సినీ గీతా మకరందం -4 సావిత్రి ని పొగరు మోతు పోట్ల గిత్తను చేసిన పాట

సినీ గీతా మకరందం -4

సావిత్రి ని పొగరు మోతు పోట్ల గిత్తను చేసిన పాట

యార్లగడ్డ వెంకన్న చౌదరి శంభు ఫిలిమ్స్ పేర 1960లో నిర్మించగా ఆదుర్తి సుబ్బా రావు దర్శకత్వం వహించగా ,రాజేశ్వర రావు మాస్టర్ వేణు ద్వంద్వ సంగీతం లో ,నాగేశ్వర రావు సావిత్రి రంగా రావు లు నటించిన చిత్రం ‘’నమ్మిన బంటు ‘’.ఇక్కడ రంగా రావు కు నమ్మిన బంటు నాగేశ్వర రావు మాత్రమె కాదు అతని ఆధ్వర్యం లో బండికి ఉన్న జోదేద్దులు కూడా .కొసరాజు సాహిత్యం పరవళ్ళు తొక్కింది .సుంకర సత్యనారాయణ మాటలు అల్లారు .ఇది అంతర్జాతీయ చలన చిత్రోత్సవం లో ప్రశంసలు పొందిన చిత్ర రాజం .

సావిత్రి ని ఆట పట్టించటానికి ఆమెను గిత్త తో పోల్చి ఆడుకున్న హాస్య పు పాట నే ఇప్పుడు మనం అనుభవిస్తున్నాము .అందులోకి వెళ్దాం రండి .ఆ పొగరు బోతు పొట్ల గిత్త కన్నూ ,మిన్నూ కాన రానిదట .పట్టుకుంటే మాసి పోయే పారు పళ్ళ గిత్త .అటు సావిత్రికి ఇటు గిత్తకూ

సరి పోయే మాటల్ని చక్కగా పొదిగారు కొసరాజు .ఆమె పళ్ళను పార పళ్ళు అంటం ఎద్దేవాచేయటమే .ఎద్దు పళ్ళు కూడా పార పళ్ళు లానే ఉంటాయి . .ఆ గిత్త రూపమే బంగారం అవుతుందట .మీదకొస్తే ఉరిమి కొమ్ములాడిస్తుందిట .వెనక్కి వెళ్తే యెగిరి కాలు ఝాడిస్తుంది .విసురు కొంటు కసరుకొంటు అటూ ఇటూ ఇటూ అటూ గుప్పిళ్ళు పెడుతుంది ,కుప్పిగంతు  లేస్తుంది ఆ గిత్తా ,ఆ అమ్మడు సావిత్రి కూడా .ఇద్దరి స్వభావాలు ఒకటే .

అంతేనా –అదిలిస్తే రంకె వేసి బెదిరే గిత్త.కదిలిస్తే గంతులేసి కాండ్రు మనే గిత్త .దాని నడుము తీరు చూస్తె నవ్వు పుట్టుకొస్తుంది .మరి దాని నడక జోరు చూస్తుంటే ఒడలు పులకరిస్తుంది .ఇంతకు మించి వన్నె చిన్నెల రాణి ఆటా అది .మంచి బోణీ ఇవ్వాలని కోరుకొంటున్నాడు నాయకుడు నాగేశ్వర రావు ,నమ్మిన బంటు .దాన్ని వదిలి పెడితే ఒట్టు అని ఒట్టెసుకొన్నాడు .ఇక దాని వగలను కట్టి బెట్టి లొంగి పొమ్మని అటు గిత్తనూ ఇటు గిత్త లాంటి అమ్మాయి సావిత్రిని హెచ్చ రించాడు .

జాన పద సాహిత్యం లో పండిన కొస రాజు రాఘ వయ్య చౌదరి రాసిన పల్లె పదాలతో ఎద్దుల భాష లో ,పల్లె టూరి వాతావరణం లో ,నాయకా నాయిక ల హృదయావిష్కరణ లో తన పై చేయిని చూపిస్తూ నాయకుడు ఆడిన నాటకం .పరవశం కలిగించే పాట ఘంట సాల అమర గానం తో ఈ గీతానికొక మహర్దశ ప్రాప్తించింది ఆ విరుపులు ,ఓంపులూ సొంపులూ ,పరితాపం ,ఆమె పై ప్రేమ ,ఆమె తనది కావాలన్న ఆరాటం అన్నీ ఇందులో కలిసి పోయి హాయి హాయి అని పించాయి కొంటె పాట అయినా కోటి రాగాలున్న పాటఅయింది .కోణంగి పాటైనది.కాలు ఝాడించటం ,గుప్పిళ్ళు పెట్టటం ,కుప్పి గంతులేయటం ,రంకె వేయటం ,కాండ్రు మానటం ,,బోణీ కొట్టటం వంటి పదాలు పల్లె జీవితానికి వేసిన పందిరి . గిత్తలను గంగి రెడ్డు వాళ్ళు బహు చక్కగా ఆడిస్తారు వాడు చెప్పినట్లు అది అన్ని పనులూ చేస్తుంది .వంగి దణ్ణం పెడుతుంది .తలూపి ఆడిస్తుంది తోక ఝాదిస్తుంది .గిట్టల పై గిత్త డాన్సు కూడా చేస్తుంది.అలా తన వశం కావాలని అన్యాపదేశం ఇందులో ఉంది .అందుకే నాకు ఈ గీతం మకరందమయ్యింది . .ఆ అమృతాన్ని మీకూ అందిస్తున్నాను .

మరో మకరంద బిందువు ను తర్వాత ఆస్వాదిద్దాం .

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్- -8-12-13-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సినిమా and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.