అడుగేయ్యాలంటే ఆటంకాలను అధిగామించాల్సిందే అన్న పద్మ భూషణ్ పద్మనాభయ్య

 

మన రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ అధికారుల్లో కె. పద్మనాభయ్యకు ఒక విశిష్టమైన స్థానం ఉంది. విపరీత పరిస్థితులను చక్కదిద్ది కాశ్మీర్ లోయలో ఎన్నికలు జరిగేలా చూడటంలో, నాగాలాండ్ శాంతి చర్చల్లోనూ ప్రముఖ పాత్ర పోషించిన ఆయన సేవలకు మెచ్చి ప్రభుత్వం ‘పద్మభూషణ్’గా గుర్తించి గౌరవించింది. 1997లో పదవీవిరమణ చేసిన తర్వాత కూడా మరో పన్నెండేళ్లు ఆయనను వివిధ పదవుల్లో కొనసాగించింది మన ప్రభుత్వం. ఒకరూ ఇద్దరూ కాదు, ఏకంగా ఐదుగురు ప్రధానమంత్రుల దగ్గర హోమ్ సెక్రటరీగా పనిచేసిన ఏకైక అధికారిగా ఘనత సొంతం చేసుకున్న పద్మనాభయ్యకు ఎదురైన కొన్ని సంఘటనల సమాహారమే ఈ వారం ‘అనుభవం’

కృష్ణా జిల్లాలోని కౌతరం మా ఊరు. మా తాతల కాలంలో 500 ఎకరాల భూమి ఉండేదట. కానీ, రకరకాల లిటిగేషన్ల కారణంగా నాకు ఊహ తెలిసేనాటికి అదంతా పోయి ఎనిమిదెకరాలు మిగిలింది. నా స్కూలు ఫైనలయ్యే నాటికి అదీ పోయింది. మా నాన్నగారు చిన్న ప్రభుత్వ ఉద్యోగి. మేం ఎనిమిదిమంది సంతానం. నేను అందరిక న్నా పెద్దవాణ్ని. పెద్ద కుటుంబం కావడం వల్ల ఇల్లు గడవడం కష్టమైపోయేది. మా ఊరికి మూడుమైళ్ల దూరంలోని గుడ్లవల్లేరు హైస్కూల్లో చదువుకున్నాను. తర్వాత ఇంటర్ కోసం గుడివాడలోని ఒక ప్రైవేట్ కాలే జీలో చేరాను. అప్పటికే భూగర్భశాస్త్రం పట్ల ఏర్పడిన ఆసక్తి కారణంగా ఆంధ్ర యూనివర్సిటీలో బీఎస్సీ(ఆనర్స్)లో చేరాలనుకున్నాను. కానీ, డబ్బుల్లేవు. ఆ స్థితిలో నూరే ళ్లు దాటిన మా ముత్తవ్వ అంటే అమ్మమ్మ గారి తల్లి నన్ను చేరదీసింది. ఆమె పేరిట ఎకరం భూమి ఉండేది.

‘వ చ్చే ధాన్యంలో నాకు అవసరమైన కొంత ఉంచుకుంటాను, మిగిలింది అమ్ముకుని నీ చదువుకు ఖర్చు చేసుకో’ అందామె. నాకు కొండంత ధైర్యం వచ్చింది. వెంటనే యూనివర్సిటీలో చేరిపోయాను. ఒక ఏడాది గడిచిందో లేదో ఆమె హఠాత్తుగా చనిపోయింది. అంతటితో అప్పటిదాకా నాకు అందుతున్న సాయాన్ని ఆమె కొడుకు నిలిపివేశాడు. నా బతుకు మళ్లీ రోడ్డు మీదికి వచ్చింది. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి. అప్పుడు విశాఖపట్నంలో మొలాసిస్ ఎగుమతి చేసే ఒక కంపెనీలో సాయంత్రం వేళ పార్ట్‌టైం జాబ్ దొరికింది. వాళ్లు నెలకు 100 రూపాయలు ఇవ్వడంతో నా చదువు గట్టెక్కింది. డిగ్రీలో యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాను. మూల స్థంభం ఉంది కదా అని కుటీరం వేయడానికి సిద్ధమైపోతాం. అదే కూలిపోతే? తక్షణమే ఏదో ఒక ప్రత్యామ్నాయం ఏర్పరుచుకోకపోతే జీవితం ఎక్కడికక్కడ ఆగిపోయే ప్రమాదముంది – అన్న సత్యాన్ని ఆ పరిస్థితి నాకు నేర్పింది.

