
పురావస్తు ఆధారాల సాయంతో చరిత్ర పునర్నిర్మాణం జరగాలన్న ప్రక్రియ భారతదేశంలో ఆలస్యంగా ఆరంభమైంది. సాహిత్యాధారాలు ప్రధానంగా – వేద వాంగ్మయం, ప్రాచీన కావ్యాలు, కావ్యావతారికలు, యాత్రా చరిత్రలు ఇత్యాదులే చరిత్ర రచనకు ఉపకరించుకున్నారు. జాతీయోద్యమం ఊపందుకొన్నాక, గతకాలపు వైభవాన్ని, కీర్తిని తవ్వితీసి ప్రజల ముందుంచాలన్న భావజాలం ముందుకొచ్చింది. 1920వ దశకంలో, సర్ జాన్ మార్షల్ లాంటి పురావస్తు శాస్త్రవేత్తలు కాలగర్భంలో కలిసిపోయిన చరిత్రను త్రవ్వితీసి కొత్త ఆవిష్కరణలు చేశారు. ఇందులో భాగంగానే హరప్పా సంస్కృతి వెలుగులోకొచ్చింది. దీంతో, ప్రపంచంలో అత్యంత, పురాతన నాగరికతల్లో భారతదేశమూ చోటు దక్కించుకొంది. నికార్సయిన ఆధారాలతో, పురావస్తు, శాసన, నాణేలు, కట్టడాలు ఆధారంగా, సాహిత్యాధారాలతో సరిచూసి, చరిత్ర రచన ఆరంభమైంది.
ఈ ధోరణి, ఆంధ్ర దేశంలో, 20వ శతాబ్దం మొదటి దశకంలో ఆరంభమైంది. 1910లో రాబర్ట్ సీవెల్ విజయనగర సామ్రాజ్యంపై Forgotten Empire అనే అద్భుతమైన గ్రంథం ప్రచురించారు. ఆంధ్ర దేశంలో చరిత్రకారులకిది మార్గదర్శకం కాగా, జయంతి రామయ్య పంతులు ఆంధ్ర సాహిత్య పరిషత్తు (1911), అంతకు ముందు, కొమర్రాజు వారి విజ్ఞాన చంద్రికా గ్రంథ మండలి (1905), కొమర్రాజు, చిలుకూరి వీరభద్రరావులు తెలుగువారి చరిత్రపై రాసిన గ్రంథాలు, 1925లో ఏర్పడ్డ ఆంధ్ర ఇతిహాస మండలి వచ్చాయి. ఈ కుదురునుంచే మల్లంపల్లి, నేలటూరి, సురవరం, మారేమండ, భావరాజు ఇలా మరెందరో చరిత్రకారులు తెలుగువారి చరిత్రకు పునాదులు వేశారు.
తొలితరం చరిత్రకారుల స్ఫూర్తితో, ఆ తర్వాతి తరంలో ముందుకొచ్చిన వారిలో, ఇంగువ కార్తికేయ శర్మ ప్రముఖులు. నెల్లూరు జిల్లా పల్లెపాడులో పుట్టి (1937) పెరిగిన శర్మ, నాగపూర్ విశ్వవిద్యాలయంలో, స్నాతకోత్తర విద్య పూర్తిచేసి, పూణేలో పరిశోధన చేశారు. పురావస్తు త్రవ్వకాల్లో ప్రావీణ్యం సంపాదించారు. వీరి పరిశోధనాంశం Development of Early Saiva Architecture With Special Reference to Andhradesa. ఈ పరిశోధన తర్వాత, శర్మ విస్తృతంగా పురావస్తు త్రవ్వకాలు చేపట్టారు. ఇందులో చెప్పుకోదగ్గ వాటిలో ముఖ్యమైనవి పెదవేగి, గుడిమల్లాం, గుంటుపల్లి, నాగార్జున కొండ, పైయన్‌పల్లి (తమిళనాడు), పేని, సర్కొబాడ, అమరావతి కాగా, హరప్పా సంస్కృతి పొడిగింపుగా, గుజరాత్‌లోని ప్రాచీన ఓడరేవు, కాళీబంగన్ దగ్గర త్రవ్వకాల్లో పాల్గొనడం విశేషం. ముఖ్యంగా క్రీ.పూ. 2, 3 శతాబ్దాల నాటి శైవక్షేత్రంగా, గుడిమల్లాం చారిత్రక నేపథ్యాన్ని నిగ్గుదేల్చడం శర్మ కనుగొన్న ముఖ్య పరిశోధనల్లో ఒకటి.
