఇతి వ్రుత్తమైంది .పరమేశ్వరుని సర్వ శక్తిమత్వం ,సర్వజ్ఞత్వం ,సంచిత కర్మ పరి పాక ప్రాబల్యం ,భారత కదా ఇతి వృత్తం గా ప్రత్యక్షమైంది .అంతే కాక ,అన్ని వేద శాఖలకు చెందిన వైదిక వాజ్మయ సర్వస్వం భారతం లో ప్రతి పాడించ బడింది .అందుకే భారతం వేద తుల్యమై ,పంచమ వేదమయింది .వేదం శబ్దానికి ప్రాధాన్యం .భారతం అర్ధ ప్రాధాన్యం .లౌకిక మైన భారత కదా ఆధారం గా పరబ్రహ్మ స్వరూపాన్ని ,,విధి ప్రభావం ,లోకులకు తెలియ బఱచి ,సత్య ధర్మాన్ని లోకం లో ప్రతిష్టించటమే భారత కర్త మహాదాశయం .

వేద సారం ప్రతి పాదించటం ,ధర్మం ,నీతి శాస్త్ర విషయాలు సులభం గా వివరించటం వల్ల భారతం స్మృతి గ్రంధం కూడా అయింది .పురాణ లక్షణాలు అన్నీ సమగ్రం గా ఉన్నాయి కనుక పురాణ సముచ్చయం అన్నారు .ఉపనిషత్ సారం ప్రతి పాదింప బడింది కనుక వేదాంత గ్రంధమైంది .ఇక వ్రాసిన వాడో -”వ్యాసో నారాయనో హరిహ్ ”అని పిలువ బడే విష్ణు అంశ సంభూతుడైన కృష్ణ ద్వైపాయన మహర్షి .ఆయనే మహాముని ,విజ్ఞాన వేత్త కావటం వల్ల ఆ రచనకు ఉదాత్తత లభించింది .మహాభారత కదా కాలం నాటికి ఆర్యులు దేశం లో చాలాభాగం విస్తరించారు .ఆర్య ,అనార్య సంమేనలం కూడా జరిగి ,అనేక వ్యవహారాలూ ,కట్టుబాట్లు ఏర్పడ్డాయి .ఐహికం పై ఆసక్తి పెరిగి ,ఆముష్మిక భావం క్రమంగా తగ్గింది .దానితో సంఘం లో న్యాయ ధర్మాలు క్షీణించాయి .అధర్మ పరాయణమే మహా భారత యుద్ధం .తాను భారత యుద్ధాన్ని ప్రత్యక్షం గా చూశాడు కనుక ,వ్యాసుడు ఆ కధను ధర్మ ప్రచారానికి ,సంఘ ఉద్ధరణకు చక్కగా ఉపయోగించు కొన్నాడు .సంఘాన్ని ,వేద మత సూత్రాలకు అనుసంధించాలని భావించాడు .ఆర్య విజ్ఞాన సర్వస్వాన్ని ప్రజల ముందు ఉంచాలని తహ తహ లాడాడు .జనానికి అందు బాటు లేని వేదాంత ధర్మాలనన్నిటిని అందుబాటు లోకి తేవాలని భావించాడు .భారత కదన్యాయం గా

24000శ్లోకాలు మాత్రమె .తన ఆశయం నేర వేర్చటానికి ,ఆధ్యాత్మిక రహస్యాలు అందించ టానికి మూడు రెట్లు పెరిగి లక్ష శ్లోకాలతో విస్తృతమైంది .ఇందులో కొంత ప్రక్షిప్తత కూడా ఉంది .అందుకే బారతాన్ని ”సంహిత ”అన్నారు .

ఆదర్శ ధర్మ వీరుడు అయిన శ్రీ రాముని చరిత్ర ను కావ్య రూపం గా వ్రాయటం ఆదికవి వాల్మీకి ఆశయం .సీతా రాముల చరిత్ర మనకు ఆశయం ,ఆదర్శం .రామాయణ పథనంవల్ల నీతి ,ధర్మం కలిగినా ప్రత్యక్షం గా సాత్విక మానసిక వికాసం ,సద్యః పర నివృత్తి కలుగుతాయి .కనుక రామాయణం కావ్యం అయింది .వ్యాసుని ఆశయం సంఘ సంస్కరణ .కనుక రచన కావ్య రచన కంటే విశిష్ట మైంది .భారతం శాంతి రస ప్రధానం .నాయకుడు శ్రీ కృష్ణుడు .రచన లో రాసోత్కార్శ కంటే అర్ధ గౌరవానికి ప్రాధాన్యత కల్గింది .పాండవ ఇతి వృత్తం ఆధారంగా వ్యాసమహర్షి తన ఆశయాన్ని నేర వెర్చు కొన్నాడు .కనుక భారతం కావ్యమే కాదు -శాస్త్రం కూడా అయింది .ఇతి వృత్తం లౌకికం .దాని ద్వారా ప్రతి పాదించింది ఆధ్యాత్మికం కనుక లోక కల్యాణానికి మార్గమైంది .

