
శివరాత్రి ప్రత్యేక కథనాలు
మహాశివరాత్రి నాడు కళకళలాడని శైవక్షేత్రాలుంటాయా? శ్రీశైలం వైపు తిరిగి ఓం నమశ్శివాయ అనని శివభక్తులుంటారా! ఆ మల్లికార్జునుడితో పాటు శివరాత్రి నాడు పూజలందుకునే మరి కొన్ని ప్రసిద్ధ శివాలయాల గురించి, వనదుర్గ మాతకు జరిపే జాతర గురించే ఈ కథనాలు..
ఏడుపాయలుగా ఎందుకు…
ద్వాపర యుగాంతంలో పాండవ వంశంలో చిట్టచివరి రాజైన జనమేజయుడు తన తండ్రి పరీక్షిత్తు మరణానికి కారణమైన సర్పజాతిని సమూలంగా అంతం చేసేందుకు ఇక్కడే సర్పయాగం చేశాడంటారు. ఏడుగురు మహర్షుల ఆధర్వంలో జరిగిన యాగాగ్ని గుండాల్లో ఆహుతైన సర్పరాజులకు సద్గతులు కలిగించడానికి గరుడుడు కంకణం కట్టుకున్నాడట. పాతాళంలో ప్రవహించే భోగవతి అనే నదిని భూమ్మీదికి తీసుకొస్తే అది ఏడు యజ్ఞ గుండాలను చల్లార్చేందుకు ఏడు పాయలుగా చీలి ప్రవహించిందనే పురాగాధ ప్రచారంలో ఉంది. ఆనాటి భోగవతి నదే భూమ్మీద మంజీర అయిందని చెబుతారు. ఆ నది ఏడు పాయలను జమదగ్ని, అత్రి, కశ్యప, విశ్వామిత్ర, వశిష్ట, భరద్వాజ, గౌతమ అనే ఏడుగురు ఋషుల పేర్లతో వ్యవహరిస్తుంటారు.
మహాశివరాత్రి అనగానే పూజలన్నీ శివుడికే జరుగుతాయి. కాని మెదక్ జిల్లా పాపన్నపేట సమీపంలోని ఏడుపాయల గుట్టల్లో మాత్రం శివరాత్రి అంటే వనదుర్గాదేవిని కొలిచే ఉత్సవ సమయం. ఏడాదికోసారి వారం రోజుల పాటు జరిగే జాతరలో పాల్గొని అమ్మవారికి మొక్కులు తీర్చుకునేందుకు పదిహేను లక్షల మందికి పైగా భక్తులు తరలివస్తారు. 2006లో మన రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పర్యాటక ఉత్సవంగా ప్రకటించింది కూడా.
కొండకోనలను దాటుకుంటూ చిట్టడవుల్లో నుంచి ప్రవహిస్తూ వచ్చే మంజీరా నది అక్కడికి వచ్చేసరికి ఏడు పాయలుగా చీలుతుంది. ఆ చీలిన ప్రదేశంలోనే కొండ గుట్టల సొరంగంలో అమ్మవారు వనదుర్గామాతగా వెలసింది. ఆమెకు 17వ శతాబ్దానికి పూర్వం నుంచీ పూజలు జరిగేవని చారిత్రకాధారాలు చెబుతున్నాయి. శివరాత్రి సందర్భంగా ఏడుపాయలగుట్టలో జరిగే బ్రహ్మాండమైన జాతరకు మన రాష్ట్రం నలుదిక్కుల నుంచే కాకుండా పొరుగునున్న కర్ణాటక, మహారాష్ట్రల నుంచి కూడా జనం తండోపతండాలుగా వస్తారు. శివసత్తుల పూనకాలు, పోతరాజుల నృత్యాలు, అడుగడుగునా జంతుబలులు, బోనాలు, బండ్ల ఊరేగింపులు వీటన్నిటితో అక్కడి వాతావరణం భిన్న సంస్కృతుల సంగమంగా కనిపించి భక్తి పారవశ్యంలో ఓలలాడిస్తుంది.