ఇంగువ కార్తికేయ శర్మ బహుముఖ ప్రజ్ఞా పాండిత్యాలు గల చరిత్రకారుడుగా గణుతికెక్కారు. పురావస్తు పరిశోధనలే కాక, నాణేల పరిశోధనలో కృషిచేసి, శాతవాహనుల కాలంనాటి నాణేలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, శాతవాహన రాజుల కాలాన్ని (Chronology)
ఖరారు చేశారు. The Coinage of the Satavahana Empire గ్రంథాన్ని వెలువరించారు. శాసనాలను పరిశీలించి, ముఖ్యంగా, బ్రాహ్మి లిపిలోని శాసనాలను నిశితంగా అధ్యయనం చేసి, Early Andhra Inscriptionsòపై ప్రామాణిక గ్రంథాన్ని రచించారు. గుల్బర్గా జిల్లా ప్రాంతంలో లభించిన సన్నతి శాసనాలను సేకరించి, వాటికి భాష్యం చెప్పారు.
అనన్య సామాన్యంగా సాగిన శర్మ కృషి చరిత్ర విభాగంలో పలు అధ్యయనాలకు దారితీసింది. మ్యూజియాలజీ, ప్రాచీన సంపద పరిరక్షణ, వాస్తు నిర్మాణ, ప్రతిమా (Conography) శాస్త్రాల్లో ప్రావీణ్యం సంపాదించారు. Numismatic Society of South India కి బాధ్యులుగా, ఆ సంస్థ ప్రచురించిన పరిశోధక జర్నల్‌కు సహ సంపాదకులుగా పనిచేశారు. బౌద్ధంపై ప్రత్యేకించి విశేష కృషి సల్పిన శర్మ, Buddhist Monuments of China, and South East Asia అనే గ్రంథాన్ని వెలువరించారు. ఈ పరిశోధనలో భాగంగా, చైనా, జపాన్, టిబెట్, నేపాల్ దేశాలను సందర్శించి, అక్కడ నెలకొన్న బౌద్ధ మత సంబంధ విశేషాలను అధ్యయనం చేశారు. వారి ప్రచురణల్లో చెప్పుకోదగ్గ మరో గ్రంథం Science of Archaeology in India. తెలుగులో, ‘ఆంధ్ర దేశంలో శైవ, వైష్ణవ ప్రతిమా లక్షణం’, రాశారు. ప్రతిమా శాస్త్రంలో వారి ప్రావీణ్యానికి నిదర్శనం వారి ‘సప్తస్వరశివ’ అనే వ్యాసం.
అఖిల భారత పురావస్తు శాఖలో సంచాలకులుగా పురావస్తు త్రవ్వకాలను, కట్టడాలను పర్యవేక్షించారు. సాలార్ జంగ్ మ్యూజియం సంచాలకులుగా, అనేక కొత్త ప్రదర్శితాలను (Eplifits) సంపాదించడమే గాక, Westren Gallery వారి హయాంలోనే ప్రారంభం కావడం విశేషం. వారసత్వ సంపద పరిరక్షణ వారికి ప్రాణప్రదం. పురావస్తు శాఖ నుంచి, సాలార్ జంగ్ మ్యూజియం దాకా వారీ విషయంలో ప్రత్యేక శద్ధ్ర ప్రదర్శించారు. యునెస్కోలో సభ్యులుగా పనిచేశారు కూడా. మనకున్న చరిత్రకారుల్లో ఇంతటి బహుముఖ ప్రజ్ఞాశాలి మరొకరు లేరనడం అతిశయోక్తి కానేరదు. ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కలిసి సంయుక్తంగా వెలువరిస్తున్న ఎనిమిది సంపుటాల ఆంధ్రప్రదేశ్ సమగ్ర చరిత్ర – సంస్కృతి గ్రంథాల్లో రెండవ సంపుటానికి, ‘తొలి చారిత్రక ఆంధ్రప్రదేశ్ క్రీ.పూ. 5000 – క్రీ.శ. 624), సంపాదకత్వం వహించారు.
