నా దారి తీరు -60
బసవా చారి మేస్టారి తో కంబైన్ ట్యూషన్
నేను ఉయ్యూరు లో పని చేస్తున్న కాలం లో ప్రైవేట్లు బాగా ఉండేవి ఎక్కువ మందే చేరి చదువుకొనే వారు .అందులో ముస్లిం ఆడపిల్లలు క్రిస్టియన్ ఆడపిల్లలు కూడా ఉండేవారు .మా అమ్మ కు మడీ ఆచారం ఉన్నందువల్ల ఆవిడకు కొంత ఇబ్బంది గానే ఉండేది .కాని ఏమీ అనలేక పోయేది .అందుకోసం ఒక రకం గా ఆవిడకు సంతృప్తి కలిగించేవాడిని .బ్రాహ్మణ ఆడపిల్లల్ని మా అమ్మ ఉండే మా పడమటింట్లోకూర్చుని చదివేట్లు చేశాను .మిగిలిన అన్నికులాల ఆడపిల్లలు మా సావిట్లో గట్టు మీద కూర్చునే వారు మగ పిల్లలు ఉత్తరం వైపు నేలలో ఉన్న ధాన్యం దంచే చిన్న రోలు దగ్గర కూర్చునే వారు .ఇంకా మిగిలి ఉంటె బయట వరండాలో కూర్చో బెట్టె వాడిని ఒక్కో సారి క్లాసులను బట్టి కూర్చో బెట్టి చెప్పటం, చది వించటం చేసే వాడిని…బంధువుల ఆడపిల్లలందరికి ఫ్రీ ట్యూ షనే. వాళ్ళు బాగా చదివే వాళ్ళు కూడా. అందులో మా లక్షమ్మ పిన్ని కూతుళ్ళు మనవ రాళ్ళు ఉండేవారు .చిలుకూరి మా ఇంట్లో వాడే .పేద పిల్లలెవరైనా ఏకులం వారైనా ఉచితం గానే చెప్పే వాడిని .పరీక్షల ముందు రివిజన్ కోసం ప్రైవేట్ చదవక పోయినా విద్యార్ధులను రమ్మనే వాడిని .వాళ్ళు ఏంతో సంతోషం గా వచ్చి లెక్కలు చేసి పరీక్షకు తయారయ్యే వారు. వారందరూ ఇలా రావటం నాకెంతో సంతృప్తిగా ఉండేది .తలిదండ్రులు ఏంతో బతిమిలాడి పిల్లల్నినా దగ్గరకు ప్రైవేట్ కు పంపే వారు ..ఇలా చాల కాలం సాగింది .ఆ తర్వాత నాకు తరచూ బదిలీల వల్ల,మళ్ళీ ఇక్కడ పని చేసినా పిల్లలు రావటం తగ్గింది .మనసులో కొంచెం బాధ గానే ఉండేది కాలం కూడా కలిసి రావాలి కదా .
మా గురువు గారు బసవా చారి గారు రిటైర్ అయ్యారు .ఆయన కు ఒకప్పుడు ప్రైవేట్లు చెప్పటం అంటే చిరాకుగా ఉండేది .ఆమాట అంటే మండిపడే వారు .దానికి ఆయన దూరం .అలాంటి వారు ఆదిరాజు పున్నయ్య మేస్టారి తో కలిసి ప్రైవేట్లు చెప్పటం ప్రారంభించారు .బానే చెబుతున్నారని పేరొచ్చింది .పున్నయ్య గారు అంటే ఇంగ్లీష్ లో నిధి .పూర్వకాలం చదువు వారు కనుక అన్నీ ఆయనకు బాగా తెలుసు .చదువు చెప్పటం లో గ్రామర్ ను అర్ధ మయ్యేట్లు చెప్పటం లో ఆయనకు ఆయనే సాటి. మంచి ఇంగ్లీష్ కూడా మాట్లాడే వారు ,రాసే వారు .లెక్కల్లోనూ దిట్ట .అయితే లెక్కల పుస్తకాలూ మారి కొత్త విషయాలు చేరాయి అవి చెప్పాలంటే ఆయనకు వీలు కాదు .అందుకని బసవా చారి గారు ఒక సారి నా దగ్గరకు వచ్చి’’ప్రసాడూ !మనిద్దరం కలిసి కంబైండ్ ట్యూషన్స్ చెబుదాం .నువ్వు లెక్కలు, సైన్సు చెప్పు నేను ఇంగ్లీష్, సోషల్ చెబుతాను .తెలుగు నువ్వు చూడు హిందీ నేను తంటాలు పడతాను .వచ్చిన డబ్బులో చేరి సగం తీసుకొందాం .డబ్బు వసూలు చేసే బాధ్యతా నాది నెల జీతాలు తీసుకొందాం .వాళ్ళకీ తేలిక మనకూ సుఖం ‘’అన్నారు నేను వెంటనే సరే నన్నాను
