తెలుగు వికాసానికి కొత్త లక్ష్యాలు

 

తెలుగు భాష, సాంస్కృతిక వికాసంలో ఈ ఏడాది కొత్త పుంతలు తొక్కిన సాంస్కృతిక శాఖ కొత్త సంవత్సరంలో మరిన్ని సృజనాత్మక కార్యక్రమాలతో ముందుకు వస్తోంది.

విజయ నామ సంవత్సరం నుంచి ‘జయ’ ముంగిలిలోకి వచ్చిన తెలుగుభాష సాంస్కృతిక వికాసం సరికొత్త దారిలోకి మళ్ళింది. తెలుగుదనం పెంపొందించే సరికొత్త కార్యక్రమాలకు రాష్ట్ర సాంస్కృతిక శాఖ తెరతీస్తోంది. 2013 ఏడాది అంతా తెలుగు భాషా సాంస్కృతిక వికాస సంవత్సరంగా ప్రకటించిన మన రాష్ట్ర ప్రభుత్వం కొత్త సంవత్సరంలో ఉగాది దాకా ఆయా కార్యక్రమాలు కొనసాగేలా పొడిగించింది. క్రిందటి ఏడాది డిసెంబర్‌లో జరిగిన 4వ ప్రపంచ తెలుగు మహాసభల దరిమిలా తలపెట్టినవన్నీ తప్పటడుగుల దశ నుంచి సరైన నడక దారిలో పడేలా ప్రభుత్వ చర్యల దిశ మళ్ళింది.
గత ముఖ్యమంత్రి రోశయ్యకు సన్నిహితంగా మెలిగిన సాంస్కృతిక కార్యక్రమాల నిర్వాహకుడు ఆర్.వి. రమణమూర్తి సాంస్కృతిక మండలికి అధ్యక్షుడిగా మూడేళ్ళు పదవీ బాధ్యతలు నిర్వహించిన తరువాత ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ‘మండలి’ మూతపడింది. స్పష్టమైన అధికారాలు, మార్గదర్శక సూత్రాలు రూపొందని ఆ మండలి ఉనికిపై సాంస్కృతిక వ్యవహారాలకు సంబంధించిన వారిలో ఎక్కడా చర్చ లేకపోవడంతో 19 ఏళ్ళ మండలి ఉనికికి శాశ్వతంగా తెరపడిందని చెప్పకనే చెప్పినట్టు అయింది.

ఈ ఏడాదిలో సగ భాగం దాకా సాంస్కృతిక శాఖకు సలహాదారుగా పదవీ బాధ్యతలు నిర్వహించిన కె.వి. రమణ ప్రస్తుతం ప్రభుత్వ తీరుతెన్నుల పట్ల తీవ్ర అసంతృప్తితో వ్యాఖ్యలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి నేతగా పలు సభలు, సమావేశాల్లో ఆయన ప్రసంగిస్తూ చేస్తున్న విమర్శలు, సూచనలు సంబంధిత అధికారులకు చురకల్లా తగులుతూ, సరైన దారికి దోవ చూపుతున్నట్టు అవుతున్నాయి. రాష్ట్ర సాంస్కృతిక శాఖలోని 32 మంది సంచాలకులు పటిష్ఠమైన కార్యక్రమాలతో తమ విభాగాన్ని చక్కదిద్దుతున్నారు. ఇన్నేళ్ళుగా ఎన్నడూ లేని విధంగా సుమారు 100 కోట్లు సాంస్కృతిక శాఖలో గలగలలాడాయి. అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాలు ప్రపంచ దేశాల ప్రతినిధుల మన్ననలు పొందాయి. ముందు చెప్పినవి, అనుకున్నవి, అందుకు సంబంధించిన లెక్కలు వంటివన్నీ మరుగున పడిపోయాయి. అట్టహాసం, పటాటోపం వంటివి మాత్రం అందరి జ్ఞాపకాల్లో మెదిలేలా ముద్ర వేసుకున్నాయి.