– వకుళాభరణం రామకృష్ణ
మాయ నుంచి తప్పించుకోవడం ఎలా?

కార్తీక మాసం ఉపాసన కాలం కాబట్టి ఈశ్వరుడు భక్తులకు చేరువలో ఉంటాడు. కానీ ఆ ఈశ్వరుడిని మాయ కమ్మేసి ఉంటుంది. ఆ మాయను దాటి ఆ ఈశ్వరుడిని చేరుకోవటం ఎలాగో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు శర్మ తెలియజేస్తున్నారు.
మానవుడికి మోక్షాన్ని ఇవ్వగల శక్తి ఈశ్వరుడికి ఉంది. ఆయన శక్తి క్షీణించిపోనిది. నిరంతరం ఉత్సాహభరితమైనది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సృష్టి అంతా ఈశ్వరనిదే. ఈ విషయం తెలుసుకునే పెద్దలు, ‘అంతా ఈశ్వరుడిదే.. ఈశ్వరుడిది కానిది ఏదీ లేదు’ అనే భావనతో బతుకుతారు. ఈశ్వరుడిని చేరుకోవటం ఎంత సులభమో.. అంత కష్టం కూడా. ఆయన మాయ మనను అడ్డగిస్తూ ఉంటుంది. ఈశ్వరుడి అనుగ్రహం వల్లే ఆ మాయ తొలగుతుంది. దీనికి ఒక ఉదాహరణ చెప్పవచ్చు. మేఘం సూర్యుడి వల్లే ఏర్పడుతుంది. సూర్యుడు సముద్రంలో నీటిని గ్రహిస్తే ఆ నీరు ఆవిరిగా మారి మేఘ రూపంలో ఏర్పడుతుంది. ఆ మేఘం సూర్యుడికి అడ్డు వస్తుంది. అప్పుడు సూర్యుడు కనబడడు. ఈ విధంగానే ఈశ్వరుడు సృష్టించిన మాయ- మనకు అడ్డుపడుతుంది. ఇది ఈశ్వరుడి ఆరాధన వల్ల, ఈశ్వర స్వరూపులయిన గురువాక్కుల వల్ల తొలగుతుంది. అందుకే మన పెద్దలు గురువులేని విద్య గుడ్డి విద్య.. అంటారు.
మాయా స్వరూపం
ఈ మాయ చాల చిత్రంగా ఉంటుంది. దీని వల్ల కామక్రోధాలు వస్తాయి. ఈశ్వరునితో ఉన్న పట్టు పోతుంది. అంతా తన ప్రజ్ఞగానే కనిపిస్తుంది. గొప్ప మహాత్ములయినవారు కూడా ఒక్కొక్కసారి మాయకు వశులయిపోతూ ఉంటారు. అలాంటి వాటిని మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి. మహాత్ములెవరూ తమ జీవితంలోని సంఘటనలను దాచరు. వారు అన్ని విషయాలనూ రాసేస్తారు. మహాత్మా గాంధీ తన జీవితంలో ఎలాంటి సంఘటననూ దాచలేదు. చంద్రశేఖర పరమాచార్య తన 73వ ఏట- ‘ఇప్పటికీ ఆశ అప్పుడప్పుడు నన్ను వశపరుచుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది’ అని చెప్పుకున్నారు. దీనికి సంబంధించి శివ పురాణంలో ఒక గొప్ప కథ ఉంది. ఒకానొక సమయంలో నారద మహర్షి హిమాలయాల కింది భాగంలో, పరమ శివుడు తపస్సు చేసిన ప్రాంతంలో కూర్చుని- పరబ్రహ్మాన్ని గురించి తపస్సు చేశారు. నారదుడిని పరీక్షించటానికి ఇం«ద్రుడు మన్మథుడిని పంపాడు.
