మన ‘ఏడు తరాలు’

 

“ప్రభువెక్కిన పల్లకి కాదోయ్.. అది మోసే బోయీలెవ్వరు?’ అని మహాకవి శ్రీశ్రీ ఏనాడో అన్నాడు. ప్రతి సామ్రాజ్య చరిత్రలోను కూలీల శ్రమ ఎవరికీ కనిపించని ఒక చీకటి కోణం. వీరి చరిత్ర ఎవరికీ తెలియదు. ఎక్కడా రికార్డు కాదు. గాయత్ర బహదూర్ ముత్తమ్మమ్మ సుజారియా 1903లో భారత్ నుంచి గయానాకు కూలీగా వెళ్లింది. దాదాపు 100 సంవత్సరాల తర్వాత గాయత్ర- తన ముత్తమ్మమ్మ ప్రయాణాన్ని, ఆ నాటి పరిస్థితులను తెలుసుకోవటానికి భారత్ నుంచి బ్రిటన్ దాకా అనేక ప్రాంతాలు తిరిగింది. లండన్ నుంచి అమెరికా దాకా అనేక పట్టణాలలో ఉన్న లైబ్రరీలను వెతికింది. చివరకు ఆ నాటి పరిస్థితులను వెలికితీయగలిగింది. హేచట్ పబ్లికేషన్స్ విడుదల చేసిన కూలీ ఉమెన్ పుస్తకంలోని కొన్ని ఆసక్తికరమైన భాగాలు..

1850లలో భారత్‌లో పరిస్థితులు బాగా క్షీణించాయి. సామాజికంగా, ఆర్థికంగా దుర్భర పరిస్థితులు నెలకొనడంతో చాలా మంది ప్రజలు తమ గ్రామాలను విడిచి వలసవెళ్లటం ప్రారంభించారు. సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ విధానం వీరికి ఉపాధి లేకుండా చేసింది. కానీ ఇదే విధానం వీరు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లటానికి వీలైన మార్గాలను కల్పించింది. 1882లో మా ముత్తమ్మమ్మ సుజారియా అయోధ్య నుంచి గయానాకు కూలీగా వెళ్లటానికి తన పేరును నమోదు చేయించుకుంది. అయితే ఆమె సముద్రం దాటి గయానాకు వెళ్లిన సంవత్సరమే బ్రిటిష్ ఇండియాలో వివాహిత మహిళలు వలస వెళ్లకుండా నిరోధించటానికి ఒక చట్టం అమలులోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం- ఏ మహిళా తన భర్త అనుమతి లేకుండా వలస వెళ్లటానికి వీలు లేదు.

ఒక వేళ ఆమె తాను అవివాహితనని గాని, విడాకులు తీసుకున్నాననిగాని, వితంతువుననిగాని చెబితే దానికి తగిన ఆధారాలు సమర్పించాలి. ఆమె అబద్ధం చెబుతోందని అధికారులు భావిస్తే-ఆమెను పది రోజులు కస్టడీలో పెడతారు. ఈ లోపులో ఆమె చెప్పిన సమాచారం నిజమా? కాదా? అనే విషయంపై దర్యాప్తు చేస్తారు. ఆ సమయంలో గయానాకు వలస ప్రజలను పంపటానికి ఉద్దేశించిన విభాగాధిపతి రాబర్ట్ మిట్‌చిల్- ఈ చట్టాన్ని చాలా కఠినంగా అమలు చేస్తున్నారని ఫిర్యాదు చేయటం మొదలుపెట్టాడు. గ్రామీణ ప్రాంతాల్లో మెజిస్ట్రేట్లు ఈ చట్టాన్ని కఠినంగా అమలుచేస్తున్నారని.. దీని వల్ల తనకు మహిళలు దొరకటం లేదని బ్రిటిష్ అధికారులకు లేఖలు రాశాడు. అతనికి కోపం రావటానికి ఒక కారణముంది. అమలులో ఉన్న చట్టాల ప్రకారం- ప్రతి నౌకలోను 100 మంది పురుషులకు 40 మంది మహిళలు ఉండాలి. లేకపోతే నౌకలు తీరాన్ని విడిచివెళ్లకూడదు. దీనితో మిట్‌చెల్ నౌకలు కలకత్తాలోనే ఉండిపోయేవి..

నౌకలలో ఎక్కించే ముందు వీరిని కలకత్తాలోని నవాబుగారి పాత కోటలో ఉంచేవారు. అక్కడ పరిస్థితులు చాలా దుర్భరంగా ఉండేవి. అంటువ్యాధులు ప్రబలేవి. వందల మంది చనిపోతూ ఉండేవారు. చాలా సార్లు అసాంఘిక శక్తుల కోసం పోలీసులు ఈ ప్రాంతాల్లో గాలిస్తూ ఉండేవారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన అనేక మంది కనిపించకుండా పోయిన బంధువుల కోసం ఈ ప్రాంతానికి వచ్చేవారు. వలసదారులను తీసుకు వచ్చిన వెంటనే వారికి యూనిఫాం ఇచ్చేవారు. స్నానం చేయటానికి ఒక సబ్బు కూడా ఇచ్చేవారు. వారందరినీ హుగ్లి నది ఒడ్డుకు తీసుకువెళ్లి స్నానం చేయించేవారు. ఈ స్నానం విషయంలో ఎటువంటి కులవివక్ష ఉండేది కాదు. బ్రాహ్మణుల దగ్గర నుంచి హరిజనుల దాకా అందరూ పక్కపక్కనే నిలబడి స్నానం చేయాల్సిందే! వాస్తవానికి చాలా మంది బ్రాహ్మణులు తమ జంధ్యాలను స్నానానికి ముందే తీసేసేవారు. దీనికి కూడా ఒక కారణముంది.