మా వరండాలో ట్యూషన్ మొదలు పెట్టాం నేను బోర్డ్ మీద లెక్కలు చెప్పే వాడిని .చేయించే వాడిని నాకు లెక్కలంటే మహా సరదా .బానే చేరారు తొమ్మిది ,పది క్లాసులకు చెప్పే వారం .తొమ్మిది వారికి నెలకు ఇరవై పది కి ముప్ఫై రూపాయలు నెలకు జీతం ఏర్పాటు చేశాం .అలానే ప్రతి నేలా పిల్లలు జీతాలు సకాలం లోనే చెల్లించే వారు .మా దగ్గర ట్యూషన్ చదివిన పిల్లలో మీసాల రెడ్డి గారి అబ్బాయి పువ్వాడ అచ్యుత రావు ఇద్దరుకోడుకులూ , తెలుగు మేష్టారు రంగారావు గారబ్బాయి మొదలైన వారుండే వారు ..ఠంచం గా మేష్టారు డబ్బు వసూలు చేసే .వారు పుస్తకం లో లెక్కలు రాసే వారు .నాకు రావాల్సిన సగం డబ్బును నయా పైసా లతో సహా ఇచ్చేవారు .యెంత వచ్చిందని నాకు ఆలోచన లేదు .రోజూ కాఫీ ఇచ్చే వాళ్ళం మేస్తారికి మేము చేసుకొన్నా టిఫిన్ కూడా పెట్టె వాళ్ళం మొహమాటా పడే వారు కాని ణా మీద వాత్సల్యం తో కాదనకుండా తినే వారు .ఆయన నాకు హైస్కూల్ లో ఎనిమిదో తరగతికి క్లాస్ టీచర్ ఇంగ్లీష్ సోషల్ చెప్పే వారు ఆ బంధం మళ్ళీ ఇలా కోన సాగింది సరదాగా ఇలా గడచి పోతున్నందుకు సంతోషం గా ఉంది రెండేళ్ళు ఇలా గడిచిపోయాయి.ఆ తర్వాతా నాకు ట్రాన్స్ ఫర్ అయింది .దానితో ఈ’’ ఉమ్మడి ప్రైవేట్ ‘’కు స్వస్తి పలికాం .ఆయన మాత్రం పున్నయ్య గారి ఇంట్లో ట్యూషన్లు కొన సాగించారు .
శారదా నికేతన్ లో పని చేయటం
మా రెండో అబ్బాయి శర్మ టెన్త్ క్లాస్ కు వచ్చేసరికి నాకు పామర్రు ట్రాన్స్ ఫర్ అయింది .అప్పుడు మా మేనమామ వరుస ,నా సహాధ్యాయి గుండు బాల భాస్కరం అంటే ‘’బాచి ‘’శారదా నికేతన్ అనే ఇన్స్టిట్యూషన్ ప్రారంభించాడు వాడు ఇంగ్లీష్ లో మహా చురుకు చాలాస్పీడ్ గా మాట్లాడే వాడు .మంచి ఇంగ్లీష్ రాసేవాడు ఇంటర్ విద్యార్ధులకు ఇంగ్లిష్ ట్యూషన్ ను అక్కడ చెప్పే వాడు .విపరీతమైన క్రేజ్ ఉండేది ఎక్కడెక్కడి వాళ్ళో వచ్చి చదివే వారు భాస్కర దగ్గర చదివితే’’ ఇంగ్లీష్ లో పాస్ గ్యారంటీ’’ అనే గొప్ప నమ్మకం కలిగించాడు కస్టపడి చెప్పే వాడు వీలయితే కొట్టే వాడు బండ బూతులూ తిట్టే వాడు .అన్నీ సహించి వాడి మీద అభిమానం తో ఆడా మగా అక్కడే చదివారు కాని వదిలి పెట్టివెళ్ళలేదు అప్పుడు కాలేజి లో ట్యూషన్స్ చెప్పే వారు కాదు అందుకని మహా గ్రాకీ గా ఉండేది బాచికి రెండు చేతులా సంపాదించాడు పిల్లల్లెరని కొరత ఉండేది భార్య తో కలిసి హాస్టల్ కూడా పెట్టాడు అదీ క్లిక్ అయింది లేదు .అంట పేరు సంపాదించాడు ఒక్క ఇంగ్లీషే చెప్పేవాడు తరువాత అమరానాద్ అనే బి.ఏ.చదివిన ఒక కుర్రాడు ,వాడి శిష్యుడు తోడయ్యాడు లెక్కల ట్యూషన్ కూడా ప్రారంభించారిద్దరూ కలిసి. అమర నాద్ లెక్కలు బాగా చెప్పేవాడు .ఇంగ్లీష్ లో ను లెక్కల్లోనూ మంచి టీచర్లు దొరికారు కనుక ఎక్కువ మంది శారదా నికేతన్ లో చేరి చదువుకొనే వారు ,బోలెడు స్తలం ఉండేది అందులో రేకుల షెడ్లు వేశాడు .టెన్త్ క్లాస్ కూ ట్యూషన్ ప్రారంభించాడు వాడి భార్య లక్ష్మి నాకు రాజ మండ్రి ట్రేయినిగ్ మేట్ .