మన్మథుడి ప్రయత్నాలకు నారదుడు లొంగలేదు. నారద మహర్షి తపస్సు సఫలీకృతం అయింది. ఆ తపస్సు పూర్తిచేసి ఆయన బయటకు వచ్చి శంకరుడి దగ్గరకు వెళ్లాడు. ‘ఈశ్వరా, హిమాలయాల్లో ఉండే గుహలో కూర్చుని నేను తపస్సు చేశాను. మన్మథుడు వచ్చి నా మీద బాణాలు వేసే ప్రయత్నం చేశాడు. కానీ నేను ఆ మన్మథ బాణాలను లెక్కపెట్టలేదు. కామాన్ని జయించి నేను తపస్సులో సిద్ధిని పొందాను’ అన్నాడు. నారదుని మాటలు విని శంకరుడు నవ్వాడు. ‘నారదా, నువ్వు చాలా చక్కటి మాట చెప్పావు. నువ్వు కాముడినే జయించావా? కాముడిని జయించడమంటే మాటలు కాదు. నేను చాలా సంతోషించాను. కానీ నారదా, నీకొకటి చెబుతాను, గుర్తుపెట్టుకో. నా దగ్గర చెప్పినట్లు నారాయణుడితో చెప్పకు’ అని సలహా ఇచ్చాడు. కానీ నారదుడు శంకరుడి మాటలను పెద్దగా పట్టించుకోలేదు. గురువుల మాటను తిరస్కరించడం అంటే ఇదే! నారదుడు వైకుంఠానికి బయలుదేరాడు.
మధ్యలో తన తండ్రి, సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మ దగ్గరకు వెళ్ళాడు. తండ్రితో కూడా తాను చేసిన తపస్సు గురించి, మన్మథుడు వచ్చి బాణాలు వేసినా తాను చలించని విషయాన్ని గురించి చెప్పాడు. అప్పుడు బ్రహ్మ, ‘నువ్వు ఎక్కడ కూర్చుని తపస్సు చేశావో అక్కడ ఇంతకు పూర్వం పరమ శివుడు కూర్చుని తపస్సు చేశాడు. అక్కడికి మన్మథుడు వస్తే ఆయన తన మూడవ కంటి మంటతో అతన్ని కాల్చేశాడు. అపుడు మన్మథుడు బూడిద అయిపోయాడు. ఆ ప్రాంతంలో మన్మథ బాణాలు పనిచేయకపోవడానికి కారణం, నువ్వు కాముడిని గెలవడానికి కారణం ఇంతకు పూర్వం ఈశ్వరుడు అక్కడ తపస్సు చేయడం. అది శివ ప్రజ్ఞ. నీ ప్రజ్ఞ కాదు” అని మందలించాడు. అందువల్ల మనం ఎప్పుడైనా ఏదైనా సాధిస్తే అది ఈశ్వరాన్రుగహం వల్ల జరిగిందనే అనుకోవాలి. అంతేకానీ మన ప్రతిభగా చెప్పుకోకూడదు. ఆ సాధించిన దానిని మనలో నిక్షేపించుకోకూడదు.
(ఎమెస్కో ప్రచురించిన కాశీ పురాణం నుంచి)
శంభు నామ మహత్యం!

కార్తీక మాసంలో శంభునామాన్ని జపిస్తే అన్ని పాపాలూ పోతాయని పెద్దలు చెబుతూ ఉంటారు. దీని వెనకున్న తత్వాన్ని చాగంటి కోటేశ్వరరావు శర్మ ఇక్కడ వివరిస్తున్నారు.
