నా దారి తీరు -58
కలకత్తా కాళీ మాత దర్శనం
ఒక శని ,ఆదివారాల్లో మా బావ నన్నూ ,మా మేనల్లుదు అశోక్ ను కలకత్తాకు రైల్ లో తీసుకొని వెళ్ళాడు .విపరీతమైన రష్ .ట్రెయిన్ పెట్టెల పైన కూడా కూర్చుని ప్రయాణం చేసే వాళ్ళ గురించి వినటమే కాని ఇప్పుడు ప్రత్యక్షం గా చూశాను .పెట్టె పైనే అందరూ నిద్ర పోయే వాళ్ళు .కంపార్ట్ మెంట్ లోకి ఎక్కి ఎల్లాగో అలా నక్కి కుక్కుకొని కూర్చున్నాం .ఉదయానే హౌరా చేరాం .విక్టోరియా సెంటర్ కు వెళ్లాం .అక్కడే పళ్ళు తోముకోన్నాం కాఫీ దొరకదు కనుక ‘’చాయ్ ‘’లాగించాం .ఆ హాల్ అంతా కలయ తిరిగి చూశాం .విక్టోరియా మహా రాణి పట్టాభి షేకం సందర్భం గా కట్టిన హాల్ అనుకొంటా .బ్రిటిష్ స్టైల్ లో సుందరం గా ఉంది అక్కడి నుంచే ఎక్కడి కైనా ట్రామ్ లో నే వెళ్ళాలి ట్రాములు రోడ్డు మీద ట్రాక్ పైనే నడుస్తాయి మొదటి సారి ట్రాము ఎక్కాం..మజాగా ఉంది ..
తరువాత హౌరా బ్రిడ్జి ని నడిచి చూశాం సస్పెన్షన్ బ్రిడ్జి .మన దేశం లో ఇదే మొదటి దని చదివిన గుర్తు .నడుస్తే ఊగుతూ ఉంది సరదాగా ఉంటుంది .అక్కడి నుండి సిటి బస్ ఎక్కి కాళీ ఘాట్ లో శ్రీ కాళీ మాత ను దర్శనం చేసుకోన్నాం .చాలా భయంకర రూపం .భయమేస్తుంది దగ్గరగా చూస్తె .జంతు బలి ఎక్కువ గా ఉంటుంది. రష్ లేదు దర్శనం తేలికగా సంతృప్తిగా ఉంది వాళ్ళ మంత్రాలు లాగి నట్లు తమాషా గా చదువుతారు .వంగ భూమిలో కాలు పెట్టినందుకు గర్వం ఆ ఉంది. ఎందరెందరో మహాత్ములు జన్మించిన పుణ్య భూమి దేశానికి అంతటికి ఆదర్శ భూమి .రామ కృష్ణ పరమ హంస వివేకా నందులు శారదా మాత ,అరవింద్ ఘోష్ శుభాష్ చంద్ర బోసు,రవీంద్ర నాద టాగూర్ ,శరత్ చంద్ర చటర్జీ ,ప్రేమ చంద్ ,బి సి రే ,రాజా రామ మోహన రాయ్ ,వందే మాతరం రాసి దేశ భక్తీ ని ప్రబోధించిన ఆనంద మఠం నవలా రచయిత బంకిం చంద్ర చటర్జీ సినిమాలకు కొత్త రూపూ ఊపు ప్రయోజనం తెచ్చిన సత్యజిత్ రాయ్ ,ఆంధ్రుల కోడలు బెంగాలీ ఆడపడుచు సరోజినీ దేవి ,మొదలైన ప్రాతస్మరణీ యులకు జన్మ నిచ్చిన రాష్ట్రం .