ఐఏఎస్ అంటేనే తెలియదు
ఒక రోజు యూనివర్సిటీ ఆవ రణలో నలుగురు విద్యార్థులు ఒకరిని భుజాల మీద ఎత్తుకుని హర్షధ్వనాలు చేస్తున్నారు. విషయం ఏమిటని అడిగితే, ‘అతడు ఐఏఎస్‌కి ఎంపికయ్యాడు’ అన్నారు. ‘ఐ.ఏ.ఎస్ అంటే ఏమిటి’ అన్నాన్నేను. నా ప్రశ్న వినగానే వాళ్లందరికీ చిర్రెత్తిపోయింది. ‘ఏమిట్రా ఐఏఎస్ అంటే ఏమిటో కూడా తెలియదా? పో అవతలికి’ అంటూ బండబండగా తిట్టారు. ఒకడైతే నన్ను కొట్టడానికే వచ్చాడు. కాని నిజంగానే అప్పటికి నాకు దాని గురించేమీ తెలియదు మరి! ఆ చివాట్లకు రోషం వచ్చి వెంటనే యూనివర్సిటీ లైబ్రరీకి వెళ్లి ఓ పుస్తకం తిరిగేస్తే ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అని ఉంది. కొద్దిక్షణాల్లోనే నా రోషం పోయి నాలో ఒక కోరిక మొదలయ్యింది. ఇదేదో గొప్పగా ఉన్నట్టుంది, ఎలాగైనా మనం ఇది చేయాల్సిందే అనుకున్నాను. అలా నా ప్రయత్నాలు మొదలయ్యాయి. ఒక రకంగా ఐఏఎస్ పట్ల నాలో ఒక పిచ్చి ఏర్పడింది. ఉదయం యూవర్సిటీ లైబ్రరీ తెరవగానే వెళ్లే తొలి వ్యక్తిని, సాయంత్రం మూసేప్పుడు బయటికొచ్చే చివరివాణ్ని నేనే అయ్యేవాణ్ని. అలా అడ్మినిస్ట్రేషన్ సర్వీసుకి ఎంపికయ్యాను. ముందు ఏమీ తెలియనంత మాత్రాన దాన్ని అందుకోవడం అసాధ్యం అనేమీ కాదు కదా! ఏ స్థాయిలో నువ్వు శ్రమిస్తావనే దానిమీదే నీ విజయాలు ఆధారపడతాయన్నది నా దృఢ విశ్వాసం.