పరమ శివుడిని ‘శంభుః’ అని ఒక చిత్రమయిన నామంతో పిలుస్తారు. ‘శం’ అంటే నిరతిశయమయిన సుఖం. ‘భావయతి’ అంటే కల్పించేవాడు. ఒక వస్తువును అనుభవించినప్పుడు దాని వల్ల కొంత సుఖానుభూతి కలుగుతుంది. ఒక వస్తువు అస్థిత్వంలో ఉండడానికి, అది అనుభూతిగా మారడానికి మధ్యలో చాలా తేడా ఉంటుంది.
ఈ శక్తిని ప్రసాదించేవాడు ఈశ్వరుడు. అందుకే- ‘ఈశ్వరాత్ జ్ఞానమన్విచ్ఛేత్ జ్ఞానదాతా మహేశ్వరః’ అంటారు. ఈశ్వరుని అన్రుగహం వల్ల మాత్రమే జ్ఞానం కలుగుతుందని దీని అర్థం. శంభునామాన్ని గట్టిగా పట్టుకుని ఆ నామంతో పిలిస్తే, ఆయన మన భావాల్ని మార్చి మనసును ఈశ్వరుడి వైపు తిప్పుతాడు. స్రత్పవర్తన కల్పిస్తాడు. అందుకే ప్రతి రోజూ శంభునామాన్ని చెప్పుకుంటూ ఉంటూ శంభుని అన్రుగహాన్ని పొందాలి. అప్పుడు శంభుడు-ఈ లోకంలో సుఖం దగ్గర నుంచి నిరతిశయ సుఖం వరకు, ఊర్ధ్వలోక సుఖం వరకు ఎంత సుఖం ఉందని అందరూ అనుకుంటున్నారో అన్నీ ఇస్తాడు. దీనినే కామకోటి అని పిలుస్తారు. కామకోటి అంటే కోర్కెలను ఇవ్వడంతో మొదలుపెట్టి కోర్కెలు లేకుండా చెయ్యడం వరకు తీసుకువెళ్ళి, ఆ తరువాత పుణ్యాన్ని ఇచ్చి, పుణ్యం వల్ల ఊర్ధ్వలోక ప్రాప్తి వరకు ఇచ్చి, తరువాత మరల తిరిగి రానవసరం లేని పునరావృతరహిత శాశ్వత శివ సాయుజ్య స్థితిని అనుగ్రహిస్తాడు.
లోకములు మూడు..
ఈ లోకంలో సుఖంగానే జీవిస్తున్నాం. మిగిలిన విషయాల గురించి అప్పుడే చింత ఎందుకనే భావన కొందరిలో ఉంటుంది. అందుకే మన పెద్దలు లోకాలను మూడుగా విభజించారు. ఒక లోకం కేవలం సుఖాలను అనుభవించడానికి మాత్రమే ఉంటుంది. అక్కడ దుఃఖస్పర్శ ఉండదు. మరొక లోకం- నరకంలో- సుఖమన్నది ఉండదు. ఎప్పుడూ ఏడుపులు, పెడబొబ్బలు, కేకలు, అరుపులతో భయంకరంగా ఉంటుంది. అది నరక లోకం. ఇక భూలోకంలో సుఖం, దుఃఖం రెండూ ఉంటాయి. ఒక రోజు మనిషి చప్పట్లు కొట్టేస్తూ, పొంగిపోతూ, అన్నీ నేనే అనుకుంటూ ఉంటాడు. మరొక రోజు కుమిలిపోతూ ఏడుస్తూ ఉంటాడు. అదే భూలోకం. ఇక్కడ జీవుడు సుఖదుఃఖాలను రెండిటినీ అనుభవిస్తూ ఉంటాడు. ఇక్కడి నుంచి పూర్ణ దుఃఖం కలిగిన లోకం లోకయినా వెళ్ళవచ్చు లేదా పూర్తి సుఖం కలిగిన లోకం లోకయినా వెళ్ళవచ్చు. కానీ స్వర్గానికి వెళ్లాలంటే పాపం చేయకుండా ఉండాలి. అది అంత తేలికైన పని కాదు.