గయానాలో తోటల యజమానులు బ్రాహ్మణులు ఎక్కువ శ్రమ చెయ్యలేరని భావించేవారు. అందువల్ల వారికి ఉద్యోగాలు ఇవ్వటానికి ముందుకు వచ్చేవారు కాదు. బ్రిటిష్ అధికారులైతే బ్రాహ్మణులలో తిరుగుబాటు ధోరణి ఎక్కువ ఉందని భావించేవారు. అందువల్ల వారిపై ఒక కన్నేసి ఉంచేవారు. దీనితో చాలా మంది బ్రాహ్మణులు జంధ్యం వేసుకోవటానికి ఇష్టపడేవారు కాదు. స్నానం అయిన తర్వాత వారు వెళ్తున్న ప్రదేశాలకు అనువైన బట్టలు ఇచ్చేవారు. గయానాకు వెళ్లే కూలీలకు కాటన్ బట్టలు ఇస్తే- వెస్ట్ఇండీస్‌కు వెళ్లే కూలీలకు ఊలు దుస్తులు ఇచ్చేవారు. ఆడ కూలీలకు రెండు ఊలు జాకెట్లు, ఒక ఊలు లంగా, ఒక చీర, కాలికి మేజోళ్లు ఇచ్చేవారు. పురుషులకైతే పంట్లాం, షర్టు, క్యాప్ ఇచ్చేవారు. ఒక గ్రూపులో ఉన్నవారికి ఒకే విధమైన బట్టలు ఇచ్చేవారు.

మా ముత్తమ్మమ్మ ప్రయాణించిన ది క్లైడ్ నౌక 1903 నవంబర్ 4వ తేదీన గయానాలోని డిమిరిరా నౌకాశ్రయానికి చేరుకుంది. డిమిరిరా ప్రాంతాన్ని 19వ శతాబ్దం తొలి రోజుల్లో బ్రిటిష్ పాలకులు డచ్ వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. 19వ శతాబ్దం ముందు దాకా ఈ ప్రాంతంలో అపారమైన బంగారు గనులు ఉన్నాయనే వాదనలు వినిపిస్తూ ఉండేవి. అయితే బ్రిటిష్ వారికి ఈ బంగారు గనులు దొరకలేదు కానీ చెరుకును పండించటానికి వీలైన నల్ల రేగడి భూమి లభించింది. ఈ సమయంలో బ్రిటిష్ కాలనీలన్నింటికీ ఇక్కడి నుంచే పంచదార ఎగుమతి అయ్యేది. అయితే అప్పటికే ఫ్రాన్స్, జర్మనీలు చక్కెర ఎగుమతులు ప్రారంభించి- గయానాతో పోటీ పడటం మొదలుపెట్టాయి. దీనితో అక్కడున్న చెరుకు ఉత్పత్తిదారులు తీవ్రమైన సంక్షోభం ఎదుర్కోవటం మొదలుపెట్టారు. బ్రిటన్‌కు చెందిన అనేక కాలనీలలో అప్పటికే బానిసత్వాన్ని రద్దు చేశారు. అయితే తమకు తక్కువ ధరకు కూలీలు దొరకకపోతే సర్వనాశనం అయిపోతామని వారందరూ బ్రిటిష్ అధికారులకు మొర పెట్టుకున్నారు. అంతేకాకుండా తమ లాభాలు తగ్గకుండా చూడాలంటే- వారికి అతి తక్కువ కూలికి పనిచేసే మనుషులు కావాలి. దీనికి తోడు ఉత్పత్తిదారులకు మరొక సమస్య ఎదురయింది. అప్పటికే వారి దగ్గర కూలీలుగా పనిచేస్తున్న వారు తమకు ఎక్కువ వేతనాలు కావాలని డిమాండ్ చేయటం మొదలుపెట్టారు. దీనితో వారు భారత్‌పై దృష్టి పెట్టారు. బ్రిటన్ కూడా తమ లాభాల కోసం భారత్ నుంచి కూలీలను పంపటం మొదలుపెట్టింది.

కూలీ ఉమన్
గాయత్ర బహదూర్
ప్రచురణ: హేచట్
ధర: రూ. 599
పేజీలు: 274
అన్ని ప్రముఖ పుస్తకకేంద్రాల్లో లభిస్తాయి

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.