
మాయనై మనునవడ మదరైమైన్దనై
తూయ పెరునీర్ యమునైత్తు రైవనై
ఆయర్ కులత్తనిల్ తోన్రుమ్ మణి విళక్కై
తామైక్కుడల్విళక్కం, శెయద దామోదరనై
తూమోమాయ్ వన్దునాం తూమలర్ తూవిత్తొళుదు
వాయినాల్ పాడి మనత్తినాల్ శిన్దిక్క
పోయిపిళైయుం పుగుతరువానిన్దనవుమ్
తీయనిల్ తూశాగుం శెప్పేలోరెమ్బావాయ్!!
ఈ అయిదవ రోజున ఈ మహా వ్రతంలో అన్వయించు గోపికలంతా భగవన్నామ సంకీర్తన చేస్తూ ఒకచోట చేరారు. అయిదు లక్షల గృహాలలో ఉండే గోపికలంతా అక్కడ చేరేసరికి ఆండాళ్ తల్లి ఆనందానికి అంతులేదు. ఈ మహా వ్రతం చేయడంలో ఎటువంటి ఆటంకాలూ ఎదురు కావని ఆమె ఘంటా పథంగా చెబుతోంది. నిజానికి అందులో ఒక గోపికకు ఓ సందేహం కలిగింది. “ఇంత పెద్దయెత్తున వ్రతం చేస్తున్నాం. దీనికి ఆటంకాలేవీ తలెత్తకుండా, చివరి వరకూ సజావుగా కొనసాగుతుందా” అని. ఆండాళ్ మాత్రం ఎటువంటి విఘ్నాలూ కలగవని గట్టి నమ్మకంతో ఉంది. ఈ మహా వ్రతం చేయడంలో ఎటువంటి ఆటంకాలూ రావని ఆమె అందరికీ అభయమిచ్చింది.
“శ్రీకృష్ణ భగవానుడు తన ప్రతిజ్ఞకు భంగం కలిగినా సరే, ఆశ్రితుల ప్రతిజ్ఞ నెరవేర్చే కల్యాణ గుణాలు కలవాడట. అందుకే కదా, మహాభారత యుద్ధంలో తాను ఆయుధం పట్టనని ప్రతిజ్ఞ చేసి, తనతో ఆయుధం పట్టిస్తానన్న భీష్మాచార్యుడి ప్రతిజ్ఞ నెరవేరడానికి చక్రాయుధం పట్టాడు! ఆయన మన కోసం మధురా నగరంలో జన్మించాడు. సర్వజగత్ కారణమైనవాడు, సర్వజగత్ వ్యాపకమైనవాడు, గోప వంశంలో ప్రకాశించే మణి దీపం వంటివాడు. ఆయననే నమ్ముకుని ఆయన తిరునామ సంకీర్తనతో ఈ వ్రతాన్ని చేస్తే, ప్రారబ్ధ, సంచిత, ఆగామి కర్మలన్నీ నిప్పులో పడ్డ దూదిపింజల్లాగా నశించిపోతాయి. కనుక మీకు ఇక ఎటువంటి సందేహమూ అక్కర లేదు. పరమాత్మ సంకీర్తన చేస్తూ వ్రతం చేద్దాం రండి!” అని ఆండాళ్ తల్లి గోపికలందరినీ ఆహ్వానిస్తోంది.
ఆశ్చర్యకరమైన కల్యాణ గుణాలు కలవాడట పరమాత్మ. యశోదమ్మ బిడ్డడై, సర్వసులభుడై ఉండడమే కాకుండా, వెన్నె దొంగలించి, ఆ దొంగతనంతో పట్టుబడిపోయి, రోలుకు బందీ అయి, దామోదరుడయ్యాడు. అంతేకాక, కీర్తిగల మధురానగర నాయకుడట. ఉత్తర దిక్కులో ఉన్న మధురా నగర కీర్తి ఏమిటంటే, కృత యుగంలో వామనుడుగా అవతరించడం వల్ల, త్రేతాయుగంలో లవణాసురుడిని సంహరించిన శత్రుఘ్నుడు పరిపాలించడం వల్ల, ద్వాపర యుగంలో సాక్షాత్ కృష్ణ భగవానుడు అవతరించడం వల్ల, ఇక ప్రతి యుగంలోనూ ఈ నగరానికి భగవత్ సంబంధం ఉండడం వల్ల మధురకు ఈ విశిష్టత కలిగిందట.
అంతేకాక, పరిశుద్ధమైన జలంతో నిండిన యమునా నది ఒడ్డున విహరించే శ్రీకృష్ణ పరమాత్మను కీర్తిద్దాం రండని కూడా ఆండాళ్ పిలుస్తోంది. యమునా నదికి ఉండే పరిశుద్ధత ఏమిటంటే, వానాకాలంలో ఉధృతంగా ప్రవహించే యమునా నది చిన్ని కృష్ణుడిని తీసుకుని పోతున్న వసుదేవుడికి మోకాటి లోతు దారి ఇచ్చిన పరిశుద్ధమైన నది అట. శ్రీకృష్ణ పరమాత్మ గోపికలతో కలిసి యుమునా నదిలో జల క్రీడలాడడం వల్ల (అంటే భగవత్, భాగవతోత్తముల సంబంధం అన్న మాట) యమునా నది పవిత్రమైందట. మనమంతా పరిశుద్ధమైన మనసుతో, ప్రతిఫలం ఆశించకుండా పుష్పాలతో పూజించి, భగవంతుడి దివ్య మంగళ విగ్రహాన్ని మనసులో నిలుపుకొని, ఆయన నామ సంకీర్తనం చేద్దాం రండని కూడా ఆండాళ్ ఆహ్వానిస్తోంది. ఆటంకాలు కలుగుతాయనే సందేహం అక్కర లేదని ఆండాళ్ ఈ అయిదవ రోజున గోపికలకు మరీ మరీ చెబుతోంది.