మంజీరా నది పాయల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడంతో జాతర మొదటి రోజు మొదలవుతుంది. ఆ రోజు నుంచి స్త్రీలు అమ్మవారికి ఒడిబియ్యాన్ని సమర్పిస్తారు. పసుపు కలిపిన బియ్యంలో ఎండు వక్కలు, ఖర్జూరాలు, కుడుకలు, తమలపాకులు, రవికె కనుములు, కొత్త చీరెలను ఉంచి వనదుర్గాదేవికి మొక్కులు చెల్లిస్తారు. రెండో రోజు అమ్మవారికి ఫలహార బండ్ల ఊరేగింపు, మూడో రోజు రథోత్సవం వైభవంగా జరుగుతాయి. రాష్ట్రం నలుమూలల నుంచి వందల సంఖ్యలో బస్సులు నడుపుతుంది ప్రభుత్వం. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా వందల సంఖ్యలో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తారు. భక్తులు స్నానాలు ఆచరించడానికి ప్రత్యేక స్నాన ఘట్టాలను ఏర్పాటు చేశారు. మంచినీరు, వసతి, పారిశుధ్య సమస్యలు తల్తెకుండా అధికార యంత్రాంగం కృషి చేస్తోంది. ప్రతి జాతరకు రాష్ట్ర మంత్రులు, ప్రముఖులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు వస్తుంటారు.
వనదుర్గాదేవి ఆలయంతో పాటు తపోభూమి, పాపాలమడుగు, సంతానగుండం, ముత్యాలమ్మ గుడి, శివాలయం, గంగమ్మగుడి, వినాయకుడి ఆలయం వంటి చోట్ల కూడా చేస్తుంటారు. అమ్మవారి ఆలయం ముందు పెద్ద బండరాయిపై ఒక జంట స్నానం ఆచరించడానికి సరిపడే గొయ్యి ఉంటుంది. సంతానం లేని దంపతులు ఈ గుండంలో పుణ్య స్నానం ఆచరిస్తే సంతానం కలుగుతుందని నమ్మకం. జాతర సమయంలోనే కాకుండా మామూలు రోజుల్లో కూడా పిల్లలు లేని దంపతులు ఈ గుండంలో స్నానాలు చేస్తుంటారు.
– కె. శ్రీనివాస్, పాపన్నపేట
కోడెమొక్కుల రాజరాజేశ్వరుడు

దేశంలో ఎక్కడా లేని విధంగా కోడె మొక్కులు చెల్లించుకునే ఆచారం ఉన్న ఏకైక దేవాలయం కరీంనగర్ జిల్లా వేములవాడలోని శ్రీరాజరాజేశ్వర క్షేత్రం. కోడెమొక్కులంటే ఏమిటో, వేములవాడకు ఇంకా ఎన్ని ప్రత్యేకతలున్నాయో తెలుసుకుందాం.
ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అనారోగ్యం, సంతానలేమి వంటి రకరకాల సమస్యలతో బాధపడుతున్నవారు తమ సమస్యలు తీరితే వేములవాడ రాజరాజేశ్వరస్వామికి కోడెదూడలను సమర్పిస్తామని మొక్కుకుంటారు. కోరిక తీరిన వెంటనే కోడెదూడను తీసుకొచ్చి స్వామికి సమర్పిస్తారు. అలాగే నిలువెత్తు బెల్లం దానం చేస్తారు. వేములవాడ ఆలయం ప్రధానంగా శైవక్షేత్రమే అయినా, మహాశివరాత్రితో సహా అన్ని ప్రధాన పర్వదినాల్లోనూ హరిహరులిద్దరికీ పూజలు జరగడం ఇక్కడి ప్రత్యేకత. ఏ ఉత్సవమైనా శ్రీపార్వతీ రాజరాజేశ్వరస్వామి, శ్రీలక్ష్మీఅనంతపద్మనాభస్వాముల ఉత్సవ విగ్రహాలను ఊరేగించడం ఆనవాయితీ. ఈ క్షేత్రానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఆలయ ప్రాంగణంలోనే ముస్లిముల హజరత్ బాబా ఖాజాబాగ్ సావర్ దర్గా కూడా ఉండటం మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది. మహాశివరాత్రి నాడు లక్షలాది భక్తులు ఆలయ ఆవరణలోనే జాగరణ చేస్తారు.
చారిత్రక విశిష్టత
క్రీ.శ. 750 నుంచి క్రీ.శ. 973 వరకు ఈ ప్రాంతాన్నేలిన చాళుక్యరాజులను వేములవాడ చాళుక్యులంటారు. 11వ శతాబ్దంలో రాజరాజనరేంద్రుడు అనే రాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు పౌరాణిక ఆధారాలున్నాయి. ఆలయానికి అనుబంధంగా ఉన్న మఠాలు మత ప్రచారానికే కాక విద్య, వైద్య కేంద్రాలుగా విలసిల్లాయి. శిల్పకళకు, జైన, శైవ, వైష్ణవ, శాక్తేయం వంటి మతాలకు, మతశాఖలకు, సంస్కృతం, తెలుగు, కన్నడ భాషలకు నిలయమై ఈ క్షేత్రం వర్థిల్లిందని చరిత్రకారుల కథనం.
