
త్యాగయ్య సంగీతాన్ని ఆలపించడం తప్ప, ఆయన సంగీతజ్ఞతకు ప్రాచుర్యం కల్పించడానికి తెలుగునాట ఇంతవరకూ జరిగిందేమీ లేదు. తిరువయ్యూరు తమిళులు తప్ప తెలుగువారు ఏనాడూ స్ఫూర్తిని పొందలేకపోయారు.
తెలుగుతనంతో సంగీతాన్ని సుసంపన్నం చేసిన త్యాగరాజును తెలుగువాడని చెప్పుకుంటూ మురిసిపోవటం తప్ప ఆ స్మృతులు, పరంపర కాపాడుకోవటంలో శ్రద్ధ కొరవడుతోంది. 2013 ఏడాదిని తెలుగు భాష సాంస్కృతిక వికాస సంవత్సరంగా ప్రకటించిన తరువాత చివరి రోజులు కరిగిపోతున్నా త్యాగయ్యకు సంబంధించిన వారసత్వ పరిరక్షణలో ఇదమిత్థమైన కార్యాచరణను కూడా రూపొం దించలేకపోయారు. ఆ రంగంలో మనసుపెట్టి నిబద్ధతతో కృషి చేసేవారికి కాస్తంత ప్రోత్సాహం కల్పించటంలో ప్రభుత్వానికి సాంస్కృతిక రంగ ప్రముఖులకు ఆలోచనలు కూడా లేకపోవటం తెలుగుతనానికి మకిలి మరక అయింది.
ప్రపంచంలో మరెక్కడా లేనంత వైభవంగా జరిగే సంగీతోత్సవం తమిళనాడులోని తిరువాయూరులో జరుగుతున్నా మన రాష్ట్రంలో సంగీత కళాకారులు, విద్వాంసులు క్రమం తప్పకుండా పాల్గొంటున్న ఆనవాయితీ లేనే లేదు. ప్రభుత్వం తరపున కొన్ని సంవత్సరాలు త్యాగరాయ ఆరాధన ఉత్సవాలు జరిగినా అందులో దుబారా, అవినీతి తప్ప అసలు సిసలు చిత ్తశుద్ధి అంతంత మాత్రమే. సాంస్కృతిక శాఖ కార్యాలయ ప్రాంగణంలో సంబంధిత అధికారుల పాత్ర ప్రభుత్వ నిర్వహణలోని సంగీత నృత్య కళాశాలల అ«ధ్యాపకులు వారి వెంట వచ్చే కొద్దిమంది విద్యార్థులకు పరిమితమైపోతోంది. మొత్తం మీద ఆ ఉత్సవం కొందరికి మాత్రమే సంబరం.
విశాలమైన తెలుగు గడ్డపై త్యాగయ్య కీర్తనల ప్రాచుర్యం పెద్ద ఎత్తున సంగీతోత్సవం చేయటంపై 33 ఏళ్ల సాంస్కృతిక శాఖ ఎన్నడూ దృష్టి పెట్టలేదు. మొక్కుబడి పనుల్లో కూడా తమ పబ్బం గడుపుకొనే పద్ధతి మాత్రం మానలేదు. తమిళనాడులో త్యాగయ్య సమాధి వద్ద వేలాది మంది సంగీతజ్ఞులు నిష్టతో చేసే ఆరాధన పద్ధతులు మనలో కాస్తంత కూడా కదలిక తీసుకు రాలేకపోయాయి. స్వరమయమైన జీవితం, త్యాగయ్య సన్నిధి తప్ప సంపదలను పెంచుకోవాలన్న తపన లేని హైదరాబాదీ విద్వాంసుడు కొల్లెగాళ్ సుబ్రమణ్యం వంటి వారి కృషి కూడా ప్రభుత్వ ప్రోత్సాహం పొందలేకపోయింది. తంజావూరు సమీపంలో గల తిరువయ్యూరులో త్యాగయ్య ఆలయం తీర్థయాత్ర క్షేత్రంగా మారిన క్రమాన్ని అవగతం చేసుకుంటే తెలుగుదనంపై ఆపేక్ష కలవారికి మరచిపోతున్న కర్తవ్యం మననంలోకి వస్తుంది. 167వ ఆరాధన జనవరి 17 నుంచి 21 వరకు నిర్వహించటానికి చెన్నై నుంచి పెద్దయెత్తున సన్నాహాలు జరుగుతున్న సమయంలో మన ఆలోచనల నుంచి నెమరుకు తెచ్చుకోవాల్సినవి చాలానే ఉన్నాయి.
మారుతున్న క్రమం
1847లో పుష్య బహుళ పంచమి రోజున సమాధి స్థితి పొందిన త్యాగయ్యకు స్వరనీరాజనాలతో ఆరాధన ఉత్సవం చేయటం 1941 దాకా స్పష్టమైన రూపుదిద్దుకోలేదు. కొందరు స్వార్థంతో, ఆభిజాత్యంతో తమకు తామే పెద్దలుగా ప్రకటించుకుని, అద్భుత స్వర ప్రపంచానికి గ్రహణం పట్టించారు. నిజమైన అభిమానుల వల్లే ఆరాధన ఉత్సవాలు విశ్వవ్యాప్తం అయ్యాయి. త్యాగయ్య వద్ద శిష్యరికం చేసినవారు, ఆయన ఆలపిస్తుంటే రాసిపెట్టి భద్రపరిచిన వారు 1847 స్వామి సమాధితో ఎవరి దోవన వారు చీలికలు పేలికలు అయ్యారు. వాలాజాపేట వెంకటరమణ భాగవతార్, ఉమయాళపురం సుందర భాగవతార్, కృష్ణ భాగవతార్, తిలైస్థానం రామయ్యంగార్, తంజావూరు రామారావు, వీణా కుప్పయ్యర్, మానాంబు చావడి వెంకట సుబ్బయ్యర్ వంటివారు నిత్యం త్యాగరాజు వెంట ఉండేవారు.
