నా దారి తీరు -59 ఇద్దరు ప్రముఖులకు ఉత్తరాలు

                  నా దారి తీరు -59

ఇద్దరు ప్రముఖులకు ఉత్తరాలు

మొదటి నుంచి నాకు ఎవరైనా మంచిపని   చేస్తే వారిని అభి నందించటం అలవాటైంది .చిన్నప్పుడే నా సహమిత్రుల కు ఆట ల్లో ,పాటల్లో పద్యాలలో వక్తృత్వం లో పోటీలు పెట్టి వారికి నాకు తోచిన బహుమతులన్దించే వాడిని .కాలేజి లో దీనిని చేయటానికి సాహసించలేక పోయానో లేక అవకాశమే రాలేదో ?తెలీదు .కాని ట్రెయినింగ్ కాలేజి లో మాత్రం దీన్ని అవకాశం గా తీసుకొన్నాను .కాలేజి పరీక్షల్లో ఫస్ట్ మార్కులోచ్చిన నా తోడి విద్యార్ధులకు లెక్చరర్ ల అను మతితో బహుమతులిచ్చే వాడిని .నేనిచ్చిన  బహుమతి అయిదు రూపాయలు మాత్రమె .అప్పుడు నేనింకా ఇంటి నుండి వచ్చిన డబ్బుతో చదువు కొంటున్న విద్యార్ధి నే కదా .అప్పుడు కాలేజి నాటకాలలో నాకు నచ్చిన నటులకు బహుమతులిచ్చే వాడిని వారెంతో సంతోషించే వారు .ఈ పని లెక్చరర్లు, యాజమాన్యం చేయాలి .కాని అదేమీ నేను ఆలోచించలేదు నాకు తోచిందీ చేశాను అంతే .దానికి మించి నా మనసులో ఏమీ ఉండేది కాదు కాని మా బాటని మేడం మాకు ఇంచార్జి  గాఉండేది .ఆవిడకు నేనిలా చేయటం అంతగా ఇష్టం ఉండేది కాదు .ఒకటి రెండు సార్లు నెమ్మదిగా నాకు చెప్పింది కూడా .నేను మాత్రం నా పధ్ధతి మార్చలేదు .

ఆ తర్వాత నేను ఉద్యోగం లో చేరిన తర్వాత ఇలాంటి ప్రోత్సాహాలను వీలైనప్పుడల్లా చేసి విద్యార్ధులను బాగా ప్రోత్సహించేవాడిని .దీనికి అందరూ మెచ్చుకొన్నారు .పని చేసిన ప్రతి చోటా కూడా ఇలా చేసి విద్యార్ధుల అభిమానాన్ని చూర గోన్నాను .ఇది బాగా చదివిన వారిని ,ఉత్సాహం గా పోటీలలో పాల్గొన్న వారిని ప్రత్యెక విషయాలలో తమ ప్రతిభ కన బరచిన వారికి ఊతం గా ఉంది .తమ శక్తి యుక్తులను మరింత కనబరచాటానికి అవకాశ మేర్పడేది వీటికి నేను చేస్తున్నది దోహద కారి అయిందని నాకు మరింత  ఆనందం గా ఉండేది .అలాగే ఏ రంగం లో నైనా ప్రత్యెకం గా  కనీ పిస్తే గుర్తింపు పొందితే ,వారి ని అభినందిస్తూ జాబులు రాసే వాడిని వీలయితే వారిని స్వయం గా కలిసి అభినందిన్చేవాడిని .నేను రాసిన ఉత్తరం వాళ్ళు తమ వారందరికీ చూపి చాలా సంతోషించేవారు వారిని గుర్తించి నందుకు వారికదొక సంతృప్తి గా ఉండేది . ఉయ్యూరు స్టేట్ బాంక్ మేనేజర్ బాగా పని చేసి అందరితో చేయిస్తుంటే బాంక్ కరెక్ట్ గా పది గంటలకే ప్రారంభమైతే ,లావాదేవీలన్నీ పకడ్బందీ గా జరుగుతూంటే వారి ప్రత్యేకతను గుర్తించి ఉత్తరం రాశానొక సారి. ఆ ఆఫీసర్, స్టాఫ్ అందరికి సర్కులేట్ చేసి సంతృప్తి చెందారు ఈ విషయాన్ని బాంక్ స్టాఫ్ లో ఒక రైన రెడ్డి గారు నాకు చెప్పి మేనేజర్ గారు కృతజ్ఞత తెలియ జేయమన్నారని తెలియ జేశారు మేనేజర్ యెంత సంతోషించారో నాకూ అంత ఆనందం కలిగింది ఇదో ‘’తుత్తి’’ఏ.వి.ఎస్.మాటల్లో .

