తిక్కన భారతం -4 విరాట పర్వం లో తిక్కన విరాట్ స్వరూపం

 తిక్కన భారతం -4

                                             విరాట పర్వం లో తిక్కన విరాట్ స్వరూపం

”హృదయాహ్లాది చతుర్ధ మూర్జిత కదో పేతంబు -నానా రసాభ్యుదాయో ల్లాసి విరాట పర్వము ”అని తిక్కనే విరాట పర్వం ప్రబంధ రచనకు అనుకూలం అనే విషయాన్ని ముందే చెప్పాడు .ఇందులో కద మన జీవితానికి చాలా దగ్గర .వీర శృంగార రస పోషణకు అనువు కనుక హృదయాహ్లాది అయింది .అనేక సన్నివేశాలలో వ్యక్తుల ప్రవర్తన ,నిజ శీల స్వభావాలు బాగా వ్యక్తమయాయి .లౌకిక జీవితం బాగా ప్రతి బిమ్బించింది .కీచక వధ ,ఉత్తర గోగ్రహణం ,అభిమన్యు వివాహం దీని లో ముఖ్య ఘట్టాలు .మొదటి దానిలో వీర ,రౌద్ర రసాలు ,రెండవ దానిలో వీర హాస్యాలు ,చివర లో లలిత శృంగారం వర్నితాలు .

కీచక వధ ను ప్రబంధం గా రచించాడు తిక్కన .అసహాయ స్తితి లోని స్త్రీకి జరిగే అవమానం ,షీలా రక్షణ కై ఆమె ప్రయత్నం ,దాని ద్వారా వివిధ పరిణామాలు లోక సామాన్యమైనవి కనుక ఇతి వ్రుఉట్టాం సహజ ఆకర్షణ ను పొందింది .పరులను ఆశ్రయించటం అందులోను రాజాశ్రయం లో పాండవుల కష్టాలు ,విరాట నగర జీవితానికి అద్దం పడతాయి .విరాటుని వినోదం కోసం భీముడు మల్లులతోనే కాదు ,సింహాలతో కూడా పోరాడా వలసి రావటం దాసీ కనుక రాణి సుధేష్ణ చెప్పినట్లు చేయ వలసిన దీన స్తితి లో ద్రౌపది ఉండటం ,తన అభి ప్రాయాన్ని కాదన్నాడని విరాట రాజు ధర్మ రాజుని పాచిక తో కొట్టి అవమానించటం ,పాండవుల పట్ల సాను భూతి చూపే ఘట్టాలు .దీని కంతటికీ కారణం ధర్మ రాజు ద్యూతం .దాని ఫలితం గా పొందిన దాస్యం .అందుకే బలవంతులైనా ,నిస్సహాయ స్తితి .సామాన్య మానవులలో కనీ పించే స్త్రీ లోలత కీచకుని లో ప్రతి బిమ్బించింది .యుక్తాయుక్తత లోపిస్తే ,కలిగే పరిణామం ఇదే అని అందరికి హెచ్చరిక .కామక్రోదాదులు కీచక వృత్తాంతం కనుక రచనను ప్రబంధ ప్రక్రియ లో నడిపాడు .ఉద్యానవన ,సూర్యోదయ ,అస్తమయ వర్ణనలు తరువాత ప్రబంధ రీతి కి మార్గ దర్శనాలైనాయి .వీటిని ఎర్రన ,సోమనాధుడు స్వీకరించారు .శ్రీ నాధుడు పోషించాడు .రాయల కాలం లో పరి పక్వ స్తితిని ప్రబంధం పొందింది .