భారీగా పథకాలు
సుమారు 40 కోట్లకు తగ్గని తెలుగు మహసభల వ్యయం ఆ తరువాత అన్ని జిల్లాల్లో నిర్వహించాలని తలపెట్టిన తెలుగుబాటతో సహా పలు కార్యక్రమాలకు మరో 45 కోట్లు కేటాయింపులు జరిగాయి. కరువు లేని వనరులు, ఎల్లలు లేని తెలుగుదనానికి దన్నుగా ఈ ఏడాదిలో అందివచ్చాయి. రాజకీయాలు, విభజన ఉద్యమాల కొలిమిలో తెలుగుదనం తల్లడిల్లుతున్నా, తలపెట్టినవన్నీ చకచకా జరుగుతున్న తీరుపై దీర్ఘకాలిక ప్రయోజయాలు సాధించేలా ఇరువురు అధికారులు సమష్టిగా 2014లో తాజాదనంతో గుబాళించేలా చేస్తున్నారు. చేయాలనుకున్న పనిపట్ల చిత్తశుద్ధి ఉంటే చాలు, అందరికీ ఆదర్శంగా మనం ముందుండవచ్చు అనే అభిప్రాయంతో, తెలుగుభాష అమలులో అన్నిటా శభాష్ అనిపించుకున్న నందివెలుగు ముక్తేశ్వరరావు సాంస్కృతిక శాఖ పగ్గాలు పట్టుకున్నారు.
ఈ విజయ ‘జయ’ సంధి కాలంలో పాత పద్ధతుల్ని వదిలి సరికొత్త ఆలోచనలకు, చర్యలకు పునాది వేసిన ఆయనకు సంచాలకుడు తోడయ్యారు. సాంఘిక సంక్షేమ శాఖలోని అధికారి ప్రసాదరాజు సాహిత్యం పట్ల ప్రీతి, అవధాన విద్యలో ప్రతిభతో మెప్పిస్తూ కవితా ప్రసాద్‌గా రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలకు నిర్దేశకుడయ్యారు. తొట్రుబాట్లు, తప్పిదాలన్నింటికి తట్టుకుని చిల్లరమల్లర దారుల్లోకి మళ్ళిన శాఖను సూటిగా నేర్పుగా తేట తెనుగుదనంలోకి మళ్ళిస్తున్నారు. ఆ జంట అధికారుల ఆలోచనలు, తాజాగా ప్రకటించిన కొత్త కార్యక్రమాలు వారి మాటల్లోనే….

“మన సాంస్కృతిక శాఖ 33 సంవత్సరాల ప్రస్థానంలో సాధించలేనివన్నీ 2013-14లో సాకారమయ్యేలా చేయగలుగుతున్నాం. ఇప్పటిదాకా 1.50 లక్షల మంది కళాకారులకు గుర్తింపు కార్డులు జారీచేయగలిగాం. వారిలోని ప్రతిభ, సృజన, పాటవాలు సమస్త ప్రపంచానికి తెలిసేలా సాంస్కృతిక శాఖ వెబ్‌సైట్‌ను రూపొందించి, ఈ-గవర్నెస్ ద్వారా చురుగ్గా వ్యవహరిస్తున్నాం. ఒక మీట ద్వారా సకల కళారూపాలు, పేరెన్నిక గన్న మహత్తర ప్రదర్శనలు, వాటి స్రష్టలు, కళాకారులు, మహనీయులు వరసపెట్టుగా కళ్ళ ముందు కదలాడేలా చేస్తున్నాం. ఎప్పటికప్పుడు అందుకు సంబంధించిన సమాచారం, వర్గీకరణ, క్రోడీకరణతో అన్నింటా తెలుగుతేజం పల్లవించేలా చేస్తున్నాం. ప్రపంచంలో ఏ ప్రభుత్వమూ చేయలేనివి, తలపెట్టనివి మన దేశంలో, మన రాష్ట్రంలో ఒనగూడేలా జరిగేలా భాష, సాంస్కృతిక రంగాలకు చెందిన అడుగులు పడుతున్నాయి. సుమారు 15,000 మందికి పైగా వయోధిక ప్రావీణ్యులకు, కళాకారులకు పెన్షన్లు ఇచ్చే పథకంలో ఇప్పుడు 8788 మంది మాత్రమే లబ్ధి పొందుతున్నారు. ఎన్ని అవకాశాలు ఉన్నాయో తెలియపరచడానికి ఇదొక మచ్చు మాత్రమే. ఈ ఏడాదిలో వరుసగా 100 రోజులపాటు జరిగిన ‘శతరూపం’లో 76 లక్షలు వ్యయం చేసి 2600 మంది కళాకారులకు అవకాశం, వనరులు అందివచ్చేలా చేశాం. 2012 డిసెంబర్ తెలుగు మహాసభల తీర్మానం ఉత్తేజంతో కదిలిన తెలుగు కళారంగం 2013 నుంచి 2014లో అడుగుపెట్టేలోగానే భవిష్యత్ తరాలకు మేలుచేసే పటిష్టమైన పునాది పడేలా సమిష్టి కృషి సాధించాం.

