బ్రహ్మైక్యమైన ‘’ఆనందో బ్రహ్మ ‘’
తెలుగు సినీ వినీలాకాశం లో ఒక్కొక్క నక్షత్రం రాలి పోతోంది అతి వేగం గా .మొన్న యాక్షన్ నటుడు శ్రీ హరి మరణించాడు .నిన్న హాస్యానికి కొత్త నిర్వచనం చెప్పిన ఏ.వి.ఎస్ .మరణం హాస్యానికే పెద్ద దెబ్బ తగి లింది .ఇవాళ ‘’హాస్య ధర్మానికి వర ‘’మైన ‘’ఆనందో బ్రహ్మ ‘’అని పించిన సుబ్రహ్మణ్యం మరణం మరీ కలచి వేసింది హాస్య ప్రియులన్దరినీ .హాస్య నటులిద్దరూ సుమారు యాభై ఏళ్ళకే చని పోవటం దిగ్భ్రాంతి కలిగించే విషయం .ఇద్దరూ ఇద్దరే ఉద్దండులు .నెల ముందు తో అవ్వారి వెంకట .సుబ్రహ్మణ్యం చని పొతే ,ఇప్పుడీ ధర్మ వరపు సుబ్రహ్మణ్యం ఆ దారినే పట్టటం విచారకరం
ధర్మవరపు నాటక రంగం లో విశష అనుభవం ఉన్న వాడు బుల్లి తెరకు పరిచయమై ‘’ఆనందో బ్రహ్మ ‘’తో అందర్నీ ఆనంద పులకాంకితులను చేశాడు ..దూర దర్శన్ దిశనే మార్చి వేశాడుఆనందో బ్రహ్మ తో .దానితోనే దూర దర్శన్ కు కొత్త జవం ,జీవం ఇచ్చాడు .రొటీన్ గా కార్య క్రమాలు మొక్కు బడిగా సాగిస్తున్న దూర దర్శన్ కు ధర్మ వరపు రాక ఒక
ఉత్తేజాన్నిచ్చింది .,దూర దర్శన్ ప్రేక్షకుల సంఖ్య విపరీతం గా పెరిగింది .ఇది తిరుగు లేని నిజం . ఈ సీరియల్ ఎన్ని సార్లు వేసినా అన్ని సార్లూ ప్రేక్షకులు ఏంతోఇష్టపడిచూశారు అందులో ఎందరెందరో నటుల్ని పరిచయం చేశారు ఆయన .ఎపిసోడ్ ఎపిసోడ్ కు వైవిధ్యం చూపించి మెప్పించారు .ఆయన కీర్తి కిరీటం లో ఆనందో బ్రహ్మ ఒక సొగసైన వజ్రం .నవ్వుల వాన కురిపించి పొడై పోయిన హృదయాలలో ఆనందపు తడి చొప్పించారు .రసార్ద్ర హృదయుల్ని చేశారు .నిజం గా హాస్యం చెప్పి, చూపించి ,మెప్పించటం చాలా కష్టమైనదే .కానీ ఏంతో సుసాధ్యం చేశాడు సుబ్రహ్మణ్యం .అదొక తపస్సు గా ,దీక్ష గా కొన సాగించాడు .అందరికీ ఆనందామృతాన్ని పుష్టిగా పంచాడు .కాని తానూ నిమిత్త మాత్రుడు గా ఉండిపోయాడు .