”కమనీయ ధర్మార్ధ కామ మోక్షములకు నత్యంత సాధనం బైన దాని ”అన్నాడు తిక్కన .”ఆయుష్యమ్బితి హాస వస్తు సముదాయంబైహికాముష్మిక శ్రేయః ప్రాప్తి నిమిత్త ముత్తమ సభా సేవ్యమ్బు ,లోకాగమ న్యాయైకాంత గృహంబు ,నాబరగి ,నానా వేదాంత విద్యా యుక్తంబగు దాని చెప్ప దోడగెం దద్భారతాఖ్యానమున్ ”

మహాభారత ఆంధ్రీ కారణం కూడా లోక హితం కోసమే ప్రారంభమైంది .రాజరాజ కాలం నాటికి మత కల్లోలం హెచ్చుగా ఉంది .జైన బౌద్ధ మత వ్యాప్తి పెరిగి ,వేద ప్రామాణ్యం తిరస్కరింప బడింది .చార్వాకం పెరిగింది .ఆర్య ధర్మం వెనకడుగు వేసింది .నిరీశ్వరవాదం వైపు ఆకర్షణ వల్ల ఐకమత్యం దెబ్బతింది .సంఘ పటిష్టత కోల్పోయింది .ఆ సమయం లో సంఘాన్ని ఉద్ధరించ టైకి కుమారిలభట్టు కంకణం కట్టుకొన్నాడు .పూర్వ మీమాంస కు ప్రాధాన్యం తెచ్చాడు .దానితో మళ్ళీ యజ్న యాగాదులు ఆదరణ పొందాయి .ఆర్యమతం మళ్ళీ పునరుద్దానమైంది .వర్ణాశ్రమ ధర్మాలకు నిలయమై ,సకల ధర్మాలకు ఆలవాలమై ,మహాభారత సారం అయిన భారతాన్ని ఆంధ్రీకరించి ప్రచారం చేయ వలసినది గా రాజ రాజు నన్నయ భట్టారకుని కోరాడు .కనుక ఇక్కడ కూడా ”లోక సంగ్రహేచ్చ ”కారణం అయింది ..

తిక్కన కాలం లో చార్వాకం వెనుకడుగు వేసినా ,జనం ఇంకా ప్రాబల్యం లో ఉంది .సోమనాధుడు మొదలైన వారి వల్ల వీర శైవం వెర్రి తలలు వేసి ,మత కలహాలకు ఆజ్యం పోసింది .శైవ ,వైష్ణవాల వల్ల కొత్త తేగలేర్పడ్డాయి .మార్గ దర్శకులు కావలసిన కవులలో మత భేదాలేర్పడ్డాయి .శివకవులు భావి కవులను నిరశించే వారు .ఈక్లిష్ట పరిస్థితులలో తిక్కన మహా కవి భారత రచన చేయ సంకల్పించి సంఘ సంస్కరణ చేశాడు .బ్రహ్మా ,విష్ణు ,పరమేశ్వరులు పరబ్రహ్మ అంశాలుగా వాళ్ళు చేసే పని సృష్టి ,స్థితి ,లయాలు సగునాత్మక మైన పరబ్రహ్మ లీలలుగా తెలియ జేశాడు .కనుక పరమాత్మ భిన్న స్వరూపాలే అవి అని తెలియ జెప్పటా నికి ”హరి హరైక మూర్తి ”ని ఇష్ట దైవం గా భావించి తన భారతాన్ని ఆయనకు అంకితమిచ్చాడు .తిక్కన తర్వాతా నాచన సోముడు ,కేతన ,ఈ మార్గాన్నే అనుసరించారు .కొరవి గోప రాజు కూడా జత కలిశాడు .తరువాత వచ్చిన శైవ ,వైష్ణవ కవులు పరదూషణ మానారు .సహనం వహించారు .తిక్కన -శివ కేశవులకు అభేదాన్ని చూపించటమే కాదు అద్వైతాన్ని బోధించి ,జీవాత్మ పరమాత్మ ఐక్యాన్ని చూపాడు .

ఆంద్ర దేశమంతా ఏక మత సూత్ర బద్ధం చేశాడు .అందుకే ఆంద్ర దేశం లో అద్వైతానికి అధిక ఆదరణ లభించింది .జాను తెనుగు కు తిక్కన పట్టం కట్టాడు .ఎర్రన కూడా ఇదే మార్గాన్ని అనుసరించాడు .ఈ విధం గా భారత రచనకు ,ఆంధ్రీకరణకు కవిత్రయం సమానమైన ప్రయోజనం కల్పించారు .అంచమ వేదం ధర్మ శాస్త్రం అని పిలువా బడే భారతాన్ని తెనుగు చేయటానికి రుషి వంటి నన్నయ ,తిక్కన ,ఎర్రన లు లభించటం లౌకిక తత్త్వం దాటి ఆధ్యాత్మికత్వం అందుకోండి భారతం .రాజాశ్రయం లో ఉన్నా ,అంతరంగం ఆముష్మికం వైపు ప్రసరించింది ఈ ముగ్గురు మహా కవుల్లో .భారత రచన వల్ల భావ బంధ విమోచానమే వీరూ ఆశించారు .