త్యాగయ్య శిష్యులలో చొరవ లేని కారణంగా 1885 దాకా తిరువయ్యారులో కుటుంబ సభ్యులు పెట్టే ఆబ్దీకం తప్ప స్వరనివాళి పద్ధతి లేనే లేదు. 1905లో శిష్యవర్గంలోని ఇద్దరు వైరి వర్గాలు విడివిడిగా పోటాపోటీగా త్యాగయ్య ఆరాధనకు తెరతీశారు. పంచమి రోజు ప్రధాన దినంగా ఒక వర్గం వారు అయిదు రోజులు ముందు మొదలుపెట్టి చేసేవారు. మరో వర్గంవారు ఆ తరువాత 4 రోజులు చేసే వారు. సమారాధనతో పాటు పేదలకు అన్నదానం వంటివి నిర్వహించేవారు. ఆ పరిసర ప్రాంతాల్లో బియ్యం, పప్పులు, కూరగాయలు, చందాలు వసూలు చేస్తుండటంతో కొందరు పెద్దల జోక్యం చేసుకుని ఈ రెండు వర్గాల మధ్య రాజీ కుదర్చారు. దాంతో సంయుక్త నిర్వహణకు నాంది పడింది.
కాగా ఛాందసంతో ఆరాధనలో నాదస్వరం వద్దని, మహిళలు ఇక్కడికి రాకూడదని నిషేధాలు విదించి, మరికొన్ని ఆంక్షలు కూడా విధించి, ఆరాధనకు వచ్చేవారికి ఆటంకాలు కలిగించేవారు. అవన్నీ తెలుసుకుని అచ్చంగా ఏం చేయాలో నిర్ణయించుకున్న అసలైన అభిమాని నాగరత్నమ్మ తిరువయ్యారులో ప్రవేశించటంతో అక్కడి వ్యవహారాలు మొత్తంగా మారాయి. నాట్యంతోపాటు ఆలాపనలో నిష్ణాతురాలైన ఆమె తనకు సమకూరిన సంపదనంతా త్యాగయ్యకు వెచ్చించాలని నిత్య సంస్మరణకు నెలవుగా సమాధి ప్రాంతాన్ని జన సందర్శనీయ స్థలంగా చేయాలని తన శేష జీవితాన్ని అక్కడే గడపాలని భావించారు. అప్పటిదాకా ఆ గ్రామంలోని సత్రాలు, చావడులలో జరిగేవన్నీ సమాధి పరిసరంలో ఆలయ ప్రాంగణంలో వైభవంగా ఎల్లకాలం జరిగేలా చేయాలని ఆమె ఎంతగానో తపించింది. త్యాగరాజు గురువు శొంఠి వెంకటరమణయ్య సమాధి పక్కన, త్యాగయ్య నిర్యాణం చెందిన ప్రాంతం పక్కన ఉన్న స్థలాన్ని ఆమె కొనుగోలు చేశారు.
కేసులు, ఫిర్యాదులు
నాగరత ్నమ్మ రావడం, ఆమె పని పద్ధతులు ఏమాత్రం గిట్టని శిష్య పరంపర ఆధిపత్యంతో చికాకులు పెట్టారు. ఫిర్యాదులు, కేసులతో త్యాగయ్య సమాధి ఆలయ నిర్మాణం వంటివి న్యాయస్థానం తీర్పు దాకా వెళ్లాయి. మొత్తం మీద 1921లో అక్కడ అడుగుపెట్టిన నాగరత ్నమ్మ తాను అనుకున్నట్టుగానే స్థలం సేకరించి, విగ్రహాన్ని తయారు చేయించి, 1925 జనవరి7 నాటికి కుంభాభిషేకంతో ఆలయాన్ని ఆరాధన పద్ధతులకు అనువుగా తీర్చిదిద్దారు. కోర్టువారు కూడా త్యాగయ్యకు శ్రద్ధాంజలికి అందరూ కూడివచ్చేలా ఓ స్పష్టమైన విధానాన్ని అందరికీ ఆమోదమైన విధంగా ఖరారు చేశారు.
1940 దాకా కార్యక్రమాలన్నీ అప్పటి నిర్వాహకుల యోచనలకు తగ్గట్టుగా జరిగాయి. హరికేశ నల్లూరు భాగవతార్ చొరవతో విద్వాంసులందరినీ సమావేశపరిచి ఘన రాగ పంచకం ఎంపిక చేసి ఆరాధన, ఆలాపన, పూజలకు కొత్తదారి తెచ్చిపెట్టారు. పంచరత్నాలుగా ప్రాచుర్యంలోకి వచ్చిన నాట, గౌళ, ఆరభి, వరాళి, శ్రీ రాగాలను నాదస్వరం తో పాటు ఆడా మగా తేడాలు లేకుండా సామూహికంగా ఆలపించటం శాస్త్రీయ సంప్రదాయం అయింది.ఆ ఆరాధన నమూనా మొత్తం సంగీత ప్రపంచానికి ఆదరణీయంగా దేశవిదేశాల్లో అనుసరణీయంగా మారింది. కొత్త కొత్త ఆలయాలు అన్ని ప్రాంతాల్లో సంగీత నిలయాలుగా ఆవిర్భవించాయి.
– జి.ఎల్.ఎన్. మూర్తి

