అ. అ. విభో ఫౌండేషన్ తెలుగు జాతికి కొండంత అండ -అంటున్న జి.వి.ఎల్.యెన్ మూర్తి –

 

అప్పాజోస్యుల విష్ణుభొట్ల ఫౌండేషన్ సంస్థ రాష్ట్రంలోనే కాక, దేశ విదేశాల్లో కూడా తెలుగు భాషా వికాసానికి ఎంతో కృషి చేస్తోంది. అనేక తెలుగు సాంస్కృతిక సంస్థలకు మార్గదర్శకంగా నిలుస్తోంది. తెలుగు నేలపై సన్మానాల కంపెనీలు, ఊకదంపుడు పొగడ్తలు పెరిగిపోతున్న రోజుల్లో అమెరికాకు చెందిన నలుగురు మిత్రులు తమ సంపాదన నుంచి తెలుగు వికాసం కోసం వెచ్చిస్తున్నారు. వీరు తెలుగు సాంస్కృతిక రంగంలో అచ్చమైన ప్రతిభకు పట్టంకడుతున్నారు. స్వస్థలానికి దూరమైన తెలుగు బిడ్డలకు తమ తల్లి భాషలోని పుస్తకాలు చదవటానికి కావాల్సిన సహాయ సహకారాలు అందజేస్తున్నారు. లక్షలు దాటి కోట్ల రూపాయల వ్యయం పెరుగుతున్నా తమ ఉద్యమానికి దన్ను గా అవసరమైన వనరుల్ని సమకూరుస్తూనే ఉన్నారు. అజో-విభో ఫౌండేషన్‌గా మన సాంస్కృతిక రంగంలో ప్రత్యేక ఒరవడి సృష్టించిన ఆ నలుగురు మిత్రుల తెలుగు మైత్రీ ప్రస్థానం తెలుగు గడ్డపై అన్ని చెరగుల్లో కొత్తమిత్రుల్ని, పుస్తక ప్రేమికుల్ని నిశ్శబ్దంగా పెంచుతోంది. సుమారు 16,000 పుస్తకాలను సమీకరించి అడిగినవారికి అసలు ధర కన్నా రాయితీతో ఇంటి ముంగిట్లోకి తెచ్చి అందిస్తున్నారు. ఎక్కడా ఏ రూపంలోనూ ప్రభుత్వం నుంచి తోడ్పాటు కోసం వెంపర్లాడకుండా అనేక ప్రభుత్వ కార్యక్రమాల తీరుతెన్నులు సిగ్గు పడేలా చేసి జేజేలు అందుకుంటున్న ఈ అజో విభో సంస్థకు ప్రధాన సారథి అయిన ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణతో మాటా మంతీ-
తెలుగు వికాసానికి కృషి
బాపట్లలో చదువుకుని కంప్యూటర్ శాస్త్ర అధ్యాపకుడిగా అమెరికాలో స్థిరపడ్డాను. సగటున నెలకు అయిదు లక్షల రూపాయల ఆదాయంతో నాకు నా కుటుంబ సభ్యులకు అన్ని అవసరాలు తీరేలా సంతృప్తికర జీవితం అందివచ్చింది. మాకు చిన్నప్పటి నుంచి సాహిత్యం, కళలు వంటివాటిపై మక్కువ ఏర్పడింది. చాలామంది కవి పండితుల్ని చూస్తూ వారి ప్రతిభతో పాటు తెలుగు నేలపై వారి విద్వత్తుకు తగిన ఆదరణ లభించటం లేదని కూడా అర్థమైంది. నా వంతుగా మన వాళ్ల ప్రతిభకు పట్టం కట్టడంతో పాటు వివిధ వేదికల ద్వారా తెలుగు సాంస్కృతిక ప్రాభవం వెలుగులోకి వచ్చేలా చేయాలన్న తపన పెరిగింది. ఆ ఆలోచన వచ్చిన తరువాత ఈ రంగంలో జరుగుతున్నవన్నీ గమనించటం, సమాచారం సేకరించటం మొదలుపెట్టాను. నా అంతరంగానికి అశాంతి పెంచినవారే తప్ప అసలు సిసలు సంస్కృతిపై ఇష్టంతో ఉన్నవారు తక్కువే. అదంతా ఓ రకమైన మాయా ప్రపంచంగా కనిపించింది. కొంతమంది కొందరి కోసం వారి వారి అభిరుచులు ఆలోచనలకు తగ్గట్టు జోరుగా హోరుగా కార్యక్రమాలు చేస్తుంటారని అవగతం అయింది.
