పద్యాల చిన్నయసూరి

పద్యాల చిన్నయసూరి

పద్యం తెలుగువారికే ప్రత్యేకమైన ఆస్తి. కందం, ఆటవెలది, తేటగీతి, మత్తేభం, ఉత్పలమాల, చంపకమాల, సీసం… ప్రతి ఛందస్సుదీ ప్రత్యేకమైన అందం. వజ్రాలు వరసగా పేర్చినట్టు, రత్నాలు రాశులు పోసినట్టు, చెరువులో ఎర్ర కలువలు పూచినట్టు, ఆకాశంలో నక్షత్రాలు వెలిగినట్టు… అలతిఅలతి పదాలతో అల్లిన మాలలు మన పద్యాలు. “అంత విలువైన ఆస్తిపాస్తులను భావి తరాలకు అందించాలనే నా తపన” అంటున్నారు విశాఖపట్నానికి చెందిన పరవస్తు ఫణిశయన సూరి. ‘వారం వారం పద్య విహారం’ పేరిట ఆయన చేస్తున్న ప్రయత్నానికి బాలల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది.

పరవస్తు ఫణిశయన సూరి. ‘పేరెక్కడో విన్నట్టుగా ఉంది’ అన్నారంటే మీకు తెలుగు గురించి కొంచెం తెలిసినట్టే. ‘పరవస్తు చిన్నయసూరికి ఈయన ఏమవుతారు’ అని అడిగారనుకోండి, అప్పుడు మీకు భాష గురించి బాగా తెలిసినట్టు. తెలుగు భాషకు వ్యాకరణ కిరీటాన్ని పెట్టిన పరవస్తు చిన్నయసూరికి ఈ ఫణిశయన సూరి ఐదో తరం మనవడు. చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకుంటున్న మనుషులున్న ఈరోజుల్లో కాయకష్టం చేసి దాచుకున్న సొమ్మును తెలుగు పద్యాల వ్యాప్తికి ఖర్చు చేస్తానంటున్న ‘అ’సామాన్యుడాయన.

కోటిచ్చినా నోటికొస్తుందా…
పూర్వం అక్షరాభ్యాసానికి పూర్వమే పిల్లలకు పద్యాలు నోటికొచ్చేవి. ఉదయాన్నే లేచి పనిచేసుకుంటూ పద్యాలను వల్లించుకునే బామ్మల నుంచో, రాత్రి పూట పద్యపఠనం చెయ్యకుండా పడుకోలేని తాతల నుంచో వినీవినీ వారికి అవి ఒంటపట్టేవి. ‘శ్రీరాముని దయచేతను….’ ‘నీ పాద కమలసేవయు…’ ‘ఉప్పుకప్పురంబు….’ ఒకటారెండా, ఒకటో తరగతిలో చేరేనాటికి తక్కువలో తక్కువ పాతిక పద్యాలయినా కంఠస్థమయి ఉండేవి చిన్నారులకు. ఇప్పుడా పరిస్థితి లేదు. “అలాగని తెలుగు పద్యాలను మరిచిపోతామా చెప్పండి? అపూర్వమైన నిధి కదండీ మన పద్యాలంటే? వాటిని పిల్లలకు నేర్పించకపోతే ఎలా?” అంటూ ఆ పనికి తానే ముందడుగేశారు.

‘వారం వారం పద్య విహారం’ అనే శీర్షికతో మొదలుపెట్టిన ఈ కార్యక్రమానికి విశాఖపట్నం పౌర గ్రంధాలయం వేదిక అయింది. ‘పద్యం నేర్చుకోండి, పది రూపాయలు అందుకోండి’ అన్న నినాదంతో మొన్న వేసవి నుంచి ఆయన చేపట్టిన ప్రచారం చిన్నారుల్లో మంచి ఉత్సాహాన్నే నింపింది. ఏప్రిల్‌లో మొదలైన ఈ కార్యక్రమానికి దాదాపు 550 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. ఆర్నెల్లు తిరిగేసరికల్లా… 300 మంది వివిధ వయసుల విద్యార్థులు ఒక్కొక్కరూ పాతిక నుంచి రెండొందల వరకూ పద్యాలను నేర్చుకున్నారు! వాళ్లకు సుమారు యాభై వేల రూపాయలను బహుమతులుగా ఇచ్చారు ఫణిశయన సూరి. అలాగని ఇది డబ్బు కుమ్మరిస్తే అయిపోయే పని కాదు. కోటి రూపాయలు పోసినా నోటికో పద్యం రావాలంటే చాలా తతంగం ఉంది.

‘పద్య విహారం’ కార్యక్రమం విజయవంతం కావడానికి సూరి చాలా పరిశ్రమించారు. “మా తెలుగు ఉపాధ్యాయులు, స్నేహితుల సహకారంతో ముందుగా తె లుగు సాహిత్యంలో అపూర్వ వజ్రాల వంటి పద్యాలను ఎంపిక చేసే పనిలో పడ్డాం. దేనికదే అపురూపంగా ఉండేది. ప్రతి పద్యాన్నీ చదువుతున్నప్పుడు దాన్ని పిల్లలకు ఎలాగైనా నేర్పించాలనిపించేది. ఏ కవినీ వదిలెయ్యాలనిపించేది కాదు. అబ్బో, అదొక విచిత్రమైన అవస్థ …’ అంటున్న సూరి మొత్తానికి తొలిమెట్టుగా ఒక ఐదు వందల పద్యాలను పోగుచేశారు. పిల్లలకు అర్థమయ్యేలా విడివిడి కాగితాల మీద రాసి నకలు తీయించారు.

