
‘సాహిత్యాకాశంలో సగం’ స్త్రీకి దక్కడానికి నిరంతరంగా సాధన చేస్తున్న విమర్శకురాలు కాత్యాయనీ విద్మహే! నిశితమైన దృక్కోణం, కఠోర పరిశ్రమ ఆమె కృషికి సాహిత్య పాఠకులలో విశిష్టమైన గుర్తింపు నిచ్చాయి. ఈ ఏడు ఆమె విమర్శా గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక ఇంటర్వ్యూ…
ఏ సాహిత్య విమర్శ రంగంలో స్త్రీలకు గుర్తింపు ఎలా ఉన్నదని అనుకుంటున్నారు, మేధా వ్యాపారమైన విమర్శను మహిళలు చేయగలరని, రాణించగలరని తెలుగు సాహిత్య లోకం నమ్ముతుందా?
– ఏ రంగంలోనైనా స్త్రీలు చేస్తున్న పనిని మనుషులు చేస్తున్న పనిగా గుర్తించే సంస్కారం పెరగాలని కోరుకుంటా. స్త్రీలకు ఆలోచించే మెదడు ఉందన్న స్పృహ ఉండాలి కదా, అంగీకరించాలంటే. మేధో వ్యాపారమయిన పనులు స్త్రీలు ఎంతో సమర్ధవంతంగా చేయగలరని అంతర్జాతీయంగా రుజువవుతున్న వర్తమానం ఒక వైపు కనపడుతున్నా, తెలుగు సాహిత్య లోకం మహిళలు విమర్శ చేయలేరని అనుకుంటే అంతకన్నా వెనకబాటుతనం మరొకటి లేదు. ఎన్నో విషయాలలో ముందున్న తెలుగు జాతి స్త్రీల మేధా వ్యాపారం గురించి కూడా గౌరవకరంగానే ప్రవర్తిస్తుందని స్త్రీలు నమ్ముతున్నారు. ఇప్పుడు మనం శ్రద్ధ పెట్టాల్సింది, స్త్రీల మేధో వికాసానికి అనుకూలమైన ప్రజాస్వామిక వాతావరణం కల్పించడం మీదే.
మీ పూర్వ స్త్రీ విమర్శకులలో మీరెవరిని ఇష్టపడతారు?
– విమర్శ వ్యాసం రాసింది ఒక్కటే అయినా బెంగుళూరు నాగరత్నమ్మ పరిశీలనా శక్తి, పదును నాకు నచ్చిన అంశాలు.
యశోదారెడ్డి, నాయని కృష్ణకుమారి మా తరానికి ఒక నమూనా. ఓల్గా, మృణాళిని విమర్శలు ఇష్టపడతాను.
స్త్రీవాదాన్ని ఒకానొక అస్తిత్వ సిద్ధాంతంగా భావిస్తారా? లేక, ప్రపంచాన్నంతా వ్యాఖ్యానించగల సమగ్ర రాజకీయ సిద్ధాంతంగా దాన్ని భావిస్తారా?
– స్త్రీవాదం కేవలం అస్తిత్వ సిద్ధాంతం మాత్రమే అనుకోను. అనేక ప్రాపంచిక విషయాలను, అధికార రాజకీయాలను అర్థం చేసుకొనటానికి స్త్రీవాద తత్వశాస్త్రం ఉపకరిస్తుందని భావిస్తాను.
మీరు స్త్రీవాద విమర్శ జెండర్ ప్రాథమిక/స్థూల స్వభావానికి పరిమితమై చేశారా, లేక స్త్రీవాదం ప్రత్యేకంగా ఆవిష్కరించిన సిద్ధాంత పరికరాలను ఉపయోగించి చేశారా?
– రెండింటిని ఉపయోగించుకున్నా. మార్క్సిస్ట్ సిద్ధాంత పరికరాలు, వాచక విమర్శ వంటి సాధారణ విమర్శ విధానాలు…. ఏవి అవసరమనుకొంటే అవన్నీ వాడుకుంటాను. కవిత్వం, కథ దేనినయినా మొదటినుండి అది ఏ భావాన్ని అంచలంచలుగా నిర్మించుకుంటూ పోతున్నదో గుర్తించటం విమర్శలో ప్రాథమిక అంశంగా ఉండాలి. స్త్రీవాద విమర్శకు అది మరీ ముఖ్యం.