ప్రభుత్వ హైస్కూల్ లో సైన్స్ టీచర్ గా పని చేస్తోంది నేచురల్ సైన్స్ టీచర్ .కనుక బాచి భార్య అమర నాద ల ట్యూషన్ బాగా క్లిక్ అయింది .ఆ తర్వాత అమర నాద్ విడిగా ట్యూషన్ పెట్టుకొని రోజంతా క్షణం తీరుబడి లేకుండా డిగ్రీ వారికీ చెప్పి బాగా సంపాదించాడు భార్య పోలీస్ శాఖలో ఉద్యోగి. రెండేళ్ళు మాదైన మా ప్రక్క పెంకుటింట్లో అద్దెకుండే వాడు .అందుకని నేను శారదా నికేతన్ లో లెక్కలు చెప్పటానికి అడిగాడు బాచి .సరే నన్నాను మా శర్మ ను కూడా అక్కడే చేర్చాను శర్మ క్లాస్ మేట్ చంద్ర శేఖర్ ,మండా వీర భద్ర రావు కొడుకు ప్రసాద్ వాడికి అక్కడ ట్యూషన్ మేట్స్ .నేను ఫిజిక్స్ కూడా చెప్పే వాడిని ఆవిడ బయాలజీ చెప్పేది ఇంగ్లీష్ బాచి చూసే వాడు వేమూరి శివరామ
క్రిష్నయ్య గారు అనే నా గురువు గారబ్బాయి ఆయన ట్యూషన్ లో నాకు సహాధ్యాయియిఅయిన వేమూరి దుర్గా ప్రసాద్ అనే దుర్గయ్య కూడా ఇక్కడ తెలుగు చెప్పే వాడు .వాడు అంతకు ముందు కరీం నగర్ ధర్మ పురి ఒరిఎంట ల్ కాలేజి లో తెలుగు లెక్చరర్ గా పని చేశాడు. కారణాలేమిటో తెలీదు కాని ,అక్కడ మానేసి ఉయ్యూరు వచ్చి ఉన్నాడు ఇంటి దగ్గర చిన్నక్లాసులకు ట్యూషన్ చెప్పేవాడు వంగల సుబ్బయ్య గారింటి ప్రక్కన ఉండేవాడు తర్వాత శారదా నికేతాన్ లో చేరి ఆ తర్వాత కే.సి.పి వారి స్కూల్ వెలగ పూడి రామ కృష్ణా మెమోరియల్ హై స్కూల్లో తెలుగు పండిట్ గా చేరి అక్కడే రిటైర్ అయి ,పెన్షన్ కూడా పొందాడు .వాళ్ళది అసలు పెద ముత్తేవి .అక్కడ ఇల్లూ వాకిలీ ఉన్నాయి మా మేష్టారు శివరామ క్రిష్నయ్య గారు ఇక్కడ నుంచి వెళ్లి అక్కడే స్తిర పడ్డారు అప్పుడప్పుడు ఉయ్యూరు వచ్చి మా ఇంటికి వచ్చి చూసి వెళ్ళే వారు .నేనం టే అమిత అభిమానం వారికి. వారి వల్లనే నాచదువుకు మంచి పునాది పడింది, . ముందుకు సాగిందికూడా . వారి నెప్పుడూ మరవలేను నన్ను తీర్చి దిద్దిన వారు ఆయనే .దుర్గయ్య నేను గోవిందరాజు వెంకటేశ్వర రావు సీతం రాజు సత్య నారాయణ మంత్రాల రాదా కృష్ణ మూర్తి మొదలైన వారందరం కలిసి బ్రాహ్మణా సేవా సంఘాన్ని పునర్నిర్మించి దానికొక వైభవం తెచ్చాం దుర్గయ్య ను అధ్యక్షుడిని సత్యనారాయణ గారిని సెక్రటరి ని చేశాం నేను ఉపాధ్యక్షుడిని .
శారద నికేతన్ లో ట్యూషన్ ఉదయం ఆరింటికే మొదలు పెట్టె వాడిని గంట లెక్కలు చెప్పి ఇంటికొచ్చి భోజనం చేసి పామర్రు వెళ్ళేవాడిని సాయంత్రం ఇంటికి వచ్చి రాత్రి ట్యూషన్ కు వెళ్లి సైన్స్ చెప్పే వాడిని .వాడు నాకు ఇచ్చిన డబ్బూఏమి లేదు మా శర్మ ట్యూషన్ చదువుతున్నందుకు డబ్బు అడిగే వాడు వాడు డబ్బు దగ్గర మొహమాటం పడదు .నేనూ వాడికేమీ ఇవ్వలేదు ఇద్దరం దొంగాతాదాం .ఇలా ఒక ఏడాది గడిపాను .ఇదీ ణా ఉమ్మడి ట్యూషన్ కదా కమా మీషూను .
సశేషం
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -23-12-13-ఉయ్యూరు