ఈ స్తితిలో జంధ్యాల దృష్టిలో పడ్డాడు బాపు ను ఆకర్షించాడు వీరిద్దరి దర్శకత్వం లో వచ్చిన సినిమాలు ధర్మ వరాన్ని ,అతని హాస్య చాతుర్యాన్ని అభినయ కౌశలాన్ని డైలాగ్ డెలివరీ ని శిఖరాయ మానం చేశాయి .’’విచిత్ర ప్రేమ ‘’చిత్రం లో సుత్తి వీరభద్ర రావు మరణిస్తే మిగిలిన సీన్లలో ధర్మ వరం నటించి మొదటి సారిగా వెండి తెర కు పరిచయమయ్యాడు ఇక వెనక్కి తిరిగి చూడాల్సి రాలేదు. దాదాపు 300సినిమాలలో నటించి నవ్వుల పువ్వులు పూయించాడు చమత్కారపు చిచ్చు బుడ్లు వెలిగించాడు అమాయకపు కాకర పూవత్తులు వెలిగించాడు .సెటైర్ ఆటం బాంబులు పేల్చాడు .రిపార్టీ సీమ టపాకాయలు కాల్చాడు . అన్నిటా తాన దైన మార్కు వేశాడు .’’జయమ్ము నిశ్చయమ్ము రా ‘’తో ప్రారంభమైన ఈ సినీ జీవిత యాత్ర ఇప్పటిదాకా అవిచ్చిన్నం గా సాగింది .ఆయన లేక పొతే సినిమా చూడటం అనవసరం అని పించేలా చేయ గలిగాడు .పదే పదే ఆయన కావాలి అని క్రేజ్ గా జనం చూశారు ఆయన హాస్యాన్ని వ్యంగ్యాన్ని అభినయాన్ని అభిమానించారు .అంతటి ఫాన్ ఫాలోయింగ్ సంపాదించుకొన్నాడు ధర్మ వరపు .
ఆయన వేసిన లెక్చరర్ పాత్రలు కొంత పాత్రల ఔన్నత్యాన్ని దెబ్బ తీసినా ,ఆ పాత్ర కనీ పిస్తే ఈలలు వేసే వారు జనం .’’బాబూ !నేనూనీ లా కాపీ కొడితే ప్రిన్సిపాల్ అయ్యే వాడిని అది చేతకాక లెక్చరర్ గా పడిఉన్నాను ‘’అంటాడొక సినిమాలో ఇందులోఎంత’’ బిట్వీన్ ది లైన్స్
‘’ఉందొ ఆలోచిస్తే నవ్వు తో బాటు లోక రీతి తెలుస్తుంది .’’మాకు తెలుసు బాబూ !అనే పదం అందరికి ఊత పదమే అయింది .అదేదో సినిమాలో ఒక మూగ పిళ్ళ మాట్లాడి ఏడిపించటం లో అతని హాస్యం సుపర్బ్ అని పిస్తుంది ‘’కాకా -కాకి ‘’అంటూ తిక మక లో పడటం నవ్వే నవ్వు .హాస్టల్ వార్డెన్ గా ,ఇంకో దానిలో యై విజయ భర్తగా ,మరో దానిలో బ్రహ్మానందం స్నేహితుడిగా అతను పండించిన హాస్యం చిరస్మరణీయం ..అన్నమయ్య లో ‘’ఏదీ !తొడ ఇటు పెట్టు ‘’అంటూ తొడపాసెం పెట్టె సీను మరవగలమా ?చొక్కా పైకెత్తి చేతి మీద అకౌంట్ లెక్కలు రాసుకొని ,నెమ్మది నెమ్మదిగా చూసు కొంటు ఏంతో కస్టపడి పోతున్నట్లు ఫీలై పోతూ బోర్డ్ మీద ఎక్కించే సీన్ మరో కడుపుబ్బా నవ్వించేది .’’బాగా చదవండి .లేక పొతే మా లాగా లెక్చరర్ అయితే ఇదిగో యెంత కష్ట పడుతున్నామో చూశారు కదా !’’అని బాధగా వ్యంగ్యం గా అంటాడు .