అక్కడి నుంచి దక్షినేశ్వర్ వెళ్లాం ఇక్కడే శ్రీ రామ కృష్ణ పరమ హంస అమ్మవారి పూజలో ,దర్శనం లో చరితార్దులైనారు ఇక్కడే వివేకానంద ఆయన శిష్యులై భగవత్ సాక్షాత్కారం పొంది ,ఆర్ష ధర్మాన్ని విశ్వవ్యాపితం చేసి గురు అరణం తర్వాత రామ కృష్ణా మిషన్ ఏర్పాటు చేసి ఎన్నో ధార్మిక సాంఘిక సేవాకార్యక్రామాలకు శ్రీ కారం చుట్టారు .ఇవన్నీ తాలచుకొంటే మనసు పులకించి పోయింది ఆ మహాను భావులు నడయాడిన నేల మీద నేనూ ఇప్పుడు నడుస్తున్నందుకు జీవితం ధన్యమైందన్న భావన కలిగింది .అలాగే అంతకు ముందు కాశీ ,ప్రయాగ గయా లలో నొ ఇదే అనుభూతికి లోనయ్యాను .ఏ జన్మ లో చేసుకొన్న పుణ్యమో ఈ అదృష్టాన్ని చ్చింది .దక్షినేశ్వర్ లో అమ్మ వారి దర్శనం చేసుకొని పరమ హంస ఉన్న గదులను వాడిన వస్తువులను చూసి ఆనందించం అలాగే ‘’కా నంద్ ‘’అంటే వివేకా నంద తిరుగాడిన గదులనూ చూసి ధన్యత చెందాం .పక్కనే గంగా నది మహా ప్రవాహం ముచ్చటగా ఉంది టూరిస్ట్ స్పాట్ గా మంచి పేరొచ్చింది .బేలూర్ మఠంకూడా చూశాం .
రాత్రికి మా బావ పై అధికారి ,తెలుగు వాడు అయిన అసిస్టంట్ ఇంజినీర్ గారింటికి వెళ్లాం .ఆయన మాకు ఆతిధ్యమిచ్చి మంచి తెలుగు భోజనం ఏర్పాటు చేశారు .వారి దగ్గర సెలవు తీసుకొని చిత్త రంజన్ కు చేరుకొన్నాం .కాళ్ళు అరిగే లాగా ఆ ప్రదేశాలన్నీ చూశాం .అక్కడ నుండి మరో ప్రసిద్ధ శివాలయం చూసిన గుర్తు పేరు జ్ఞాపకం లేదు మధ్యాహ్నం ఎక్కడో సోడా దొరికితే తాగిన జ్ఞాపకం ఉంది .
ఇంకో సారి రవీంద్రుని విశ్వ భారతి ని సందర్శించాం .పచ్చని వృక్షాల మధ్య ఈ విద్యా దేవాలయం ఉంది ఇక్కడ చిత్రలేఖనం ,సంగీతం సాహిత్యం మొదలైన లలిత కళలు నేర్త్పుతారు .విశ్వ విద్యాల స్తాయి కోర్సులుంటాయి రవి కవి విగ్రహం ఆయన ప్రసిద్ధ చిత్రాలు ప్రత్యెక గదుల్లో ప్రదర్శనకు ఉంచారు అన్నీ తీరికగా చూశాం .మన జాతీయ గీతం రాసిన మహా కవి గీతాంజలి కి నోబుల్ పురస్కారం పొంది తనకు మన దేశానికి కీరి ప్రతిష్టలు తెచ్చాడు ఆయన ప్రత్యెక బాణీ లో ‘’రవీంద్ర సంగీతం ‘’ఉద్భవించింది ఇప్పటికీ అందరూ దాన్ని సాధన చేస్తూ ప్రదర్శిస్తూనే ఉన్నారు .ఆయన కీర్తికి వన్నెలు తెస్తూనే ఉన్నారు .రవీంద్రుడు తిరిగిన ప్రదేశం లో తిరుగుతున్నందుకు చెప్ప లేని సంతృప్తి కలిగింది .ఇక్కడే రాయప్రోలు సుబ్బారావు , బెజవాడ గోపాల రెడ్డి మొదలైన్ తెలుగు ప్రముఖులు చదువుకొని ప్రసిద్ధులయ్యారు .