ప్రాచీన తెలుగు సాహిత్యాన్ని కూడా మీరు స్త్రీవాద కోణం నుంచి పరిశీలించారు. అటువంటి విమర్శ ప్రధానంగా స్త్రీ రచనలు లేదా స్త్రీ పాత్రలు వీటిని పరిశీలించడంగా ఉంటుంది. సాహిత్యాన్ని మొత్తంగా స్త్రీ దృష్టి నుంచి అంచనా వేయాల్సిన అవసరం లేదంటారా? అలాగే ఆధునిక సాహిత్యంలో కూడా ప్రతి వాదం నుంచి వచ్చిన సాహిత్యాన్ని, తిరిగి స్త్రీకోణం నుంచి మదింపు జరగాలి కదా…
– ప్రాచీన సాహిత్యాన్ని స్త్రీవాద దృక్పథంతో పరిశీలించటం స్త్రీల రచనలకు స్త్రీ పాత్రల పరామర్శకు మాత్రమే పరిమితం కాదు. స్త్రీల రచనలలో స్త్రీలకే ప్రత్యేకమైన భావోద్వేగాలు, బాధలు, భయా లు కోపాలు, నిరసనలు నిష్ఠూరాలు ఎలా ప్రతిఫలించాయో, అవి రచయిత్రుల సాంఘిక సాం స్కృతిక స్థాయికి ఎలా ప్రాతినిధ్యం వహిస్తున్నాయో నిర్ధారించటం ముఖ్యం. స్త్రీ పాత్రల పరిశీలన వాళ్ల గుణ శీలాలను, ప్రవర్తన రీతులను గుర్తించి చెప్పటానికే కాక వాటినలా నిర్ధారించిన పితృస్వామిక రాజకీయాలను విశ్లేషించటానికి ఉపయోగపడాలి. అందువల్ల ప్రాచీన ఆర్వాచీన సాహిత్యాలను, స్త్రీ పురుష రచనలను అన్నిటిని స్త్రీ కోణం నుండి కావచ్చు, స్త్రీవాద దృక్పథం నుండి కావచ్చు… అంచనా వేయాల్సిందే. యిక ఏ వాదం నుండి వచ్చిన సాహిత్యాన్నయినా స్త్రీ కోణంతో స్త్రీల ప్రయోజనాల దృష్ట్యా పునర్ మూల్యాంకనం చేయవలసిందే. ఆ పని ఇంకా సరిగా మొదలు కాలేదు. ఆ పని జరగటానికి అవసరమైన వస్తుగత దృష్టికోణంతో పాటు సహనం సంయమనం మన సంస్కారంలో భాగం కావాలి.
స్త్రీవాద విమర్శ లేదా సాహిత్యం కూడా ఇతర అస్తిత్వ వాదనల నుంచి నేర్చుకోవాలి కదా?
– తప్పకుండా..! స్త్రీవాద విమర్శ లేదా సాహిత్యం ఇతర అస్తిత్వ వాదాల నుంచి నేర్చుకోవలసినది తప్పక నేర్చుకోవలసిందే, నేర్చుకుంటున్నది కూడా. ఏ వాదమైనా ఒక నిర్దిష్ట జీవితానుభవం నుండి వచ్చేదే, అనుభవాలను పంచుకొనటం మన జీవితాలను విస్తృత పరుస్తుంది. మనలను మానవీయం చేస్తుంది. మార్క్సిజం నుండి స్త్రీవాదం, స్త్రీవాదం నుండి దళితవాదం… వాటినుండి మైనారిటివాదం.. ప్రాంతీయవాదం… ఆయా సందర్భాలలో అవి పెట్టే డిమాండ్లను పట్టి.. మిగిలినవి.. తగిన సవరణలతో సర్దుబాట్లతో ఒకదానినొకటి మార్చుకుంటూ అభివృద్ధి ముఖంగా సాగాలి. వీటి మధ్య వైరుధ్యాలు ఉండవచ్చు కానీ, అవి శత్రు వైరుధ్యాలు మాత్రం కాదు.
స్త్రీవాద దృష్టి నుంచి సాహిత్య చరిత్రను పునర్నిర్మించే సంకల్పం ఉందా?
– ముందు స్త్రీల సాహిత్య చరిత్ర రాయాలి. 1950 వరకు రచనలు చేసిన స్త్రీలు 500కు పైగా ఉన్నారు. వాళ్లకు తెలుగు సాహిత్య చరిత్రలో చోటే దొరకలేదు. అందువల్ల అప్పటి నుండి ఇప్పటి వరకు స్త్రీల సాహిత్యం సేకరించే పని పెట్టుకున్నాను. సమగ్ర స్త్రీల సాహిత్య చరిత్ర రచన తరువాత స్త్రీవాద దృష్టి నుండి తెలుగు సాహిత్య చరిత్రను పునర్నిర్మించే పని.
(ఇంటర్వ్యూ: వివిధ)