స్థలపురాణం
నారదుని కోరిక మేరకు మొదట కాశీలో ప్రత్యక్షమైన పరమశివుడు అక్కడ సంతృప్తి చెందక వేములవాడకు వచ్చాడని ఒక కథ. ద్వాపర – కలియుగాల సంధి సమయాన శ్రీరాజరాజేశ్వరుడు ధర్మగుండంలో గుప్తుడయ్యాడట. కాలక్రమంలో ధర్మగుండంలో లింగాకారంలో ఉన్న రాజరాజేశ్వరుడిని ప్రతిష్టించారని మరో కథ. ఈ క్షేత్రానికి సంబంధించి ఇంకొన్ని ఆసక్తికరమైన పురాణగాధలు కూడా వినిపిస్తుంటాయి.
– దాసరి దేవేందర్, వేములవాడ
చేదుకో కోటయ్యా… చేదుకోవయ్యా

‘చేదుకో కోటయ్యా…చేదుకోవయ్యా’ అని ఆర్తితో పిలవగానే ఎంతటి పాపాలనైనా హరించి భక్తులకు ఇహపర సౌఖ్యాలను అందిస్తాడనే పేరున్న దేవుడు శ్రీత్రికోటేశ్వర స్వామి. గుంటూరు జిల్లాలోని ఈ ప్రసిద్ధ క్షేత్రంలో శివరాత్రి సందర్భంగా తరలివచ్చే ప్రభలు చూడటానికి రెండు కళ్లు చాలవు.
ఇది బ్రహ్మచారి అయిన దక్షిణామూర్తి క్షేత్రం కావడం వల్ల ఇక్కడ కళ్యాణోత్సవాలు జరగవు. ధ్వజ స్తంభం కూడా వుండదు. ఎటు చూసినా మూడు శిఖరాలు కనిపిస్తూ ఉంటాయి కనుక కొండ పై వెలసిన దేవుడికి త్రికోటేశ్వరుడు అని పేరు వచ్చింది. ఈ మూడు శిఖరాలను త్రిమూర్తులుగా వ్యవహరిస్తారు.
దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసిన తర్వాత శివుడు శాంతించి పన్నెండేళ్ల బాలుడిగా మారి బ్రహ్మచర్య దీక్షతో కైలాసంలో సమాధి నిష్టలో దక్షిణామూర్తిగా ఉన్నాడట. అప్పుడు బ్రహ్మాది దేవతలు ఆయన వద్దకు వెళ్ళి తమకు బ్రహ్మోపదేశం చేయమని కోరారట. అందుకు శివుడు అంగీకరించి త్రికూటాద్రి (కోటప్పకొండ)కు వచ్చి బ్రహ్మోపదేశం చేశాడని స్థలపురాణం. ఇది బ్రహ్మచారి అయిన దక్షిణామూర్తి క్షేత్రం కావడం వల్ల ఇక్కడ కళ్యాణోత్సవాలు జరగవు. ధ్వజ స్తంభం కూడా వుండదు. ఎటు చూసినా మూడు శిఖరాలు కనిపిస్తూ ఉంటాయి కనుక కొండ పై వెలసిన దేవుడికి త్రికోటేశ్వరుడు అని పేరు వచ్చింది. ఈ మూడు శిఖరాలను త్రిమూర్తులుగా వ్యవహరిస్తారు. ఈ క్షేత్రం చోళరాజులకు పూర్వం నుంచే ప్రసిద్ధికెక్కిందని కొండ మీద లభ్యమైన పురాతన శాసనాలు తెలియజేస్తున్నాయి. వాటి ఆధారంగా చూసినప్పుడు ఇది వెయ్యేళ్లకు పైగా చరిత్ర ఉన్న ప్రదేశమని భావించవచ్చు.
కోటప్పకొండ తిరునాళ్లంటే గుంటూరు జిల్లాలో పెద్ద సంబరం. శివరాత్రి సందర్భంగా విద్యుత్ ప్రభల నిర్మాణానికి పోటీ పడతారు చుట్టుపక్కల గ్రామస్థులు. ఒక్కొక్క విద్యుత్ ప్రభ నిర్మాణానికి దాదాపు నెల రోజులు పడుతుంది. సుమారు 90 అడుగుల ఎత్తు వరకు వీటిని నిర్మిస్తారు. ఒక్కొక్క విద్యుత్ ప్రభకు 12 – 15 లక్షల రూపాయల వ్యయమవుతుంది. సర్వాంగసుందరంగా తయారైన ప్రభలు విద్యుత్ కాంతులీనుతూ ఎంతో కోలాహలంగా గ్రామాల నుంచి కొండకు తరలివస్తాయి. కోటప్పకొండ తిరునాళ్లకు ప్రభుత్వం రాష్ట్ర పండుగ హోదా కూడా కల్పించింది. శివరాత్రి సమయంలో ఆలయ అలంకరణ అద్భుతంగా ఉంటుంది. కొండ దిగువన ఉన్న వివిధ సామాజిక సత్రాల్లో యాత్రికులకు అన్నదానం భారీగా జరుగుతుంది. ఘాట్ రోడ్డులోని పర్యాటక కేంద్రం ఇప్పటికే ముస్తాబయ్యింది. బోట్ షికారు, చిన్నారుల కోసం ఆట వస్తువులు కూడా ఏర్పాటయ్యాయి.