పోటాపోటీగా ప్రదర్శనలు
అన్ని ప్రక్రియల్లో అత్యంత మేటిగా సకల కళల సమాహారంగా సృజన, ఆకర్షణ ఉండేలా నాటకాల పోటీని ఏర్పాటు చేశాం. ముక్కలు ముక్కలైన తెలుగు రంగస్థల వికాసం మళ్ళీ ఒకే ఒక్క కేంద్రంలో వెలుగులు విరజిమ్మేలా, విశ్వవ్యాప్త వేదికలు ఎక్కేలా పలు రూపాల చర్యలు చేపట్టాం. ఆ దిశలో ఒక సోపానంగా తెలుగు నాటకం, నవల పోటీలు నిర్వహిస్తున్నాం. పౌరాణిక, చారిత్రక, సాంఘిక నాటకాలను మూడు ప్రక్రియలుగా చేసి వాటిల్లో తాజా రచనకు ఒక్కొక్క దానిలో లక్ష రూపాయల బహుమతిని అందజేస్తున్నాం. అత్యుత్తమంగా ఎంపికైన వాటికి తోడుగా మరో 10 నాటకాలకు ప్రశంస బహుమతులు కూడా అందజేస్తున్నాం. కేవలం బహుమతి ప్రదానంతో, పురస్కారంతో అయిపోయిందనుకోకుండా వాటి ప్రచురణ, ప్రదర్శనల బాధ్యత కూడా ప్రభుత్వం వహిస్తుంది. తెలుగుగడ్డ ఎల్లలు దాటి రంగస్థల వ్యాప్తికి అవసరమైనవన్నీ ప్రభుత్వం కల్పిస్తుంది. కళాకారులు, సృజనకారులు చేయాల్సిందల్లా వరుసపెట్టుగా చూపరుల్ని మెప్పించి జేజేలు అందుకోవటమే!
ఈ ఏడాదికి వీడ్కోలు చెబుతూ నూతన సంవత్సరానికి స్వాగతం తెలిపే సమయంలో డిసెంబర్ 31 సాయంత్రం రవీంద్రభారతి వేదికగా నవతరం ప్రతిభాదీప్తి వికసించేలా సంకల్పించాం. కొత్తతరం ప్రతినిధులు సరికొత్త ఆలోచనలు, సృజన ప్రతిబింబించేలా ఆలోచనలు, కళారూపాలతో అందరి ముందుకు రావాలన్నదే మన రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం. యువతరం ప్రతినిధులతో సాంస్కృతిక రంగం కళకళలాడేలా వికసించేలా చేయటానికి మా శాఖ అన్ని సన్నాహాలు రూపొందించింది.