అప్పుడు ఉత్తర ప్రదేశ్ కు కమలా పతి త్రిపాఠీముఖ్య మంత్రిగా ఉండేవాడు ఆయన చాలా శ్రోత్రియుడు .అందరూ ఆయన పాదాలపై పడినమస్కారాలు చేసే వారు. ముఖాన పేద్ద కుంకుమ బొట్టు తో పంచా ,లాల్చీ తో కురచగా ఉండేవాడు .తన కాళ్ళ మీద పడని  వారిపై గుర్రుగా ఉండేవాడు ఒక రకం గా ఉత్తర ప్రదేశ్ రాజకీయాలను చాలా కాలం శాశించాడు .కేంద్రం లోను ఆయన మాటకు తిరుగుండేది కాదు ఆయన చెప్పిన వాళ్ళకే కేంద్ర మంత్రి పదవి .ఇందిరా గాంధి కూడా ఆయన కు భక్తురాలే .తర్వాత అక్కడ బెడిసింది ఆయన్ను గద్దె నుంచి తప్పించి కేంద్రం లో రైల్వే మంత్రి చేసింది .అప్పుడు ఆ రాష్ట్ర రాజ కీయాలు ఒడిదుడుకులకు లోనైనాయి

.ఆసమయం లో ‘’త్రిభువన నారాయణ్ సింగ్ ‘’అంటే టి యెన్ .సింగ్ అనుకోకుండాఉత్తర ప్రదేశ్  ముఖ్య మంత్రి అయ్యారు .ఆయన ఏంతో నీతి నిజాయితీలు,వ్యక్తిత్వం రుజు వర్తన ,నిర్భీకత ఉన్న వారు ఈ విషయాలన్నీ పేపర్ల ద్వారా చదివాను .అప్పటికి ఆయనకు శాసన సభలో సభ్యులు కూడా కాదు .ముఖ్య మంత్రి పదవి చే బట్టిన ఆరు నెలల లోపు అసెంబ్లీకి ఎన్నిక కావాలని రూలు ఉంది .దానికి ఆయన సిద్ధమైనారు అలాంటి గొప్ప సుగుణాలున్న ముఖ్య మంత్రి ఆ రాష్ట్రానికి దొరకటం అదృష్టం అని అందరి భావన .అందుకని నేను ఆయన్ను అభి నందిస్తూ ఒక ‘’కార్డు ముక్క ‘’రా శా ను .ఇదే ఒక రాజకీయ ప్రముఖుడికి రాసిన ప్రధమ ఉత్తరం దాన్ని అందుకొన్న  ముఖ్య మంత్రి  టి యెన్ సింగ్ గారు నాకు కృతజ్ఞతలు చెబుతూ ఉత్తరం రాశారు ఇది నాకు ఏంతో ఆనందాన్నే కాక ఆశ్చర్యాన్ని కలిగించింది దాన్ని భద్రం గా దాచి అందరికి చూపించి సంతృప్తి చెందేవాడిని ఆ జా బును చాలా కాలం దాచుకొన్నాను ప్రాణ ప్రదం గా .ఆ తర్వాత కనీ పించలేదు .

బ్రాహ్మణ ఆది పత్యాన్ని కాదని ఒక సింగ్ ముఖ్యమంత్రి అయ్యాడని త్రిపాఠీ ఆగ్రహావేశాలకు లోనై నాడు   అతనికి  ‘’చెక్’’ పెట్టటానికి తేరా వెనుక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు .ధిల్లీ నుంఛీ ,అలహాబాద్ వచ్చీ తీవ్ర ప్రయత్నాలు చేసేవాడు ఆయనకు సహనం నశించిపోయి సూటీ పోటీ మాటలతో విరుచుకు పడేవాడు .శాసన సభ్యుడు కానట్టి ముఖ్య మంత్రి శాసన సభ ఉప ఎన్నిక లలో పోటీ చేసి గెలవక పొతే పదవి ఉండదు కనుక పోటీ చేశారు సింగ్ జీ .అంతే కులం మతం అన్నీ పని చేశాయి .’’చపాతీ ‘’(త్రిపాఠీ )గారి యంత్రాంగం మంత్రాంగం పని చేశాయి సింగ్ గారిది రాజ మార్గం .కుయుక్తులు తెలియని అసలైన గాంధేయ వాది.నిజాయితీకి మారు పేరు .ఎన్నిక సంగ్రామం లో నూ తనదైన క్రమ శిక్షణ నే పాటించారు .రాజకీయ చదరంగం బ్రహ్మాండం గా నడిచింది . .ప్రజలను అన్ని రకాల ప్రలోభ పెట్టారు త్రిపాఠీ .దానికి వాళ్ళు లొంగిపోయారు సింగ్ లాంటి నిజాయితీ పరుడిని గాంధేయ వాదినీ ప్రజలు ఓడించి తమ అసమర్ధతను చక్కగా చాటుకొన్నారు .టి.యెన్ సింగ్ గారు ఉప ఎన్నికలో ఓడిపోయారు .వారు వెంటనే రాజీనామా చేసేశారు .తన నిజాయితీని చాటుకొన్నారు .మంచికి చెడుకు జరిగే రాజ కీయ పోరాటం లో చెడె గెలుస్తుంది తాత్కాలికం గా అని మరో సారి రుజువైంది .ఇలా యు .పి .లో త్రిభువన నారయణ్ సింగ్ గారి ప్రభుత్వం ఆరు నెలలకే పతనమైంది .ఇది నాకు ఏంతో బాధించింది .ఈ బాధ చాలా కాలం మనసులో ఉండి పోయింది