– కె. శ్రీనివాసరావు, నరసరావుపేట
ఫోటోలు : ఉమామహేశ్వర్రావు, గుంటూరు
తిన్నడి భక్తి మూగజీవుల ముక్తి శ్రీకాళహస్తి

గ్రహణాల సమయంలో మూతబడని దేవాలయం ఏదంటే శ్రీకాళహస్తీశ్వరాలయమే. చిత్తూరు జిల్లాలో తిరుపతి సమీపంలో ఉన్న ఈ క్షేత్రానికి అనేక ప్రత్యేకతలున్నాయి.
శ్రీకాళహస్తిలోని వాయులింగం స్వయంభువని భక్తుల నమ్మకం. అది శ్వాసిస్తున్నట్టు దీపాలు అటూఇటూ కదులుతాయని వారు నమ్ముతారు. సాలెపురుగు, పాము, ఏనుగులు భక్తితో అర్చించిన స్వామి కనుక ఈ దేవుడికి శ్రీకాళహస్తీశ్వరుడనే పేరొచ్చింది. పేరుకు తగినట్టే ఇక్కడి శివలింగం పొడుగ్గా ఉండి, శిరస్సు భాగాన సర్పాకారం, మధ్యలో ఏనుగు దంతాలు, అడుగు భాగంలో సాలీడు చిహ్నాలు ఉంటాయి. వాటికి తోడు వాయులింగేశ్వరుడు నిత్యం నవగ్రహ కవచాన్ని ధరించి ఉంటాడు. అందుకే ఇక్కడి ముక్కంటి ఆలయం రాహు-కేతు సర్పదోష నివారణ పూజలకు ఖ్యాతిగాంచింది. ఆ కవచం వల్లనే ఉమాశంకరుడికి గ్రహణ దోషాలు కలగవు. అందుకే సూర్య చంద్ర గ్రహణాల సమయంలో దేశంలో అన్ని ఆలయాలను మూసివేసినా శ్రీకాళహస్తీశ్వరాలయం మాత్రం తెరుచుకునే ఉంటుంది. గ్రహణ సమయంలో ఇక్కడ శంకరుడికి సర్వాభిషేకాలు చేస్తారు. ఆ సమయంలో స్వామి దర్శనం కోసం ఇక్కడకు తండోపతండాలుగా వస్తారు భక్తులు.
శ్రీకాళహస్తి ఆలయం లోపల, వెలుపల, గోపురాల పైన కనిపించే అద్భుతమైన శిల్పశైలి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చోళ, పల్లవ రాజుల శైలి కలగలసి ఈ దేవాలయానికి ఒక ప్రత్యేక శోభనిచ్చింది. శ్రీకృష్ణదేవరాయలు గజపతిరాజులపై లభించిన విజయానికి చిహ్నంగా 1516వ సంవత్సరంలో ఏడు అంతస్తులతో 136 అడుగుల ఎత్తులో రాజగోపురాన్ని నిర్మించాడని చరిత్ర చెబుతోంది. ఈ గోపురంపై కనిపించని శిల్పం లేదు, శిల్పులు ప్రదర్శించని నైపుణ్యం లేదు. అంత గొప్ప గాలిగోపురం 2010 మే 26వ తేదీన కూలిపోయిన సంగతి తెలిసిందే. అంతే స్థాయిలో సౌందర్యం ఉట్టిపడేలా రాజగోపుర పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ పనులు పూర్తి కావడానికి మరో రెండేళ్ళు పట్టే అవకాశముంది. రాయల వంశానికి చెందిన అచ్యుతరాయల వారి పట్టాభిషేకం ఆలయ ముఖద్వారానికి కుడివైపున గల పదహారుకాళ్ళ మండపంలో జరిగిందని చెబుతారు. ఆ మండపాన్ని అచ్యుతరాయ మండపంగా పిలుస్తారు.
– వలిపి శ్రీరాములు