”భారత భారతీ శుభ గభస్తి చయమ్బుల జేసి ,ఘోర సం –సార వికార ,సంతమాస జాల విజ్రుమ్భము వాపి ,సూరి, చే

తో రుచి రాబ్జ బోధనా రతుం డగుదివ్య పరాశారాత్మజాం –భోరుహ మిత్రు గొల్చి ” అని నన్నయ గారు పేర్కొనటం గమనార్హం ..తిక్కన కూడా ”ఇంకా జన్మాంతర దుఃఖ ముల ,తొలగు నట్లు జేసి ,సుఖాత్ము జేయవే ”అని హరి హరుడిని ప్రార్ధించాడు .అప్పుడు ఆ జగన్నాధుడు -”జనన మర్నాడు లైన సంసార దురిత –ములకు ,నగ పడ కుండంగగాను దోలగు తెరవు–గను వెలుంగు నీ కిచ్చితి ననిన లేచి –నిలిచి సంతోష మెద నిండ నెలవు కొనగ ” తిక్కన మేల్కాంచాడు .కనుక తిక్కన గారి ఆశయమూ భావ బంధ మోక్షమే .అంతే కాక ,తన ఆశయాన్ని ఇలా తెలియ జేస్తాడు కవిబ్రహ్మ –

”కావున భారతామృతము కర్ణ పుటంబుల నారగ్రోలి ,యాం –ధ్రావలి మొదముంబోరయు నట్లు గ ,సాత్యవతేయ సంస్మృతి

శ్రీ విభవాస్పదంబయిన చిత్తము తోడ మహా కవిత్వ దీ –క్షా విధి నొంది ,పద్యముల గద్యములన్ రాచి యించేదన్ గృతుల్”

తిక్కన గారు వాడిన అమృత శబ్దం పరబ్రహ్మనే తెలుపు తుంది .భారతామృతం అంటే పరబ్రహ్మ తో అభేదాన్ని సూచిస్తుంది .పరబ్రహ్మ జ్ఞానం -మననం అనే యోగం తో లభిస్తుంది .అంటే భారత ఆఖ్యానాలను వినటం తో ఆనందం సిద్ధిస్తుంది అని ,విశిష్ట మైన అర్ధం గా కవి బ్రహ్మ వాక్కు .పరబ్రహ్మ సాక్షాత్కారం విద్య వల్లనే సాధిస్తారు .అలాగే భారత రచన తనకూ తన జాతికీ నిత్య శ్రేయాన్ని కల్గించాలని తిక్కన గారి పరమ ఉదాత్తమైన ఆశయం .నిత్య మోక్షాన్ని కోరాడు కనుక భారత ఆమ్నాయ కర్మ నిర్వహణలో యోగి అయాడు .యోగుల లాగే సంయమనాన్ని పొందాడు .అల్పాక్షరాలలో అనల్పార్ధం ,వ్యంగ్య వైభవం ,గాంభీర్య గుణ ప్రధానం గల పాత్ర శీల చిత్రణ ,అలంకార వ్యామోహం వదిలి సహజ రమ్యత ,అర్ధ గౌరవం చేత కల్పించటం కవిత్రయ రచన ప్రధాన గుణం .ఇంతటి సంయమనం తరువాతి కవుల్లో కన్పించదు .ఇంతటి సంయమనం ,లోక హితం కోరే కవులు లేక పోవటం వల్లనే భారతానికి దగ్గర గా రా గల్గిన రచన తెలుగు సాహిత్యం లో ఇంత వరకు రాలేదు .లోక కళ్యాణ ప్రతిపాదిక మహా కావ్యం కనుక భారతం ఆంధ్రుల విజ్ఞాన సర్వస్వమైంది .ఆంధ్రుల జాతీయ జీవిత సర్వస్వం అయింది .డాంటేరాసిన ”డివైన్ కామెడి ”ఇటాలియన్లకు ,హోమర్ రాసిన ”ఇలియడ్ ‘గ్రీకులకు ,మిల్టన్ రాసిన ”పారడైజ్ లాస్ట్ ”ఆంగ్లేయులకు వారి వారి జాతీయ జీవిత సర్వస్వాలు .ఉత్కృష్టమైన సారస్వతాన్ని నిర్మించి ,స్వార్ధ రహితులై ,విజ్ఞాన వ్యాప్తి చేసి ,లోక హితం చేసిన మహానీయులే నిజమైన జాతీయ నాయకులు అని పాశ్చాత్య మతం .ఆ దేశాలలో సాహిత్య స్రష్టలకు అనన్య గౌరవం ఉండటం మహదానందం గా ఉండటమే కాదు అందరికి ఆదర్శం ,అనుసరణీయం కూడా .

సశేషం –మీ –గబిట.దుర్గా ప్రసాద్ –14-7-12–కాంప్–అమెరికా


Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.