
పరమేశ్వరుడికి ‘శశి శేఖరుడు” అనే పేరు కూడా ఉంది. శివుడికి ఆ పేరు ఎలా వచ్చిందో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు శర్మ వివరిస్తున్నారు.శశకం అంటే కుందేలు. దూకే స్వభావం ఉన్నది కుందేలు. అలాంటి స్వభావం ఉన్నదే కాలం. ఈ కాలాన్ని ఒడిసిపట్టుకొని తన వద్ద పెట్టుకున్నవాడు కాబట్టి శశి శేఖరుడు అని పిలుస్తారు. ఈ నామాన్ని మనం తాత్విక ధోరణిలో కూడా చూడాలి. మనిషికి సుఖము ఉంటే కాలం దూకేస్తుంది. దుఃఖం కలిగితే కాలం గడుస్తున్నట్టు అనిపించదు. కానీ కాలంలో
సుఖదుఃఖాలు రెండూ ఉంటాయి. కాలానికి ఉన్న ఈ ద్వైదీ స్వభావాన్ని వైదిక సమన్వయం చేస్తే అది సరైన నిర్వచనమవుతుంది. అలాంటి ద్వైదీ స్వభావం ఉన్న కాలాన్ని ఆభరణంగా ధరించిన వాడు శివుడు. దీనినే చంద్రరేఖతో సూచిస్తారు. ఈ పేరు రావటానికి వేరొక కథ కూడా చెబుతారు. దక్ష ప్రజాపతికి ఇరవై ఏడుమంది కుమార్తెలు. వీరిందరికీ నక్షత్రాలు పేర్లు పెట్టారు. వీరందరినీ చంద్రుడికిచ్చి వివాహం చేశారు. వాస్తవానికి ఇంత మంది భార్యలున్న చంద్రుడు చాలా ఆనందంగా ఉండాలి.
కానీ చంద్రునిలో ఒక దోషం ఉంది. ఆయనకు విచక్షణ ఉండదు. తొందర ఎక్కువ. చంద్రుడు తన భార్యలలో ఒకరైన రోహిణి మీద ఎక్కువ ప్రేమను కనబరిచేవాడు.. ఇది సహజంగా మిగిలిన ఇరవై ఆరుమందికి బాధ కలిగించింది. దీనితో వారు తండ్రి దగ్గరకు వెళ్లి, “నాన్నగారూ! మీరు ఎందుకు ఈ తప్పు చేశారు? మా ఇరవై ఏడు మందిలో ఒకవేళ రోహిణియే అందగత్తేమో! రోహిణినొక్కదాన్నీ చంద్రుడికిచ్చి వివాహం చేస్తే సరిపోయేది. చందమామలాంటి భర్తను పొందడానికి మేం అర్హులం కామేమో! అందుకేనేమో చంద్రునికి రోహిణి మీద ఉన్న ప్రేమ మా మీద లేదు. మేం ఎంత పనికిమాలినవారమైనా మాకు తగిన భర్తలు పృథ్విలో ఉండరా? మాకు చాలా బాధగా ఉంది ” అని మొరపెట్టుకున్నారు. దక్షప్రజాపతికి చాలా కోపం వచ్చింది. వెంటనే చంద్రలోకం వెళ్లాడు. చంద్రునితో “నీకు నేను నా ఇరవై ఏడు మంది కుమార్తెలనూ ఇచ్చి వివాహం చేసినప్పుడు అందరినీ జ్రాగత్తగా సమానంగా చూసుకుంటానని మాట ఇచ్చావు. కానీ నువ్వు ఒక్క రోహిణితో మాత్రమే ఉంటున్నావని తెలిసింది. ఇలా ఉండడానికి వీలులేదు. ఇరవై ఏడు మంది పిల్లల కంటి వెంటా నీళ్ళు రాకూడదు. అందరినీ సమానంగా చూసుకోవాలి’ అని హితవు చెప్పాడు. చంద్రుడు అంగీకరించాడు. కొంతకాలం గడిచింది. కానీ చంద్రుడి ప్రవర్తనలో ఎలాంటి మార్పూ రాలేదు.
దీనితో దక్షుడికి చాలా కోపం వచ్చి చంద్రుడిని, ‘నీ విశృంఖలత్వానికి నేను అడ్డువేస్తాను. నీవు క్షయ వ్యాధి పీడితుడవు అవుదువు గాక’ అని శపించాడు. చంద్రుడికి క్షయవ్యాధి వస్తే దేవతలందరూ నీరసపడిపోయారు. దీనికొక కారణముంది. చంద్రుడు బాగా ప్రకాశిస్తే ఆయన అన్రుగహం వల్ల ఓషధులు ప్రకాశిస్తాయి. ఓషధులు బాగా ప్రకాశిస్తే ఓషధులతో కూడిన ద్రవ్యంతో యజ్ఞం చేయవచ్చు. యజ్ఞంలో ఈ ఓషధుల్ని కూడా వేస్తే ఈ హవిస్సులను దేవతలు తీసుకుంటారు. అప్పుడు దేవతల ఆకలి తీరుతుంది. చంద్రుడికి క్షయవ్యాధి సోకడం వలన దేవతలకు హవిస్సులు లేవు. ఇది చంద్రుడి వ్యక్తిగత సమస్య కాదు. లోకాల సమస్య అయి కూర్చుంది. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మ, ‘నేను లోక సంక్షేమం గురించి చెబుతున్నాను. ఇప్పుడు చంద్రుడు ప్రభాస క్షేత్రానికి వెళ్ళాలి. ప్రభాస క్షేత్రం సముద్ర ఒడ్డున ఉంది. ఆ ప్రభాస క్షేత్రంలో ఒక గుంట తవ్వి అందులో ఒక పార్థివ లింగాన్ని పెట్టుకుని పంచాక్షరి మహా మంత్ర జపాన్ని మృత్యుంజయ మంత్రంతో కలిపి అనుష్ఠానం చెయ్యాలి.
అప్పుడు శంకరుడు కరుణిస్తాడు’ అని ఉపాయం చెప్పాడు. వెంటనే చంద్రుడు ప్రభాస క్షేత్రానికి వెళ్ళాడు. అక్కడకు వెళ్ళి పంచాక్షరీ మహా మంత్రాన్ని మృత్యుంజయ మహా మంత్రంతో అనుసంధానం చేసి కొన్ని కోట్ల సార్లు జపం చేశాడు. శంకరుడు పార్వతీ సమేతంగా ప్రత్యక్షమయాడు. చంద్రుడు తనకి క్షయవ్యాధి తగ్గిపోయేలా చేయమని పరమేశ్వరుని ప్రార్థించాడు. పరమేశ్వరుడికి వరమిచ్చే శక్తి ఉంది. కానీ వరం ఇస్తే, దక్ష ప్రజాపతి మాటకు విలువ లేకుండా పోతుంది. అప్పుడు శివుడు చంద్రుడితో, “నీకు క్షయ ఉంటుంది. కానీ నువ్వు పదిహేను రోజులు క్షీణిస్తావు. పదిహేను రోజులు వృద్ధి పొందుతుంటావు. క్షయ పూర్తిగా లేదు కాబట్టి నశించిపోవు. నువ్వు నా అనుగ్రహం పొందావని తెలుసుకోవడానికి నాతో కలిపి నీ దర్శనం చెయ్యడానికి నా పేరే నీతో కలుపుకుంటాను. చంద్రశేఖర అని పిలిపించుకుంటాను” అని ఆ చంద్రుణ్ణి తీసి నెత్తిన పెట్టుకున్నాడు.

