పిచ్చుకల తోటమాలి

పిచ్చుకల తోటమాలి

 
 
 

 

 
 
 

ఆఫీసుకి, ఇంటికి మధ్య దూరం ఐదు కిలోమీటర్లు పైబడితేనే “ఈ ట్రాఫిక్‌లో తిరగలేక చస్తున్నామని” అంటుంటారు హైదరాబాద్ మహానగరంలో. అటువంటిది ఆఫీసు దూరమైనా పర్వాలేదు మొక్కలు, చెట్లు పెంచి రకరకాల పిట్టలకు, పిచ్చుకలకు తన ఇంటిని నెలవుగా చేయాలనుకున్నారు తిరుమల్ ప్రసాద్ పాటిల్. అందుకే ఆయన రోజుకి 80 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన తిరుమల్ వారాంతాలలో తోటపని చేస్తూ గడపడమే ఇష్టం అంటారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే చదవండి…

“సిఎస్‌సి (కంప్యూటర్ సైన్సెస్ కార్పొరేషన్) అనే అమెరికా సంస్థలో నెట్ వర్క్ కన్సల్టెంట్‌గా పనిచేయడం మొదలుపెట్టి పదేళ్లవుతోంది. మా స్వస్థలం అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలంలోని కలుగోడు గ్రామం. మా నాన్నగారు రైతు. విఆర్ఓగా కూడా చేశారు. కాని మా ప్రధాన జీవనాధారం మాత్రం వ్యవసాయమే. ఐటి ఉద్యోగినే అయినప్పటికీ గ్రామీణ నేపథ్యం, రైతు కుటుంబం కావడం వల్ల మట్టితో అవినాభావ సంబంధం ఉంది నాకు. చదువు పూర్తయ్యాక ఉద్యోగం కోసం 1998లో హైదరాబాద్‌కి వచ్చాను. 2006లో ఘట్‌కేసర్ మండలం, చౌదరిగూడా గ్రామంలో రెండొందల గజాల స్థలం కొని ఇల్లు కట్టుకున్నాను. 2008 నుంచి ఇక్కడే ఉంటున్నాం. మా ఆఫీసు నుంచి ఇంటికి 40 కిలోమీటర్ల దూరం. అంటే రానుపోను 80 కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నాను రోజూ. పొగ, ధ్వని, వాతావరణ కాలుష్యాలకు దూరంగా ఉండడం కోసమే ఇంత దూరంలో ఇల్లు కట్టుకున్నాను. చెట్లు, పిట్టలు, పిల్లుల్ని పెంచుకోవచ్చనే కోరిక కూడా దీనికి ఒక కారణం. 200 గజాల్లో అంటే ఇల్లు పెద్దగానే కట్టొచ్చు. కాని గార్డెన్‌కి స్థలం ఉండాలన్న ఉద్దేశంతో ఇంటిని చిన్నదిగా కట్టాము. మా ఇంటి చుట్టూరా దాదాపు 70 రకాల చెట్లు ఉన్నాయి. మొక్కలు, చెట్లు ఉన్నాయంటే పక్షులు వస్తుంటాయి కదా! అలానే అవి రావడం మొదలైంది.

బుజ్జి పిట్ట.. బుల్లి పిట్ట…
పిచ్చుకలు, రకరకాల పిట్టలు వచ్చి వాలుతుంటే సంతోషంగా అనిపించి వాటికి గింజలు వేయడం, నీళ్లు పెట్టడం, గూడు కట్టుకునేందుకు వీలు కల్పించడం మొదలుపెట్టాను. గూడుకోసం ప్రత్యేక ఏర్పాటు ఎందుకనుకోవచ్చు? పాతకాలంలో అయితే పక్షులకి గూళ్లు కట్టుకునేలా ఇళ్ల నిర్మాణం ఉండేది. ఇప్పుడున్న కాంక్రీట్ జంగిల్‌లో వాటికి గూడు కట్టుకోవడానికి స్థలమే లేదు. పిచ్చుకలేమో సురక్షితమైన ప్రదేశం లేకపోతే గూడు కట్టుకోవు. నేను అట్టడబ్బాలు పెట్టేవాడ్ని కాని అవి అంతగా నిలిచేవి కావు. ఆన్‌లైన్‌లో వాటికి సంబంధించిన సమాచారం వెతికితే నాసిక్‌కి చెందిన ‘నేచర్ ఫర్ ఎవర్ సొసైటీ’ అనే స్వచ్ఛందసంస్థ కనిపించింది.