నిప్పుల మీద నడక
పి.వి.నర్సింహారావుగారు ప్రధాన మంత్రిగా ఉన్న రోజుల్లో ఆయన దగ్గర హోమ్ సెక్రెటరీగా ఉన్నాను. ఆ సమయంలో లండన్‌లో పచ్చళ్ల వ్యాపారం చేసే లక్కూబాయి పాఠక్ అనే అతను చంద్రస్వామి మీద కేసు వేశాడు. ‘నర్సింహారావుగారు చంద్రస్వామితో కలిసి ఇంగ్లాండ్ వచ్చినప్పుడు ఒక ఇండస్ట్రీ ఇప్పిస్తామని నా వద్ద లక్ష డాలర్లు లంచం తీసుకున్నారు. మా ఒప్పందం ప్రకారం నాకు అది ఇవ్వలేదు..’ అని పాఠక్ ఆరోపణ. ఆ కేసు జరుగుతున్న సమయంలో కోర్టులో పాఠ క్ ఒక ప్రకటన చేస్తూ ‘నే ను లంచం ఇస్తున్నప్పుడు నర్సింహారావుగారు కూడా అక్కడున్నారు’ అంటూ వ్యాఖ్యానించాడు. ఆ కారణంగా అప్పుడున్న మహిళా మేజిస్ట్రేట్ నర్సింహారావు గారిని అందులో పార్టీని చేసింది. అయితే ప్రధానమంత్రిని విచారించాలంటే హోమ్ మినిస్ట్రీ అంటే నేను ప్రాసిక్యూషన్ శాంక్షన్ ఇవ్వాలి. దాన్ని కోరుతూ కోర్టు నుంచి మాకు ఉత్తర్వులు వచ్చాయి. కేసంతా క్షుణ్ణంగా చదివితే, అందులో ప్రధానిని విచారించాల్సినంత విషయమే లేదు. ఇంతకీ పాటక్ ఏమంటాడు? తాను లంచం ఇచ్చినప్పుడు నర్సింహారావు గారు లోపల ఉన్నారు. డబ్బులు తీసుకున్నాక చంద్రస్వామి లోపలికి వెళ్లిపోయారు. కొద్దిసేపటి తర్వాత నర్సింహారావు చంద్రస్వామితో కలిసి బయటికి వచ్చి ‘చంద్రస్వామి మీ కేసు గురించి చెప్పారు. చూద్దాం..!’ అన్నారంటూ ఉంది. ఇదేమంత గొప్ప ఆధారం? దాని ఆధారంగా నర్సింహారావుగారి మీద కేసెలా వేస్తారు? పాఠక్ డబ్బును ప్రధానికి నేరుగా ఇవ్వలేదు. చంద్రస్వామికి ఇస్తున్నప్పుడు అక్కడ ప్రధాని లేరు. కావాలని ఇరికించడం తప్ప ఈ కేసులో ఎంతమాత్రం బలం లేదని నాకు అర్థమైపోయింది.

నేను నర్సింహారావుగారికి ఆ మాటే చెప్పాను. ‘ఈ కేసుకూ మీకూ ఏ సంబంధమూ లేదు సార్! కాని మనం ప్రాసిక్యూషన్ శాంక్షన్ ఇవ్వకుండా ఉండిపోతే, అందరూ వేలెత్తి చూపుతారు. ప్రధానమంత్రిని రక్షించడానికే హోమ్ మినిస్ట్రీ శాంక్షన్ ఇవ్వడం లేదంటూ రచ్చ చేస్తారు. కోర్టు కూడా రోజూ ఒత్తిడి చేస్తుంది. అందువల్ల శాంక్షన్ ఇచ్చేయడమే మంచిది’ అన్నాను. అందుకాయన సరేనన్నారు. అలా నేను విచారణకు అనుమతినిచ్చాను. అయితే నేనిచ్చే శాంక్షన్ మీద హోమ్ మినిస్టర్ శంకర్రావ్ చౌహాన్ సంతకం పెట్టాలి. ఆ సమయంలో ఆయన సొంతూరు నాందేడ్‌లో ఉన్నారు. ఆ మరుసటి రోజే కోర్టులో హియరింగ్ ఉంది కాబట్టి సంతకానికి వ్యవధి లేదు. అప్పుడు నేను సంతకం కోసం ఆ ఫైల్‌ను ఒక ప్రత్యేక విమానంలో (బిఎస్ఎఫ్) నాందేడ్‌కు పంపించాల్సి వచ్చింది. ఒక ఏడాదిపాటు కొనసాగిన ఆ కేసును తర్వాత కొట్టేశారు. హోమ్ సెక్రెటరీగా నర్సింహారావుగారి కిందే పనిచేస్తూ, ఆయన్నే విచారించేందుకు ప్రాసిక్యూషన్ శాంక్షన్ ఇవ్వాల్సి రావడం నన్ను విపరీతమైన ఆత్మసంఘర్షణకు గురిచేసింది. నిజమేదో మనకు తెలిసినా విధినిర్వహణలో కొన్నిసార్లు నిప్పులు మింగక తప్పదని ఆ అనుభవం నేర్పింది.