మనం సాధారణంగా ‘చతుర్ముఖ బ్రహ్మ మన లలాటం మీద రాసిన రాతప్రకారం మనం పనులు చేసేస్తూ ఉంటాం’ అని అనుకుంటాం. కానీ అది తప్పు. మన పూర్వీకులు మనం అనుక్షణం శివుడిని ప్రార్థించాలని కోరుకున్నారు. అందుకే తిలకధారణాన్ని సూచించారు. విభూతి తీసుకొని నుదుటను బొట్టు పెట్టుకుంటే- పార్వతీ పరమేశ్వరుల్ని నుదిటిపై పెట్టుకున్నట్లే! ‘లలాట లిఖితారేఖా పరిమార్తుం నశక్యతే’ అనేది సామాన్య సిద్ధాంతం. అంటే బ్రహ్మ రాసిన రాత మారదు అని చెప్పటం. కానీ తిలకధారణ చేసి విభూతి పెట్టుకోగానే, ఆలోచనా సరళిలో మార్పు వస్తుంది. తప్పుడు పనులను మానేయాలనే భావన కలుగుతుంది. అటువంటి తప్పుడు పనులను చేయకూడదనే పూనిక రావడం ప్రారంభమవుతుంది. మనసును జయించటానికి ముందు శరీరాన్ని అలంకృతం చేస్తారు. అలా చేయడం ప్రారంభిస్తే దుఃఖాన్ని స్వీకరించి దుఃఖం నుండి బయటపడతారు.
ఇది వినటానికి చాలా చిత్రంగా ఉంటుంది. ఈ లోకంలో సత్త్వం, రజస్సు, తమస్సు అనే మూడు గుణములు ఉన్నాయి. ఈ త్రిగుణాలు మన మనసును సుఖాలను అనుభవించమని ప్రోత్సహిస్తూ ఉంటాయి. ఉన్నతిని పొందకుండా బాధిస్తూ ఉంటాయి. ఉన్నతిని పొందకుండా బాధించే త్రిగుణాల బాధ నుండి బయటపడడానికే చాలా మంది సంసారమనే కొత్త బాధను ఎంచుకుంటారు. సంసారంలో ఉండి తరించడం చాల కష్టం. అలా తరించాలంటే దానికి మార్గం తెలియాలి. మరి బాధపోవడానికి సుఖంలోకి కదా వెళ్ళాలి? మరి బాధపోవడానికి బాధలోకి వెళ్లమనడంలో ఉద్దేశం ఏమిటి? సత్వరజస్తమోగుణాలనే మూడు గుణముల నుండి బయటపడడానికే సంసారంలోకి ప్రవేశించి సుఖాలను అనుభవించి, ఈ సుఖాలు సుఖాలు కావు, నిజమయిన సుఖం ఈశ్వరుడే అనే లక్షణాన్ని ఏర్పరచుకుని, వైరాగ్య సంపత్తిని పెంపొందించుకోవడం. దీని వల్ల ఇక ఇంద్రియాలు, మనసు చలించని స్థితికి వెడతాడు. దీనిని ఒక ఉదాహరణతో చెప్పవచ్చు. గాలి మల్లెపూల మీదుగా వెళ్తుంది. తాను మల్లెపూవుల మీద నుండి వస్తున్నానని పొంగిపోదు. అశుద్ధం మీదుగా వెళ్తుంది. తాను అశుద్ధం మీదుగా వెళ్ళానని బాధపడదు. దేని మీద నుంచి వెళ్ళినా గాలి గాలిగానే ఉంటుంది. దానికేమీ బాధలేదు. అలాగే పూర్ణ వైరాగ్యం పొందిన వారికి సుఖదుఃఖాల బాధ ఉండదు.
(ఎమెస్కో పబ్లికేషన్స్ ప్రచురించిన శివ పురాణం నుంచి)

