
వివిధ భాషల్లో ప్రచురితమయ్యే పుస్తకాలను ఒక భాష నుంచి మరొక భాషకు అనువాదం చేసి- దేశ ప్రజలందరికీ అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ నేషనల్ బుక్ ట్రస్ట్. దీని ఆధ్వర్యంలో నేటి నుంచి హైదరాబాద్‌లో పుస్తక ప్రదర్శన జరుగుతోంది. దాదాపు 14 ఏళ్ల తర్వాత ఎన్‌బీటీ నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనలో పాల్గొనటానికి ఆ సంస్థ డైరక్టర్ సికిందర్ హైదరాబాద్ వచ్చారు. పుస్తకాలకు సంబంధించిన అనేక అంశాలపై మాట్లాడారు.. ఆ వివరాలలోకి వెళ్తే..
– ప్రజలలో పఠనాసక్తి ఎలా ఉంది? ఈ విషయంపై నేషనల్ బుక్ ట్రస్ట్ ఇప్పటి దాకా అనేక సర్వేలు చేసింది కదా.. అవేం చెబుతున్నాయి ?
*ప్రజలలో పఠనాసక్తి తగ్గింది అనుకోవటం తప్పు. పుస్తకాలకు ఎప్పుడూ మార్కెట్ ఉంది. కాని ఆ పుస్తకాలు ప్రజల దగ్గరకు చేరే ప్రక్రియలోనే కొన్ని సమస్యలున్నాయి. దీనికి సంబంధించిన ఉదాహరణలు మీకు మూడు చెబుతాను. ఈ మధ్య- ముంబాయిలో మేం పుస్తక ప్రదర్శన నిర్వహించాం. చాలామందికి ఆశ్చర్యంగా ఉంటుంది కానీ దాదాపు 12 ఏళ్ల తర్వాత ముంబాయిలో జరిగిన తొలి పుస్తక ప్రదర్శన అది. పుస్తక ప్రదర్శన చివరి రోజున దాదాపు 80 వేల మంది ఆ ప్రదర్శనకు వచ్చారు. ఈ మధ్య ఢిల్లీలోని ఒక మెట్రో రైల్వే స్టేషన్‌లో మేము పుస్తకాల షాపు తెరిచాం. ఇది పెద్దగా విజయవంతమవుతుందనే ఆశ మాకు కూడా లేదు. కానీ అనూహ్యంగా ఇది విజయవంతమయింది. రోజుకు కనీసం 200 నుంచి 500 పుస్తకాలు విక్రయిస్తున్నాం. ఈ మధ్య మేము కాశ్మీర్‌లో ఒక పుస్తక ప్రదర్శన నిర్వహించాం. దాదాపు 20 ఏళ్ల తర్వాత నిర్వహించిన తొలి ప్రదర్శన అది. దీనిలో మా గోదాముల్లో ఉన్న మొత్తం ఉర్దూ పుస్తకాలన్నీ అమ్ముడయిపోయాయి. ఈ ఉదాహరణల ఆధారంగా చూస్తే పుస్తకాలు చదివే వారి సంఖ్య నిజానికి పెరుగుతోందని అర్థమైంది. వాటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటంలోనే సమస్యలున్నాయి.
– ఎన్‌బీటీనీ ఈ ఉద్దేశంతోనే ఏర్పాటు చేశారు కదా.. ఆ లక్ష్యాన్ని ఎందుకు సాధించలేకపోతున్నారు..?
* ఎన్‌బీటీ పుస్తకాల గురించి చాలామందికి తెలియని మాట నిజమే. దీనికి ఒక కారణం చవక ధరలు. మా పుస్తకాలు 50 రూపాయల లోపే ఉండేవి. కమిషన్ తక్కువ వస్తుంది కాబట్టి ఎవరూ తమ పుస్తకాల దుకాణాలలో పెట్టుకునే వాళ్లు కాదు. రెండో కారణం చాలా కాలంగా ఎన్‌బీటీ లక్ష్యం పుస్తకాలను ప్రచురించడం మాత్రమే. ఇప్పుడు ఆ లక్ష్యాన్ని మరింత విస్తృత పరిచి, పఠనాసక్తిని పెంచటానికి ప్రయత్నిస్తున్నాం. దీనిలో మొదటి అడుగుగా హైదరాబాద్ సహా నాలుగుచోట్ల బుక్ ఫెసిలిటేషన్ సెంటర్లు పెడుతున్నాం. దీనిలో పుస్తక విక్రయ కేంద్రాలతో పాటుగా చదువుకోవటానికి లైబ్రరీ, రచయితలు కలుసుకోవటానికి, పుస్తకాలు విడుదల చేసుకోవటానికి వీలుగా కాన్ఫరెన్స్ హాల్, రచయితల సమావేశాల కోసం మరో హాలు ఉంటాయి. హైదరాబాద్‌లో దీనికి అవసరమైన 3 వేల చదరపు అడుగుల స్థలం ఇవ్వటానికి ఆంధ్ర మహిళా సభ ముందుకు వచ్చింది. ఇది మరో రెండు మూడు నెలల్లో ప్రారంభమవుతుంది.