పెకిలించుకు రావడమే….
నర్సింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నేను హోమ్ సెక్రెటరీనే కాకుండా, జమ్ము-కాశ్మీర్ వ్యవహారాలకు ఇంఛార్జిని కూడా. అదెలా జరిగిందంటే – హోమ్ మినిస్టర్ శంకర్రావ్ చౌహాన్ అయితే మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్‌గా రాజేశ్ పైలట్ ఉండేవారు. వ్యక్తిగతంగా ఇద్దరూ మంచివారే. చౌహాన్‌గారేమో సీనియర్ రాజకీయనాయకుడు, వయసులో పెద్ద. ఎంతో పరిణతి చెందిన మనిషి. అందువల్ల ప్రతి పనినీ లోతుగా పరిశీలిస్తూ, చాలా నిదానంగా చర్యలు తీసుకునేవారు. రాజేశ్ పైలట్ యువకుడు. అన్నీ వేగంగా, చకచకా జరిగిపోవాలన్నట్లు వ్యవహరించేవాడు. దాంతో ఇద్దరికీ పడేది కాదు. చౌహాన్‌గారు కాశ్మీర్ వెళ్లి ఏదైనా వ్యాఖ్య చేస్తే, తర్వాత కొద్దిరోజులకే రాజేశ్ పైలట్ వెళ్లి అందుకు పూర్తి విరుద్ధంగా మరో వ్యాఖ్య చేసి వచ్చేవారు. పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు ప్రభుత్వంలో, ప్రజల్లో ఒక అయోమయాన్ని సృష్టించేవి. ఈ పరిణామాల్ని భరించలేక చివరకు నర్సింహారావుగారు జమ్మూకాశ్మీర్ వ్యవహారాల కోసం ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి దాన్ని హోమ్ మినిస్టరీ నుంచి తొలగించి తన దగ్గర అట్టిపెట్టుకున్నారు.

ఒకవైపు హోమ్ మినిస్టర్ సెక్రెటరీగా కొనసాగిస్తూనే. ఆ కొత్త విభాగానికి కూడా సెక్రెటరీగా నన్నే పెట్టాడు. అప్పుడు జమ్మూ కాశ్మీర్‌లో ఏం జరుగుతోందో చెప్పమంటూ అటు చౌహాన్, ఇటు పైలట్ అస్తమానం నన్నడుగుతూ ఉండేవారు. ప్రధానమంత్రి చేతిలో ఉన్న విషయాలు వీళ్లకు నేనెలా చెప్పగలను? మంత్రులు కనుక వాళ్లడిగినప్పుడు అసలే చెప్పనని భీష్మించుకోవడం కూడా కష్టమైన పనే. ఆ కష్టమంతా పడుతూనే ఉండేవాణ్ని, వీళ్లు నా మీద పదేపదే ఒత్తిడి చేస్తూనే ఉండేవారు. వాళ్ల ఒత్తిడికి తట్టుకోలేక ఏదైనా విషయం వాళ్లకు చెప్పానే అనుకోండి. మళ్లీ మునుపటిలా పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేసి గందరగోళం సృష్టిస్తారు. చివరికి ఒకసారి వాళ్లిద్దరి దగ్గరకూ వెళ్లి, ‘ప్రధానమంత్రి గారే కదా మీ వద్ద ఉన్న ఆ విభాగాన్ని తీసేసి స్వయంగా తన వద్ద పెట్టుకున్నారు? ఇంత జరిగాక కూడా నేనా వివరాలన్నీ మీకు చెప్పడం చాలా పెద్ద తప్పవుతుంది. మీకు అంతగా ఆసక్తి ఉంటే నేరుగా ప్రధానమంత్రినే అడగండి’ అని చెప్పేశాను. ఆ తర్వాత వాళ్లిద్దరూ నన్ను ఇరుకున పెట్టడం మానేశారు. ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఎప్పుడూ ఉంటాయి. వాటి ని పెకి లించుకుని బయటపడలేకపోతే దేశానికే కాదు మనకు మనమే పూచీదారులుగా ఉండలేమని బలంగా నమ్ముతాను.