ఇలా కార్యక్రమాలు నిర్వహిస్తూ, అందులో కాస్తంత మిగుల్చుకోవటం వంటివి జరుగుతూంటాయని కథలు కథలుగా చెప్పారు. ఏడాదిలో కొద్ది రోజులు సెలవు పెట్టుకుని మన ప్రాంతానికి వచ్చి తెలుగువారి మధ్య, కళాకారులు సాంస్కృతిక రంగ అభిమానుల మధ్య గడపటం, గొప్ప గొప్పవారిని సత్కరించుకోవడం నా దారిగా చేసుకున్నాను. నాతో పాటు సన్నిహితంగా మెలిగే అమెరికా మిత్రులలో పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం ప్రాంతం నుంచి శాస్త్రవేత్తలుగా వికసించిన విష్ణుభొట్ల రామన్న లక్ష్మణ ్ణలు ఆసక్తితో స్పందించారు. వారి తరువాత భౌతిక శాస్త్రంలో ప్రతిభతో రాణించిన కందాళం చారి కలసి వచ్చారు.
ఎక్కడా చేయి చాపని పౌండేషన్
చేసేదేదో మన సొత్తుతో మనం చేద్దాం, ఎవరినీ ఎప్పుడూ ఏ సాయం కోసం అడగవద్దనే నిర్ణయంతో మా సంకల్పాన్ని సాకారం చేసుకున్నాం. 1993లో మా ఫౌండేషన్ తరపున తొలి కార్యక్రమం హైదరాబాదులో జరపటానికి సన్నాహాలు మెదలుపెట్టాం. 1994 జూన్‌లో మా ప్రప్రథమ కార్యక్రమం జరిగింది. ఆ ప్రయత్నానికి అన్ని రంగాల నుంచి ఉత్తమాభిరుచి కలవారు హజరై మా కార్యక్రమాల రూపకల్పన, నిర్వహణ తీరులపై అన్ని వివరాలూ కనుక్కుని, చాలా బాగున్నాయని మమ్మల్ని ప్రోత్సహించారు. మంచి మంచి నాటకాలు, సాహితీ సదస్సులు వంటివాటితో పాటు ప్రతిభామూర్తి జీవితకాల సాధన పురస్కారంతో మేము ఆరంభించిన ఒరవడి తెలుగు గడ్డపై అర్థవంతమైన కార్యక్రమాలకు మంచి మెప్పు లభించింది. మా మిత్రులు, కళాభిమానులు పలు సూచనలు సహాయ సహకారాలకు అవకాశాలు కూడా పెంచారు. మా పురస్కారాల ఎంపికతో పాటు ప్రదానం చేసే పద్ధతులలో సంస్కారవంతమైన సంప్రదాయాలను నిక్కచ్చిగా పాటిస్తున్నాము. హైదరాబాదు తరువాత 1995లో విశాఖపట్నంలో కార్యక్రమాలతో మాకు అన్ని ప్రాంతాల్లో కళాకారుల సాన్నిహిత్యం పెద్ద దన్నుగా అందివచ్చింది. ఆ తరువాత నుంచి విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, గుంటూరు, నెల్లూరు, భీమవరం, మళ్లా 2002లో హైదరాబాదు, తిరిగి విజయనగరం, తెనాలి, కాకినాడలలో దిగ్విజయంగా మా కార్యక్రమాలు జరిగాయి.
అమెరికా పద్ధతులు, స్థానిక వైభవం
మాకు ఎక్కడా పెద్ద యంత్రాంగం, కార్యకర్తల హంగూ ఆర్భాటాలు లేకపోయినా అందరికన్నా మెరుగ్గా తొలినాటి నుంచి 20 ఏళ్ల పాటు మహా వైభవంగా చేయగలిగాము. మేము ఏడాది ముందుగానే ఆయా ప్రాంతాల సాంస్కృతిక రంగ నిర్వాహకులు, అక్కడి కార్యకర్తలతో సంప్రదింపులతో అన్నీ సజావుగా చేయగలుగుతున్నాము. అన్ని వనరులూ మా ఫౌండేషన్ నుంచి అందిస్తున్నాము. స్థానికంగా వేదిక నిర్వహణతో పాటు ఆతిథ్యం, వసతి సౌకర్యాలతో సహకరిస్తే చాలు మేము అడుగులు ముందుకు వేస్తున్నాం. మేము నాటకాలలో చేసిన ప్రయోగాలు, రచనలకు అందించిన స్ఫూర్తి చాలా మేలు చేశాయి.