సినిమా నటన కోసం ప్రభుత్వ ఉద్యోగాన్నే మానేశాడు .సినిమాలలో సుస్తిర స్తానం సంపాదించుకొన్నాడు . ‘’సినీ హాస్య మార్గ దర్శి’’ అయ్యాడు అది చాలు అయన ధన్య జీవితానికి .పోలీసు ,ఇన్స్పెక్టర్ ,కాంట్రాక్టర్ ,సంగీతం నేర్పే మేష్టారు ,తమిళ గాయకుడు మొదలైన వెరైటీ వేషాలలో రాణించాడు ”ఎండి నా రొయ్యా ”అనే ఊతపదం తో ”కిక్కేక్కిస్తాదొక సినిమా లో
తన జీవితం లో యెన్.టి.రామా రావు తో నటించలేక పోయాననే బాధ ధర్మ వరపు కు ఉండేది .చివరికి రాజకీయాల్లో కూడా చేరి వైస్ .కు దగ్గరై,రవీంద్ర భారతి నిర్వహణ చేబట్టాడు .ఎన్నికలలో ప్రచారం చేశాడు .కాని రాజశేఖర మరణం తర్వాత కొడుకు పార్టీలో చేరటం అందరికి ఇబ్బంది కలిగించింది .అంత అంటకాగాల్సిన అవసరం లేదను కొన్నారు అభిమానులు .
ఏ.వి.ఎస్.లానే సినిమా తీసి చేతులు కాల్చుకొన్నాడు ఈ సుబ్రహ్మణ్యం కూడా .’’తోక లేని పిట్ట ‘’తీసి నష్టపోయాడు .సంగీతమూ తానె చేశాడు .అయినా పిట్ట ఎగరలేదు చతికిల బడింది .’’తోక లేని పిట్ట తొంభై ఆమడలు పరిగెత్తింది ‘’అనే సామెత నిజం కాలేదు ఈయన కు .తొంభై రోజులు కాదుకదా ,అందులో సగం కాదుకదా ,అందులో సగం రోజులు కూడా ఆడకుండా దెబ్బ తీసింది .’’ఒక తుపాకీ మూడు పిట్టలు ‘’సినిమా లో నటిస్తుండగా ఈ మరణం కలిగింది .మా హితుడు సన్నిహితుడు,ఉత్తమ కధకుడు ,రిటైర్డ్ రేడియో ఇంజినీర్ అయిన స్వర్గీయ గంధం వెనకా స్వామి శర్మ గారు ధర్మ వారపు సుబ్రహ్మణ్యం తనకు చాలా దగ్గర బంధువు అని ”ఒరేయ్” అనే అంతటి చనువు ఉందని ,బంధుత్వానికి విలువ ఇస్తాడని ,ఆపదలో ఉన్న వారికి ఏంటో సహాయం చేసే గుణం ఉన్న వాడని నాతొ తరచుగా చెప్పే వారు .తాము తరచూ పెళ్ళిళ్ళలో కలుస్తూనే ఉంటామనీ అనే వారు .ఇప్పుదు ఇద్దరూ అమరలోకం లో ముచ్చటించు కొంటరేమో ?
ధర్మ వరపు –వెంకటేశ్వర భక్తీ చానెల్ లో సంగీత స్వరాల పై మంచి ఎపిసోడ్ల లో పాల్గొని తన స్వర ,రాగ పాండిత్యాన్ని అద్భుతం గా ఆవిష్కరించుకొన్నాడు .తెలుగు పద్యాన్ని ఏంతోహృద్యం గా పాడే వాడు ,వివరించే వాడు .అంటే అన్నీ తెలిసిన గొప్ప నటుడు .నటన ,ప్రొడక్షన్ రచన దర్శకత్వం సంగీత పాండిత్యం పుష్కలం గా ఉన్న గొప్ప నటుడు ధర్మ వరపు సుబ్రహ్మణ్యం .ఆయన హఠాన్మరణానికి సంతాపం ప్రకటిస్తూ,ఆత్మ శాంతి కలగాలని కోరు కొంటున్నాను .
‘’సుబ్రహ్మణ్య షష్టి’’ రోజున ఈ సుబ్రహ్మణ్య మరణం పై రాయటం బాధగా నే ఉంది .
మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ -8-12-13-ఉయ్యూరు