”నీరజాకరములు నిష్ఠమై జేసినా భవ్య తపంబున ఫలమనంగ -దివస ముఖాభి నందిత చక్ర యుగ్మకంబు ల యనురాగంపు బ్రోవనంగ–హరిహరబ్రహ్మ మహానుభావంబులోక్కోటి గాగ గరగిన గటిక యనగనతుల వేదత్రయ లతి కా చయము పెను పొంద బుట్టెడు మూల కందమనగ –నఖిల జగముల కందేర యగుచు జనసమాజ కరపుట హృదయ సరోజములకు -ముకులనంబును జ్రుమ్భనంబును నొనర్చి -భాను బిమ్బంబు పూర్వాద్రి పై వెలింగె ”—భవ్య తపః ఫలమైన పరంజ్యోతి స్వరూపం విశుద్ధ ప్రేమ పరిణామ మైన రస స్తితి ,హరి హర బ్రహ్మైక్య జ్ఞాన మూర్తి ,వేదత్రయ జన్మ కారణ మైన అర్బ్రహ్మ స్వరూపం -లోకాతీతత ,అలోకిక ఉపమానాలలో వర్ణన చేయటం వల్ల రచన ఉదాత్త స్తితి పొందింది .మనోహరం గా అని పించాతమే కాదు సోర్యుని పరబ్రహ్మ మూర్తి గా ప్రతి పాడించి వేద ధర్మాన్ని నిరూపించాడు తిక్కన .సూర్యభగవానుడు చైతన్య దాత అని ,జ్ఞాన ప్రదాత అని ”కందేర ”అనే ఒక్క మాటలో నిక్షిప్తం చేశాడు .అలాంటి పరబ్రహ్మ మైన సూర్య దర్శనం హృదయ వికాసం కలిగిస్తుంది అనటం లో సందేహమే లేదు .ఉపమానాలు అతి పవిత్ర మైనవి కనుక ఉదాత్త కవితా తత్త్వం ఆవిష్కారమైంది .సూర్యాస్తమాయ వర్ణన కూడా భావనా చమత్కారం తో రాశాడు .సూర్యుడు పశ్చిమ దిశా చేరగానే ,అది సాన్ధ్యారున రంజితం అయిందట భర్త వస్తే .భార్య కు రాగ రంజితం అయినట్లు .

”ఇనుడు తన కడకు నేతేంచిన రాగము బొందుటదియుచిత మనగా –గెంపున మేరసి పస్చిమాశాన్గన జన సంభావముల గారవ మందెన్ ”ఇనుడు అంటే సూర్యుడు భర్త అని అర్ధాలు .రాగం అంటే ఎరుపు అనురాగం -అర్ధ శ్లేష తో గొప్ప చమత్కారం చేశాడు .భ్హర్త విరహం లో ఉన్న పశ్చిమ దిశా కు భర్త సమాగమం -అందుచేత ఆమె లోక సంభవ నీయు రాలు అయిందట .కుల కాంతకు దక్కే గౌరవం దక్కిందట .ఈ విధం గా ప్రక్రుతి వర్ణన సహజా లంకార చమత్కారం తో హృదయ వికాసం కల్గిస్తాడు తిక్కన .

కీచకుని కామ వృత్తికి అనుగుణం గా వనం లోని పక్షుల విహారం ను అతి సుకుమారం గా పోషించాడు –

”ఇంపైన ప్రియ కాన నిచ్చి ,నిల్చిన మధు-వాదట నాను మత్తాలి విభుని –జెట్టు పల్పచారింప చుట్టూ గ్రుమ్మరి మనోరమ నియ్య కొలుపు మరాల విభుని –ఫలరస మొన్దొంటి కెలమి జన్చుల నిచ్చు -మెయిన జోక్కెడు శుక మిదునములకు -గామి బాసి తలిరు జొంపమునకు మెయి మెయి -దాకంగా జానూ పిక దంపతులును ”–ఇదీ ప్రతి అంగుళం లోను కన్పించిన ప్రకృతి .”కామీ స్వతాం పశ్యతి ”అన్నట్లు ,అంతటా కీచాకుడికి అలానే కన్పించింది .అతని లోపలి భావాలకు ఉద్రేక పరచటానికి ప్రకృతి బాగా దోహదం చేసింది .అందుకే ”తనువు నింద్రియములు ,మనము ధృతి యు దన వశంబు గాక -తల్లాడ పది సింహబలుడు విషమ బాణు బారి బారే ”అన్నాడు .సింహం వంటి బల వంతుడు కూడా కామం లో పిల్లి అయి పోయాడు .అలా కామోద్రేకం తో రోజంతా దహించుకు పోయాడు .సైరంధ్రి చేసిన సంకేతం కూడా అందు కో లేని మూధత్వం వాడిని ఆవ హించింది ..రాత్రి నర్తన శాల కు చేరాడు .ఎలా ?”స్వాంతము బాహుగర్వ ఘన సం,తమ సాంధము గాగ -శంక యొ క్కిన్తయు లేక -కీచకుడహంక్రుతి ముంగలి గాగ మండవాభ్యన్తర భూమి ”చేరాడు .కామాతురునికి లజ్జా భయము ఉండవు కదా .ఇలా కామంధుని చిట్టా వృత్తిని సాక్షాత్కరింప జేసి మన ముందు కీచకుణ్ణి ఉంచాడు తిక్కన .