ప్రతి ఏటా నాటకాల పోటీలతో పాటు మా వేదికతోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్న వాటిని పుస్తక రూపంతో తొలి ప్రదర్శన సమయంలోనే ఖచ్చితంగా అందరికి అందిస్తున్నాం. వాటివల్ల రంగస్థల ప్రచారంతో పాటు అన్ని ప్రాతాల్లోని వారికి మంచి నాటకాలు అందించగలిగాం. మా వల్లే 700 పైచిలుకు నాటకాలు వచ్చాయి. వేదికెక్కించి వాటికి తెర తీసింది కూడా మేమే. ప్రతి ఏడాదీ మేము ప్రదానం చేస్తున్న ప్రతిభామూర్తి, విశిష్టసేవామూర్తి, సేవామూర్తి పురస్కారాలలో మేము పాటించిన ప్రమాణాలు అందరి మన్ననలూ పొందాయి. లక్ష రూపాయల నగదుతో పాటు మా సత్కార గ్రహీతల వ్యక్తిత్వం గుణశీలంపై ఉద్దండ విద్వాంసులతో వ్యాసాలు రాయించి ప్రామాణికమైన ప్రత్యేకమైన సంచికను వెలువరిస్తూనే ఉన్నాము. ఎ్కడా ఎన్నడూ రాజకీయ నాయకులు మా వేదిక పై లేకుండా నిక్కచ్చిగా మనగలుగుతున్నాం. కొత్త కథలు, నవలల పోటీలు మేము నిర్వహించటం వల్లనే సాహితీ గగనంలో అక్షరాల తారలుగా మిలమిలలాడుతున్నాయి. మేము ప్రతి ఏటా మంచి మంచి ప్రతిభావంతుల్ని అమెరికాకు ఆహ్వానించి అక్కడ వేరు వేరు ప్రాంతాలలో సదస్సులు, సభలు నిర్వహించటంతో అక్కడ సారస్వతం వెల్లువెత్తేలా చేయగలుగుతున్నాం. వీటకన్నిటికి తోడుగా మేము తెలుగు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా చేస్తున్నాం. ఎక్కడ మంచి పుస్తకం ఉంటుందో వెతుక్కోవటం, తెలుసుకోవటం కష్టమైపోయిన ఈ రోజుల్లో మా సేవతో వేల వేల పుస్తకాలు అమ్ముడవుతున్నాయి .కొనేవాళ్లు, చదివేవాళ్లు తరిగిపోతున్నారని నిట్టూర్పులు విడిచేవారికి అది నిజం కాదని చేసి చూపిస్తున్నాం. అన్ని రకాల అభిరుచుల కలబోతగా మాత్రమే కాక తెలుగు గడ్డకు దూరమైన తెలుగు బిడ్డలకు అక్షరాలు, చిట్టిగీతాలు, కవితలు, కథలు వంటివి సమస్త ప్రక్రియల సారస్వతం విదేశీ లోగిళ్లలో తెలుగుతనం పండిస్తున్నాయి.
శుష్కప్రియాలు, శూన్యహస్తాలు
కాస్తంత కళ అబ్బితే చాలు ప్రభుత్వ సహాయం, ప్రోత్సాహం కోరటం, విమర్శలు, ఉద్యమాలతో విరుచుకు పడటం మన వాళ్లకు బాగా అలవాటు అయింది. ప్రేక్షకులు, కళాభిమానుల్ని పెంచుకుని అన్ని ప్రాంతాలలోనూ జైత్రయాత్ర చేయాలన్న ఆలోచన కూడా మనలో చాలా మందిలో లేశమాత్రం కూడా కనిపించదు. పాత కాలంలో మహారాజుల ప్రాపకంతో ముందుకు సాగిన సాహిత్యం, కళల తీరు ఇప్పుడు ఎన్నో అవకాశాలు ఉండి కూడా కుంచించుకుపోయి చిన్న పరిధిలో మనుగడ సాగించటం సరికాదు. ఆలోచించండి. పొరుగు దేశాల్లో ఏం జరుగుతోందో గమనించండి. తెలుగుదనం వ్యాప్తికి మహత్తర సృజనకు, అంతటి ఆస్వాదనకు మనకు ఉన్న రాశి, వాసిని ఆత్మవిశ్వాసంతో గర్వంగా చాటుకుని ఆదర్శంగా నిలిచేలా చేయటానికి మా సంపాదనలో కొంత వెచ్చిస్తూ సార్థకం చేస్తున్నాం.

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.