– పుస్తకాలను ప్రజల దగ్గరకు తీసుకువెళ్లటానికి మీరు చేస్తున్న ప్రయత్నాలేమిటి?
* పుస్తక ప్రదర్శనలు నిర్వహించటం ఒక పద్ధతి. మాతో భావసారూప్యం ఉన్న సంస్థలతో కలిసి పనిచేయటం రెండో పద్ధతి. పుస్తక పఠనానికి సంబంధించిన వర్క్‌షాపులను, సెమినార్లకు నిర్వహించటానికి మేము ఆర్థిక సాయం చేస్తాం. ఎవరైనా వర్క్ షాపు పెట్టుకుంటే దానికి అయ్యే ఖర్చులో 75 శాతం మేం భరిస్తాం. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను నేనే స్వయంగా చూస్తా. ఆసక్తి ఉన్నవారు మమ్మల్ని నేరుగా సంప్రదించవచ్చు.
_ మహిళా సాహిత్యం, దళిత సాహిత్యం మొదలైన వాటిపై ఎన్‌బీటీ సరైన శ్రద్ధ చూపించటం లేదనే విమర్శ బలంగా వినిపిస్తూ ఉంటుంది..
*మా వద్ద ఎనిమిది వేల రన్నింగ్ టైటిల్స్ ఉన్నాయి. వీటిలో వర్తమాన రచయితలు రాసిన పుస్తకాలు తక్కువే. ఈ సమస్యను పరిష్కరించటానికి ప్రతి భాషలోను ఒక అడ్వైజరీ కమిటీ వేశాం. దీనిలో పుస్తకాలతో సంబంధం ఉన్నవారు సభ్యులుగా వ్యవహరిస్తారు. దీనిలో ఒక మహిళ తప్పనిసరిగా ఉంటారు. వీరి సూచనల మేరకు మేము పుస్తకాలను ప్రచురిస్తాం. అయితే ఈ కమిటీలు అంత క్రియాశీలకంగా వ్యవహరించటం లేదనేది వాస్తవం. దీని పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం. ఇక ముందు మహిళా సాహిత్యం, దళిత సాహిత్యాలను ఎక్కువగా ప్రచురించటానికి ప్రయత్నిస్తాం. ఇక్కడ మీకు ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాలి. నేను విదేశీ పుస్తక ప్రదర్శనలకు వెళ్లినప్పుడు- అక్కడి వారు భారతీయ రచయితలు నేరుగా ఇంగ్లీషులో రాసే పుస్తకాల కన్నా వివిధ ప్రాంతీయ భాషల్లో వచ్చే సాహిత్యం నుంచి చేసే అనువాదాలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ఈ సాహిత్యమే మన సమాజం అసలు స్వరూపాన్ని తెలియజేస్తుందని పేర్కొంటారు. ఈ మధ్య కాలంలో ఎన్‌బీటీ సమకాలీన సాహిత్య ప్రచురణకు గట్టి ప్రయత్నమే చేస్తోంది.
– ప్రస్తుతం ఈ -కంటెంట్‌కు, ఈ- కామర్స్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. కాని ఇప్పటి దాకా ఎన్‌బీటీ ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు కనబడదు..
* రెండేళ్ల క్రితం నేను పదవిలోకి వచ్చినప్పుడు- మాకున్న ప్రధానమైన సమస్య వేర్ హౌసింగ్. మా దగ్గర ఎన్ని పుస్తకాలు ఉన్నాయో కూడా కచ్చితమైన లెక్కలు లేవు. ఇప్పుడు అది గాడిలో పడింది. ఈ- కామర్స్ ద్వారా పుస్తకాలను విక్రయించే ప్రయత్నం ఈ మ«ధ్యే మొదలుపెట్టాం. ప్రస్తుతం ఎన్‌బీటీ సైట్ ద్వారా 800 టైటిల్స్‌ను కొనుగోలు చేయవచ్చు. ఇక ఈ -బుక్స్ విషయానికి వస్తే త్వరలో చెన్నైకు చెందిన ఒక కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోబోతున్నాం. వచ్చే ఏడాది చివరి నాటికి కొన్ని ఈ- బుక్స్ మార్కెట్‌లోకి వస్తాయి.
ఇంటర్వ్యూ: సి.వి.ఎల్.ఎన్, ఫోటో: గోపి