ఇప్పుడు భీముని రంగ ప్రవేశం చేయిస్తున్నాడు తిక్కన కవి ..లోకజ్ఞత ,ఔచిత్యం నిండిన రచన మనకిన్డులో కన్పిస్తుంది –

”గమనము వీక ,వేరొక వికారము పుట్టాక ,సంగారోత్సవో –ద్యమ రభసాతి రేకము బయల్పడుటిన్చుక లేక రోష సం

భ్రమ మొక ఇంత యైన బరభావ నిరూప్యము గాక ,ద్రౌపదీ –రమణుడు వోయి ,విక్రమ దురంధరతం దగ నాట్య శాలకున్ ”-

భీముడు జాగ్రత్త గా అన్ని వైపులా చూసుకొంటూ ,తన బాల పరాక్రమాలు ఒప్పగా మద మత్త గజం లాగా సదృశ గతి ”లో ప్రవేశించాడు .ఇక్కడ కీచక భీములలో ప్రవర్తనా వైవిధ్యం కన్పిస్తుంది .మదాన్దుడై అనుమానం లేకుండా ,అహంకారమే ఆయుధం గా ప్రవేశించాడు కీచకుడు .నిర్వికార గామ్భీర్యాలతో ఆత్మ నిగ్రహం కోల్పోకుండా ,తన బాహా గర్వమే ఆయుధం గా భీముడు ప్రవేశించాడు.అనుమానం లేకుండా కీచకుడు వస్తే ,భీముడు వివేకం తో పరిసరాలను అన్నిటిని పరిశీలిస్తూ వచ్చాడు .బయట పడితే పాండవ రహస్యం బట్టబయలు అవుతుందేమో ననే అనుమానం భీముడిది .కనుక యుక్తా యుక్త విచక్షణ తో వచ్చాడు .ఇలా పాత్ర పోషణ లో స్వభావ వ్యక్తీకరణ లో తిక్కన తన సిద్ధ హస్తాన్ని చూపిస్తాడు .

రతి అనే సాత్విక భావం ఇరువైపులా నిష్టం అయితేనే శృంగారం గా అది పరిణమిస్తుంది .వీర రసానికి ఉత్సాహం కావాలి .అందుకే ద్రౌపది కీచక వధ తర్వాతా భీముడిని ”మన వారి లోన నొక్కని బిల్వక -ఉత్సాహంబు చేసిన సాహసాన్ని ”ప్రశంసించింది .ఆ ఉత్సాహాన్ని వీరం గా మార్చిందిభీముడిలో .అందుకే కీచక పీచాన్ని అతి భీకరం గా అణచాడు.ద్రౌపది పరాభవాన్ని స్వయం గా చూశాడు కనుక భీముడి లో రౌద్రం మూర్తీభ వించింది .తన భార్య యెడ కామంతో ప్రవర్తించి నందుకు వాడి కళ్ళను ,అతిగా ప్రేలి నందుకు ముఖాన్ని ,పతివ్రత ణు వెంటాడి జుట్టుపట్టుకొన్న కాళ్ళు ,చేతుల్ని ఇంకా ఏమీ చేయలేని స్తితి లో ఇతరులు చూడ టానికి వీలు లేకుండా ,రూపం చేదేట్లు ,శరీరం లోకి తోసి ,కీచక దేహాన్ని ఒక మాసపు ముద్దగా మారిస్తే తప్ప భీముడికి తృప్తి కలుగ లేదు .ఇది మనకు అమానుష వధ అని పిస్తుంది .ఉపకీచాకుల్ని చంపటం లోను రౌద్రం బాగా విజ్రుమ్భిచింది .”వికృతపు జావు నంప మది వేడుక పుట్టిన గిట్టి పట్టి మా -శతకమును బీనా దీర్ఘ భుజ శాఖలు బాదయుగంబు మేనిలో –నికి జొర ,నుగ్గు గా దురిమి ,నించిన గ్రంథాల తిత్తియైన కీ -చాకు ధరణీ స్తలిం జదిపి చక్కని ముద్దగ జేసే దుష్టుడై ”-ఉపకీచాకుల్ని చంపే ఘట్టం లో –

”వికట భ్రుకుటి ఘోర ఫాల కలిత స్వేదోద్భాతుమ్డున్ -చలక్రుతోష్ట ద్వాయుడం -బ్రమర్దన దశావిర్భావ సంభావితాం -గకుండు ని –బాకా విధ్వంసకుడ య్యే డన్నిలచే –శుమ్భంమూర్తి విస్ఫూర్తి తోన్”–ఏఎ వృత్తాంతం అంతా మనం చూసే సంఘటన ఆ అతి సన్నిహితం గా కన్పిస్తుంది .దీనిని తిక్కన మనోహరంగా ,రసవత్తరం గా ,రచించటం వల్ల పండితులను ,విమర్శకులను ఆకట్టు కొన్నది .

సశేషం –మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ –15-7-12.–కాంప్–అమెరికా

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.