కళామైత్రి
ప్రభుత్వ సత్కారాలు, నంది విజేతలు, విశ్వవిద్యాలయంలో ప్రతిభా పురస్కారాలు, ప్రతిష్టాత్మక బిరుదులు, జవహర్ బాల భవన్ వారి బాలశ్రీలు వంటివి పొందిన ప్రతిభావంతుల్ని, ఆ కోవలో తమ స్థానం పదిలపరచుకోవాలనుకునే వారిని నూతన సంవత్సరంలో చురుగ్గా సరికొత్త సృజనా పాటవాలతో మన సాంస్కృతిక రంగాన్ని పరిపుష్టం చేయమని ఆహ్వానిస్తున్నాం. అందరికీ పేరుపేరునా ప్రభుత్వం నుంచి శుభాకాంక్షల వినతులతో లేఖలు రాస్తున్నాం. తెలుగు కళారూపాలన్నీ సరికొత్త సమ్మిళిత ప్రదర్శనలతో వినూత్న ప్రక్రియలు, ప్రదర్శనలతో విరాజిల్లేలా చేయడానికి కళాకారులు కోరినవన్నీ ప్రభుత్వం పనుపున అందివచ్చేలా చేయబోతున్నాం.

కళాపరిచయం
ఈ పేరుతో పిన్నలు, పెద్దలు మన ఆచార వ్యవహారాలు, సంప్రదాయాల పద్ధతులు, పండుగలు, పర్వదినాల లోతుపాతులు వంటివి మతాలు, ప్రాంతాలకు అతీతంగా అవగాహన పెంచుకునేలా చేయడానికి అన్ని వనరుల్ని సమన్వయం చేశాం. అభివృద్ధి చెందిన దేశాల్లో ఆర్ట్ అప్రీసియేషన్ కోర్సుగా విస్తృతంగా నిర్వహించే పద్ధతులకు మించిన శిక్షణ, అవగాహనతో ప్రాథమికంగా అభిరుచి, ఆస్వాదనలో మెళకువలు పెంపొందించేలా ప్రభుత్వ నిర్వహణలో ‘కళాపరిచయం’ ఉండేలా తీర్చిదిద్దాం. ఒక తరగతి గదికి తగినట్టుగా చిన్న చిన్న బృందాలు, కూటములు ఉంటేచాలు ప్రభుత్వం నియమించే నిపుణుడు వారి ముంగిలికే వచ్చి తర్ఫీదుతోపాటు అవసరమైన అవకాశాలు అందిపుచ్చుకునే పద్ధతులన్నీ తెలియచెపుతారు. నామమాత్రపు రుసుం, కళాభిరుచి, సాంస్కృతిక రంగంపట్ల మక్కువ మాత్రమే ఇందుకు అర్హతలు. మన రాష్ట్రంలో మాత్రమే కాకుండా, తెలుగువారు ఎక్కడ ఉన్నా సాంస్కృతిక శాఖకు సంబంధించిన కార్యక్రమాలు, వనరులు వారి వద్దకు అందివచ్చేలా అన్ని ఏర్పాట్లు జరిగాయి.