ఒక ఆదివారం ఫరక్కాకు దగ్గర ఊరికి వెళ్లి చూశాం ఇది మనకూ బంగ్లా దేశ్ కు సరిహద్దు ప్రాంత నిత్యం రైళ్ళలో దొంగ చాటుగా బియ్యం రవాణా జరుగుతుందని బావ చెప్పాడు ..కలకత్తాలో రసగుల్లాలు వీలైనప్పుడల్లా తిన్నాం .ఆ రుచి గొప్పది .తమాషా గా ఉంటుంది .దీనికే కలకత్తా ప్రసిద్ధి బెంగాల్ లో ఎక్కడ చూసినా ఈ దుకాణాలే కని పిస్తాయి .పల్లె జనం మరీ అనాగారకం గా ఉంటారు .బాగా వెనక బడిన ప్రాంతాలేక్కువ బెంగాల్ లో చీకటి కూపాలే పల్లెలన్నీ కరెంటు లేని గ్రామాలు బాగా ఎక్కువ .తిండికి మొహం వాచీ ఉంటారు .ఆకలీ దరిద్రం ఎక్కడ కెళ్ళినా కనీ పించి అయ్యో అని పిస్తుంది .మన విజయనగరం శ్రీకాకుళం ప్రాంతం ఆడవాళ్ళ లాగా ఇక్కడా బీహార్ ఒరిస్సా లలో జాకెట్ తోడగని వారే ఎక్కువ .
మధ్య తరగతి ఉన్నత కుటుంబాలలో స్త్రీ పురుషులు మహా అందం గా ఉంటారు మగ వారి పంచ కట్టే విధానం భలేగా ఉంటుంది వల్లే వాటుగా శాలువా కప్పుకోవటం తో వారికి ఒక హుందా గౌరవం కలుగుతుంది స్త్రీలు చాలా అందం గా ఉంటారు మగ వారి అనడమూ గొప్పగానే ఉంటుంది అందుకే ‘’బెంగాలీ బాబు లు ‘’అంటారు .వీరి పేర్లు ఏంటో ప్రత్యేకం గా ఉంటాయి మన పురాణాలలో వేదాలలో ఉన్న పేర్లనే ఎక్కువ మంది పెట్టుకొంటారు .నాకొక్క సారిఅని పిస్తుంది అష్ట వసువులు బెంగాల్ లోనే జన్మించారని అంత గొప్ప వారు ఇక్కడ జన్మించారు. దేశానికి దిశా నిర్దేశం చేశారు స్వాతంత్ర్య సమరం లో సాంఘిక సంస్కరణల్లో మత సంస్కరణల్లో రాజ కీయ ముందు చూపులో బెంగాలీలే మార్గ దర్శులయ్యారు . ఇలా మేము బీహార్ లోని జమ్తారా లో ఉన్న కాలాన్ని సద్వినియోగం చేసి మా బావ మాకు చూడాల్సిన ప్రదేశాలన్నీ చూపించి కొత్త లోకాలను చూసిన అనుభూతిని కలిగించాడు .సుమారు ఒక ఇరవై రోజులున్నామేమో జంతారా లో ఆ తర్వాత అశోక్ ను నన్ను హౌరాదాకా వచ్చి ట్రెయిన్ ఎక్కించాడు బావ .ఆ మధురాను భూతులను మనస్సుల నిండా నింపుకొని ఉయ్యూరు తిరిగి వచ్చాం ఎన్నో రోజులు ఇంట్లో వారితోనూ స్కూల్ వారితోనూ స్నేహితులతోనూ ఈ యాత్రా ముచ్చట్లు చెప్పుకొంటూనే ఉండేవాడిని .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -21-12-13-.ఉయ్యూరు