గూడు..గింజ..
ఈ సంస్థ పిచ్చుకల కోసం, ప్రకృతి సంరక్షణ కోసం పనిచేస్తుంది. వాళ్లని సంప్రదిస్తే పక్షుల గూడు కోసం ఎలాంటి ఏర్పాటుచేయాలి, గింజలు ఎలా పెట్టాలి అనే విషయాలు తెలిశాయి. గింజలు వేయడం ప్రత్యేక విద్యా అనిపించొచ్చు కాని పళ్లెంలో గింజలు పెడితే పక్షులు ముక్కుతో పొడిచి వాటిని చెల్లాచెదురు చేస్తాయి తప్ప తినలేవు. అలా కాకుండా వాటికి తిండి పెట్టేందుకు ప్రత్యేక పద్ధతి ఉందని వాళ్ల ద్వారానే తెలిసింది. ఆ సంస్థ వాళ్లు పిచ్చుకలకి ఉపయోగపడేలా తయారుచేసిన నెస్ట్ బాక్స్‌లు, గింజలు వేసే ఫీడర్స్ దొరికాయి. ఆన్‌లైన్‌లోనే ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను. నెస్ట్ బాక్స్‌లు ఎలా పెట్టాలి, ఫీడర్‌లు ఎంత ఎత్తులో పెడితే వాటికి అనుకూలంగా ఉంటుందనే విషయాల మీద పరిశోధనలు చేసి మరీ తయారుచేశారు కాబట్టి అవి చక్కగా అమరిపోయాయి. పిచ్చుకలకి భయం పోగొట్టి, మన దగ్గరకు రావాలంటే ఏం చేయాలనేటువంటి విలువైన సమాచారాన్ని కూడా ఆ సొసైటీ వాళ్లు ఇచ్చారు.

పిచ్చుకలతో పాటు
మొదట్లో కొన్ని నెలలు పిచ్చుకలు వచ్చేవి కాని గింజలు తినేందుకు భయపడేవి. ట్రాప్ పెట్టామేమోనని దగ్గరికి రాకపోయేవి. ఏడెనిమిది నెలల పాటు చూసిన తరువాత ఫ్రెండ్లీగానే ఉందనుకుని గూళ్లు ఏర్పాటు చేసుకోవడం, పిల్లల్ని పెట్టడం మొదలుపెట్టాయి. అలా ఇప్పటివరకు ఐదారు తరాలే పెరిగాయి. పిచ్చుకలే కాకుండా రాబిన్, మునియా, హమ్మింగ్‌బర్డ్స్, బుల్‌బుల్ పక్షులతో పాటు మరో ఐదారు రకాల పక్షులు వస్తాయి. కొన్ని పక్షుల పేర్లు తెలియదు కాని చాలా అందంగా ఉంటాయి.
గత రెండేళ్లలో మా తోటకి వస్తున్న ఊర పిచ్చుకల సంఖ్య బాగా పెరిగింది. నెస్ట్ బాక్స్‌లు, ఫీడర్లు మా ఇంటి చుట్టుపక్కల ఐదారుమంది చేత కూడా కొనిపించాను. దాంతో వాళ్ల ఇళ్లకి కూడా పిట్టలు వస్తున్నాయి. అందుకే ఇప్పుడు మా కాలనీ అంతటా పిచ్చుకలు కనిపిస్తున్నాయి. వేసవిలో ప్రతిరోజూ తొమ్మిది రకాల పక్షులు వస్తాయి. హమ్మింగ్‌బర్డ్స్ శీతాకాలంలో ఎక్కువగా వస్తాయి. మిగతా సీజన్‌లలో వేరే రకాల పక్షులు పొద్దున్నా, సాయంత్రం వస్తుంటాయి. చలి, వర్షాకాలాల్లో తేమ ఉండడం వల్ల పురుగులు ఎక్కువగా ఉంటాయి. దాంతో వాటికి ఆహారం దొరుకుతుంది. వేసవిలో బయట ఆహారం దొరకడం కష్టం కాబట్టి మా ఇంటి తోటలోకే ఎక్కువ పక్షులు వస్తాయి. నాలుగైదు టబ్బుల్లో నీళ్లు నింపి ఉంచుతాం. నీళ్లు తాగుతూ, గింజలు, పళ్లు తింటూ రోజంతా కిచకిచమంటూ తిరుగుతుంటాయి. సాయంత్రం వేళకి చెట్ల మీదకి చేరుకుంటాయి. నీళ్ల సమస్య లేకుండా ఉండేందుకని ఇంటిపైన పడిన నీళ్లు, బాల్కనీ నుంచి వచ్చే నీళ్లకి కలిపి ఒకే పైపు ఏర్పాటుచేశాను. ఆ పైపును ఆరడుగుల ఇంకుడుగుంతలోకి పంపించాను. దీనివల్ల మా ఇంట్లో ఒక్క చుక్క నీరు కూడా వృథా కాదు.

