
శివరాత్రి రోజు యావత్ భారతదేశం ‘హరోం హరహర… శంభోశంకరా..’ అంటూ శివనామ స్మరణతో మారుమోగిపోతుంది. హిమాలయాల్లోని కేదారనాథ్ మొదలు దక్షిణపు అంచునున్న రామేశ్వరం వరకూ దేశం నలుమూలలా ఉన్న పన్నెండు జ్యోతిర్లింగ క్షేత్రాల్లో అభిషేకాలు జోరందుకుంటాయి. మన రాష్ట్రంలో ప్రసిద్ధ శైవక్షేత్రాలయిన శ్రీశైలం, శ్రీకాళహస్తి, వేములవాడ వంటి ఆలయాల్లోనైతే భక్తుల హడావుడి ఇంతింతనలేం. పేరున్న ఆలయాల గురించి అందరికీ తెలుసు. కాని పూర్వం ఎన్నో పూజలందుకుని, కాలక్రమంలో వైభవాన్ని కోల్పోయిన శివాలయాలు కొన్ని ఉన్నాయి. అలా అపూర్వమైన శిల్పకళావైభవాన్ని, ఘనమైన చరిత్రను తమలో పొదువుకున్న రెండు దేవాలయాల గురించే ఈ కథనం…
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మానవ పురుషాంగాన్ని పోలి ఉండే ఏడు అడుగుల శివలింగం ఎక్కడుందో తెలుసా?
ఎక్కడంటే చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలంలోని గుడిమల్లం అనే గ్రామంలో.
1911లో గోపీనాథరావు అనే పురావస్తు శాస్త్రవేత్త సంవత్సరం పాటు పరిశోధించి ఈ శివలింగ ఉనికి గురించి ప్రపంచానికి తెలియజేశారు. మొదట ఒక మహావృక్షం కింద ఆరుబయట పూజలందుకునే లింగంగా దీన్ని ప్రతిష్ఠించారని ఆయన అంచనా. ఈ లింగం చుట్టూ జరిపిన తవ్వకాల్లో దొరికిన ఎముకలను (గొర్రె లేదా పంది) బట్టి ఇక్కడ మాంసాన్ని నైవేద్యంగా అర్పించేవారని ఒక అభిప్రాయం. మట్టిపాత్రలు, కుండలు, ఎముకలు వంటి అవశేషాలున్న ఒక పురాతన దిబ్బపై ఈ లింగం ప్రతిష్టించబడి ఉండొచ్చని చరిత్రకారుల నిర్ణయం.
ఋగ్వేద రుద్రుడు
పురుషాంగంపై ఉండే సన్నని ఈనెల వంటి సున్నితమైన నరాలను సైతం అద్భుతంగా, స్పష్టంగా కనిపించేలా చెక్కిన దీని శిల్పకళ అత్యంత సహజంగా ఉంటుంది. దీనిపైన – ఒక చేత్తో గొడ్డలి (పరశువు), మరో చేత్తో గొర్రెను పట్టుకొన్న రుద్రుడు ఒక యక్షుని భుజాలపై నిలబడ్డట్టు ఉంటుంది విగ్రహం. ఈ రుద్రుడిని ధ్యాన ప్రతిమగా చూపడం విశేషం. తలపాగా, ధోవతి ధరించిన ఈ రుద్రుడి వస్త్రధారణ ఋగ్వేద కాలం నాటిదని శాస్త్రకారుల అంచనా. ప్రాచీన శైవపూజా విధానాన్ని సవివరంగా తెలిపే ఈ అద్భుత లింగం చెక్కేందుకు వాడిన రాయిని గురించి ఎటువంటి సమాచారమూ లేదు. గతంలో ఎప్పుడో ఉజ్జయినిలో దొరికిన రాగినాణేలపై ఈ లింగాన్ని పోలిన బొమ్మ ఉంది. మధుర మ్యూజియంలో ఇలాంటి శిల్పముంది. మొద ట్లో ఈ శివలింగం ఆరుబయటే పూజలందుకునేది. క్రీ.శ. తొమ్మిదవ శతాబ్దం మొదలుకొని కొన్ని రాజవంశాలు దానిచుట్టూ గుడిని నిర్మించాయి. ఆలయ సముదాయాలన్నీ పరిపల్లవ, బాణ, చోళుల శిల్పశైలిని పోలి ఉన్నాయి. గర్భగుడి సైతం గజపుష్టాకారంలో గంభీరంగా ఉంటుంది. ఆలయంలో దొరికిన శాసనాల్లో దీన్ని పరమేశ్వర ఆలయంగా పేర్కొన్నారు. ఆలయ ప్రాంగణంలో పార్వతి, సుబ్రమణ్యస్వామి, సూర్య దేవాలయాలున్నాయి.