నేను రాసిన రెండో ఉత్తరం మహా వక్త ,రాజకీయ దురంధరుడు ,పాతికేళ్ళుగా పార్ల మెంట్ మెంబర్ ,యు యెన్ వొ లో తన మాత్రు భాష హిందీలోనే మాట్లాడి చరిత్ర సృష్టించిన వాడు ,మూడు సార్లు భారత దేశ ప్రధాన మంత్రి అయిన వాడు అయిన అటల్ బిహారీ వాజీ పేయి గారికి ,ఆయన పార్ల మెంట్ మెంబర్ గా ఉన్నకాలం లో రాశాను ఏ సంవత్సరం లోనో గుర్తు లేదు ..సందర్భం ఏమిటంటే –అప్పటికే కాంగ్రెస్ అంటే ప్రజల్లో విముఖత ఏర్పడి ,ప్రజాస్వామ్య విలువలన్నీ మంట గలిసిపోయి దేశం పరువు బజారుపడ్డ సమయం ,అనేక పార్టీలు ఎవరి దారి వారిదే నన్నట్లున్న రాజకీయ అస్తిరత్వం సమర్ధమైన జాతీయ ప్రభుత్వం ఏర్పడితే బాగుంటుందని పెద్దలందరూ భావిస్తున్న తరుణం అది .అప్పుడు అటల్జీ.కిఇంగ్లీష్ లో  జాబు రాశాను .కవర్ రాశానని జ్ఞాపకం .అందులో నేను ఆయనకు ఒక సూచన చేశాను స్క్రిప్ట్ అంటా ఇదే అని కాదు దాని భావమే నేనిక్కడ తెలియ జేస్తున్నాను ..’’అయ్యా !దేశం లో ఉన్న సంక్లిష్ట రాజకీయ సంక్షోభం లో ఎవరికి వారు గిరి గీసుకొని వారంటే వీరికి వీరంటే వారికి పడకుండా విభేదాల తో కాలం గడుపుతుంటే కాంగ్రెస్ దీన్ని అదను గా తీసుకొని ప్రజా సంక్షేమం పట్టకుండా పబ్బం గడుపు కొంతోంది .దానితో కాంగ్రెస్ కు ప్రత్యామ్నానం లేదను కొంటున్న ప్రజలు మనసులో కాదను కొన్నా కాంగ్రెస్ కే  వోటు వేసి అధికారం దక్కిస్తున్నారు .మీ  పార్టీ ,కమ్యూనిస్టులు కలిసి పని చేస్తే గొప్ప ప్రత్యామ్నాయ పార్టీ ఏర్పడి ప్రజల ఆశలు తీర టానికి గొప్ప అవకాశం ఏర్పడుతుంది ఈదిశ గా ఆలోచించండి ప్రజల కస్టాలు తీర్చే ప్రయత్నం చేయండి .కాంగ్రెస్ అంటే విసుగేత్తిపోయిన జనానికి ఇదొక మంచి అవకాశం కలిగి విరుద్ధ భావాలు కల మీరు ఒక కామన్ అండర్ స్టాండింగ్ తో పని చేస్తే దేశానికి ఏంతో మేలు జరుగుతుంది. మీ అభిప్రాయ  భేదాలను పక్కన పెట్టండి ప్రజా శ్రేయస్సు దృష్ట్యా మీ రెండు పార్టీలుకలిసి పని చేయాల్సిన చారిత్రిక అవసరం ఏర్పడింది .ఎవడో ఒక అనామకుడు రాసిన ఉత్తరం అని తీసి పారెయ్యకండి ,ఇది ప్రజలందరి మనసులోని మాట .పార్టీలు కొన్ని కలిసి పని చేయాల్సిన సమయం దేశానికి ఇప్పుడు అవసరం వచ్చింది కాదన కండి. మీ ప్రయత్నం మీరు చేయండి .కమ్యూనిస్టులతో స్నేహ హస్తం చాచండి .కలుపుకొని పొండి.దేశానికి మంచి చేయండి ‘’అని రాశాను ఈ జాబును’’ శ్రీ అటల్ బిహారీ వాజపేయి -పార్ల మెంట్ మెంబర్ ,ఇండియన్ పార్లమెంట్ -న్యు ధిల్లీ ‘’ అనే అడ్రస్ కు పంపాను అది అందిందో లేదో తెలీదు నాకెటు వంటి సమాధానం అటల్ నుంచి రాలేదు .కొంత అసంతృప్తి కలిగింది .అయినా నా భావాలు నేను చెప్పాను అయన నాలా ఆలోచించాలని రూల్ ఏమీ లేదుకదా అని సమాధానపడ్డాను .ఇలా ఇద్దరు రాజకీయ ప్రముఖులకు నా మనసులో ని భావాలు తెలియ జేశాననే ఆత్మ సంతృప్తి నాకు మిగిలింది .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-22-12-13- ఉయ్యూరు

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in నా దారి తీరు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.