వాటికోసమే సేంద్రీయం
క్రిమిసంహారక మందులు, ఎరువులు అస్సలు వాడను. పూర్తిగా సేంద్రీయ పద్ధతిలోనే అంటే వేపపిండి, వర్మికంపోస్టు మిశ్రమాన్ని వాడి మొక్కలు పెంచుతాను. చెట్ల మొదళ్లలో వేసే ఈ మిశ్రమాన్ని ఆరు నెలలకోసారి మారుస్తుంటాం. నాలుగైదు అంగుళాల లోతుకు తవ్వి వేయడం వల్ల మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి. అందుకని సీజన్‌కి తగ్గట్టు వచ్చేవి తప్ప మామూలు పురుగులు రావు. మొక్కలకి రసాయన క్రిమి సంహారక మందులు వాడితే ఆ పురుగులు తిన్న పక్షులు చచ్చిపోతాయి. అందుకే పక్షులు క్షేమంగా ఉండాలంటే రసాయనాలకు దూరంగా ఉండాలి.

ఇంటి చుట్టూ మొక్కలు, చెట్లు ఉంటే దోమలు, పురుగులు, పాములు, తేళ్లు వస్తాయనే భయం ఉంటుంది. అలాంటివి ఇంట్లోకి రాకుండా ఉండేందుకు కిటికీలకు, తలుపులకి మెష్ డోర్లు పెట్టాం. మా తోటలో నందివర్ధనం, నూరు వరహాలు, కనకాంబరాలు, మల్లెపూలు, బ్రహ్మకమలాల మొక్కలతో పాటు కరివేప, వేప, కొబ్బరి, అల్ల నేరేడు పండ్లు, అరటి, దానిమ్మ, జామ, పంపర పనస, నారింజ, బొప్పాయి చెట్లు ఉన్నాయి. పదిహేను అరటి చెట్లు ఉండడం వల్ల ఏడాది పొడుగునా అరటి పళ్లు వస్తూనే ఉంటాయి.

ఫేస్‌బుక్‌లో స్నేహితులకి సలహాలు
నాకు ఫేస్‌బుక్ స్నేహితులు 500కి పైగా ఉన్నారు. వాళ్లలో మన దేశం వాళ్లే కాకుండా ఇతర దేశాల వాళ్లు కూడా ఉన్నారు. ఫేస్‌బుక్‌లో పిట్టల ఫోటోలు పెడుతుంటాను. అవి చూసి మేము కూడా పెంచుతామని కొంతమంది సలహాలు అడుగుతుంటారు. పక్షులకి గూడు ఎలా చేయాలి, ఫీడర్స్ ఎక్నడ్నించి తెచ్చారు, వాటిని ఎలా రప్పించాలి అని అడుగుతుంటారు. నాకు ఇంకో లక్ష్యం ఉంది. మా కాలనీలో దాదాపు వెయ్యి చెట్లు నాటాలని. ప్రభుత్వ అధికారులతో ఇప్పటికే దాని గురించి మాట్లాడాం. వానాకాలం వచ్చే లోపులో ఏర్పాట్లు చేసి తొలకరి పడగానే నాటుతాం. ఎక్కువ మెయింటెనెన్స్ లేకుండా భూమికి చలువనిచ్చే మొక్కల్ని నాటుతామ”ని వివరించారు.

జిమ్‌కెళ్లే అవసరం లేదు
వారాంతాల్లో ఉదయం ఐదున్నరకి నిద్రలేచి కాఫీ తాగి పని మొదలుపెట్టి తొమ్మిది లేదా పది గంటల వరకు చేస్తాను. దీనివల్ల జిమ్‌కి వెళ్లకుండానే వ్యాయామం చేసినట్టు అవుతుంది నాకు. వ్యవసాయం పని ఎలాగూ మాకలవాటే కాబట్టి నాకిదేం కొత్త కాదు. పదిగంటల తరువాత కుటుంబంతో బయటికి వెళ్లి… సాయంత్రం ఇంటికొచ్చి మళ్లీ నాలుగ్గంటల్నించి ఆరు గంటల వరకు పని చేస్తాను. శని, ఆదివారాల్లో నా రొటీన్ ఇదే.

– కిరణ్మయి

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.