నిర్మాణ చాతుర్యం
ఏకలింగంపై శివుని అనేక రూపాలను మలచిన తీరు నాటి శిల్పుల విశిష్టతకు నిదర్శనం. భూగర్భ జలమట్టం ఈ లింగం కింద 350 అడుగుల లోతున ఉన్నప్పటికీ ఒత్తిడి పెరిగితే ఆ నీరు లింగంపై పడేలా నిర్మాణచాతుర్యం చూపారు. అలా 2005 డిసెంబర్ 4న నీళ్లు వచ్చాయి. ఈ గుడిని తాళం లాంటి ఆకారంలో నిర్మించడం వల్ల లింగాన్ని కదిలిస్తే గుడి మొత్తం కూలిపోతుందని కొందరంటారు. ఆనందకుమారస్వామి, జితేంద్రనాథ్బెనర్జీ వంటి అంతర్జాతీయ పురాతత్వవేత్తలు, వ్యాఖ్యానకారులు, శాస్త్రవేత్తలు శిల్పచరిత్రలోనే అపురూపమైన ఈ శివలింగాన్ని తమ రచనల్లో అభిమానించి ఆరాధించి ప్రేమించారు. ఇంగువ కార్తికేయశర్మ రాసిన ‘పరశురామేశ్వర టెంపుల్ ఎట్ గుడిమల్లం’ ‘ద డెవలప్మెంట్ ఆఫ్ ఎర్లీ శైవ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్’ అనే రెండు పుస్తకాలు మినహా ఈ గుడి గురించి మరే ఇతర సమాచారమూ లే దు.
పూజలు మొదలయ్యాయి..
బాణ, చోళ, పల్లవ, గంగపల్లవ, రాయల కాలంలో నిత్య ధూపదీపనైవేద్యాలతో కళకళలాడిన ఈ ఆలయాన్ని 1954లో గుడిమల్లం గ్రామస్థుల నుంచి భారత పురావస్తుశాఖ స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచి గుడిలో పూజలు ఆగిపోయాయి. గ్రామస్థుల తరపున వున్నం గుణశేఖర్నాయుడు 2006 నుంచి 2008 వరకు సమాచారహక్కు చట్టం సాయంతో పోరాడాడు. గుడికి సంబంధించిన ఆస్తుల వివరాలు కాదుగదా, కనీసం గుడికి సంబంధించిన సాహిత్యం కూడా వారి దగ్గర లేదన్న చేదు నిజాన్ని వెలికితీశాడు. అతని పోరాటం ఫలితంగా గుడిలో పూజలు చేసేందుకు 2009లో గ్రామస్థులకు అనుమతి లభించింది.
(రేణిగుంట నుంచి గుడిమల్లం 16 కి.మీ. దూరంలో ఉంటుంది. పాపారాయుడుపేట మీదుగా వెళ్లాలి)
– డి. లెనిన్
ఫోటోలు : మద్దెన హరిబాబు
—


idi lakulesa sampradayaniki chendindi.
LikeLike