శ్రుత కావ్యాలు: ఇంటింటా సత్కాలక్షేపం
పుస్తకాల చదువుల అలవాటు తగ్గి వెండితెర, బుల్లితెరల్లో గంటలు గంటలు హెచ్చిస్తున్న వారికి అనువుగా వారు పొందుతున్న వాటికి మించిన వినోదం, ఉల్లాసం, మనోవికాసం రంగరించిన డీవీడీలు, సీడీలు సాంస్కృతిక శాఖ నుంచి విరివిగా ఉత్పత్తి, పంపిణీ ఉండేలా సరికొత్త పథకం అమలవుతోంది. తెలుగు విశ్వవిద్యాలయంలో నూతనంగా ఏర్పాటైన రికార్డింగ్ థియేటర్ ద్వారా తొలిదశ ప్రయత్నాలు కొత్త ఏడాది తొలిరోజునే శ్రీకారం చుట్టుకోబోతున్నాయి. రసవత్తరమైన రూపకాలు, నాటకాలు, కథలు, మహనీయుల జీవిత గమనంలో రసవత్తర ఘట్టాలు, కళారూపాలకు సంబంధించిన సరికొత్త పాఠాలు వంటివి ప్రతివారికి అందుబాటులో పదిలంగా హత్తుకుని పదే పదే చూసి, విని పరవశించేలా చేస్తున్నాం. ఈ రంగంలో ఉత్సాహం, ప్రతిభ ఉన్నవారు సాంస్కృతిక శాఖ వారిని వ్యక్తిగతంగా, లిఖితపూర్వకంగా సంప్రదించవచ్చు.ఈ ఏడాదిలో సాంస్కృతిక ప్రదర్శనలు వేదికలపై కార్యక్రమాల నిర్వహణకు ఇంచుమించుగా 140 లక్షలు ప్రభుత్వం అందించింది. తెలుగుదనం వైతాళికులుగా అందరి మన్ననలు పొందిన పలువురు ప్రముఖుల శత జయంతి కార్యక్రమాలు ఏడాది అంతా జరిగేలా కార్యక్రమాల పరంపరకు అన్ని విధాలా సహకరిస్తున్నాము. సులువుగా నిధులు, పుస్తకాలు అందిస్తున్నాం. గురజాడ 150 ఏళ్ళ ఉత్సవ సందర్భంలో 5 కోట్లు, ఆయనతోపాటు తెలుగుదనం పండించిన గిడుగు రామమూర్తి, ఆదిభట్ల నారాయణ దాసు, రఘుపతి వెంకటరత్నం నాయుడుల ఉత్సవాలకు సంబంధించి 50 లక్షల మేరకు కేటాయింపులు జరిగాయి.

కార్యక్రమాలు జరుగుతున్నాయి. సాహితీమూర్తి త్రయం పేరిట తిరుమల రామచంద్ర, పుట్టపర్తి నారాయణాచార్యులు, కాళోజీలతోపాటు నీలం సంజీవరెడ్డి శత జయంతి కార్యక్రమాలకు 25 లక్షలు మంజూరు అయ్యాయి. మధిర మ«ధురోత్సవాలు నిర్వహించడానికి 10 లక్షలు ఇతర ప్రాంతాల్లో ఉత్సవాలు, కళారూపాలకు పలు విధాల సాంస్కృతి శాఖ తోడ్పాటు అందిస్తోంది. పాత ఏడాది అనుభవాలతో కొత్త ఏడాదిలో అన్నింటా ప్రమాణాలు, విలువలు పెంపొందించడానికి అందరూ కలసికట్టుగా స్పందించాలని సాంస్కృతిక శాఖ విజ్ఞప్తి చేస్తోంది. సూచనలు, సందేహాలు, వివరాలు, ఫిర్యాదులు వంటి వాటితోపాటు ప్రతినిత్యం సాంస్కృతిక వ్యవహారాలు, కార్యక్రమాల్లో పాల్గొనాలన్న అభిలాష గల ప్రేక్షకులు అందుకు సంబంధించిన సంఘాలకు తోడ్పాటు ఉంటుంది. నమోదు చేయించుకుంటే చాలు, అందుకు సంబంధించినవన్నీ తెలిసి వస్తాయి. ఆహ్వానాలు అందుతాయి. సాంస్కృతిక సంస్థలు కూడా శాఖలో నమోదు చేసుకుంటే చాలు ప్రభుత్వం తరఫున కళాకారులలకు తగిన ఆర్థిక సాయం అందిస్తాయి. ఆసక్తి కలవారు ఏమాత్రం తటపటాయించకుండా 040-23212832, 040-23242482 ఫోన్‌ల ద్వారా సాంస్కృతిక శాఖతో నిత్య సంబంధాలు పెంపొందించుకోవచ్చు.
-జి.ఎల్.ఎన్. మూర్తి

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.