తెలుగులో చదవలేని ఇంగ్లీష్ మీడియమ్ వారికైతే ఇంగ్లీష్‌లోనే రాసిచ్చారు. అర్థం చెబుతూ పద్యాన్ని చదవడంలో శిక్షణనిచ్చారు బాలలకు. “వేసవి శిబిరం బాగా నడుస్తుందా లేదా అని ఆందోళనగా ఉండేది. మొదట్లో తల్లిదండ్రులు బలవంతపెడితే, కొద్ది మందొచ్చేవారు. నెమ్మదిగా వాళ్లంతటవాళ్లుగా రావడం పెరిగింది. వేసవి శిబిరం తర్వాత ఆపేద్దామనుకున్న మేం ఇప్పుడు పద్య విహారాన్ని వారం వారం హాయిగా కొనసాగిస్తున్నామంటే బాలల్లోని ఆదరణే దానికి కారణం” అంటున్నారు సూరి.

అపర భువన విజయం
ఎల్‌కేజీ నుంచి పదో తరగతి దాకా – వివిధ వయసుల బాలలు పూర్వ కవుల పద్యాలను గడగడా చదువుతుంటే చెవుల్లో అమృతం పోసినట్టుంటుంది. “చిన్నారులు తప్పుల్లేకుండా భావయుక్తంగా పద్యాలు చదువుతుంటే ఎంత ఆనందం కలుగుతోందో మాటల్లో చెప్పలేను…” అంటున్న ఫణిశయన సూరిలో ఆ ఆనందామృతాన్ని పదిమందికీ రుచి చూపించాలనే ఆలోచన కలిగింది. తన శిక్షణలో బాలలు సొంతం చేసుకున్న పద్య సంపదను పదిమందిలోనూ ప్రదర్శిస్తూ ‘తెలుగు పద్య విజయం’, ‘తెలుగు పద్యం – వ్యక్తిత్వ వికాసం’ అన్న శీర్షికలతో ఇప్పటికీ రెండు భారీ కార్యక్రమాలు నిర్వహించారు.

రెండిటిలోనూ నన్నయ, తిక్కన, ఎర్రన, పోతన , మొల్ల… వంటి మహామహుల రూపాలను ధరించిన పిల్లలు… సాక్షాత్తూ ఆ కవులు భువికి దిగి వచ్చారా అన్నంత ధారణతో పద్యాలను చదువుతుంటే సభాసదులు పులకరించిపోయారు. ఇవన్నీ చేస్తున్నారు కదాని సూరి ఏమీ ఆగర్భశ్రీమంతుడు కాదు.

వివాహాది శుభకార్యాల్లో పువ్వుల అలంకరణ చేసే వృత్తికి తోడు అప్పుడప్పుడు ఆర్ట్ డైరెక్టర్‌గా సినిమాలకూ పనిచేస్తుంటారు. పద్య విహారం కనీసం రెండేళ్ల పాటు నిర్విఘ్నంగా జరగడానికి ఐదు లక్షల రూపాయల నిధిని సొంతంగా సమకూర్చుకున్నాకే తొలి అడుగు వేశారాయన. “ఈ కార్యక్రమానికి నిధులు సమకూర్చమని నేనుగా ఎవరినీ అడగదల్చుకోలేదు.. పద్యం పట్ల అభిమానంతో ఎవరైనా ఇస్తే కాదనను” అంటున్న సూరి ప్రయత్నం ఎంతోమందికి మార్గదర్శకం.

మన తెలుగు పద్యాల గొప్పదనాన్నీ, వాటి అందచందాలనూ ఈ తరానికి తెలియజెప్పే శీర్షికలు కొన్ని పత్రికల్లోనూ విజయవంతంగా నడుస్తున్నాయి. ‘ఈమాట’ వెబ్ మ్యాగజిన్‌లో విజయవాడవాసి చీమలమర్రి బృందావనరావు చక్కటి పద్యాలను ఏర్చి కూర్చి కొన్నేళ్లుగా పాఠకులకు పరిచయం చేస్తున్నారు. అటువంటిదే మరో ప్రయత్నం గుంటూరుకు చెందిన రచయిత పాపినేని శివశంకర్ చేశారు.

అమెరికాలో వెలువడే ‘తెలుగునాడి’ మాస పత్రిక పాఠకుల కోసం ఆయన పరిచయం చేసిన అనర్ఘ రత్నాల వంటి పద్యాలు, వాటి వివరణలనూ ఒకచోట చేర్చి ‘తల్లీ నిన్నుదలంచి’ అన్న పుస్తకాన్ని ఈమధ్యే విడుదల చేశారు. “ప్రాచీన సాహిత్యంలో జీవధాతువుగల అమూల్య పద్యాలెన్నో కనపడతాయి. అవి మానవ సంబంధాల్ని నిర్వచించి వ్యాఖ్యానిస్తాయి. విద్యార్థులు మొదలు గృహస్థుల దాకా అందరికీ జీవనకళ నేర్పుతాయి. జీవిత సంస్కారాన్ని పండిస్తాయి. అంతిమంగా ఒక ఆరోగ్యదాయకమైన వ్యక్తిగత, సామాజిక సంస్కృతిని పాదుగొల్పుతాయి…” అని తెలుగు పద్య నిధిని తలుచుకొని మురిసిపోతున్నారు పాపినేని శివశంకర్.ఫణిశయన సూరి : 9440682323

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సేకరణలు and tagged . Bookmark the permalink.

2 Responses to పద్యాల చిన్నయసూరి

  1. పరవస్తు ఫణిశయనసూరిగారి కృషి సర్వదా బహుధా ప్రశంసనీయం.

    Like

  2. Govindaraju sudhakar's avatar Govindaraju sudhakar says:

    Eidu taralu nidriimchina sajeeva beejam ankurinchind, chakkani sahiti vrukshamai parimilistundi

    Like

Leave a reply to Govindaraju sudhakar Cancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.