సమయం విలువ తెలియాలి…
1986 నుంచి 1990 వరకు అంటే నాలుగేళ్ల పాటు లండన్‌లోని భారతీయ హైక మిషన్‌లో పనిచేశాను. ఒకరోజు ఒక బ్రిటిష్ మహిళ తన కేసు విషయం మాట్లాడటానికి మా ఆఫీసుకు వచ్చింది. ఆమె వచ్చి నా ఎదురుగా కూర్చున్న కొద్దిసేపటికి నాకో ఫోన్ వచ్చింది. మాట్లాడాను. ఫోన్ పెట్టేసి ఆమెతో మాట్లాడటం మొదలెట్టిన కాసేపటికే మళ్లీ నాకు ఫోన్ వచ్చింది. నేను ఫోన్ చేతిలోకి తీసుకున్నానో లే దో… ఆమె నా చేతిలోంచి ఫోన్ లాక్కుని పక్కన పెట్టేసి ‘మిస్టర్ పద్మనాభయ్యా, మీరు నాకు అపాయింట్‌మెంట్ ఇచ్చారు. ఆ సమయానికి నేను వచ్చాను. మీరు మీ దృష్టినంతా నా కే సు మీదే పెట్టాలి. మాటిమాటికీ ఈ ఫోన్లు మాట్లాడటమేమిటి?’ అంది ఎంతో అసహనంగా. నేను ఒక్క క్షణం నిర్ఘాంతపోయినా, వెంటనే తే రుకుని సవినయంగా ‘మేడమ్! ఒక ఫోనేమో మా ఇండియా నుంచి, ఇంకో ఫోనేమో హైకమిషన్ నుంచి అందుకే…’ నా వాక్యం పూర్తి కాకుండానే ‘హై కమిషనేగానీ, దేవుడేగానీ నాకు అనవసరం. ఈ సమయం పూర్తిగా నాది. అందుకే నేనున్న ఈ సమయంలో మీరు మరెవరితోనూ మాట్లాడటానికి వీలు లేదు’ అంది. నేను కొద్ది క్షణాలు స్థాణువులా ఉండిపోయాను. ఆ తర్వాత ఆమె కేసంతా విని పంపించాను. మనకు మన సమయం, మన వ్యవహారాలు ఎంత ముఖ్యమో, ఎదుటి వారికి కూడా వారివి అంతే ముఖ్యమనే విషయాన్ని మనం మరిచిపోతుంటాం. ఎక్కడో ఉన్నవాళ్లు ఎక్కువైపోయి ఎదురుగా ఉన్నవాళ్లు తక్కువైపోవడం న్యాయం కాదు కదా మరి!

నా మంత్రి మీద నేనే విచారణ..
దేవెగౌడ ప్రధానమంత్రి అయినప్పుడు కూడా నేనే హోమ్ సెక్రెటరీని. అప్పుడు మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ పదవిని బీహార్‌కు చెందిన తస్లీముద్దీన్‌కు ఇచ్చారు. ‘తస్లీముద్దీన్ పెద్ద నేరగాడు. అతనికి మీరా పదవినెలా ఇస్తారు? వెంటన్నే అతన్ని తొలగించాలి..’ అంటూ ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. దేవెగౌడ నన్ను పిలిచి అతని మీద విచారణ చేసి ఆయనకు నివేదిక ఇవ్వమన్నారు. ‘సెక్రెటరీగా ఉండి మంత్రి మీద ఎలా విచారణ చేస్తాను? ఆ బాధ్యత మరెవరికైనా అప్పగించండి’ అన్నాను. ‘లేదు లేదు. నాకు మరెవరి మీదా నమ్మకం లేదు. అందువల్ల మీరే పరిశీలించాలి’ అన్నారాయన. అది నాకు చాలా ఇబ్బందికరమైన విషయమైపోయింది. ప్రతిపక్షం వాళ్లేమో రోజురోజుకూ స్వరం పెంచేస్తున్నారు. దేవెగౌడగారేమో మళ్లీమళ్లీ ఆ మాటే చెబుతున్నాడు. అప్పుడు తప్పక, నేనూ నా జాయింట్ సెక్రెటరీ యు.కె.సిన్హా ఇద్దరం కలసి ఆ కే సు పరిశీలనలోకి దిగాం. ప్రతిపక్షాలు చెప్పినట్లు తస్లీముద్దీన్ మీద చాలా క్రిమినల్ కేసులున్నట్లు తేలింది. దేవెగౌడకు నివేదికనిస్తే, దాని ఆధారంగా ఆయన తస్లీముద్దీన్‌ను వెంటనే తొలగించారు.

– బమ్మెర

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.